మెయన్ ఫీచర్

ఆర్థిక వ్యవస్థపై భరోసా తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ దేశాలకు చెందిన ఆర్థిక వ్యవస్థలకు నూతన సంవత్సరం చిరు దరహాసాన్ని అందించింది. అయితే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తాను కూడా ఉన్నానని భారత్ దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు మరచిపోకుండా గుర్తు చేస్తుంటుంది. ముఖ్యం గా ప్రపంచంలో జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశంగా భారత్ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) పరంగా స్థిరంగా ముందుకు పోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏ దేశం కూడా స్వయం సమృద్ధం కాదు. ఒకరిపై మరొకరు ఆధారపడాల్సిందే. అయితే మన చుట్టూ చోటుచేసుకుం టున్న పరిణామాల ప్రభావం భారత ఆర్ధిక వ్యవస్థపై ఏమాత్రం పడబోదన్న విశ్వాసంతో మనల్మి మనం భ్రమింపజేసుకుంటున్నామన్నది మాత్రం వాస్తవం.
వాణిజ్య ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలోవరుసగా ఏడోసారి (13-14 శాతం) పడిపోయాయి. వచ్చే మార్చి 31తో ముగిసే వర్తమాన ఆర్థిక సంవత్సరంతో ఈ ఎగుమతులు గత నాలుగేళ్లలో కనిష్ట స్థాయిని నమోదు చేయనున్నాయి. ఈ ఎగుమతుల్లో అధికంగా దెబ్బతినేది పెట్రోలియం ఉత్పత్తుల రంగం. వీటి ఎగుమతులు దాదాపు 50 శాతం పడిపోనున్నాయి. ముఖ్యంగా ఈ రంగంలో ఉన్నది, దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్. కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన ప్రకారం, జిడిపిలో ఎగుమతుల వాటా 2013-14లో నాలుగోవంతు నుంచి ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్థ్భాగంలో ఐదోవంతుకు పడిపోయాయి. శ్రామికులు అత్యధికంగా అవసరమైన వస్తప్రరిశ్రమ, దుస్తులు, వజ్రాలను మెరుగు పరచడం, తోళ్లు, హస్తకళలు, సముద్ర ఆహారం వంటి రంగాల్లో తీవ్ర మాంద్యం నెలకొనివుంది. సమాంతరంగా డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ పడిపోతున్నప్పుడు ఎగుమతులకు ఎంతో ప్రోత్సాహం కలగాలి. కాని అది జరగకపోవడమే విచిత్రం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్, దక్షిణాసియాలు ‘‘వెలుగు రేఖలు’’ అని ప్రపంచ బ్యాంకు ఆకాశానికెత్తేసినా, మనం ఆనందించదగ్గ పరిణామం ఏమీ కనిపించడం లేదు. దేశంలోని బ్యాంకులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు, నిరర్ధక ఆస్తులు, అతిపెద్ద ప్రైవేటు కంపెనీలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడం వంటి సమస్యల బరువుతో కునారిల్లుకుపోతున్నాయి. మరి నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు కార్పొరేట్ రంగం పెట్టుబడులు విపరీతంగా పెరిగాల్సింది పోయి, వాటి సామర్ధ్యాలు దారుణంగా పడిపోయి, లాభాలు కుంచించుకొని పోయి, నిరుపయోగంగా ఉండిపోయాయి.
ఒక అంచనా ప్రకారం దేశ స్థూలజాతీయోత్పత్తిలో పెట్టుబడుల వాటా గత ఏడేళ్ల కాలంలో 10 శాతం పడిపోయింది. ఇది 2008లో 38 శాతం ఉండగా ప్రస్తుతం 28 శాతం నమోదైంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తున్నది. ఒకవేళ అటువంటి పెట్టుబడులు వచ్చినా అవి మొత్తం పెట్టుబడులలో పదిశాతానికి మించవు. ఈ నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాట్లో పెట్టాలంటే ప్రభుత్వానికి...ప్రభుత్వ రంగంపై ఆధారపడం ఒక్కటే మార్గం. కానీ దేశంలో డిమాండ్ చాలా తక్కువ. మరి సమర్ధతకు మారుపేరుగా నిలిచిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు హయాంలో కూడా సరకు రవాణా లక్ష్యాలను చేరుకోలేదు. విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి కూడా నత్తకు అన్న రీతిలో కొనసాగుతోంది. ఇక వౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు ప్రగతి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.
