ఈ వారం స్పెషల్

అణా నుంచి ఆన్‌లైన్ దాకా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టికర్త ఎవరు?
సమస్త జగత్తును తనవైపు తిప్పుకుంటున్న సంపద, ధనం లేదా చలామణి మారకం ఏవిధంగా పుట్టింది? అన్నదానికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు లేవనే చెప్పాలి. చారిత్రక దృష్టాంతాల ఆధారితంగా కొంత మేర నాటి కరెన్సీ మనుగడను నిర్ధారించే ప్రయత్నం చేసినా అదే నూటికి నూరు శాతం నిజమని భావించడానికి వీల్లేదు. అసలు డబ్బును మొట్టమొదటిసారిగా ఎవరు సృష్టించారన్నది నాటికీ నేటికీ సమాధానం లేని ప్రశే్న. క్రీ.పూ, ఐదవ శతాబ్దానికి ముందే ఈ డబ్బు అన్నది వివిధ రకాల నాణేల రూపంలో చలామణిలో ఉండేది. క్రీ.పూ. ఏడవ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా పశ్చిమ దేశాల సంస్కృతిలో నాణేల అంకం మొదలైంది. అక్కడినుంచి క్రమానుగతంగా అవి విలువను పెంచుకుంటూ మొత్తం పశ్చిమ దేశాలు వేటికవి తమ మనుగడను నిర్ధారించుకునే.. ప్రత్యేకతను చాటుకునే విధంగా కరెన్సీ ముద్రించుకునే స్థాయికి వెళ్లాయి. ప్రతి దేశ నాణెం మీద, పెద్ద కరెన్సీ మీద ఆయా దేశాలకు చెందిన చారిత్రక పురుషులు, చరిత్రకారులు, పురాణ పురుషులకు సంబంధించిన ముద్రలు ఉండేవి. అదే సంస్కృతి చాలా దేశాల్లో నేటికీ కొనసాగుతోంది.

కరెన్సీ నుంచి కార్డువైపు...
మానవ నాగరికత కరెన్సీకి కొత్త అర్థాలు నేర్పింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డబ్బు ఉన్నా లేకున్నా తాను కోరుకున్న ఆనందాన్ని సంతృప్తిని పొందే సులభమైన మార్గాలను మనిషి ఎంచుకున్నాడు. ఆవిధంగా కరెన్సీ స్థానే ఆధునికమైన కార్డుల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా కరెన్సీ ముద్రణా వ్యయం మితిమీరి పోవడంవల్ల కొన్ని పెద్ద దేశాల్లో పరిమిత స్థాయిలోనే కరెన్సీని అందుబాటులోకి తెచ్చేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇంటినుంచి కదలకుండా జేబులో దమ్మిడీ లేకుండానే కార్డే సర్వస్వంగా ఆధునిక లావాదేవీల క్రమం శక్తివంతమైంది. పశ్చిమ దేశాల్లో ఈ రకమైనవ్యవస్థను దశాబ్దాల క్రితమే అంకురించినప్పటికీ భారతదేశంలో ఇటీవలే ఇది పుంజుకుంటోంది. నగదే సర్వస్వంగా, అది లేనిదే మనుగడే లేదన్న భావన నుంచి కార్డు తోనే అన్ని రకాల లావాదేవీలను నిర్వహించే స్థాయికి భారతీయుడు ఎదుగుతున్నాడు. కాలంతో పాటు మానవ అవసరాలు కూడా మారుతున్నాయి. మారకం విలువ రూపం ఏదైనా దాని పరమార్థం మానవ అవసరాలు తీర్చడమే. అందుకు ఆన్‌లైన్ లావాదేవీలే నిదర్శనం.

