అక్షర

విభిన్న సంక్లిష్టతల సమాహారం ‘క్రాస్ రోడ్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రాస్‌రోడ్స్
(కథా సంకలనం)
కె.సదాశివరావు
వెల: రూ.150/-
పంపిణీదారులు:
సాహితి ప్రచురణలు
29-13-53,
కాళేశ్వరరావు రోడ్డు
సూర్యారావుపేట,
విజయవాడ- 520002

కథలెప్పుడూ జీవితాల చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. పెనవేసుకున్న పరిస్థితులు, వెంటాడే పాత్రలూ, చోటుచేసుకున్న పరిణామాలు కొత్త వాతావరణంలోకి మోసుకుపోతాయి. అలాంటి సందర్భాల్లోంచి ఊపిరిపోసుకున్న సంక్లిష్టతలు ఊహించని మలుపులతో సహజత్వానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాయి. అలా పుట్టుకొచ్చినవే కె.సదాశివరావుగారి కథా సంకలనం ‘క్రాస్‌రోడ్స్’లోని కథలు. వస్తువైవిధ్యమైన సంభాషణలతో, ప్రత్యేకశైలితో తనదైన ప్రపంచంలోకి మనల్ని లాక్కెళ్ళిపోతాయి. కథారచన చెయ్యడంలో చెయ్యి తిరిగినతనం అనుభవంలోంచి తొంగి చూస్తుంది. జీవన వాస్తవికత కొట్టొచ్చినట్టు రూపుకడుతుంది. సరళత్వంతో కూడిన వాక్య నిర్మాణశైలి ప్రాపంచిక దృక్పథంతో బంధనాలను పాశ్చాత్య సంస్కృతి ఛాయలను ప్రతిబింబిస్తాయి. రెండు విషయ సూచికలతో కథలు, ఆంగ్ల రాజ్య కథలు పేరిట మొత్తం 19 కథలు ఈ సంకలనంలో వెలుగుచూస్తాయి. నడకలో బిగువు, వాక్యాలలో పదాల పొందిక, ముగింపుని సహజత్వం వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. లబ్దప్రతిష్ఠుడిగా ఎన్నదగిన ఈ రచయిత కథలు వాసిలో ప్రత్యేక ముద్రను వేసుకున్నాయి.
గతంలో ఇండియా సందర్శనకు వచ్చి దిక్కూమొక్కూలేని పరిస్థితుల్లో అచేతనంగా రోడ్డుమీద చావుబతుకుల మధ్య పడివున్న మాక్స్‌బ్రాండన్ జీవితగాథ ‘క్రాస్‌రోడ్స్’. సంగీతం మీద వ్యామోహంతో ప్రపంచాన్ని చుట్టివచ్చే పనిలో సాహిత్య, సంగీత, వేదాంతవేత్తల్ని, సన్యాసుల్ని, ఆధ్యాత్మిక ప్రాంతాల్ని సందర్శించి వచ్చి, యవ్వనప్రాయాన్ని అంకితంచేసే క్రమంలో డా.శశిధర్ పర్యవేక్షణలో మళ్లీ మనిషిగా మారుతాడు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, పెళ్లిచేసుకొని ఒకింటివాడిగా స్థిరపడతాడు. ఇలా ప్రాక్పశ్చిమాలు కలిసే దిక్చక్రపు క్రాస్‌రోడ్స్‌లో ముఖ్యమైనదాన్ని దాటి, దారిలోపడిన కథనం ఈ ‘క్రాస్‌రోడ్స్’ కథలో కన్పిస్తుంది. కథనంలో వెస్ట్రన్ కల్చర్ శైలితోపాటు భారతీయ సంస్కృతి నేపథ్యం బలంగా విన్పిస్తుంది. జీవన తాత్విక ప్రధాన పార్శ్వాల్ని తడిమి పొదివి పట్టడంలో రచయిత కె.సదాశివరావు కృతకృత్యుడయ్యారు.
