కథ

అంతర్మథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు మాకు చేసిన సేవలు చాలు. ఇక మీరు విశ్రాంతి తీసుకుని మమ్మల్ని కృతార్థులని చెయ్యండి’ అంటూ నాగేశ్వర్ మెళ్లో ఓ దండ వేసి, చేతిలో ఓ గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చి సాదరంగా సాగనంపారు ఆఫీసు వాళ్లు.
ఇంకా నిన్న మొన్నటి వరకూ ఉద్యోగపు వేటలో అడ్డమైన ఆఫీసులకి ఎక్కే లిఫ్టు, దిగే లిఫ్టులా ఫైల్ చంకన పెట్టుకుని తిరుగుతున్నట్లే అనిపిస్తోంది. అప్పుడే తనకి అరవై ఏళ్లు నిండిపోయాయా? తాత, నానమ్మ ఇదివరలో ‘జీవితమంతా ఓ కలలా జరిగిపోయింది’ అనుకుంటూంటే - ‘ఏమిటో? ఈ ముసలాళ్లు పిచ్చాళ్లలా మాట్లాడుతారు’ అనుకునేవాణ్ణి. నా దాకా వస్తే ఇప్పుడు తెలుస్తోంది. నేనూ ముసలాణ్ణయి పోయానని ‘చేసింది చాలు, వెళ్లి ఓ మూలన కూర్చోవయ్యా’ అని పరోక్షంగా చెప్తున్నారు.
ఏం చేస్తాం? కాల మహిమ. వీళ్లంతా ఒకప్పుడు (నిన్న మొన్నటి వరకు) గుడ్‌మార్నింగ్‌లు, గుడీవినింగులు చెప్తూ వంగి వంగి దండాలు పెట్టినవారే! ‘ఏరు దాటాక తెప్ప తగలెయ్య’మనే రకాలు. ఇంతలో మనస్సు హెచ్చరించింది. ‘నువ్వేం చేసావోయ్? నీ పై ఆఫీసర్లు రిటైరై వెళ్లిపోతున్నప్పుడు నువ్వేమైనా మనస్ఫూర్తిగా బాధపడ్డావా? ఆ ఖాళీ నీకు దక్కాలని ఆశించలేదా? అందుకు ప్రయత్నాలు చెయ్యలేదా? అదే పని వాళ్లు చేస్తూంటే నీకు బాధగా ఉందా? ఇవి సహజ పరిణామాలు. అవి నువ్వు చింతించినా, ఆనందించినా జరిగిపోతూ ఉంటాయి. నిన్ను నువ్వు సమాధానపరచుకో! నిజాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకో!’ అంటూ ఉపన్యాసం దంచింది.
‘సరే! ఒప్పుకోక ఛస్తానా?’ అనుకుంటూ సమాధానపడ్డాడు నాగేశ్వర్.
* * *
భర్త ఇంటికి రాగానే ఎదురెళ్లి చేతిలో గిఫ్ట్, బొకే అందుకుంది. మంచి గంధపు పూల దండ అందుకుని ఆనందంగా రాధాకృష్ణుల విగ్రహానికి అలంకరించింది. గిఫ్ట్ ఏమిటో? అనుకుంటూ పాకెట్లు చింపుతున్న భార్య రమణితో, ‘అందులో ఏముందో చూడాలన్న ఆత్రమే గానీ, నాకు కాస్త కాఫీ అన్నా ఇవ్వాలని తోచదా?’ అన్నాడు చిరాగ్గా.
‘అయ్యో! అదేమిటండీ? పార్టీ ఇచ్చి ఉంటారు కదా! అన్నీ తీసుకుని వచ్చి ఉంటారని తీసుకురాలేదు, ఉండండి తెస్తాను’ అంటూ విప్పుతున్న పాకెట్ టేబుల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్లింది రమణి. ఇంతలో గదిలో పరీక్షకి చదువుకుంటున్న సునీత వచ్చి ఆ పాకెట్ పూర్తిగా విప్పింది. అందులో రెండు వెండి దీపపు సెమ్మాలు ఉన్నాయి. కాఫీ తెస్తున్న రమణి వాటిని చూసి ‘సెమ్మాలు ఎంతో అందంగా బాగున్నాయండి! ఎప్పటి నుంచో ఇలాంటి సెమ్మాలు కొనాలనుకుంటున్నాను. వ్రతాలకీ, పూజలకీ వీటిలో దీపాలు వెలిగిస్తే బాగుంటుంది’ అంది భర్తకి కాఫీ అందిస్తూ.