అమెరికా ఉనికి చాటిన కరెన్సీ
కేవలం జలాల విషయంలోనే కాదు, కరెన్సీ విషయంలో కూడా దేశాలు భారీ యుద్ధాలకు దిగిన పరిస్థితులు చరిత్ర పుటల్లో ఎన్నో ఉన్నాయి. 17వ శతాబ్దంలో అమెరికా కాలనీల (ప్రాంతాలు)పై తన పట్టును పెంచుకోవడానికి నాటి ఆంగ్ల పాలకులు కరెన్సీనే ఆయుధంగా విసిరారు. దాంతో ఈ కాలనీల్లో ఉండే ప్రజలు ఇంగ్లీషు కరెన్సీనే ఆంగ్ల వస్తువులను కొనుగోలు చేసేందుకు వినియోగించుకోవాల్సి వచ్చేది. అంటే ఏవిధంగానూ ఇతర దేశాలతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించడానికి వీలుండేది కాదు. అయితే, మొట్టమొదటిసారిగా మసాచుసెట్స్ రాష్ట్రం బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించింది. 1652లో తొలిసారిగా సొంతంగానే వెండి నాణేలను ముద్రించడంతో ఆంగ్ల పాలకులకు ఎనలేని ఆగ్రహమే వచ్చింది. ఫలితంగా అమెరికా, బ్రిటన్‌ల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకుని 1775లో యుద్ధానికి దారితీసింది. బ్రిటిష్ హయాంలో ఉన్న కాలనీల నాయకులందరూ స్వతంత్రాన్ని ప్రకటించుకుని సొంతంగానే కరెన్సీని ముద్రించుకున్నారు. అయితే వీటి విలువలో సారూప్యత లేకపోవడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోయి అంతిమంగా అవి నిరుపయోగంగా మారిపోయే పరిస్థితి తలెత్తింది.

యుగమేదైనా ధనమే ఇంధనం. రాజుల కాలమైనా, నియంతల రాజ్యమైనా, ప్రజాస్వామ్యమైనా ధనానికే అన్ని కాలాల్లోనూ అగ్రతాంబూలం. బంగారం, వెండి నాణేలతో మొదలైన కరెన్సీ పయనం అప్రతిహతంగానే సాగింది. కొత్త రూపంలో సాగుతోంది కూడా. మనిషి నాగరికత అలవరుచుకున్న తర్వాత ధనం ప్రాధాన్యత పెరిగింది. వస్తు విలువలకు ఇదే కొలమానంగా మారింది. ఏ రూపంలో ఉన్నా ధనం ధగధగలాడిందని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలున్నాయి. చారిత్రక లెక్కల ప్రకారం మూడువేల సంవత్సరాల క్రితం కరెన్సీ పయనం మొదలైంది. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు సంతరించుకుంటూ నవనాగరిక లక్షణాన్ని అలవరుచుకుంటూ కాలంతో పోటీగా పరుగులు పెడుతూనే వస్తోంది. భారత్‌లో క్రీస్తుపూర్వమే కరెన్సీ చరిత్ర మొదలైంది. ప్రపంచంలో తొలి నాణేలను ముద్రించిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అణా నుంచి మొదలై అనంతంగానే విలువను సంతరించుకుంటూ సరికొత్త రూపంతో కరెన్సీ కొత్త సొబగులీనింది. తాజాగా రెండువేల నోటుతో సరికొత్త లక్షణాలనూ సంతరించుకుంది. డాలరైనా, రూపాయైనా, ఇంకేదైనా కూడా ఆయా దేశాల మారక విలువలకు అద్దం పట్టేదే. ప్రపంచంలో వాటి స్థాయిని స్థానాన్ని నిర్థారించేవే. వేలవేల సంవత్సరాల కరెన్సీ చరిత్ర లోతుల్లోకి తొంగిచూస్తే ఎన్నో అద్భుతాలు కళ్ళకు కడతాయి. కేవలం విలువల పరంగానే కాకుండా ఆయా కాలాల సాంస్కృతిక సౌరభానికి కూడా ఈ కరెన్సీ అన్నది నాణేల రూపంలో దృష్టాంతంగా నిలిచింది. విలువకు విలువనిచ్చే కరెన్సీకి నిన్న, నేడు, రేపు ఎదురే లేదు. అందుకే డబ్బుకు లోకం దాసోహం అనడం కరెన్సీ రాజసానికి సంకేతం.