అయితే ఇక్కడ కనిపించే ఒకే ఒక్క సానుకూల పరిణామం, ప్రపంచంలో ముడి చమురు ధరలు పడిపోవడం. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇది అదృష్టమనే చెప్పాలి. అయినప్పటికీ అంతర్జాతీయ ముడి చమురు ధరలు గత 12 సంవత్సరాల కాలంలో కనిష్ట స్థాయికి చేరుకోవడం, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మాంద్యానికి నిదర్శనం. అయితే భూభౌగోళిక రాజకీయ పరిస్థితులు మెరుగుపడుతుండటం మరో పరిణామం. దీనికి విరుద్ధంగా పశ్చిమాసియాకు చెందిన సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య తలెత్తుతున్న సరికొత్త సంఘర్షణలు సమస్యలను మరింత విస్తరింపజేస్తున్నాయ.
ఉద్గమిస్తున్న ఆర్థిక వ్యవస్థలుగా పేరుపడ్డ బ్రిక్స్ దేశాల్లో-బ్రెజిల్, రష్యా, ఇండి యా, చైనా, దక్షిణాఫ్రికా- బ్రెజిల్, రష్యాలు దారుణమైన మాంద్యంలో కూరుకుపోయాయి. ఇటీవల బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ నాలుగోవంతుకు కుంచించుకొని పోగా, రష్యా ఆర్థిక వ్యవస్థ 40 శాతానికి క్షీణించింది. ఇక చమురు ఎగుమతి దేశాలైన నైజీరియా, వెనిజులాల ఆర్థిక వ్యవస్థలు ధ్వంసమైపోయాయి. ఉద్గమిస్తున్న ఆర్థిక వ్యవస్థలు ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఊబిలోకి లాక్కొని పోతున్నాయి’’ అంటూ 2015 అక్టోబర్‌లో ఫైనాన్షియల్ టైమ్స్ విడుదల చేసిన నివేదిక హెచ్చరించింది. అంతేకాదు చైనా కరెన్సీ విలువను తగ్గించడం వల్ల, ప్రపంచ దేశాల్లోని స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలిపోతాయని కూడా ఈ నివేదిక అంచనా వేసింది. సరీగ్గా అదే జరిగింది కూడా.
కొనుగోలు శక్తి పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పరిగణించబడిన చైనా నేడు అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతకు మారుపేరుగా నిలిచింది. మూడు దశాబ్దాల పాటు అప్రతిహతంగా రెండంకెల స్థాయిలో ప్రగతిపథంలో దూసుకెళ్లిన చైనా ఆర్థిక ప్రగతి ఆరు, ఏడు శాతానికి పరిమితమైంది. 2008లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్, ఆస్ట్రేలియాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరత్వంగా ఉంచడంతో ఎంతో దోహదపడ్డాయి. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఈ దేశాలు అదే రకమైన పాత్రను ఎంతోకాలం పోషించలేవన్నది మాత్రం సుస్ప ష్టం. అమెరికాకు చెందిన అతిపెద్ద పెట్టుబడిదారు జార్జ్ సొరస్ 2008, సెస్టెంబర్ 15న అమెరికాలో చోటు చేసుకున్న మాంద్యం మాదిరి సంక్షోభం మళ్లీ పొంచి ఉన్నదని ఇప్పటికే హెచ్చరించారు. ఆ రోజు న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో లెహ్‌మన్ బ్రదర్స్, మెర్రిల్ లిన్చ్, అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూపు కంపెనీలు ఒకేసారి దివాలా తీసిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది చెప్పేదేమంటే జార్జ్ సొరస్ అనవసర భయాందోళనలు కల్పిస్తున్నాడని, ఆయన చెప్పే మాటలను పట్టించుకోవాల్సిన అవసం లేదని. అదీ కాకుండా అదెప్పుడో ఏడేళ్ల క్రితం జరిగింది. మళ్లీ అటువంటిది మళ్లీ సంభవించవచ్చునన్నది కేవలం అనవసర భయాందోళన తప్ప మరోటి కాదని వారు ఘంటాపథంగా చెబుతున్నారు.
