అంతర్జాతీయం

అమెరికాను కుదిపేస్తున్న మంచు తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 23: అమెరికా రాజధాని వాషింగ్టన్‌పై రికార్డు స్థాయిలో 30 అంగుళాల మంచును కప్పేయవచ్చని భావిస్తున్న మంచు తుపాను శనివారం అమెరికా తూర్పు తీరాన్ని తాకింది. ఈ మంచు తుపాను కారణంగా దేశవ్యాప్తంగా ఎనిమిది మంది చనిపోగా, కనీసం పది రాష్ట్రాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి. కాగా, ఈ మంచు తుపాను తాకిడికి గురి కాకుండా ఉండడం కోసం ఎక్కడైనా ఆశ్రయం పొందాలని ఈ మంచు తుపాను మార్గంలో వారాంతపు ప్రయాణాల్లో ఉండే లక్షలాది మందికి అధికారులు విజ్ఞప్తి చేశారు. మంచు తుపాను తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో జార్జియా, నార్త్ కరోలినా, టెనె్నస్సీ, మేరీలాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూ జెర్సీ, న్యూయార్క్, కెంటకీ ఉన్నాయి. ఈ రాష్ట్రాలతో పాటుగా వాషింగ్టన్ డిసి సైతం మంచు ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఇళ్లలోనే ఉండాలని, భద్రతకోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) తమ సభ్యులను కోరింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు ఆశ్రయం కల్పించడం కోసం గురుద్వారాలు సహా పలు దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలను తెరచి ఉంచారు. తూర్పు తీరప్రాంతం, మధ్య అట్లాంటిక్ ప్రాంతాలను వేల టన్నుల మంచుతో కప్పేసిన ఈ మంచు తుపాను మార్గంలో దాదాపు 8.5 కోట్ల మంది అంటే అమెరికా మొత్తం జనాభాలో నాలుగో వంతు ఉన్నారు.మంచు తుపాను కారణంగా శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా కనీసం 8 మంది చనిపోయినట్లు మీడియా వార్తలు పేర్కొన్నాయి. స్నోజిల్లా2గా మీడియా అభివర్ణించిన ఈ మంచుతుపాను అంగుళాల మేర మంచును కుమ్మరించడంతో లక్షా 20వేలకు పైగా ఇళ్లకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ వారాంతానికల్లా వాషింగ్టన్ నగరం 30 అంగుళాల మేర మంచుతో కప్పడిపోతుందని భావిస్తుండగా, కనీసం పది రాష్ట్రాలు స్నో ఎమర్జెన్సీని ప్రకటించాయి. గత 90 ఏళ్లలో ఎన్నడూ లేని పరిస్థితి ఉంటుందని తాము అంచనా వేస్తున్నామని, ఇది చావు బతుకుల సమస్యగా మారవచ్చని, కొలంబియా డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఉన్న వారంతా కూడా ఇలాగే భావించాలని వాషింగ్టన్ డిసి మేయర్ మిరియల్ ఇ బౌసెర్ చెప్పారు. సాధారణంగా శుక్రవారం రాత్రి సందర్శకులతో క్రిక్కిరిసి ఉండే మార్కెట్లు, మాల్స్, రెస్టారెంట్లు అన్నీ కూడా జనం లేక బోసిపోయి కనిపించాయి. రోడ్లపై వాహనాల ట్రాఫిక్ కూడా లేదు. మంచు తుపాను కారణంగా శుక్ర, శనివారాల్లో 6 వేలకు పైగా విమాన సర్వీసులను రద్దు చేయగా, 4,500 సర్వీసులు ఆలస్యమైనాయి. ముందుజాగ్రత్త చర్యగా వాషింగ్టన్ ప్రాంతంలో ప్రజా రవాణా సర్వీసులను కూడా నిలిపివేశారు. మరో 36 గంటల పాటు మంచు తుపాను ప్రభావం ఉంటుందని, శనివారం మధ్యాహ్నం తర్వాత తుపాను అసలు తీవ్రత కనిపిస్తుందని, భారీ మంచు, గాలి వేగం పెరగడం, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంటున్నారు.