‘అంతేకాదు, రెండు చిరతలు కూడా కొనుక్కుని రోజూ భజన చేసుకుందాం! ఇంక అదే పని. అది చెప్పడానికే వాళ్లివి కొనిచ్చారు’ అన్నాడు విసుగ్గా.
‘అదేమిటండీ? అలా అంటారు. ఇప్పుడేమయిందని? అందరిలాగే మీరూ రిటైర్ అయ్యారు. మీ నాన్నగారు, మా నాన్నగారు, మీ అన్నయ్య, మా అన్నయ్య అందరూ రిటైరవ్వలేదా. మీరూ అలాగే రిటైరయ్యారు. హాయిగా ఇంటి పట్టున ఉండి ఇంటి విషయాలు చూసుకోవచ్చు. తీరుబడిగా అమ్మాయికి పెళ్లి ప్రయత్నాలు చెయ్యచ్చు. మీకిష్టమైతే... నాకు ఇంటి పన్లలో సాయపడచ్చు. ఆహా! మీకు ఇష్టమైతేనే! బలవంతమేమీ లేదు. కంగారుపడకండి’ అంటూ సర్ది చెప్పింది రమణి.
‘నాకు మాథ్స్‌లో కొంచెం హెల్ప్ చెయ్యి నాన్నా! కొన్ని ప్రాబ్లెమ్స్ చాలా టఫ్‌గా ఉంటున్నాయి’ అంది సునీత.
ఇంతలో కొడుకు ప్రభాస్ వచ్చి ‘నువ్వు రిటైరయిపోయావా నాన్నా! అయితే ఇంక నించీ మనం బాడ్మింటన్, చెస్ ఆడుకోవచ్చు’ అంటూ ఆనందంగా అంటూంటే ఇతడికి మాత్రం వాళ్ల మాటల్లో ఏదో శే్లష ఉన్నట్లుగా అనిపిస్తోంది.
అందరూ రిటైరయ్యేలోపల బాధ్యతలన్నీ తీర్చేసుకుంటారు. తను లేటుగా పెళ్లి చేసుకోవడం, పిల్లలు లేటుగా ఉండటం వల్ల వాళ్ల చదువులు, పెళ్లిళ్లు అన్నీ ఇక మీదటే జరగాలి. రిటైర్మెంట్ మాత్రం తప్పనిసరి తద్దినంలా టైముకి వచ్చేసింది. ఏం చేస్తాం అనుకుంటూ అలా ఓ వారం రోజులు డిప్రెషన్‌లోనే గడిపాడు. భార్య, పిల్లలు అతడిలో ఉత్తేజం కలిగించడానికి వారి శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
* * *
నాగేశ్వర్ మెల్లగా టీవీ చూడడానికి అలవాటు పడ్డాడు. సినిమాలు, అవి నచ్చకపోతే న్యూస్, అది నచ్చకపోతే మరోటీ మరోటీ అలా అన్ని ఛానల్స్ మార్చిమార్చి చూస్తూ కొన్ని హాస్పిటల్స్ వాళ్లు చూపిస్తున్న డాక్టర్లు, చెప్పే జబ్బులు, సూచనలు చూడడం మొదలెట్టాడు. ఒక్కో ఛానెల్‌లో ఒక్కో టైములో రోగాలు, వాటి తాలూకు లక్షణాలు, జాగ్రత్తలు వగైరా వగైరా చూస్తున్నాడు.
అందులో ఒక డాక్టర్ చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నాడు నాగేశ్వర్. ‘ఈ రోగం (ఎక్స్‌వైజెడ్) సాధారణంగా యాభై ఏళ్లు పైబడిన వారికి వస్తుంది. పొత్తికడుపు నించీ గొంతు వరకు ఎక్కడైనా మెల్లగా నొప్పి రావచ్చు. లేకపోతే దగ్గు, ఆయాసం లాంటివి రావచ్చు. ఎక్కువగా శ్రమ పడినప్పుడు కొంచెం వేగంగా గుండె కొట్టుకోవచ్చు. తరచుగా జలుబు చేస్తూండవచ్చు. కాళ్లు, చేతుల నొప్పులు రావచ్చు. తిన్నది అరగక పులి త్రేన్పులు రావచ్చు. ఇలాంటి లక్షణాల్లో ఏ ఒక్కటి కనపడినా అశ్రద్ధ చేయక వెంటనే ఆస్పత్రికి వచ్చి తగిన పరీక్షలు చేయించుకోవడం డాక్టర్ సలహా తీసుకుని పాటించడం మంచిది. లేకపోతే ప్రాణానికి ముప్పు రావచ్చు’ అంటూ చెప్పుకుపోతున్నాడు.
