Others

ఆడపిల్లను కంటే.. ‘గిఫ్ట్ ప్యాక్’ ఉచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగ వివక్ష, భ్రూణహత్యలను నివారించేందుకు దంపతులకు ఉచితంగా ‘గిఫ్ట్ ప్యాక్’లను అందజేయాలని రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. బాలికల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినందున సామాజిక చైతన్యం కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. ‘ఆడశిశువుకుటుంబానికి భారం కాద’న్న విషయమై దంపతుల్లో అవగాహన పెంచేందుకు వినూత్న పథకాలను అమలు చేస్తున్నారు. ఆడపిల్ల జన్మించిన ఇంటికి వెళ్లి గిఫ్ట్ ప్యాకెట్లతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి చిన్న పుస్తకాలను అందజేస్తున్నారు. దుస్తులు, బొమ్మలు వంటివి ఈ గిఫ్ట్ ప్యాకెట్లలో ఉంటాయి. ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వ్యాధి నిరోధక సూత్రాలు, శిశు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పుస్తకాల రూపంలో అందజేస్తున్నారు. శిశువులకు అంటువ్యాధులు సోకకుండా మందులు, వైద్య పరికరాలను కూడా గిఫ్ట్ ప్యాకెట్ల ద్వారా ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన ఆడశిశువులకు మాత్రమే గిఫ్ట్‌ప్యాకెట్లను అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ఆడశిశువును కన్న దంపతులను అభినందిస్తూ ముఖ్యమంత్రి వసుంధర రాజె రాసిన లేఖను కూడా అందజేస్తారు. సామాజిక న్యాయం, విద్య, ఆరోగ్యం, కార్మికశాఖతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు బాలికల కోసం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆడపిల్లల పెంపకానికి ఈ పథకాలన్నీ దోహద పడతాయని దంపతులకు తెలియజేస్తున్నారు. తొలి విడతగా రెండు వేలమంది దంపతులకు గిఫ్ట్‌ప్యాకెట్లను పంపిణీ చేయాలని నాగౌర్ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖ సౌజన్యంతో వీటిని సిద్ధం చేశారు. ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో లింగ వివక్ష ఇంకా బలంగానే ఉందని, ఆడపిల్ల జన్మిస్తే కుటుంబానికి భారం అన్న భావజాలం ఉందని అధికారులు చెబుతున్నారు. గిఫ్ట్‌ప్యాక్‌లు, పథకాలపై ప్రచారం వల్ల పరిస్థితిలో కొంతయినా మార్పు వస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
గర్భం ధరిస్తే చెప్పాల్సిందే..
లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు, చట్టవ్యతిరేక గర్భస్రావాల వల్ల బాలికల సంఖ్య తగ్గుతోందని గ్రహించిన హర్యానా ప్రభుత్వం లింగ నిష్పత్తిని పెంచేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. గర్భం దాల్చిన వారి వివరాలను నమోదు చేసేందుకు ఒక చట్టాన్ని తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. గర్భవతుల వివరాలన్నీ అందుబాటులో ఉంటే భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. గర్భం దాల్చిన మూడు నెలలలోగా మహిళలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధిగా పేర్లు నమోదు చేసుకోవాలని, ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే చట్టం ఎలా ఉండాలన్న విషయాన్ని ఖరారు చేస్తారు. మరోవైపు ప్రైవేటు నర్సింగ్ హోంలు, స్కానింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నిఘా బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. న్యాయ, పోలీసు, వైద్యశాఖల ప్రతినిధులు స్కానింగ్ కేంద్రాల్లో పరికరాలు, రికార్డులను తనిఖీ చేస్తారు. లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు, చట్టవిరుద్ధ గర్భస్రావాలను నియంత్రించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని హర్యానా సర్కారు భావిస్తోంది. స్కానింగ్ కేంద్రాల్లో అక్రమాల గురించి ఎవరైనా సమాచారం ఇస్తే లక్ష రూపాయల నజరానా అందజేస్తామని, తమకు సహకరించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. లింగ వివక్షను నిర్మూలించేందుకు, బాలికల సంఖ్యను పెంచేందుకు కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.