ఆటాపోటీ

స్పిన్నర్ల బౌలింగ్.. ఎక్‌స్ట్రాల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ క్రీడైనా కొన్ని రికార్డులకు పరిమితమవుతుంది. కానీ క్రికెట్‌లో మాత్రం రికార్డులకు కొదువ లేదు. కొన్ని రికార్డులు విచిత్రంగా ఉంటే మరికొన్ని ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఇందుకు ఉదాహరణలు ఎనె్నన్నో! 2013 జొహానె్నస్‌బర్గ్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఢీకొన్నప్పుడు అలాంటి విచిత్రమే ఒకటి చోటు చేసుకుంది. ఎందుకో తెలియదుగానీ భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు డివిలియర్స్ కీపింగ్ బాధ్యత నుంచి తప్పుకొని, సరదగా ఒక ఓవర్ బౌల్ చేశాడు. ఐదు పరుగులిచ్చాడు. అతని నుంచి స్ఫూర్తి పొందాడో ఏమోగానీ, ఆతర్వాత దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు ధోనీ కూడా కీపింగ్ గ్లోవ్స్‌ను విడిచిపెట్టి, బౌలర్‌గా అవతారమెత్తాడు. రెండు ఓవర్లు బౌల్ చేసిన అతను నాలుగు పరుగులిచ్చాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో, ఒకే టెస్టులో ఇరు జట్ల వికెట్‌కీపర్లు బౌలింగ్ చేయడం అదే మొదటిసారి. ఇప్పటి వరకూ అదే చివరిసారి కూడా. బైస్.. లెగ్‌బైస్.. వైడ్స్.. నోబాల్స్.. వీటిలో ఏ పద్ధతిలో వచ్చినాసరే.. వాటిని ఎక్‌స్ట్రాలుగా పరిగణిస్తారు. అంటే ఆ పరుగులు ఏ బ్యాట్స్‌మన్ ఖాతాలోకీ వెళ్లవు. సహజంగా ఎక్‌స్ట్రాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ, భారత్‌తో, 2007 డిసెంబర్‌లో జరిగిన బెంగళూరు టెస్టులో పాకిస్తాన్ ఏకంగా 76 పరుగులను ఎక్‌స్ట్రాల రూపంలో సమర్పించుకుంది. టెస్టు క్రికెట్‌లో ఇదొక రికార్డు.
సచిన్ తెండూల్కర్ సమకాలీనుడు కావడంతో ప్రతిభకు తగిన గుర్తింపు సంపాదించుకోలేకపోయిన బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్. జట్టును ఆదుకోవడానికి ఎన్నోసార్లు అతను క్రీజ్‌లో పాతుకుపోవాల్సి వచ్చేది. బంతిని రక్షణాత్మకంగా ఆడడంలో ద్రవిడ్‌ను మించిన ఆటగాడు లేడు. అందుకే ‘ది వాల్’ అన్న ముద్దుపేరు అతనికి స్థిరపడింది. ద్రవిడ్ ఎంతటి సమర్థుడంటే, ఒకానొక దశలో, అన్ని ఫార్మాట్లలోనూ కలిపి ఏకంగా 173 వరుస ఇన్నింగ్స్‌లో అతను డకౌట్ కాలేదు. ఈ రికార్డును ఎవరైనా అధిగమిస్తారనుకోవడం అత్యాశే.
ఒక జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం అదృష్టం. ఎంతకాలం కెప్టెన్‌గా కొనసాగారనికాదు.. ఎన్ని మ్యాచ్‌లకు నాయకత్వం వహించారన్నది ముఖ్యం. ఆ విధంగా చూస్తే, ఎక్కువ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టిన రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో ఉంది. టెస్టుల్లో 60, వనే్డల్లో 199, టి-20 ఇంటర్నేషనల్స్‌లో 72 కపిలి మొత్తం 331 మ్యాచ్‌ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 324 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి నెలకొల్పిన రికార్డును ధోనీ 2016 ఆగస్టు 27న అధిగమించాడు.
మెక్‌కలమ్ విశ్వరూపం
రికార్డు బ్యాటింగ్ అంటే ఏమిటో, పరుగుల వరద సృష్టించడంలో విశ్వరూపం అంటే ఏమిటో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ నిరూపించాడు. సాధారణంగా కెరీర్‌లో ఫలానా టెస్టు తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ముందుగానే ప్రకటిస్తే, ఆ చివరి మ్యాచ్‌లో ఎవరైనా తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. తమ స్థాయికి తగినట్టు ఆడలేక అభిమానులను నిరాశపరుస్తారు. అయితే, మెక్‌కలమ్ అందరిలాంటి వాడు. 2016 ఫిబ్రవరి 20న అతను క్రైస్ట్‌చర్చిలో ఆస్ట్రేలియాపై కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతూ సెంచరీ చేశాడు. అది కూడా 54 బంతుల్లోనే శతకాన్ని పూర్తిచేసి, కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 32 పరుగులకే న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు దిగిన అతను 79 బంతుల్లో 145 పరుగులు సాధించి, జట్టును ఆదుకున్నాడు. అప్పటి వరకూ వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్), మిస్బా ఉల్ హక్ (పాకిస్తాన్) 56 బంతుల్లో సెంచరీ సాధించి, సంయుక్తంగా నెంబర్ వన్ స్థానంలో ఉండగా, మెక్‌కలమ్ వారిని రెండో స్థానానికి నెట్టేశాడు.
ఒక పరుగు.. 4 వికెట్లు..
వనే్డ ఇంటర్నేషనల్స్‌లో కేవలం ఒక పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఎవరూ కోరుకోని రికార్డును సొంతం చేసుకుంది. 2015 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ గ్రూప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఫిబ్రవరి 21న, క్రైస్ట్‌చర్చిలో వెస్టిండీస్‌తో జరిగిన వనే్డలో పాక్ పరుగుల ఖాతాను తెరవకుండానే ఓపెనర్ నాసిర్ జంషెడ్, వెటరన్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్, హారిస్ సొహైల్ వికెట్లను కోల్పోయింది. జెరోమ్ టేలర్ ఈ ముగ్గురినీ అవుట్ చేశాడు. అహ్మద్ షెజాద్ సింగిల్ తీసి జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు సాధించగా, పాకిస్తాన్ అతి కష్టం మీద 160 పరుగులు చేసి ఆలౌటైంది. సొహేబ్ మక్సూద్ (59), ఉమర్ అక్మల్ (59), షాహిద్ అఫ్రిదీ (28) రెండంకెల స్కోర్లు చేయడంతో పాక్‌కు ఆ మాత్రం స్కోరు సాధ్యమైంది. 2006లో కెనడా జట్టు నాలుగు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోగా, పాకిస్తాన్ అంతకంటే చెత్త బ్యాటింగ్‌తో కొత్త రికార్డు సృష్టించింది.
ఫాలోఆన్స్‌లో ఓడిన ఆసీస్
ప్రపంచ మేటి జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. అయితే, దురదృష్టం వెంటాడిన జట్టు కూడా అదే. ఒక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడి, ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం ద్వారా ఫాలోఆన్‌కు దింపి, ఆతర్వాత అనూహ్యంగా ఓడిన సంఘటనలు టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం మూడు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడింటిలోనూ ఓడిన జట్టు ఆస్ట్రేలియానే కావడం విశేషం. 2001 కోల్‌కతా టెస్టులో ఫాలోఆన్ ఆడిన భారత్ ఆ తర్వాత ఆసీస్‌ను ఓడించింది. అంతకు ముదు 1894, 1981 సంవత్సరాల్లో ఇంగ్లాండ్ ఇదే రీతిలో ఆసీస్‌పై నెగ్గింది.
సునామీ బ్యాటింగ్!
బ్యాటింగ్‌లో సునామీ సృష్టించడం దక్షిణాఫ్రికా ప్రస్తుత కెప్టెన్ ఎబి డివిలియర్స్ సొంతం. ఎన్నో రికార్డులు సాధించిన అతని ఖాతాలో, వనే్డల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు కూడా ఉంది. 2015 జనవరి 18న వెస్టిండీస్‌తో జరిగిన వనే్డలో అతను 39వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. 31 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి, కొరి ఆండర్సన్ 36 బంతుల్లో సెంచరీని సాధించి నెలకొల్పిన రికార్డును బద్దలు చేశాడు. అదే ఊపును కొనసాగించిన అతను మొత్తం మీద 44 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లు, 16 సిక్సర్లతో 149 పరుగులు సాధించాడు. ఒక్కో బంతికి సగటున 3.38 పరుగులు చేశాడంటే, అతని విజృంభణ ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించుకోవచ్చు.
50 ఓవర్లలో 444
వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఇంగ్లాండ్ సాధించిన అత్యధిక స్కోరు ఇది. పాకిస్తాన్‌తో 2016 ఆగస్టు 30న ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన వనే్డలో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో మూడు వికెట్లకు 444 పరుగులు సాధించింది. వనే్డ క్రికెట్‌లో ఇది రికార్డు. అనంతరం పాకిస్తాన్‌ను 275 పరుగులకు కట్టడి చేసి, 169 పరుగుల తేడాతో గెలిచింది. ఓపెనర్ షర్జీల్ ఖాన్, టెయిలెండర్ మహమ్మద్ అమీర్ చెరి 58 పరుగులు చేయకపోతే, పాక్ పరిస్థితి మరింత భయానకంగా ఉండేది.
పొట్టి క్రికెట్‌లో పెద్ద స్కోరు
క్రికెట్ పట్ల అంతగా ఆసక్తి కనబరచని అమెరికాలో ఒక హోరాహోరీ మ్యాచ్ జరగడం, కేవలం ఒక పరుగు తేడాతో ఫలితం వెల్లడికావడం విచిత్రం. 2016 ఆగస్టు 27న ఫ్లొరిడాలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టి-20 ఇంటర్నేషనల్‌లో మొత్తం 489 పరుగులు నమోదయ్యాయి. ఈ స్కోరులో 32 సిక్సర్లు ఉన్నాయి. కేవలం పది వికెట్లు మాత్రమే కూలాయి. ప్రేక్షకుల్లో చివరి వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌ని వెస్టిండీస్ ఒక పరుగు తేడాతో గెల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 245 పరుగులు చేసింది. ఆ స్కోరులో 21 సిక్సర్లు ఉన్నాయి. అనంతరం భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు చేజార్చుకొని 244 పరుగులు సాధించింది. ఇందులో 11 సిక్సర్లు. పొట్టి క్రికెట్‌లో నమోదైన పెద్ద స్కోరుగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన పరుగులు రికార్డుకెక్కాయి.
ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సచిన్ తెండూల్కర్ కెరీర్‌లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో టెస్టుల సంఖ్య 200. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇన్ని మ్యాచ్‌లు ఆడిన ఏకైక బ్యాట్స్‌మన్ సచిన్. ఇలా చెప్తూపోతే క్రికెట్‌లో రికార్డులకు అంతం అనేదే ఉండదు. ప్రతి పరుగూ ఒక రికార్డే. ప్రతి బంతికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. క్రికెట్‌కు ఇంత క్రేజ్ రావడానికి ఈ రికార్డుల జాబితా కూడా ఒక కారణం. ఎవరెవరు ఏఏ రికార్డులు సృష్టించారన్న కుతూహలంతో అందరూ ఈ క్రీడకు అభిమానులుగా మారిపోతున్నారు. ఇటీవల జరిగిన ఐపిఎల్ వేలంలో అనామక ఆటగాళ్లకు కూడా భారీ పారితోషికాలు లభించడం మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నది. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీని ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తోనే అతను సరికొత్త చరిత్ర సృ ష్టించి, అందరికీ సుపరచితుడయ్యాడు. క్రికెట్ తప్ప మరే ఇతర రంగాల్లో ఎవరికీ ఇలాంటి ప్రచారం ఉండదు.

- ఎస్‌ఎంఎస్