చిన్నప్పుడు స్కూలురోజుల్లో బాల్యానుభూతుల్ని నెమరువేసుకొనే సన్నివేశం సుబ్బలక్ష్మిని ఎగ్జిబిషన్‌లో కలుసుకునే సందర్భంలో తటస్థపడుతుంది. దీనివెనుక అంతర్లీనంగా దాగివున్న స్నేహపరిమళపు గుబాళింపునకు వ్యంగ్యస్పృహతో రచయిత కళ్ళకు కట్టిస్తారు. ‘‘పొగ-మంచు’ కథలో. కథాకథనం చాలా ఆసక్తిగా సాగుతుంది. అందరి భవిష్యత్తునూ జాతకాల రూపంలో పరిష్కార మార్గాల్ని అనే్వషించి, ఆచరింపజేసే ఓ తాంత్రిక్‌రాయ్ చివరికి తన భవిష్యత్తును తెలుసుకోలేక ఓ గజ్జికుక్క స్కూటర్‌కి అడ్డురావడంతో గాయపడి ఆస్పత్రి పాలవుతాడు. అందరికీ శకునం చెప్పే బల్లి తానే కుడితిలో పడిన చందంగా మిగిలిపోతుంది. ‘తాంత్రిక్ ఈవెనింగ్’ కథ గత స్మృతులను నెమరువేసుకునే తరహాలోనే ఒకప్పటి కళాశాల అందగత్తె మహిమను ఊహించని రీతిలో కలుసుకొని బాహ్యాకర్షణలో ఊగిసలాడే మానసిక స్థితిని తాత్విక దృష్టికోణంలో విడమర్చి విశే్లషించి చెబుతారు. ‘తుషార బిందువులు’ కథలో. కథనశక్తి చాలా బలంగా ఉన్నతంగా వ్యక్తీకరిస్తాలిందులో.
తండ్రీ-కొడుకుల మధ్య ఆచరణలో, ఆదర్శాలలో తొంగి చూసిన రెండు మనస్తత్వాల అంతరాలతోపాటు, ధనంతో కొనలేని కొన్ని జీవితపు విలువల లోతును ఆదర్శప్రాయంగా చిత్రించడంలో రచయిత ఆరితేరిన తనం స్పష్టమవుతుంది. ‘లాస్ట్‌ట్రిప్’ కథలో. రాంచంద్-శ్రీ్ధర్‌ల విరుద్ధ్భావాల ఆలోచనల మేళవింపునకు ఇది దర్పణం పడుతుంది. వ్యక్తిత్వం ఔన్నత్యస్పృహను ప్రతిబింబించే తపనగల గొప్పకథ ఇది. ‘అశ్వమేథం’ కథలో గెలుపునకూ ఓటమికీ మధ్య తొంగి చూసే అంతర ఆంతర్య స్వభావాన్ని బతుకు బూతద్దంలో చూపించే ప్రయ త్నం చేస్తారు రచయిత.
పొన్నుచామి దగ్గర మాట తీసుకొని గుర్రప్పందెం రేసులో గెలవాలని ప్రయత్నించి గాయపడి ఓడిపోతాడు జాకీ విజయ్. ఈ అంతర్గత సంఘర్షణ
జీవితంలోని పలు పార్శ్వాల్ని స్పృశించి వ్యాపార ప్రపంచం రహస్యాల గుట్టురట్టు చేస్తుంది. ఈ డొల్లతనాన్ని ఆవిష్కరించడంలో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వారసత్వ తగాదాల ముఠా కక్షలను ప్రతిఫలింపజేసే కథ ‘కథకానిది’. వర్గశత్రుత్వాన్ని నిరసిస్తూ పైఅధికారిని తన కొడుకుకి బదిలీకోసం ప్రయత్నించి ఓడిపోతాడు తండ్రి. రక్తపాతానికి దూరంగా మానవత్వాన్నీ, కుటుంబ సంక్షేమాన్నీ కోరుకునే కథ ఇది. వెలుగులోకి రాని ఒకప్పటి అజ్ఞాత పద్య కవి పరంజ్యోతిగారి రచనలను పుస్తకరూపంలో తీసుకురావడానికి మిత్రులతోపాటు నవీన్ చేసిన ప్రయత్నం చివరికి బూడిదలో పోసిన పన్నీరవుతుంది. జీవన ఆర్తిని చాలా ఆర్ద్రంగా అక్షరబద్ధం చేసిన రచయిత సృజనాత్మకశక్తికి ఇది నిలువుటద్దంగా నిలుస్తుంది. యులిసిస్ నవల ప్రాధాన్యతను, కథాచిత్రణ తీరునూ విడమర్చిచెప్పే కథ ‘యులిసిస్ వచ్చిన రోజు’. పాశ్చాత్య దేశాల ఆలోచనా సరళిని, అవగాహనాశైలిని, వ్యవహార తీరునూ బతికే విధానాన్ని అక్షరాక్షరంలో బొమ్మ కట్టిస్తారు రచయిత. గాఢానుభూతి, హృదయావిష్కరణలతో పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.