వెంటనే నాగేశ్వర్ మనసులో అనుమానం మొదలైంది. యాభై ఏమిటి? తనకి అరవై కూడా నిండిపోయాయి. మొన్నీ మధ్య రెండుసార్లు జలుబు, దగ్గు వచ్చి తగ్గింది. అప్పుడు పులి తేనుపులు కూడా వచ్చాయి. ఈ మధ్య అప్పుడప్పుడు కడుపులో గడబిడగానే ఉంటోంది. ఎక్కువగా నడిచినప్పుడు గుండె దడ వస్తోంది. ఆ డాక్టర్ చెప్పిన వాటిలో సగంపైగానే నాకు ఆ జబ్బు తాలూకు సూచనలు కనపడుతున్నాయి. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్లాలా? వెళ్తే బోలెడు టెస్టులు, బోలెడు డబ్బులు వేస్టు. పైగా నాకు ఆ (ఎక్స్‌వైజెడ్) జబ్బే వచ్చేసుంటుంది. ఆ జబ్బు ట్రీట్‌మెంట్‌కి నాకొచ్చిన ప్రావిడెంటు ఫండు, గ్రాట్యుటీ అన్నీ ఖర్చయిపోతే ఎలా? ఇంకా ప్రభాస్ చదువుకి రెండేళ్లు డబ్బు ఖర్చవుతుంది. సునీతకి ఇంకా ఉద్యోగం రాలేదు. వచ్చినా ఆడపిల్ల డబ్బు వాడుకోవడం ఏం బాగుంటుంది. దాని పెళ్లికి ఎంత డబ్బు అవసరవౌతుందో. ఇన్ని ఖర్చులు ముందర పెట్టుకుని ఇప్పుడు నాకు రోగానికి అనవసరపు ఖర్చెందుకు.’
ఇలా లోలోపల మధనపడుతూ ఒక్కోసారి రాత్రిపూట నిద్రట్లో పైకే ‘ఎక్స్‌వైజెడ్ జబ్బే అయుంటుంది’ అంటూ కలవరించడం మొదలెట్టాడు నాగేశ్వర్.
భార్య రమణికి భర్త ధోరణేమీ అంతుపట్టట్లేదు. రిటైరయ్యాక మొన్న మొన్నటి వరకు దిగాలుపడి ఏదో కోల్పోయిన వాడిలా కూర్చుంటూంటే బాధపడేది. ఇప్పుడేదో కాస్త మెల్లిగా టీవీ చూస్తూ భర్తలో కొంత మార్పు వస్తోంది ఫరవాలేదు అనుకుంటున్న సమయంలో ఈ కలవరింత లేమిటి? ఈ ఎక్స్‌వైజెడ్ రోగమేమిటి? భర్త వరస ఆమెకేమీ అంతుపట్టడంలేదు. ‘పిచ్చి కుదిరింది గాని రోకలి తలకి చుట్టమన్నాట్ట! వెనకటికెవడో! అలా ఉంది ఈయనగారి వ్యవహారం.
* * *
‘ట్రింగ్.. ట్రింగ్..’
‘హలో! ఎవరండీ?’
‘హలో! సైకియాట్రిస్ట్ రంగనాథ్ గారేనాండీ?’
‘అవునండీ! మీరెవరు?’
‘నేను మీ ఫ్రెండ్ నాగేశ్వర్ గారి వైపునండి’
‘ఆ! చెప్పండమ్మా! ఏమిటి? అంతా కులాసానా? ఈ మధ్య మావాడు రిటైరయ్యాడని విన్నాను. ఎలా వున్నాడు? వాడికి బాగా కాలక్షేపం అవుతోందా?’
