ఆటాపోటీ

కామెంటేటర్ ఓవరాక్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిచ్ తీరుతెన్నులు, వాతావరణం, జట్టు బలాబలాలు, వ్యూహాలు వంటి విషయాలను బుకీలకు సమాచారం అందించి కొంత మంది ఆటగాళ్లు భారీగా ముడుపులు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఫలానా ఓవర్‌లో నో బాల్స్ వేస్తానని, లూజ్ బాల్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు భారీ షాట్ కొట్టే అవకాశం ఇస్తానని ముందుగానే ఒప్పందం కుదుర్చుకొని, స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వారూ ఉన్నారు. చివరికి మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్‌లో దోషులుగా కేసులు ఎదుర్కొంటున్న అంపైర్లు సైతం ఉన్నారు. అయితే, కామెంటేటర్లు ఇలాంటి సమాచారం ఇచ్చిన సంఘటనలుగానీ, పరోక్షంగా ఒక జట్టుకు సహకరించిన సందర్భాలుగానీ దాదాపుగా లేవు. ఆ లోటును ఆస్ట్రేలియాలో పేరుప్రఖ్యాతులున్న ‘నెట్‌వర్క్ టెన్’ కామెంటేటర్ మార్క్ హోవర్డ్ తీర్చేశాడు. బిగ్‌బాష్‌లో భాగంగా సిడ్నీ థండర్స్‌తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అడెలైడ్ స్ట్రయికర్స్ కెప్టెన్ బ్రాడ్ హాడ్జ్‌కి అతను సూచన చేయడం వివాదానికి కారణమైంది. అడెలైడ్ బౌలర్ బెన్ లాగ్లింగ్ గత ఎనిమిది బంతుల్లో సిడ్నీ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్‌ను రెండు పర్యాయాలు అవుట్ చేసిన విషయాన్ని అతను మైక్రోఫోన్ పెట్టుకొని ఫీల్డింగ్ చేస్తున్న హాడ్జ్‌కి చెప్పాడు. వెంటనే అతను స్పందిస్తూ, ఆ గణాంకాలను తనకు గుర్తులేవని, తర్వాతి ఓవర్‌లోనే లాగ్లింగ్‌కు బంతినిస్తానని చెప్పాడు. కాగా, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ లైవ్‌లో రావడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. మైదానంలో ఉన్న క్రికెటర్‌కు ఈ విధంగా సూచన చేయడం అనైతికమని కామెంటేటర్స్ బాక్స్‌లో ఉన్న ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ మండిపడ్డాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) వెంటనే స్పందించి, ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. మరోవైపు ‘నెట్‌వర్క్ టెన్’ బహిరంగ క్షమాపణ చెప్పింది. కామెంటేటర్ హోవర్డ్ ఉద్దేశపూర్వకంగా ఆ సమాచారాన్ని ఇవ్వలేదని వివరించింది. మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నప్పుడు మైదానంలో ఉన్న ఆటగాళ్లు, ప్రధానంగా కెప్టెన్లతో మైక్రోఫోన్‌లో కామెంటేటర్లు మాట్లాడడం, వారి అభిప్రాయం తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని గుర్తుచేసింది. అదే ప్రయత్నంలో హాడ్జ్‌తో హోవర్డ్ మాట్లాడాడే తప్ప, బౌలర్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వాలనిగానీ, తద్వారా అతనికి సాయం చేయాలన్న ఆలోచనగానీ అతనికి లేవని పేర్కొంది. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని భరోసా ఇచ్చింది. అయితే, తమ కామెంటేటర్లంతా ఎంతో అనుభవజ్ఞులనీ, వారికి నియమ నిబంధనలు బాగా తెలుసునని అంటూ హోవర్డ్‌పై చర్య తీసుకునే అవకాశం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. హాడ్జ్‌కి సమాచారమిచ్చిన హోవర్డ్‌పై సిఎ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.