ధనం మూలం ఇదం జగత్ - అన్నది నానుడి. చేతిలో కాణీ లేకుండా ఏ వ్యక్తీ మనుగడ సాగించలేడు. దేశమేదైనా, కాలమాన పరిస్థితులు ఏవైనా, ఏ రూపంలో ఉన్నా ధనం జీవన ఇంధనమే. ఆయా కాలాల పరిస్థితులను బట్టి రూపం మారినా నేటి యుగం వరకు ధనం ఏదో రూపంలో మానవ జగత్తును నడిపిస్తూనే ఉంది. ధనం లేనిదే మనుగడే లేదన్న అనివార్య పరిస్థితులకు మానవాళి వచ్చేసింది. ఈ ధనం అన్నది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. అది రూపాయా... డాలరా... పౌండా... మరొకటా అనేదాంతో నిమిత్తం లేదు. ఇది జనం చేతిలో లేకపోతే అల్లాడే పరిస్థితే. ఆదిమానవ కాలంనుంచి నేటి పరిస్థితుల వరకు అనుక్షణం అన్ని కాలమాన పరిస్థితుల్లోనూ ధనమే మనిషిని నడిపిస్తోంది. మనుగడను శాసిస్తోంది. నిర్దేశిస్తోంది. గమనాగమనాలను ముందస్తుగానే నిర్ధారిస్తోంది కూడా మరి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన నాటి ధనం లేదా సంపద నేటి కరెన్సీ పుట్టుపూర్వోత్తరాలేమిటి? ఏవిధంగా అంకురించింది? ఎలా ఎదిగింది? యావత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎలా చేరుకుంది? ఈ కరెన్సీని సృష్టించింది మనిషే అయినా ఒక దేశమే సిరిసంపదలకు తలమానికంగా, మరో దేశం అధమంగా ఉండటానికి కారణం ఏమిటి? కరెన్సీ విలువలో ఈ తేడాలకు మూలమేమిటి? ఇవన్నీ కూడా ఆధునిక జీవన విధానాన్ని శాసించేవే అవుతున్నాయి. సంపన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలు - ఈ మూడింటి నిర్వచనం వెనుక ధనమే మూలం. సంపదే కొలమానం. అంటే నాటి మానవుడి ఎదుగుదలకు మరో రూపంలో ఈ సంపదే దోహదం చేసినా నేటి ప్రపంచాన్ని శాసించడానికి ఇదే బలమైన ఆయుధంగా మారింది. అసలు భారతీయ రూపాయి ఏవిధంగా ఉద్భవించింది? అణా నుంచి మొదలైన భారతీయ కరెన్సీ గమనం దేదీప్యంగా ధగధగలాడే పదివేల నోట్లకు తాజాగా రెండువేల నోట్లకు చేరుకుంది. ఈ పయనం ఓ అద్భుతమే. ప్రతి దశలోనూ ఏదో రూపంలో ఈ కరెన్సీ భారతీయ జీవనాన్ని నాడు - నేడు నిర్దేశిస్తూనే వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నపళంగా చెలామణిలో వున్న 500, 1000 రూపాయల కరెన్సీని ఎకాఎకిన రద్దుచేసిన నేపథ్యంలో యావద్భారతం గగ్గోలెత్తింది. ఈ మూకుమ్మడి చలామణి రద్దు వెనుక బలమైన ఆర్థిక కారణాలున్నప్పటికీ దేశవ్యాప్తంగా కోటానుకోట్ల మంది చేతిలో చిల్లిగవ్వ లేక కరెన్సీ కోసం గంటల తరబడి క్యూలు కట్టడాన్ని బట్టి చూస్తే... కాలమేదైనా మనిషికి ఆర్థిక ఆసరా కరెన్సీనేనన్న విషయం కరతలామలకమవుతోంది. మిగతా దేశాలతో పోలిస్తే ఏ దశలోనైనా భారతదేశ స్థితిగతులు వేరు. ఆర్థిక పరిస్థితులు భిన్నమైనవే. ఆయా కాలాల్లో ప్రజల జీవనం, మనుగడ మరింత విభిన్నమైనవి. మిగతా దేశాల మాట ఎలా వున్నా భారతదేశంలో కరెన్సీ పుట్టుక అన్నది కేవలం మనుగడ ప్రాధాన్యతగానే సాగింది. రూపమేదైనా పరస్పరం జీవించడమన్నదే దానికి ప్రాతిపదిక అయింది.
భారతీయ రూపాయి చరిత్ర లోతుల్లోకి వెళితే ప్రాచీన భారతాన్ని, నాటి కాలమాన పరిస్థితులను స్పృశించాల్సిన అవసరం ఎంతైనా వుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే నేటి రూపాయి పుట్టుక జరిగిందని భావించాలి. ఇందుకు చారిత్రక ఆధారాలే కాకుండా వాటిని రుజువు చేసే దృష్టాంతాలు, దృక్కోణాలు కూడా బలంగానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే నాణేలను జారీచేసిన మొట్టమొదటి దేశాల్లో మొదటి స్థానం భారత్‌కు, రెండో స్థానం చైనాకు దక్కుతుంది. మనం చెప్పుకుంటున్న రూపాయి పుట్టుక కూడా అత్యంత సంక్లిష్టమైనదే. రూపాయి అని దీన్ని నిర్వచించడానికి కారణం సాంస్కృతిక మూలాలే. సంస్కృతంలో ‘రూప’ అన్నదానికి ‘వెండి’ అనే అర్థం వుంది. ఆ వెండి నాణేలే రూపాయిగా చలామణి అయ్యాయి. అనంతర కాలంలో భిన్న ఆకృతుల్లో వాటిపై ముద్రలు, ఆకృతులు వచ్చాయి. ‘రూపాయి’ అంటే ఒక రూపం కలది అన్న భావనే మొదట్లో వుండేది. ద్రవిడ సంస్కృతి నుంచే ఇది పుట్టుకొచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. వేద కాలంలో కూడా నాటి చలామణి నాణేనికి ఓ అర్థం ఉండేది. ఋగ్వేద కాలంలో ‘రూప’ అన్నది అందానికి విశేషణంగా, ‘రూపక’ అన్నది దాని గొప్పతనాన్ని వర్ణించే పదంగా సాగేది. ‘రూప్యా’, ‘రూపియా’... పేరు ఏదైనా, ఉచ్చారణ ఏదైనా అది నాటి జీవన మనుగడకు క్రియాత్మకంగా కొనసాగింది. మన పురాణాల్లో కూడా వెండి, బంగారు నాణేల గురించి ఎన్నో కథలను విన్నాం. అవి కూడా నాటి ఆర్థిక జీవనానికి ‘విలువ’తో కూడిన మనుగడకు కొలమానమేనని భావించవచ్చు.
మన చరిత్రలో తొలి దశ నాణేలకు సంబంధించి ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. వౌర్య చక్రవర్తి చంద్రగుప్త వౌర్య వద్ద ఆర్థిక నిపుణుడిగా పనిచేసిన చాణక్యుడు రాసిన అర్థశాస్త్రంలో ఇందుకు సంబంధించిన బలమైన ప్రస్తావనలు ఉన్నాయి. క్రీ.పూ. 340 - 290 కాలంలో భిన్న రూపాల్లో నాణేలు కొనసాగాయి. సువర్ణ రూప, తామ్ర రూప, సీస రూప - ఇలా నాటి కాలంలో చలామణి జరిగింది. అనంతర కాలంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ నాణేల రూపం కూడా మారుతూ వచ్చింది. 1540 నుంచి 45 వరకు ఐదేళ్లపాటు పాలించిన షేర్షా సూరి వెండి నాణేలను జారీచేశారు. అంతేకాదు పౌర, సైనిక పాలనా వ్యవస్థను కూడా ఆయన ఏర్పాటుచేశారు. అప్పట్లో జారీ అయిన వెండి నాణేన్ని ‘రూపియా’గా వ్యవహరించేవారు. ఇక మొగలాయిల కాలంలో వెండి నాణెం చాలా బలంగా చలామణిలోకి వచ్చింది. ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ ఈ నాణేల పరస్పర మార్పిడితోనే జరిగేవి. మరాఠాల పాలనలోనూ, తొలి దశ బ్రిటిష్ ఇండియాలోనూ ఇవే చలామణి అయ్యేవి. భారతదేశంలో పేపర్ కరెన్సీ అన్నది తొలిసారిగా 1770లోనే మొదలైంది. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, ది జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బీహార్, అలాగే బెంగాల్ బ్యాంకులు 1770 నుంచి 1791 వరకు రూపాయిని నాణేల రూపంలో కాకుండా కాగితం రూపంలోనే జారీచేశాయి. 19వ శతాబ్దం అంతా కూడా దాదాపుగా భారతీయ కరెన్సీ వెండి ఆధారితంగానే సాగింది. దాని ఫలితంగా అనేక రకాలుగా దీని ప్రామాణిక విలువపై ప్రతికూల ప్రభావం పడింది.
ఆంగ్ల పాలకులకు ముందు దేశాన్ని పాలించిన డచ్ పాలకులు కరెన్సీకి సంబంధించి ఎన్నో రకాలుగా మార్పులు తెచ్చారు. అనంతరం మొదలైన బ్రిటిష్ పాలనలోనూ, అలాగే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్ద కాలంలో భారతీయ రూపాయి భిన్న ఆకృతులను సంతరించుకుంది. అంటే మొత్తం పదహారు అణాలుగా రూపాయిని విభజించారు. ఒక్కో అణాను నాలుగు పైసలు లేదా ఆరు పైసలుగా మార్చారు. అంటే ఒక రూపాయి 16 అణాలతో సమానమన్నమాట. 1957లో కూడా భారతీయ రూపాయి మరింతగా విభజితమైంది. దాన్ని వంద నయాపైసలుగా మార్చారు. అనంతర కాలంలో ‘నయా’ తొలగి ‘పైసా’గానే చలామణిలోకి వచ్చింది. 20వ శతాబ్దం మధ్య వరకు కూడా భారతీయ రూపాయే అధికారిక కరెన్సీగా కొనసాగింది. ముఖ్యంగా బ్రిటిష్ ఇండియాలోనూ, భారత్‌ను కేంద్రంగా తీసుకునే ఆంగ్లేయులు పాలించిన ప్రాంతంలో కూడా ఈ కరెన్సీనే చలామణి అయింది. ముఖ్యంగా తూర్పు ఆఫ్రికా, దక్షిణ అరేబియా, పర్షియాఖాతం పరీవాహక దేశాలన్నీ కూడా ఆంగ్లేయుల పాలనలోనే ఉండేవి కాబట్టి అక్కడ కూడా భారతీయ రూపాయే అధికార కరెన్సీగా కొనసాగింది.