‘ఆంగ్ల రాజ్యకథలు’విషయానికొస్తే భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వబోతున్న తరుణంలో దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి మనస్కరించక ముందు బ్రిటీష్ అధికార్లు పడే మానసిక వ్యధకు సజీవ దర్పణం ‘లాస్ట్ పేరేడ్’ కథ. చాలా అహంభావ దృష్టితో, విషాదకరంగా, హృద్యంగా కొనసాగుతుంది. తరతరాలుగా భారత్‌లో పాతుకుపోయిన బ్రిటీష్ వారసుల మనస్తత్వ చిత్రణకి సజీవ ప్రతిబింబమిది. రాజుగారి ప్రయాణంలో తారసపడిన విషాద సన్నివేశ దృశ్యచిత్రాలు, వ్యధాభరిత స్థితిగతులు అవగతమవుతాయ. కథ చివర్లో అసంపూర్ణంగా మిగిలిపోయిన ముగింపు ‘యాత్ర’ కథని స్తబ్దతకి గురిచేస్తుంది. ‘బహుమతి’ కథలో మహారాజు- మహారాణిలు బ్రిటిషర్స్ అయిన కారొలైన్, సిడ్నీ థామ్సన్‌ల వివాహానికి హాజరై గాజు పెంకులతో, రాళ్ళతో పొదిగిన బంగారపు నకిలీ హారాన్ని కానుకగ్గా ఇవ్వడంలో ఉన్న మోసపూరిత మర్మరహస్యాన్ని తెలివిగా తిరస్కరించి ఉత్తరంతో తిప్పికొట్టే ప్రయత్నం చెయ్యడం అరుదైన కొసమెరుపుతో ముగింపునిస్తుంది. సిపాయిల తిరుగుబాటు కాలంలో గాయాలతో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని వచ్చి ఉద్యమకారుల చేతిలో అసువులుబాసిన ఒక మంచి బ్రిటీష్ అధికారి కథ ‘లాయిడ్ సాబ్’. స్వాతంత్య్రానికి పూర్వం గాంధీ జీవిత ఘట్టాల్ని శిక్షపడిన తీరును, వ్యక్తిత్వాన్ని, పోరాటం క్షణాలను కథనాత్మక శైలితో చిత్రించిన తీరు అబ్బురపరుస్తుంది ‘నేకెడ్ ఫకీర్’ కథ. ఇదే తరహాలో విలక్షణ అంశాల్ని కథలుగా మలిచిన తీరు ‘మరో బహుమతి’, ‘వేటగాళ్లు’, ‘్ఢల్లీ దర్బార్’వంటి రచనలు స్పష్టంచేస్తాయి.
ఇలా రెండు సంస్కృతుల వారసత్వాన్ని, ఇతర దేశాల సంప్రదాయక విలువల్ని, లోతుపాతుల్ని, సందిగ్ధతల్ని, విషయ వైవిధ్యాన్ని అందిపుచ్చుకొని నేర్పుగా ప్రదర్శించడంలో రచయిత సదాశివరావు విశాల దృష్టి. తులనాత్మక పరిశీలనా దృక్పథం, అస్తిత్వతాత్విక అవగాహనా రీతి, జీవన మూలతత్వ స్వభావ ఛాయల మేళవింపు సంపూర్ణంగా అద్దంపడతాయి. స్వతహాగా మంచి అనువాదకుడు, అధ్యయనశీలి, ఆలోచనాపరుడు, విశిష్ట సైన్స్‌ఫిక్షన్ కథకుడు అయిన సదాశివరావుగారి విలక్షణ జీవనశైలి. బహువిషయ, భాషా పరిజ్ఞానంతోపాటు పాశ్చాత్య దేశ రచయితల, కవుల రచనలను జీర్ణించుకొని, వొంటబట్టించుకోగలగడం చాలా కొద్దిమందికే సాధ్యపడుతుంది.

-మానాపురం రాజా చంద్రశేఖర్