‘‘గ్లోబల్ ఫైనాన్సియల్ టర్మోయిల్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ : మేజర్ కన్‌టాజియన్ అండ్ షాకింగ్ లాస్ ఆఫ్ వెల్త్?’’, పేరిట ఆసియా అభివృద్ధి బ్యాంకు 2009, మార్చి నెలలోచర్చా నివేదికను విడుదల చేసింది. నాటి మాంద్యం పుణ్యమాని ఆసియలోని అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక దేశాలు సగటున మొత్తం 9.6 ట్రిలియన్ డాలర్లు నష్టపోయాయని పేర్కొంది. ఇది ఈ ప్రాంతంలోని దేశాల మొత్తం స్థూల జాతీయ ఆదాయం కంటే 109 రెట్లు ఎక్కు వని ఆ నివేదిక పేర్కొంది. 1930లో ప్రపం చ వ్యాప్తంగా గొప్ప మాంద్యం చోటుచేసుకుంది. ఆ మాంద్యం ప్రభావం ప్రపంచాన్ని అప్పట్లో పెద్ద కుదుపునకు లోను చేసింది. అప్పట్లో కూడా మాంద్యం అమెరికా నుంచే ప్రారంభమైంది. 1929, సెప్టెంబర్ 4 నుంచి స్టాక్ మార్కెట్ల పతనం ప్రారంభమైంది. 1929, అక్టోబర్ 29న ఏకంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలి పోయాయి. 1929- 32 మధ్యకాలంలో ప్రపంచం వ్యాప్తంగా స్థూలజాతీయోత్పత్తి దాదాపు 15శాతం పడిపోయింది. అదే 2008-09 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలు కోల్పోయిన జిడిపి కేవలం ఒక్కశాతం మాత్రమే. 1930 నాటికి కొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడినప్పటికీ, మిగిలిన దేశాల్లో మాత్రం రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభయ్యే వరకు ఇది కొనసాగింది. 1930 నాటి మహా సంక్షోభం పేద, ధనిక దేశాలను తీవ్రంగా దెబ్బతీసింది. అంతర్జాతీయ వాణిజ్యం 50 శాతం కంటె అధికంగా పడిపోయింది. అమెరికాలో నిరుద్యోగం 25 శాతం పెరగ్గా, చాలా దేశాల్లో ఇది 35 శాతం వరకు నమోదైంది. భారీ పరిశ్రమలపై ఆధారపడిన దేశాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.
అంతటి తీవ్ర స్థాయిలో కుదిపేసిన నాటి మాంద్యం వల్ల కలిగిన దుష్ఫలితాలు ఇంతవరకు సమసిపోలేదు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం చైనాలో ఏర్పడిన సంక్షోభం కూడా ఇప్పుడప్పుడు తొలగిపోతుందనుకోవడం వట్టి భ్రమ మాత్రమే. ఇది కూడా దీర్ఘకాలం కొనసాగే అవకాశాలే ఎక్కువ. రిజర్వ్ బాంకు గవర్నర్ రంగరాజన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, ‘‘పోటీలు పడుతూ కరెన్సీ విలువ తగ్గించుకుంటూ పోవడం ప్రతికూల పరిణామాలకు దారి తీయవచ్చు. ఇది వివిధ దేశాల ప్రభుత్వాలు స్వీయ రక్షణ విధానాలను మరింత కఠినంగా అమలు పరచడానికి దారితీస్తుంది. అంటే తమ ఆర్థిక వ్యవస్థను బాగు పరచడానికి, ఇతర ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే విధానం అమలు చేయడం మొదలు పెడితే ఇక ప్రపంచం పరిస్థితి మరింత అధ్వాన్నం కాకమానదు. ప్రస్తుతం యుఎస్ ఫెడరల్ బ్యాంకు వడ్డీరేట్లను పెంచడం, చైనా యువాన్ విలువను తగ్గించడం ఇటువంటి విధానాలకు ఉదాహరణ. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్ని ఎదుర్కొంటున్నది. దీన్ని తట్టుకోవడానికి తన వద్ద ఉన్న డాలర్ నిల్వలను విడుదల చేయడం ద్వారా లిక్విడిటీని మరింత ప్రోత్సహించవచ్చు. చైనా ఆర్థిక వ్యవస్థ మాం ద్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశం తీసుకునే ఈ చర్యలు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత దెబ్బతినడానికి దోహదకారి కాగలవు. దిగజారిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారత్‌కు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.

- పరంజయ్ గుహ థాకుర్తా