ఆటాపోటీ

సిఒఎ నిశ్శబ్ద యుద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్భాటపు ప్రకటనలు.. పర్యటనల హంగామాలు లేవు.. ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు శిల్పిలో కనిపించే ఏకాగ్రతతో బిసిసిఐ పాలనాధికారుల కమిటీ (సిఒఎ) పని చేస్తున్నది. మూడో కంటికి తెలియకుండా, తనకు అప్పచెప్పిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నది. సిఒఎను తక్కువ అంచనా వేసిన బోర్డు, దాని సభ్య సంఘాల అధికారులు క్రమంగా దారిలోకి వస్తున్నారు. లోధా సిఫార్సుల అమలుకు బలమైన పునాది పడుతున్నది. అటు విదేశాలతో సిరీస్‌లకు, ఇటు దేశవాళీ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అన్ని వ్యవహారాలు సిఒఎ పర్యవేక్షణలో జరిగిపోతున్నాయి. భారత క్రికెట్‌ను సిఒఎ చక్కదిద్దుతున్నది. అతి తక్కువ కాలంలోనే బిసిసిఐ కొత్త రూపంతో వెలిగిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
**
ఐపిఎల్ మొదలుకావడంతో, దానితోపాటు స్పాట్ ఫిక్సింగ్ కేసు కూడా తెరపైకి వచ్చేసింది. అనేకానేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)లో సమూల మార్పులకు కారణమైంది. భారత క్రికెట్‌లో పారదర్శకతకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు సుప్రీం కోర్టు లోధా కమిటీని నియమించింది. ఆ కమిటీ చేసిన సూచనలు బిసిసిఐకి ఏ దశలోనూ మింగుడుపడలేదు. ఈ కమిటీ చేసిన సూచనలను అమలు చేసేందుకు బిసిసిఐ వెనుకాడడంతో, నలుగురు సభ్యులతో కూడిన పాలనాధికారుల కమిటీ (సిఒఎ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ అధ్యక్షత వహిస్తుండగా, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, ప్రముఖ చరిత్రకారుడు, జర్నలిస్టు రామచంద్ర గుహ, ఆర్థిక నిపుణుడు విక్రం లిమాయే సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ కమిటీ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, లోధా కమిటీ సిఫార్సులను దశల వారీగా అమలు చేస్తున్నది. ఆర్భాటపు ప్రకటనలు ఏవీ లేకుండా, సుప్రీం కోర్టు అప్పగించిన బాధ్యతను ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా పూర్తి చేసే దిశగా ఈ కమిటీ ముందుకు సాగుతున్నది.
**

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలనా వ్యవహారాలను ఒక గాడిలో పెట్టడంతోపాటు, క్రికెట్‌లో వేళ్లూనుకున్న అవినీతిని పెకళించడానికి విశ్రాంత న్యాయమూర్తి లోధా నేతృత్వంలోని కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేయడానికి సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల పాలనాధికారుల కమిటీ (సిఒఎ) నిశ్శబ్దంగా తన పనితాను చేసుకుంటూ పోతున్నది. మాజీ కంప్‌ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ అధ్యక్షతన నలుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీకి సుప్రీం కోర్టు చాలా బాధ్యతలనే కట్టబెట్టింది. లోధా సిఫార్సుల అమలు వాటిలో అత్యంత కీలకమైనది. ఈ కమిటీకే బిసిసిఐ పాలనా వ్యవహారాల పర్యవేక్షణ అధికారాన్ని సుప్రీం కోర్టు అప్పగించింది. ఈ కమిటీలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడిఎఫ్‌సి మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక నిపుణుడు విక్రం లిమాయే, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ సభ్యులుగా ఉన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొత్త కమిటీ ఏర్పడడంతో దశాబ్దాల తరబడి భారత క్రికెట్‌పై గుత్త్ధాపత్యం చెలాయిస్తున్న బిసిసిఐ ఏకపక్ష నిర్ణయాలకు, ఒంటెత్తు పోకడలకు తెరపడింది. స్వచ్ఛంద సంస్థల చట్టం కింద నమోదైనప్పటికీ, దేశంలో క్రికెట్‌కు బిసిసిఐ పర్యాయపదంగా మారింది. క్రమంగా క్రికెట్‌ను తన గుప్పిట్లో ఉంచుకొని రాజ్యమేలింది. క్రికెట్‌కు ఉన్న విపరీతమైన ఆదరణే పునాదిగా, ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులున్న క్రికెట్ సంస్థగా ఎదిగింది. ప్రపంచ క్రికెట్‌ను కూడా శాసించే స్థాయికి చేరిన బిసిసిఐకి ఒకానొక దశలో సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా పట్టలేదు. 