పశ్చిమ భారతంలోనూ, దక్షిణ భారతంలోనూ ఈశాన్య బెంగాల్ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా కరెన్సీలు చలామణిలోకి వచ్చాయి. ముఖ్యంగా స్థానిక అవసరాలను వ్యాపార, వాణిజ్యపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్పిడి జరిగేలా వీటిని రూపొందించారు. బెంగాల్‌లో ముద్రించిన నాణేలు మొగలాయి శైలిని ప్రతిబింబిస్తే, మద్రాసులో ముద్రితమైన నాణేలు దక్షిణ భారత రీతులకు అద్దం పట్టేవి. మొట్టమొదటిసారిగా ముంబయి మింట్‌లో 1717లో అప్పటి చక్రవర్తి ఫరూఖ్ సియర్ అనుమతితో మొగలాయి డబ్బును ముద్రించారు. బ్రిటిష్ బంగారు నాణేలను కరోలినాగా, వెండి నాణేలను యాంజిలినాగా వ్యవహరించేవారు. రాగి నాణేలను కూపరూన్‌లుగా పరిగణించేవారు. 1830 నాటికి భారతదేశంలో ఆంగ్ల పాలకుల పట్టు మరింతగా బిగిసింది. తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. భిన్న ప్రాంతాల్లో, భిన్న రూపాల్లో కరెన్సీ ఉండటం వల్ల తమ ఆదాయానికి, ఆధిపత్యానికి ముప్పేనని భావించిన నాటి ఆంగ్ల పాలకులు 1835లో భారత్ అంతటా ఒకే రకమైన నాణేలను, కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందుకు 1835 నాటి నాణేల చట్టం ఎంతగానో వారికి ఉపకరించింది. అప్పట్లో ముద్రితమైన కొత్త నాణేలపై విలియం-4 బొమ్మ ఉండేది. మరోవైపు దాని విలువ ఇంగ్లీషులోనూ, పర్షియా భాషలోనూ ఉండేది. 1840లో ముద్రితమైన నాణేలపై విక్టోరియా మహారాణి బొమ్మ ఉండేది. భారత సామ్రాజ్ఞిగా విక్టోరియా మహారాణి 1877లో బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా తొలి నాణేలను విడుదల చేశారు. అయితే ఇక్కడ కూడా నాటి ఆంగ్ల పాలకులు ద్వంద్వ నీతిని ప్రదర్శించారు. ఇంగ్లాండ్‌లో బంగారమే ప్రామాణికంగా నాణేలు విడుదలైతే, భారత్‌లో అందుకు భిన్నమైన నాణేలే విడుదలయ్యాయి. ఫలితంగా ఇక్కడ ఆంగ్ల పాలకులు తమ ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల కోసం భారీగానే రూపాయిలను వెచ్చించాల్సి వచ్చేది. దాన్ని భర్తీ చేసుకునేందుకు పన్నులను కూడా భారీగానే పెంచారు. అవి దేశవ్యాప్తంగా అనిశ్చితికి, అలజడులకు దారితీసింది. 1911లో కింగ్‌జార్జి-5 బొమ్మతో ముద్రితమైన నాణెం అలజడులకు దారితీసింది. భారతీయ ఏనుగు బొమ్మనే ముద్రించినా అది ఏనుగు కంటే కూడా పంది మాదిరిగానే ఉండటం వల్ల ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆ నాణెంపై బొమ్మను మార్చారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వెండి కొరత చాలా తీవ్రం కావడంతో దీని ఆధారితంగా నాణేలను పెద్ద సంఖ్యలో ముద్రించే అవకాశం లేకుండా పోయింది. దాని ఫలితంగానే పేపర్ కరెన్సీ అన్నది తెరపైకి వచ్చింది. రూపాయి, రెండు రూపాయల నోట్లు, అర్ధ రూపాయి బిళ్ల ముద్రితమయ్యాయి. ఇంకా చిన్న మారకం విలువ కలిగిన నాణేలను అల్యూమినియంతో రూపొందించారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆంగ్ల పాలకులు అవలంబించిన నాణేల విధానానే్న కొనసాగించారు. రూపాయి విలువ 64 పైసలుగానే కొనసాగింది. 