‘ఏం కాలక్షేపమో డాక్టర్‌గారూ! మొదట్లో నేను, పిల్లలూ ఎంత పలకరించి మాట్లాడించాలని చూసినా మాట్లాడక దిగులుగా ఉండేవారు. ఇప్పుడు కాస్త టీవీ చూస్తూ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నారు. మళ్లీ అలా దిగులుగా ఉండడం, రాత్రిపూట నిద్దట్లో ‘ఎక్స్‌వైజెడ్’ జబ్బు వచ్చేసింది. ఆ! అదే!’ అంటూ కలవరిస్తున్నారు. అదేమిటో అర్థం కావడంలేదు. అడిగితే చెప్పరు. పోనీ ‘డాక్టర్ దగ్గరికి వెళ్దామా?’ అంటే, ‘నాకేం రోగం? డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి!’ అంటారు. ఏం చెయ్యాలో తోచక మీరు, ఆయన చాలా క్లోజ్‌ఫ్రెండ్స్ కదా పైగా మీరిటువంటి విషయాలు సులువుగా సరి చేస్తారని మీకు ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడాయన బ్యాంక్‌కి వెళ్లారు. ఇదే సమయమని మీకు చెప్తున్నాను. నేను చెప్పినట్టు చెప్పకుండా మీరోసారి వచ్చి మా వారిని చూడండి. నాకేదో భయంగా ఉంటోంది ఆయన వరస చూస్తూంటే!’ అంటూ చెప్తున్న రమణితో...
‘అయ్యో! మీరంతలా చెప్పాలామ్మా! నేనే కలిసి చాలా రోజులయింది. ఓ సారి రావాలనుకుంటూనే ఉన్నాను. తప్పకుండా వస్తాను. మీరేం కంగారుపడకండి. వాడిది కొంచెం సున్నిత మనస్తత్వం. నేను మెల్లిగా అడిగి తెలుసుకుని సమస్య పరిష్కారం చేస్తాను’
‘్థంక్స్ అన్నయ్యగారూ! ఉంటాను’ అని రిసీవర్ పెట్టేశాక రమణి మనసుకి కాస్త ఊరట కలిగింది.
* * *
కాలింగ్ బెల్ మ్రోగగానే వెళ్లి తలుపు తీసిన నాగేశ్వర్ ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొనగా ‘ఒరేయ్! ఏమిటిరా? ఈ హఠాత్ ఆగమనం? ఫోన్ చెయ్యందే పిలవనిదే రానివాడివి..’ అంటూంటే-
‘పిలవని పేరంటంలా వచ్చానంటావా?’ అన్నాడు డాక్టర్ రంగనాథ్.
‘అబ్బే! నువ్వలా ఏం ఫీలవకు. మా ఇంట్లో ఇవాళ ఏ పేరంటం లేదులే! ఎటొచ్చీ ఊరక రారు మహాత్ములు అన్నట్లు నీలాంటి వాళ్లు ఊరికే రారు కదా! అందుకని ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. అంతే! రారా! కూర్చో. ఇదిగో రమణీ! ఎవరొచ్చారో చూడు’ అంటున్న భర్తలో ఉత్సాహం చూసి తృప్తిగా ఆనందించింది రమణి. ఇద్దరికీ కాఫీలు అందించింది.
‘ఆ! చెప్పరా! ఏమిటి సంగతి? ఇంతకాలానికి మా మీద దయ కలిగింది. చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు నాగేశ్వర్.
‘అదేరా! నువ్వు జాబ్ నించీ రిటైర్ అయ్యావు కదా! ఇక లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావో చూద్దామని మీ ఇంటికి వచ్చాను. ఇక్కడ దగ్గర్లో ఓ పేషెంట్‌ని కలవాల్సి వచ్చిందిలే! అలాగే నిన్నూ ఓసారి చూసి పోదామని వచ్చాను. అంతే!’ అన్నాడు రంగనాథ్. అక్కడ నించీ మెల్లిగా వంటింట్లోకి వెళ్లి వీరి సంభాషణ వింటోంది రమణి.
‘నేనూ ఓ పేషెంట్‌లాగే ఉన్నాను లేరా!’ అన్నాడు నాగేశ్వర్.
‘అదేమిటిరా? ఏమైంది నీకు? ఒంట్లో బాగుండడం లేదా?’ తెలియనట్లే అడిగాడు రంగనాథ్.
‘ఈ మధ్య చాలామందికి ఎక్స్‌వైజెడ్ జబ్బేదో వస్తోందిట కదా! అది నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాంతకవౌతుందని విన్నాను. అది నాకు మొదలైందని అనుమానంగా ఉంది’ అన్నాడు. భార్య ఎక్కడో లోపల ఉంది కదాని ధైర్యంతో మెల్లిగా చెప్పాడు నాగేశ్వర్.