2013లో జరిగిన ఆరో ఐపిఎల్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను ఖాతరు చేయలేదు. ముకుల్ ముద్గల్ రెండు దశల్లో జరిపిన విచారణను బిసిసిఐ తేలిగ్గా తీసుకుంది. ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా దోషులపై చేపట్టాల్సిన చర్యలను ఖరారు చేయడంతోపాటు దేశ క్రికెట్‌ను పారదర్శకంగా ఉంచేందుకు అనుసరించాల్సిన విధానాలను రూపొందించడానికి లోధా నేతృత్వంలో కమిటీని నియమించినా స్పందించలేదు. ఈ కమిటీ చేసిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. సిఫార్సులను అమలు చేసి తీరాలంటూ సుప్రీం కోర్టు పలుమార్లు స్పష్టం చేసినా, ఆ దిశగా అడుగులు వేయలేదు. సిఫార్సుల అమలుపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకుండా తాత్సారం చేసిన బిసిసిఐ చివరికి సుప్రీం కోర్టు జోక్యంతో తన ప్రత్యేకతను కోల్పోయింది. అత్యున్నత న్యాయస్థానం హెచ్చరికలను పట్టించుకోని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే తమ పదవులను కోల్పోవాల్సి వచ్చింది. బోర్డులో మార్పులకు అదే శ్రీకారం.
సుప్రీం కోర్టు ఆగ్రహం
ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిసిసిఐ తన చర్యలతో సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైంది. లోధా సిఫార్సుల అమలుపై ఒక నిర్ణయం తీసుకోవడానికి బోర్డు మూడు పర్యాయాలు ప్రత్యేక సమావేశాలను నిర్వహించిందికానీ, ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేదు. సిఫార్సులను అమలుచేసి తీరాల్సిందేనని పదే పదే చెప్తున్నా ఏవో కుంటి సాకులు చెప్తూ తప్పించుకోవడానికి బిసిసిఐ ప్రయత్నించడంతో సుప్రీం కోర్టు కఠినంగా వ్యవహరించక తప్పలేదు. పాలనా వ్యవహారాల కోసం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించి, బోర్డును కట్టడి చేసింది. వినోద్ రాయ్ నేతృత్వంలోని కమిటీ ఇప్పుడు తనదైన శైలిలో ముందుకు వెళుతూ, బోర్డుకు కొత్త రూపాన్ని ఇస్తున్నది. అయితే, భారీ మార్పుల సమయంలో చోటు చేసుకునే హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. శాస్తవ్రేత్తలు అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నంత ఏకాగ్రతతో కమిటీ పని చేస్తున్నది. కొత్తగా కమిటీ వేసినప్పటికీ బిసిసిఐ వ్యవహార శైలిలో మార్పు వస్తుందా? రాదా? అన్న ప్రశ్నలకు తన చేష్టలతో సమాధానాలనిస్తున్నది. దశాబ్దాల తరబడి బోర్డు వ్యవహారాలను తమ చెప్పుచేతల్లో ఉంచుకున్న క్రికెట్‌తో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు హఠాత్తుగా పెత్తనాన్ని వదులుకుంటారా? అన్న అనుమానాలకు కూడా వినోద్ రాయ్ కమిటీ తెరదించింది. భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ తప్ప కమిటీలో క్రికెటర్లు ఎవరూ లేకపోవడంతో బిసిసిఐ తీరు మారదన్న వాదనకు సరైన జవాబు చెప్తున్నది. క్రికెట్‌ను వ్యాపారంగా మార్చేసిందని ఇప్పటికే బిసిసిఐపై విమర్శలున్న నేపథ్యంలో, కొత్త కమిటీ ఏ విధంగా ఈ విమర్శల నుంచి బోర్డును బయటపడేస్తుందో చూద్దామంటూ సవాళ్లు విసిరిన వారికి సమయానుకూల నిర్ణయాలతో చెంపపెట్టు సమాధానాలిస్తున్నది. గతంలో బోర్డు అధికారులు క్రికెట్‌ను వ్యాపారంగా మార్చడానికి, కోట్లాది రూపాయలు ఆర్జించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే, అందుకు భిన్నంగా వినోద్ రాయ్ కమిటీ ఆర్థికాంశాల కంటే, ప్రక్షాళనకే అధిక ప్రాధాన్యతనిస్తున్నది. మొత్తం మీద తనదైన విధానాలతో కమిటీ ముందుకు దూసుకెళుతుండగా, భారత క్రికెట్‌పై దశాబ్దాలుగా కొనసాగుతున్న బిసిసిఐ ఆధిపత్యానికి క్రమంగా తెరపడుతున్నది. సిఒఎ నియామకంతో బోర్డుకు కొత్త రూపం వచ్చింది.
చేతలకే ప్రాధాన్యం
పాలనాధికారుల కమిటీ (సిఒఎ) చీఫ్ వినోద్ రాయ్ మాటల కంటే చేష్టలకే ప్రాధాన్యం ఇవ్వడంతో, బిసిసిఐలో శరవేగంతో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రక్షాళన కార్యక్రమాలపై ఎక్కువగా ప్రచారం జరగడం లేదు. దీనితో అనవసర వివాదాలు, చర్చలు చోటు చేసుకోవడం లేదు. బోర్డులో తనది నైట్‌వాచ్‌మన్ పాత్రగా వినోద్ రాయ్ ఇది వరకే స్పష్టం చేశాడు. బోర్డుకు ఎన్నికైన కార్యవర్గంతో కలిసి పాలనా వ్యవహారాలు సజావుగా సాగేలా చూడడమే తన బాధ్యతని చెప్పాడు. సుప్రీం కోర్టు తనపై ఎంతో నమ్మకంతో ఒక బాధ్యతను అప్పచెప్పిందని, దానిని పూర్తి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నాడు. తాను క్రికెట్ ప్రేమికుడినని ప్రకటించుకున్న అతను ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిసిసిఐ పాలనా వ్యవహారాలు సాగేలా చూస్తానన్న మాటకు కట్టుబడి పని చేస్తున్నాడు. మిగతా ముగ్గురు సభ్యులు కూడా అతనికి సహకరిస్తూ దేశంలో క్రికెట్ ప్రక్షాళనకు, బిసిసిఐలో ఉత్తమ పాలనకు కృషి చేస్తున్నారు. సుప్రీం కోర్టు వారికి అప్పగించిన బాధ్యత కూడా అదే. క్రికెట్ పాలనా వ్యవహారాలను చూడాల్సి రావడం తనకు ఇదే మొదటిసారని ప్రకటించిన విక్రం లిమాయే, దశాబ్దాల అనుభవం ఉన్న అధికారిలా అత్యుత్తమ సేవలు అందిస్తున్నాడు. చరిత్రకారుడు రామచంద్ర గుహ ఎప్పటికప్పుడు అమూల్యమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. మరోవైపు మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ ప్లేయర్ల సంఘంపై దృష్టి సారించింది. బోర్డులో వ్యవహారాలు, తీసుకునే నిర్ణయాలు క్రికెటర్లను ప్రోత్సహించేవిగా ఉండేలా ప్రయత్నిస్తున్నది. సుప్రీం కోర్టు తనకు అప్పగించిన బాధ్యతను సిఒఎ సమర్థంగా నిర్వహిస్తున్నది. ఈ నిశ్శబ్ద యుద్ధం ముగిసిన తర్వాత, సరికొత్త బిసిసిఐ మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. చాలా తొందరగానే లోధా కమిటీ సిఫార్సులను సంపూ ర్ణంగా అమలు చేయంచే దిశగా సిఒఎ ప్రస్థానం ముందుకు సాగుతున్నది.
**
చిత్రాలు..రామచంద్ర గుహ *వినోద్ రాయ్
*విక్రం లిమాయే *డయానా ఎడుల్జీ

- బిట్రగుంట