ఆటాపోటీ

సంచలనాల టెన్నిస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్లు గెలవడం.. టైటిళ్లు సాధించడం సర్వసాధారణం. ఎలాంటి అంచనాలు లేకుండా పోటీకి దిగి, స్టార్లను ఓడించడం సంచలనం. ఇలాంటి సంచలనాలకు మారుపేరైన టెన్నిస్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు ఎన్నో నమోదయ్యాయి. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను ఉజ్బెకిస్తాన్‌కు చెందిన డెనిస్ ఇస్టోమిన్ 7-6, 5-7, 2-6, 7-6, 6-4 తేడాతో ఓడించడం, ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రేపై జర్మనీ యువ ఆటగాడు మిషా జ్వెరెవ్ 7-5, 5-7, 6-2, 6-4 ఆధిక్యంతో విజయం సాధించడం ఇలాంటి సంచలనాలే. నిరుడు వింబుల్డన్‌లోనూ జొకోవిచ్‌కు మూడో రౌండ్‌లో ఇలాంటి అనూహ్య ఓటమే ఎదుంది. శామ్ క్వెర్రీ 7-6, 6-1, 3-6, 7-6 ఆధిక్యంతో జొకోవిచ్‌పై గెలిచాడు. అప్పటికే ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్స్‌లో టైటిళ్లను కైవసం చేసుకున్న జొకోవిచ్ ఫేవరిట్‌గా బరిలోకి దిగితే, ఎవరూ, ఎలాంటి ఆశలు పెట్టుకోని క్వెర్రీ గెలవడం అప్పట్లో సంచలనమే. అదే వింబుల్డన్‌లో ఎవరూ ఊహించని మరో ఫలితం కూడా వెల్లడైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 772వ స్థానంలో ఉన్న మార్కస్ విల్లీస్ 6-3, 6-3, 6-4 ఆధిక్యంతో అప్పటి 54వ ర్యాంకర్ రికార్డస్ బెరాంకిన్స్‌పై విజయం సాధించాడు. అదే విధంగా నిరుడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో, డిఫెండింగ్ చాంపియన్, అప్పటి ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌ను స్పెయిన్ క్రీడాకారిణి గార్బినె ముగురుజా ఓడించి ప్రకంపనలు సృష్టించింది. 2015లోనూ సెరెనాకు ఇదే విధమైన అనూహ్యమైన ఓటమి యుఎస్ ఓపెన్‌లో ఎదురైంది. సెమీ ఫైనల్స్‌లో ఆమె రాబెర్టా విన్సీ 2-6, 6-4, 6-4 తేడాతో చిత్తుచేసింది. అయితే, ఫైనల్‌లో ఆమె ఫ్లావియా పెనెట్టా చేతిలో ఓడింది. 2013 వింబుల్డన్ నాలుగో రౌండ్‌లో సెరెనా ఓడిన తీరు కూడా అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలిచి, వింబుల్డన్‌లో అడుగుపెట్టిన సెరెనా వరుసగా మూడు మ్యాచ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిచింది. కానీ, నాలుగో రౌండ్‌లో ఆమెకు జర్మనీ క్రీడాకారిణి సబినే లిసికీ ఎదురైంది. తీవ్రంగా పోరాడినప్పటికీ 2-6, 6-1, 4-6 తేడాతో సెరెనా పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది.
కెరీర్‌లో 17 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకొని, ‘ఆల్‌టైం గ్రేట్’గా పేరుప్రఖ్యాతులు సంపాదించిన రోజర్ ఫెదరర్ నిరుడు ఆస్ట్రేలియా ఓపెన్ మూడో రౌండ్‌లో ఎవరూ ఊహించని విధంగా ఓటమిపాలయ్యాడు. ఆండ్రియాస్ సెప్పీ 6-4, 7-6, 4-6, 7-6 ఆధిక్యంతో గెలిచి ఫెదరర్‌కు షాకిచ్చాడు. అంతకు ముందు 2013 వింబుల్డన్‌లోనూ ఫెదరర్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. రెండో రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన అన్‌సీడెడ్ సెర్గీ స్టాకోవ్‌స్కీ 6-7, 7-6, 7-5, 7-6 ఆధిక్యంతో విజయం సాధించి ఫెదరర్‌ను ఇంటికి పంపాడు. ‘స్పెయిన్ బుల్’, ప్రపంచ మాజీ నంబర్ వన్ రాఫెల్ నాదల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడు కూడా అనుకోని పరాజయాలను చవిచూసిన సందర్భాలున్నాయి. 2015 వింబుల్డన్ రెండో రౌండ్‌లోనే అతను అప్పటి ప్రపంచ 102వ ర్యాంకర్ డస్టిన్ బ్రౌన్ చేతిలో 5-7, 6-3, 4-6, 4-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. 2014 వింబుల్డన్ నాలుగో రౌండ్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు చెందిన 144వ ర్యాంక్ ఆటగాడు నిక్ కిర్గియోస్ 7-6, 5-7, 7-6, 6-3 తేడాతో నాదల్‌పై గెలిచాడు. 2013 వింబుల్డన్ మొదటి రౌండ్‌లోనే నాదల్ వెనుదిరిగాడు. అప్పటి 135వ ర్యాంకర్ స్టీవ్ డెర్సిస్ 7-6, 7-6, 6-4 తేడాతో గెలిచాడు. ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీలో నాదల్ మొదటి రౌండ్‌లోనే ఓడడం అదే మొదటిసారి. 2012 వింబుల్డన్ రెండో రౌండ్‌లో అతను చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడు, 100వ ర్యాంకర్ లుకాస్ రొసొల్ చేతిలో 7-6, 4-6, 4-6, 6-2, 4-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. 2009 ఫ్రెంచ్ ఓపెన్ నాలుగో రౌండ్‌లో అతనిని రాబిన్ సోల్డరింగ్ 6-2, 6-7, 6-4, 7-6 స్కోరుతో విజయం సాధించాడు.
మహిళల టెన్నిస్, 2008 యుఎస్ ఓపెన్ రెండో రౌండ్‌లో అప్పటి టాప్ సీడ్ అనా ఇవానోవిచ్‌ను రెండో రౌండ్‌లోనూ జూలీ కొయిన్ 6-3, 4-6, 6-3 తేడాతో ఓడించడం సంచలనం సృష్టించింది. 2003 వింబుల్డన్ తొలి రౌండ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ లేటన్ హెవిట్‌పై ఇవో కార్లొవిచ్ 1-6, 7-6, 6-3, 6-4 స్కోరుతో గెలిచాడు. 2001లో రోజర్ ఫెదరర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉండేవాడు. అప్పట్లో టాప్‌సీడ్ పీట్ సంప్రాస్‌ను అతను వింబుల్డన్ నాలుగో రౌండ్‌లో 7-6, 5-7, 6-4, 6-7, 7-5 తేడాతో ఓడించాడు. అంతకు ముందు వరుసగా 31 మ్యాచ్‌ల్లో తిరుగులేని విజయాలను నమోదు చేసిన సంప్రాస్ ఎవరూ ఊహించని రీతిలో నిష్క్రమించాల్సి వచ్చింది. 1996 వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్‌లో రిచర్డ్ క్రాయిసెక్ 7-5, 7-6, 6-4 ఆధిక్యంతో సంప్రాస్‌పై గెలిచాడు.
అగస్సీకీ తప్పని ఓటమి
ప్రపంచ మేటి టెన్నిస్ స్టార్లలో అండ్రీ అగస్సీ ఒకడు. అలాంటి అసాధారణ ప్రతిభావంతుడికి కూడా అనూహ్య పరాజయం తప్పలేదు. 1996 వింబుల్డన్ మొదటి రౌండ్‌లో డౌగ్ ఫ్లాచ్ చేతిలో అగస్సీ ఓడాడు. డబుల్స్ స్పెషలిస్టుగా ముద్రపడిన ఫ్లాచ్ 2-6, 7-6, 6-4, 7-6 తేడాతో అగస్సీపై గెలవడం అప్పట్లో అభిమానులను ఆశ్చర్యపరచింది. 1998 అడిలైడ్ ఇంటర్నేషనల్‌లో లేటన్ హెవిట్ కూడా ఇదేవిధంగా అగస్సీపై అనూహ్య విజయాన్ని నమోదు చేశాడు. అప్పట్లో 16 ఏళ్ల వయసున్న హెవిట్ ప్రపంచ ర్యాంక్ 550. టాప్ సీడ్ అగస్సీని అతను సెమీ ఫైనల్స్‌లో ఓడించాడు. 2000 సంవత్సరంలో జరిగిన యుఎస్ ఓపెన్ రెండో రౌండ్‌లో జర్మనీకి చెందిన ఆర్నార్డ్ క్లెమెంట్ 3-6, 2-6, 4-6 ఆధిక్యంతో వరుస సెట్లలో అగస్సీని చిత్తుచేశాడు. యుఎస్ ఓపెన్ చరిత్రలో నమోదైన అనూహ్య ఫలితాల్లో ఇదీ ఒకటి.
స్ట్ఫె సైతం..
మహిళల టెన్నిస్‌పై తనదైన ముద్ర వేసిన మాజీ నంబర్ వన్ స్ట్ఫె గ్రాఫ్ కూడా కెరీర్‌లో చేదు అనుభవాలను ఎదుర్కొంది. 1990 వింబుల్డన్‌లో ఆమె అప్పటికే రెండు పర్యాయాలు టైటిల్ సాధించి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. మరోసారి టైటిల్‌ను అందుకునే ఊపులో ముందుకు దూసుకెళ్లిన ఆమె సెమీస్ చేరింది. అయితే, అనామకురాలు జినా గ్యారిసన్ 6-3, 3-6, 6-4 తేడాతో స్ట్ఫెని ఇంటిదారి పట్టించింది. 1994 వింబుల్డన్ మొదటి రౌండ్‌లోనూ స్ట్ఫెకి అలాంటి పరిస్థితే ఎదురైంది. టెన్నిస్ రంగంలో అంతగా పేరులేని లోరీ మెక్‌నీల్ 7-5, 7-6 స్కోరుతో స్ట్ఫెని ఓడించింది. వింబుల్డన్ చరిత్రలో ఒక డిఫెండింగ్ చాంపియన్ మొదటి రౌండ్‌లోనే ఓడిపోవడం అదే మొదటిసారి.
సంచలన ఫలితాలకూ, ఎవరూ హించని విజయాలు లేదా పరాజయాలకూ వేదికైన టెన్నిస్‌లో స్టార్లు మాత్రమే గెలుస్తారని, అనామకులు రాణించలేరని అనుకోవడానికి వీల్లేదు. టాప్ సీడ్స్, డిఫెండింగ్ చాంపియన్స్ ఓడడం, అప్పటి వరకూ ఊరూపేరూ లేని వారు ఒక్కసారిగా స్టార్ హోదాను దక్కించుకోవడం టెన్నిస్‌లో మాత్రమే సాధ్యం. మిగతా క్రీడల్లోనూ ఇలాంటి ఫలితాలు వెల్లడైన సందర్భాలు ఉన్నప్పటికీ, టెన్నిస్‌లోనే ఎక్కువ. అందుకే, గ్రాండ్ శ్లామ్స్ మాత్రమేకాదు.. సాధారణ టెన్నిస్ టోర్నీలు కూడా హోరాహోరీగా సాగుతాయి. ప్రేక్షకులను అలరిస్తాయి. ఫలితాన్ని ముందుగా ఊహించడం కూడా కష్టం కాబట్టే, ప్రతి మ్యాచ్ నీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో తిలకిస్తారు. ఈ లక్షణమే టెన్నిస్‌కు ప్రత్యేకతను సంపాదించిపెట్టింది.

చిత్రం..నొవాక్ జొకోవిచ్

- యశస్విని