‘అలాంటప్పుడు డాక్టర్లని కన్సల్ట్ చేసి టెస్టులు చేయించుకోవచ్చు కదా! మనసులో దిగులు రోజురోజుకి పెంచుకుంటూంటే నిజంగానే ఆ జబ్బేదో వస్తుంది’ అన్నాడు రంగనాథ్.
‘అబ్బ! అలా అనకురా! భయమేస్తోంది. టెస్టులు చేయించుకోవాలంటే బోలెడు డబ్బు ఖర్చు. ట్రీట్‌మెంట్‌లకి వాటికీ ఉన్న డబ్బు కాస్తా ఖాళీ అయితే ఎలా? ఇంకా మా వాడి చదువు పూర్తవలేదు, పిల్లకి పెళ్లవ్వాలి’
‘అవన్నీ ఆలోచిస్తూ ముందర నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? రోగం వుంటే కదురా! ట్రీట్‌మెంట్ ఇచ్చేది? ముందర పరీక్ష చేయించుకో’ అన్నాడు.
‘ఉంటుందనే అనిపిస్తోందిరా! టీవీలో డాక్టర్ సలహాలు చూశాను. వాళ్లు చెప్పిన లక్షణాలు చాలా నాలో వున్నాయి’
‘ఏమిటా లక్షణాలు?’
‘తరచుగా జలుబు, దగ్గు రావడం, పులి తేనుపులు రావడం, చలిచలిగా అనిపించడం, పొత్తి కడుపు దగ్గర్నించీ గొంతు వరకూ ఎక్కడో ఒకచోట అప్పుడప్పుడు నొప్పి రావడం, ఎక్కువ నడచినా, పని చేసినా గుండె దడ, ఆయాసం రావడం ఇలాంటివన్నీ వాళ్లు చెప్పారు. అవన్నీ నాకూ వున్నాయి’
‘ఓరి పిచ్చివాడా! అలాంటి లక్షణాలన్నీ నీకే కాదురా! ప్రతీ మనిషికీ ఉంటాయి. వాటిని ఆసరాగా తీసుకుని కొందరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వారు కొన్ని చానెళ్లలో పరోక్షంగా ప్రకటనలిస్తున్నారు. అంత డబ్బులు పోసి చదువుకుని, కోట్ల ఖర్చుతో పెద్దపెద్ద ఆస్పత్రులు కట్టినప్పుడు పేషెంట్లు రాకపోతే వారికి నష్టం కదా! డాక్టర్లకి, నర్సులకి, ఆయాలకి మిగతా స్ట్ఫాకి జీతాలిచ్చుకోవాలి. మెయింటెనెన్స్ ఖర్చు అన్నీ ఉంటాయి కదా! అందుకే పేషెంట్లని రాబట్టుకునే మార్గాలు అనే్వషిస్తారు. ఇది ఇప్పుడు సేవల పేరుతో చేసే మార్కెటింగ్. అది తెలియక నీలాంటి వాళ్లంతా ఆ ఆస్పత్రులకి ఎగబడతారన్నమాట. నువ్వు వెళ్లకుండా వాళ్ల మాటలతో మనసులో దిగులు పెంచుకున్నావు’ అన్నాడు రంగనాథ్.
‘అంతేనంటావా?’ నీరసంగా అడిగాడు నాగేశ్వర్.
‘ముమ్మాటికీ అంతే! అయినా నీ అనుమానం తీరడానికి రేపు నాతోరా! ఆ హాస్పిటల్ మంచి పేరున్న హాస్పిటల్, టెస్టులకి రేట్లు, డాక్టర్ ఫీజులు కూడా న్యాయంగా ఉంటాయి. నేను అక్కడ వారానికి మూడురోజులు మధ్యాహ్నం రెండు గంటలసేపు పేషెంట్లని చూస్తాను. అక్కడ పూర్తి వైద్య పరీక్షలు చేయడానికి బయట ఆస్పత్రులకన్నా తక్కువే వసూలు చేస్తారు. పైగా మనలాగా అరవై యేళ్లు పైబడ్డ వారికి రాయితీలు కూడా ఉంటాయి. నాకు తెలిసిన మంచి డాక్టర్లు ఉన్నారు. వారికి నిన్ను పరిచయం చేస్తాను. రేప్పొద్దునే్న సిద్ధంగా ఉండు. కాఫీ కూడా తాగకు. నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను. నువ్వేం భయపడకు’ అన్నాడు రంగనాథ్.
