క్రీడాభూమి

అశ్విన్ కమాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 14: శ్రీలంకతో ఆదివారం జరిగిన చివరి, మూడో టి-20లో అశ్విన్ తన బౌలింగ్ మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. భారత్‌కు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. పిచ్ స్వభావాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని లంక బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. అతనితోపాటు మిగతా బౌలర్లు కూడా రాణించి, ప్రత్యర్థి జట్టును కేవలం 82 పరుగులకే ఆలౌట్ చేశారు. దసున్ షనక (19), తిసర పెరెరా (12) తప్ప ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారంటే లంక బ్యాటింగ్ ఏ విధంగా పతనమైందో ఊహించుకోవచ్చు. నాలుగు వికెట్లు కూల్చిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత విజయానికి బాటలు చేశాడు. కాగా, శ్రీలంకకు టి-20 ఇంటర్నేషనల్స్‌లో ఇదే అత్యల్ప స్కోరు. 2010 టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 87 పరుగులకే ఆలౌటైంది. ఈసారి భారత్ చేతిలో అంత కంటే తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. సాదాసీదా లక్ష్యాన్ని భారత్ మరో 37 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 9 వికెట్ల ఆధిక్యంతో లంకను చిత్తుచేసి, మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి సంప్రదాయాలను పక్కకుపెట్టి, కొత్త బంతితో మొదటి ఓవర్ వేసే బాధ్యతను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అప్పచెప్పాడు. అతని వ్యూహం ఫలించింది. ఆరంభంలోనే స్పిన్‌ను ఎదుర్కోవాల్సి రావడంతో కంగుతిన్న శ్రీలంక ఓపెనర్లు వికెట్లు సమర్పించుకొని పెవిలియన్ చేరారు. మొదటి ఓవర్ మూడో బంతిని షాట్‌గా మార్చేందుకు ప్రయత్నించిన నిరోషాన్ డిక్వెల్లా (1)ను ధోనీ స్టంప్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతిలో తిలకరత్నే దిల్షాన్ (1) కూడా వెనుదిరిగాడు. అతనిని అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కేవలం మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఆతర్వాత కోలుకోలేకపోయింది. కెప్టెన్ చండీమల్ కేవలం 8 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లోనే హార్దిక్ పాండ్య క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. అలేస గుణరత్నే నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అశ్విన? బౌలింగ్‌లో సురేష్ రైనాకు దొరికిపోయాడు. నాలుగు పరుగులు చేసిన మిలింద సిరివర్ధనను వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. టాప్ ఆర్డర్‌లో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం శ్రీలంకను నిలువునా ముంచేసింది. దసున్ షనకతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే దిశగా సాగుతున్న సికుగే ప్రసన్న (9) తొందరపడి పరుగు కోసం చేసిన ప్రయత్నంలో విఫలమయ్యాడు. అతను రనౌట్ కావడంతో లంక ఆశలకు పూర్తిగా గండింది. మరికొద్ది సేపటికే షనక వికెట్ కూడా కూలింది. 19 పరుగులు చేసిన అతనిని రవీంద్ర జడేజా బౌల్డ్ చేశాడు. కొన ఊపిరితో ఆడుతున్న లంకను సురేష్ రైనా కూడా దెబ్బతీశాడు. అతను ఒకే ఓవర్‌లో సచిత్ర సేనానాయకే (8), తిసర పెరెరా (12) వికెట్లు పడగొట్టి, లంక పతనంలో తన వంతు పాత్ర పోషించాడు. ఒక పరుగు చేసిన దిల్హారా ఫెర్నాండోను జస్‌ప్రీత్ బుమ్రా బౌల్డ్ చేయడంతో 18 ఓవర్లలో 82 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. అప్పటికి దుష్మంత చమీర 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.
బౌలర్లు విజయానికి బాటలు వేయగా, భారత బ్యాట్స్‌మెన్ ఎలాంటి సమస్య లేకుండా లక్ష్యాన్ని ఛేదించారు. రోహిత్ శర్మ 13 పరుగులు చేసి చమీర బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరగ్గా, శిఖర్ ధావన్, రహానే మరో వికెట్ కోల్పోకుండా జట్టుకు విజయాన్ని అందించారు. 13.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి భారత్ విజయభేరి మోగించే సమయానికి ధావన్ 46, రహానే 22 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా. ఈ విజయంతో భారత్ టి-20 జట్టు నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. సిరీస్‌లో అద్భుత ప్రతిభ కనబరచిన రవిచంద్రన్ అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

స్కోరుబోర్డు
శ్రీలంక ఇన్నింగ్స్: నిరోషాన్ డిక్వేల్లా స్టంప్డ్ ధోనీ బి అశ్విన్ 1, తిలకరత్నే దిల్షాన్ ఎల్‌బి అశ్విన్ 1, దినేష్ చండీమల్ సి హార్దిక్ పాండ్య బి అశ్విన్ 8, అసెలా గుణరత్నే సి రైనా బి అశ్విన్ 4, మిలింద సిరివర్ధన బి నెహ్రా 4, దసున్ షనక బి జడేజా 19, సీకుగె ప్రసన్న రనౌట్ 9, సచిత్ర సేనానాయకే సి ధోనీ బి సురేష్ రైనా 8, తిసర పెరెరా సి జడేజా బి రైనా 12, దుష్మంత చమీర నాటౌట్ 9, దిల్షార ఫెర్నాండో బి జస్‌ప్రీత్ బుమ్రా 1, ఎక్‌స్ట్రాలు 6, మొత్తం (18 ఓవర్లలో ఆలౌట్) 82.
వికెట్ల పతనం: 1-2, 2-3, 3-12, 4-20, 5-21, 6-48, 7-54, 8-72, 9-73, 10-82.
బౌలింగ్: అశ్విన్ 4-1-8-4, రవీంద్ర జడేజా 4-1-11-1, ఆశిష్ నెహ్రా 2-0-17-1, జస్‌ప్రీత్ బుమ్రా 3-0-10-1, యువరాజ్ సింగ్ 1-0-15-0, హార్దిక్ పాండ్య 2-0-13-0, సురేష్ రైనా 2-0-6-2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ ఎల్‌బి చమీర 13, శిఖర్ ధావన్ నాటౌట్ 46, ఆజింక్య రహానే నాటౌట్ 22, ఎక్‌స్ట్రాలు 3, (మొత్తం 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 84.
వికెట్ల పతనం: 1-29.
బౌలింగ్: సేనానాయకే 4-0-22-0, ఫెర్నాండో 2-0-7-0, చమీర 2-0-14-1, ప్రసన్న 1-0-3-0, సిరివర్ధనే 1-0-9-0, గురణత్నే 2.5-0-22-0, దిల్షాన్ 1-0-4-0.