Others

గోపాలుడు- భూపాలుడు (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ- సినిమా అనుసరణ:
ఎస్ భావన్నారాయణ
మాటలు: పాలగుమ్మి పద్మరాజు
నృత్యం: ఎకె చోప్రా,
రతన్‌కుమార్
కళ: కె మీనన్
కూర్పు: కెయస్‌ఆర్ దాస్
కెమెరా: హెచ్‌ఎస్ వేణు
స్టంట్స్: స్వామినాథన్
నిర్మాత: వైవి రావు
సంగీతం: యస్‌పి కోదండపాణి
దర్శకత్వం: జి విశ్వనాథం
**
రాజమండ్రికి చెందిన వైవి రావు 1948లో ‘సువర్ణమాల’ చిత్ర నిర్మాణం బాధ్యత కోసం మద్రాసు వచ్చారు. 1954నుంచి ‘డిటెక్టివ్’ మాసపత్రిక సంపాదకవర్గంలో పనిచేస్తూ సర్క్యులేషన్ మేనేజర్‌గా వ్యవహరించారు. తన బావమరిది భావన్నారాయణ ప్రోత్సాహంతో వారు స్థాపించిన గౌరీ ప్రొడక్షన్స్‌వారి 12 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తరువాత స్వయంగా రవిచిత్ర ఫిలిమ్స్ నెలకొల్పి నిర్మాతగా ‘టక్కరిదొంగ- చక్కని చుక్క’, ‘పగసాధిస్తా’, ‘రివాల్వర్ రాణి’ వంటి చిత్రాలు రూపొందించారు. ఎస్ భావన్నారాయణ తన గౌరీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందించిన చిత్రం ‘గోపాలుడు- భూపాలుడు’. 1967 జనవరి సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలైంది.
***
కుంతల సామ్రాజ్యంలో రాజ్యంకోసం, పదవికోసం కొన్ని తరాలుగా అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవటం ఆనవాయితీగా జరుగుతోంది. ఆ క్రమంలో మహారాజు ప్రభాకర్‌రెడ్డికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని తమ్ముడు వీరేంద్ర, మహరాజును, బాలుని చంపబోయి అన్నగారి చేతిలో మరణిస్తాడు. ఆ దాడిలో మహరాజు మరణించగా, మహారాణి (యస్ వరలక్ష్మి) తనకు జన్మించిన మరో బిడ్డను, దాసి చేత ఆ రాజ్యానికి దూరంగా పంపించేస్తుంది. పులి బారిన పడి దాసి మరణించగా, బిడ్డను మంగమ్మ (హేమలత) కాపాడి గోపన్నగా పెంచుకుంటుంది. యువరాజు రాజేంద్ర భూపతి (ఎన్టీఆర్) యుక్త వయస్కుడై, ఓ పల్లె యువతి రజని (జయలలిత)ని ప్రేమిస్తాడు. మహామంత్రి (మిక్కిలినేని), మేనమామ కుమార్తె పద్మావతి (రాజశ్రీ) నిచ్చి యువరాజు వివాహం చేయాలనుకుంటుంది మహారాణి. ఇంతలో యువరాజును బంధించేందుకు బాబాయి కుమారుడు వీరబాహు (రాజనాల) దాడి చేస్తాడు. అడవిలో గోపన్న అతన్ని రక్షిస్తాడు. ఒకే పోలికలున్న గోపన్నను చూసి ఆశ్చర్యపోయిన యువరాజు, తన రాజ్యానికి రమ్మని ఆహ్వానిస్తాడు. అక్కడ పద్మావతి, గోపన్న ఒకరినొకరు ఇష్టపడతారు. తన రాజముద్రిక గోపన్నకిచ్చి పల్లెలో తన ప్రేయసితో గడుపుతున్న యువరాజును వీరబాహు బంధిస్తాడు. యువరాజుకు బదులు ఒడుపుగా రాజకార్యాలు నిర్వహిస్తూ, అస్త్ర విద్యా పోటీల్లో పాల్గొంటాడు గోపన్న. తన స్నేహితుడు కోటి (పద్మనాభం), రజనిల సాయంతో పాతాళ చెరలో బంధించబడిన యువరాజును విడిపించి కోటకు తెస్తాడు. ఈక్రమంలో గోపన్న తన కుమారుడేనని మహారాణికి తెలుస్తుంది. అతని నిస్వార్థం గ్రహించి గోపన్నను పెంపుడు తల్లి మంగమ్మతో సహా రాజ్యంలో ఉండమని కోరుతుంది. ఇరువురూ అన్నదమ్ములకు తమ ప్రేయసిలతో వివాహం జరగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
చిత్రంలో గోపన్నగా, యువరాజు రాజేంద్రగా నటరత్న ఎన్టీ రామారావు వైవిధ్యమైన నట ప్రతిభను ప్రదర్శించి మెప్పించారు. అమాయకంగా, చురుకుగా, ధీర గాంభీర్యంతో సన్నివేశానుగుణమైన భావోద్వేగాలను నిండుతనంతో ఆకట్టుకునేలా నటించి మెప్పించారు. ఇక పల్లె యువతిగా జయలలిత అమాయకత్వంతో, చక్కని నృత్యంతో అలరించింది. రాకుమారిగా రాజశ్రీ ఔచిత్యమైన నటన ప్రదర్శించింది. రాజమాతగా ఎస్ వరలక్ష్మి బిడ్డల ఎడబాటుకు తల్లడిల్లటం, గోపన్న తన కుమారుడేమోనన్న సంశయం, చివరకు గోపన్నచే నిందలుపడటంలాంటి సన్నివేశాల్లో అద్భుత నటనను ప్రదర్శించి, గంభీరమైన మాతృ హృదయ వాత్సల్య పూరితమైన నటనతో పాత్రలో ప్రత్యేకత చూపారు.