‘ఒకవేళ నిజంగానే నాకా జబ్బు ఉందని తేలితే?’
‘అలా అయితే డాక్టర్లు మందులు రాసి ఇస్తారు. అందుకని లేని జబ్బు ఉందని ఊహించుకుంటూ మనోవ్యాధిని పెంచుకుంటావా?’ అని కాస్త కోపంగా రంగనాథ్ అనేసరికి, ఒప్పుకున్నాడు అతడితో ఆస్పత్రికి వెళ్లడానికి.
* * *
పరీక్షలన్నీ అయ్యాక నాగేశ్వర్‌కి ఏ జబ్బూ లేదని తేలింది. షుగరు, బీపీ కూడా సాధారణంగానే ఉందని తేలింది. అతడిలో ఆనందానికి పట్టపగ్గాల్లేవు. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.
ఇప్పుడతడి బాధ, జబ్బేమీ లేని దానికి అనవసరంగా ఆరోగ్య పరీక్షలని పదివేల దాకా అయిందని. ఇతడికి తను చెప్తే కొట్టి పడేస్తాడని అక్కడే ఉన్న మరో మానసిక వైద్యుడి చేత చెప్పించాడు రంగనాథ్.
ఆయన నాగేశ్వర్‌ని చూసి వివరాలు అడిగి తెలుసుకుని ఇలా సలహా ఇచ్చాడు, ‘ఈ రోజుల్లో రిటైరైన వారికి కూడా ఉద్యోగాలు ఉంటున్నాయి. ఎటొచ్చీ ఇదివరకు వచ్చినంత జీతం రాకపోవచ్చు. ఓపిక వుంటే వెళ్లి పని చేయండి. లేకపోతే హాయిగా ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని భాగవతం, భారతం, భగవద్గీత, రామాయణం వంటి గ్రంథాలూ చదవండి. అవి చదివినా అర్థం అవదు అనుకుంటే కొన్ని టీవీ ఛానెళ్లలో పండితులు ప్రవచనాలు చేస్తున్నారు. అవి విని మనసు ప్రశాంతతని పొందండి.ఇలాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలతో అంతర్మథనం మాని అందరిలోనూ నిండి వున్న ఆ పరమాత్ముని అంతర్మథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. మీకే రోగం లేదు, రాదు, అరవై దాటిన వారికి రిటైర్మెంట్ ఇచ్చేది ఇందుకే! పుట్టుక ఎంత సహజమో! చావూ అంతే సహజం. ఎందరో మహామహులు, మన పెద్దలు అందరూ మనం చూస్తూండగానే వెళ్లిపోయారు కదా! అలాగే మనమూనూ! ఇందులో ముందు నించీ బాధ, బెంగ అనవసరం. ఉన్నన్నాళ్లూ ప్రశాంతంగా ఉండడం, తోటి వారికి సాయపడడం అలవరచుకోండి. నిశ్చింతగా ఉండండి’ అంటూ సాగనంపాడు ఆ డాక్టర్.
‘విన్నావుగా! ఇక నిశ్చింతగా ఉండు’ అంటూ ఇంటి దగ్గర అతడిని దింపి తను వెళ్లాడు రంగనాథ్.
* * *
ఇప్పుడు నాగేశ్వర్ రోజూ అన్ని ఛానెళ్లలో వచ్చే ప్రవచనాలు, న్యూస్ తప్ప ఇంకేమీ చూడడం లేదు. భగవద్గీత రోజుకి ఒక అధ్యాయం అర్థంతోపాటుగా చదవడం అలవాటు చేసుకుంటున్నాడు. రమణి కూడా భర్తతో పాటుగా వింటోంది. ఇప్పుడు అందరిలోనూ ఆనందం, ఉత్సాహం పుంజుకున్నాయి.
*
-ఆర్.ఎస్.హైమవతి
3, సెకండ్ మెయిన్‌రోడ్
సెంబాక్కం,
(నియర్ ఎంఎవి స్విమ్మింగ్ పూల్)
చెన్నై - 600073.
9444945942
044-2227 5503

-ఆర్.ఎస్.హైమవతి