1950లో అణాల సిరీస్‌ను జారీచేశారు. అంటే భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముద్రించిన నాణేలు అవే. కింగ్ జార్జి బొమ్మను తొలగించి అశోకచక్రను ముద్రించారు. 1955లో భారతీయ నాణేల చట్టాన్ని సవరించారు. 1957 ఏప్రిల్ 1నుంచి అది అమలులోకి వచ్చింది. దాంతో రూపాయి పదహారు అణాల నుంచి 100 పైసలుగా మారింది. 1, 2, 5, 10, 20, 50 నయాపైసలుగా నాణేలు చలామణిలోకి వచ్చాయి. 1968 నుంచి కొత్త నాణేలను ముద్రించడం మొదలైంది. నయాపైసా సిరీస్ అంతరించింది. 60వ దశకంలో తీవ్ర స్థాయిలో తలెత్తిన ద్రవ్యోల్బణం కారణంగా చిన్న మారకం విలువ కలిగిన నాణేలను అల్యూమినియంతో ముద్రించడం మొదలైంది. అప్పటినుంచే మూడు పైసల నాణెం చలామణిలోకి వచ్చింది. 1968లో 20 పైసల నాణేన్ని జారీచేసినా అది అంతగా చలామణి కాలేదు. కాలానుగుణంగా నాణేలను ముద్రించే భారం పెరిగిపోవడం వల్ల అవసరాలు కూడా తీవ్రం కావడం వల్ల వ్యయానికి లబ్ధికి మధ్య తేడా పెరిగిపోతూ వచ్చింది. ఫలితంగా 1970 దశకంలో 1, 2, 3 పైసల నాణేలను తొలగించారు. 10, 25, 50 పైసల స్టీల్ నాణేలను చలామణిలోకి తెచ్చారు. అనంతర కాలంలో కూడా ఆర్థికపరంగానూ, ఇతరత్రా కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. రూపాయి, రెండు రూపాయల కరెన్సీలను ముద్రించడమన్నది వ్యయభరితం కావడం వల్ల 1990 దశకంలో ఈ విలువతో నాణేలు చలామణి కావడం మొదలైంది. క్రీస్తుపూర్వంలో మొదలైన భారతీయ కరెన్సీ గమనం అనన్యసామాన్యంగా అప్రతిహత రీతిలోనే ఎప్పటికప్పుడు కొత్త రూపును, మార్పును సంతరించుకుంటూ దేదీప్యమవుతూ వచ్చింది. కాలమేదైనా కరెన్సీయే మానవ మనుగడను శాసించిందన్నది ప్రతి దేశ గమనంలోనూ కొట్టొచ్చినట్టు కనిపించే వాస్తవం.
నాణెమైనా, కాగితమైనా, ప్లాస్టిక్ అయినా దానివల్ల ఆయా వ్యక్తులకు లభించే లబ్ధి ఏమిటన్న దానిపైనే దాని విలువ ఆధారపడి వుంటుంది. భౌతికంగా దానికి పెద్దగా విలువ లేకపోయినా దాని మారకం వల్ల లభించే ప్రయోజనమే కరెన్సీని మానవ జీవితంలో కీలక భాగంగా మార్చింది. అది లేకపోతే మనుగడే లేని స్థితికి తెచ్చింది. దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం నుంచి కూడా డబ్బు అన్నది మానవ చరిత్రలో ఏదో రూపంలో అనివార్య భాగంగా కొనసాగుతూ వచ్చింది. అంతకుముందు వస్తుమార్పిడి వ్యవస్థ (బార్టర్ సిస్టమ్) విస్తారంగా ఉండేది. అంటే ఒక వ్యక్తి దగ్గరున్న వస్తువును మరో వ్యక్తికి ఇచ్చి అతని వద్ద తన అవసరానికి పనికొచ్చే వస్తువును తీసుకోవడన్నమాట. ఇది కేవలం వస్తువులకు సంబంధించే కాకుండా ఆహార పదార్థాలు, వినియోగ సంబంధిత అంశాలకు కూడా అనంతర కాలంలో విస్తరించింది. ఒక దశలో జంతు చర్మాల మార్పిడి నుంచి ఆయుధాల మార్పిడి వరకు కూడా ఈ వ్యవస్థ కొనసాగింది. ఇప్పటికీ కూడా ప్రపంచంలో అనేకచోట్ల ఈ వస్తు మార్పిడి వ్యవస్థ కొనసాగుతోందని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. *

- బి.రాజేశ్వర ప్రసాద్