దర్శకులు జి విశ్వనాథం కథానుగుణమైన సన్నివేశాలను రూపొందించటంలో తన ప్రతిభ కనబర్చారు. గోపన్న రాజభవనంలో తొలుత అమాయకంగా, ఆపైన వీరునిగా చాకచక్యం చూపించే సన్నివేశాలను రక్తికట్టించేలా చూపారు. పాతాళ చెరలో వేసిన సెట్టింగులు, నీటిలో మొసలితో పోరాటం, కత్తియుద్ధాలు.. స్టంట్ మాస్టర్ స్వామినాథన్ సాయంతో చిత్ర విచిత్రమైన పోరాటాలు అనుభవంలోకి తెచ్చారు. రాజనాల, ఎన్టీఆర్‌ల మధ్య సభలో, గుహలో, రాజశ్రీని కాపాడే సన్నివేశంలో, తిరిగి సైనికులలో ఎంతో వైవిధ్యంగా థ్రిల్లింగ్‌గా పోరాటాలు రూపొందించి చిత్రీకరించారు. మధ్యలో వాణిశ్రీ, పద్మనాభంలపైనా, అల్లు రామలింగయ్య, జగ్గారావులతోను, హాస్య సన్నివేశాలు చొప్పించి చిత్రాన్ని జనరంజకంగా తీర్చిదిద్దారు. పాటల చిత్రీకరణలోనూ వారి బాణీ కనిపిస్తుంది. తొలుత పిల్లలు వేరు చేయబడే సమయంలో నేపథ్య గీతంగా కథాంశాన్ని సూక్ష్మంగా వివరించారు. సి నారాయణరెడ్డి రచించగా, టిఎం సౌందరరాజన్ ఆలపించిన ఆ గీతం -ఇదేనా తరతరాల చరిత్రలో జరిగింది ఇదేనా. రాజశ్రీ, చెలులపై తోటలో చక్కని సెట్టింగులు, కోనేటి జలకాలతో చిత్రీకరించిన గీతం -ఉయ్యాలో ఉయ్యాలో (ఎస్ జానకి, లత బృందం- సినారె). ఎన్‌టి రామారావు, జయలలితలపై చల్లని వెనె్నలలో చిత్రీకరించిన గీతం -చూడకు చూడకు (పి సుశీల, ఘంటసాల- సినారె). వాణిశ్రీ, పద్మనాభంలపై గీతం -మరదలా చిట్టిమరదలా (పిఠాపురం, ఎల్‌ఆర్ ఈశ్వరి- సినారె). జయలలితపై నృత్య గీతం -ఓం జంతడి (పి సుశీల- సినారె). ఈ చిత్రంలోని అలరించే కనువిందైన, వినసొంపైన ఆకట్టుకునే గీతాలను రాజశ్రీ ఊహలో శ్రీకృష్ణునిగా ఎన్టీఆర్‌పై చిత్రీకరించారు. ఆ గీతం -ఒకసారి కలలోకి రావయ్యా (ఎస్ జానకి, ఘంటసాల- ఆరుద్ర). జయలలిత, ఎన్టీఆర్‌లపై చిత్రీకరించిన హిట్ సాంగ్ -కోటలోని మొనగాడా/ వేటకు వచ్చావా. మరో గీతం -ఎంత బాగున్నది ఎంత బాగున్నది. రాజశ్రీ, ఎన్టీఆర్‌లతోపాటు చివరిలో నలుగురిపై చూపటం (సుశీల, ఘంటసాల- సినారె) ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం సంగీతపరంగానూ శ్రోతలను నేటికీ అలరిస్తుండడం విశేషం.
చిత్రంలో దళపతి (్భమన్న) సత్యనారాయణ, వంటవాడు (మహనస) సలహాదారుగా అల్లు రామలింగయ్య, పల్లె యువతిగా వాణిశ్రీ, రాజనాల అనుచరునిగా జగ్గారావు, గూఢచారిగా సిహెచ్ కృష్ణమూర్తి నటించారు. ‘గోపాలుడు-్భపాలుడు’ చిత్రం చక్కని కథాసంవిధానంతో ఆసక్తికరమైన చిత్రీకరణతో జనరంజకంగా రూపొంది, జనామోదం పొంది, విజయం సాధించింది. జానపద చిత్రాలను అభిమానించే ప్రేక్షకులకు అభిమాన చిత్రంగా నిలిచింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి