అక్షర

ఆస్తికుని ఆవేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్య్రంబకేశ శతకం
- డా.పింగళి గంగాధరరావు;
పుటలు: 48;
వెల: రు.101/-;
ప్రచురణ కర్తలు:
సాహితీ ప్రచురణలు,
3-68/1, పోతంగల్,
కోటగిరి మండలం,
నిజామాబాద్ జిల్లా.

భక్తి ప్రపత్తులతో శతకం రాయటం ఆత్మాశ్రయ రచనం. అందులో కొన్ని కవిత్వపు విలువలతో ప్రమోదాత్మకత, ప్రబోధాత్మకత పోహళించి రాస్తే అది కావ్యం అవుతుంది. ఇలా కొంత కవితా గంధం కూడా అద్ది ఒక పఠనీయ రచనగా డా.పింగళి గంగాధరరావుగారు రాసిన త్య్రంబకేశ శతకం ఒక మంచి పుస్తకం.
ఇందులో శతక రచనా సంప్రదాయబద్ధంగానే 108 పద్యాలున్నాయి. ప్రతి పద్యానికీ మకుటం ‘తాప తిమిర నాశ! త్య్రంబకేశ!’ అని. ‘తాపతిమిర నాశ’ అనటంలో ధ్వనించే గంభీరార్థం ప్రశంసనీయం. పరమాత్మనుంచి జీవాత్మ తాను వేరుపడి ఒక ఆర్తిని, ఒక వియోగ బాధను, ఒక అనిర్వచనీయ ఆధ్యాత్మిక తాపాన్ని అనుభవిస్తుంటాడు. ఇదే కవి సమ్రాట్ విశ్వనాథ చెప్తూ ఉండిన ‘జీవుని వేదన’. ఆ వేదనంతా తనను ఒక తిమిరంలాగా ఆవహించి చుట్టుకొని ఉన్నది; ఆ తిమిరాన్ని అంతంచేసే స్వామివి నీవే ఓ త్య్రంబకేశా అంటూ సర్వేశ్వరుని సంభావన చేస్తున్నాడు శతక కర్త. ఇది పింగళివారి ఆర్తి మాత్రమేకాదు. ప్రతి ఆస్తికుని ఆవేదన. ఇది సార్వకాలికం, సార్వజనీనం.
ఇక శతకంలోని కవిత్వపు విలువల విషయానికొస్తే ‘‘సహనమున్నచాలు సాధ్యవౌనేదైన/ శిలయుశిల్పమవద చితికి చితికి/ హలము తగిలి తగిలి హరితవౌబీడైన’’అంటూ ఆలంకారికంగా చెప్పిన వాక్యాలలో ‘కష్ట్ఫేలి’అనే నీతితోపాటు కష్టపడే వ్యక్తియొక్క బ్రతుకులోని ఆర్ద్రత, వేసట, దయనీయతలు స్ఫురించి ఆలోచించేకొద్దీ గుండె పొరలలోకి చొచ్చుకుపోతాయి, గుండెను పిండేస్తాయి. ఇదీ- భావగాంభీర్యం అన్నా, భావార్ద్రత అన్నా.
‘‘వీపుమీద గొట్ట వేదన యొకడికె/ తలను గొట్టనొకడు తలపు మరచు/ కడుపుకొట్టరాదు కలత చెందు గృహము’’అన్న మాట చాలా మంచి మాట. ఎవరినైనా శారీరకంగా హింసించటంకంటే అతని నోటి ముందు కూడు తీయటం గాని, అతని జీవనోపాధిని దెబ్బతీయటం గాని అమానుషం; దారుణాతి దారుణం. కాయానికి దెబ్బ తగిలితే దెబ్బ తగిలినవాడు మాత్రమే ఏడుస్తాడు. అతని కడుపుమీద కొడితే అతని కుటుంబం మొత్తం క్షోభిస్తుంది. ఈ భావం ఊహిస్తేనే కడుపు తరుక్కుపోతుంది.
‘‘ఒక్క విత్తుచాలు మొక్క మ్రానగుటకు/ సూక్తియొకటి చాలు శక్తి నింప/ చిన్న దివ్వె చాలు చీకట్లు ఛేదింప’’వంటి ఎంతో లోతైన సందేశాత్మక పద్యాలు చాలా ఉన్నాయి యిందులో.
‘మావూరు’ (మాయూరు); ‘నిండి వున్న’ (నిండి యున్న), ‘దూషణుణ్ణి’ (దూషణునిని); ‘ఆదరించేవాడు’ (ఆదరించెడివాడు) మొదలైన వ్యాకరణ దోషాలు, ఉద్భవించావు, దైవానివి, చూపుతావు, ఉచ్చరిస్తు, ఉడుమోలె మొదలైన రూపాలతోడి విశృంఖల వ్యావహారిక భాషా పద ప్రయోగాలు సన్నబియ్యంలో చిన్నచిన్న పలువురాళ్ళ లాగా ఎబ్బెట్టుగా ఉన్నాయి.
మొత్తంమీద కవిత్వపు విలువల పరంగా ఈ శతకం ఒక మంచి పుస్తకం.
-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం