ఆటాపోటీ

బిసిసిఐపై పిసిబి బౌన్సర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భవిష్యత్ ప్రణాళికను అనుసరించి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ద్వైపాక్షిక క్రికెట్‌కు ససేమిరా అంటున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)పై చట్టపరమైన చర్యల రూపంలో బౌన్సర్లు విసిరేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) సిద్ధమవుతోంది. ఇందుకోసం పాక్ సర్కారు నుంచి పిసిబి ఇప్పటికే అనుమతి పొందింది. నిబంధనలను అనుసరించి పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాల్సి ఉన్నప్పటికీ, భారత్ అందుకు నిరాకరిస్తున్నదని పిసిబి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అందుకే, క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) లేదా ఇతర అంతర్జాతీయ వేదికల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, భారత్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నది. స్వదేశంలో కోర్టు కేసులతో ఇప్పటికే సతమతమవుతున్న బిసిసిఐకి ఈ కొత్త పరిణామం సమస్యలను సృష్టించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇదివరకు పిసిబితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత జట్టు పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడాలి. రొటేషన్ విధానాన్ని అనుసరించి ఈసారి పాక్‌లోనే టీమిండియా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, అక్కడ భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా, పాక్ తన హోం సిరీస్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని వేదికగా చేసుకొని ఆడుతున్నది. 2009 మార్చి 3వ తేదీన లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ పాక్‌లో భద్రతపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పిసిబికి తటస్థ వేదిక అనివార్యమైంది. అప్పటి నుంచి పాక్ తన హోం సిరీస్‌లను యుఎఇలోనే ఆడుతున్నది. పరస్పర అంగీకార ఒప్పందం (ఎంఒయు) ప్రకారం భారత్ కూడా యుఎఇకే వెళ్లాల్సి ఉంటుంది. కానీ, అక్కడ మ్యాచ్‌లు ఆడే ప్రసక్తి లేదని బిసిసిఐ అంటున్నది. భారత్‌కు వచ్చి సిరీస్ ఆడితే, కోరింత మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ పిసిబికి ఎర వేసింది. ఈ విధంగానైనా స్వదేశంలో సిరీస్‌లు జరగకపోవడంతో ఎదుర్కొంటున్న నష్టాలను చాలావరకు భర్తీ చేసుకోవచ్చని ఆశచూపింది. అయితే, అప్పట్లోనే షహర్యార్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చాడు. దీంతో కంగుతిన్న బిసిసిఐ మరో కొత్త ఎత్తువేసింది. బంగ్లాదేశ్ లేదా శ్రీలంకలో సిరీస్‌ను ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపింది. కానీ, అది ప్రతిపాదన స్థాయిని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
పాక్ వాదనలో బలమెంత?
ఐసిసి నిబంధనలను అనుసరించి ఫిక్చర్స్ అండ్ ఫ్యూచర్స్ ప్రోగ్రామ్ కింద కుదిరిన ఒప్పందాన్ని ఆయా క్రికెట్ జట్లు అమలు చేయాల్సిందేనని, ఈ రకంగా చూస్తే, తమతో ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేసుకునే హక్కు బిసిసిఐకి లేదని పిసిబి చేస్తున్న వాదనలో బలం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ద్వైపాక్షిక సిరీస్ షెడ్యూల్‌ను అమలు చేయడం లేదా ఏవైనా కారణాల వల్ల దానిని మార్చుకోవడం లేదా వాయిదా వేసుకోవడం లేదా తిరస్కరించడం వంటివి ఆయా జట్ల పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుందని ఐసిసి ఇదివరకే స్పష్టం చేసింది. అంతేగాక, ఆటగాళ్ల భద్రత అనే అంశం తెరపైకి వస్తే, వారి ప్రాణాలను ప్రమాదంలో పడేసైనా సిరీస్‌లు ఆడాలని చెప్పే అధికారం తమకు లేదని ఐసిసి తేల్చిచెప్పింది. పాక్‌లో ఉగ్రవాద కార్యకపాలు ఉద్ధృతంగా ఉన్నాయని, ఆటగాళ్ల భద్రతకు ప్రమాదం ఉందని అంటున్న దాదాపు అన్ని దేశాలు అక్కడ సిరీస్‌లు ఆడడం లేదు. అయితే, హోం సిరీస్‌లకు యుఎఇని పిసిబి ఎంపిక చేసిన తర్వాత, అక్కడ సిరీస్‌లు ఆడుతున్నాయి. పాక్‌లో భద్రత లేకపోతే, మిగతా జట్ల మాదిరిగానే యుఎఇలోనే సిరీస్‌లు ఆడొచ్చుకదా అన్నది పిసిబి వాదన. కానీ, భారత్ మాత్రం యుఎఇలో సిరీస్‌లు ఆడబోనని మొండిపట్టుతో ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో హోం సిరీస్‌లను తటస్థ కేంద్రాల్లో ఆడడం క్రికెట్‌లో కొత్తకాదు. వివిధ టోర్నీలను కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చిన సందర్భాలున్నాయి. చివరికి అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటీవలే భారత్, వెస్టిండీస్ జట్లు తమ ద్వైపాక్షిక టి-20 సిరీస్‌ను ఫ్లోరిడాలో ఆడాయి. ఇదే తరహాలో పాక్‌తో యుఎఇలో ఎందుకు సిరీస్‌లు ఆడడం లేదని బిసిసిఐని పిసిబి నిలదీసే అవకాశం ఉంది. క్రీడలకు రాజకీయాలతో సంబంధం ఉండరాదన్నది ఒలింపిక్ ఉద్యమ సూత్రం. అలా చూస్తే భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ఇరు దేశాల క్రికెట్ జట్ల మ్యాచ్‌లతో ముడిపెట్టడం సమంజసం కాదు. కానీ, దేశాల మధ్య ఉన్న వ్యతిరేకతల కారణంగా ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌నే కొన్ని దేశాలు బహిష్కరించిన సందర్భాలున్నాయి. కాబట్టి ఒలింపిక్ క్రీడాస్ఫూర్తి లేదా ఐసిసి నిబంధనలను ఆధారంగా చేసుకొని, భారత్‌పై చట్టపరమైన చర్యలకు పిసిబి ప్రయత్నించినా చెప్పుకోదగ్గ ఫలితం ఉండకపోవచ్చు.
భారత్ ససేమిరా
పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలకు భారత్ ఏమాత్రం సానుకూలత వ్యక్తం చేయడం లేదు. అసలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌కు పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా లేవని బిసిసిఐ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఐసిసి చైర్మన్ శశాంక్ మనోహర్ తాను బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాక్‌తో సిరీస్‌పై ఆసక్తిని ప్రదర్శించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎన్నోసార్లు పిసిబికి అతను హామీలిచ్చాడు. షహర్యార్‌ను చర్చల కోసం భారత్‌కు కూడా పిలిపించాడు. కానీ, ద్వైపాక్షిక సిరీస్‌లకు అనుమతించాలని ఎన్నడూ కేంద్రాన్ని కోరలేదు. మనోహర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పాక్‌తో క్రికెట్ గురించి కేంద్రానికి ఒక్క మాట కూడా చెప్పని బిసిసిఐ ఇప్పుడు ముందుకొస్తుందని అనుకోవడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. బిసిసిఐ నుంచి పిసిబికి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. అందుకే, అంతర్జాతీయ వేదికగా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమైంది. బిసిసిఐ అప్పటి అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఆహ్వానం మీదే భారత్ వచ్చిన పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఎలాంటి హామీని పొందకుండానే వెనుదిరిగాడు. క్రికెట్ సిరీస్‌లపై స్పష్టతనివ్వకపోతే, తమ ఆటగాళ్లు భారత్‌తో మ్యాచ్‌లను బహిష్కరిస్తారని హెచ్చరించినా అతనికి బిసిసిఐ నుంచి సానుకూల స్పందన రాలేదు. మరోవైపు, క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు ఇది అనువైన సమయం కాదని భారత్‌లోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రముఖులు స్పష్టం చేయడం పిసిబికి ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పకడ్బందిగా అమలు చేయడం నుంచి పలు అంశాలపై భారత్, పాక్ ప్రభుత్వాల మధ్య చర్చలు జరగాలని, ఆ తర్వాత క్రీడా సంబంధాలపై నిర్ణయాలు తీసుకోవాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. సరిహద్దులో పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌తో ఇప్పుడు క్రీడా సంబంధాలు ఏమిటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ డిమాండ్లు, ప్రశ్నలకు సరైన సమాధానం మాత్రం లభించడం లేదు.
దిక్కుతోచకే గట్టి నిర్ణయం!
బిసిసిఐ వైఖరితో అన్ని విధాలా నష్టపోతున్న పిసిబి దిక్కుతోచని స్థితిలోనే చట్టపరమైన చర్యలకు నడుం బిగించిందన్నది వాస్తవం. ద్వైపాక్షిక సిరీస్‌లపై యుద్ధానికి సిద్ధమైంది. 2014లో కుదిరిన ఒప్పందం ప్రకారం నిరుడు డిసెంబర్ మాసంలో పాకిస్తాన్‌తో భారత క్రికెట్ జట్టు సిరీస్ ఆడాలి. ఈ విషయాన్ని గతంలో పిసిబి చాలాసార్లు గుర్తుచేసింది. భారత్ వైఖరి ఇదే విధంగా ఉంటే, భవిష్యత్తులో తాము టీమిండియాతో మ్యాచ్‌లు ఆడాలా వద్దా అన్న అంశాన్ని పునరాలోచించుకోవాల్సి ఉంటుందని పిసిబి పలుమార్లు హెచ్చరించింది. బిసిసిఐ చేసిన ప్రతి ప్రతిపాదనకూ అంగీకారం తెలిపింది. బతిమిలాడింది. భంగపడింది. కానీ, ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో, అమీతుమీ తేల్చుకోవడమే ఏకైక మార్గంగా ఎంచుకుంది. ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందనేది ఉత్కంఠ రేపుతున్నది. మొత్తానికి పిసిబి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ బిసిసిఐని విడిచిపెట్టకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతున్నది. ఇలావుంటే, అంతర్జాతీయ క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టుకు గానీ, ఐసిసికి గానీ వెళ్లడం ద్వారా పిసిబికి ప్రత్యేకంగా లాభించేది ఏమీ ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్వైపాక్షిక సిరీస్‌ల విషయపై ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాలను ఆయా దేశాల్లో ఎవరైనా నిరాకరించవచ్చని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయ. ఈ విషయంలో ఐసిసి ఎవరినీ ఆదేశించే అవకాశం లేదు. అంటే, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడడం బిసిసిఐ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. తప్పకుండా ఆడి తీరాలన్న నిబంధన ఏదీ లేదు. పిసిబి చేసే విష ప్రచారం వల్ల బిసిసిఐకి ప్రత్యక్షంగా నష్టం ఏమీ లేకపోయనా, ఇప్పటికే ఐసిసిని ఢీకొని, ఒక్క తీర్మానాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోలేక పరువుపోగొట్టు కున్న బిసిసిఐకి ఇప్పుడు పాక్ వలన ఎదురయ్యే కొత్త పరిణామాలు తలనొప్పిగా మారడం మాత్రం ఖాయం. కానీ, పాక్‌తో క్రికెట్ సంబంధాలు మెరుగు పడడం అసాధ్యమన్నది వాస్తవం. పాకిస్తాన్‌లో పర్యటించే మాట ఎలావున్నా, కనీసం తటస్థ వేదికలపై ఆడడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాకు సాధ్యం కాదు. ఇందుకు కేంద్రం కూడా సానుకూలంగా లేదు.

భారత్, పాకిస్తాన్ జట్లు తలపడే ప్రతి మ్యాచ్ ఒక యుద్ధాన్ని తలపిస్తుంది. మైదానంలోనేగాక, స్టాండ్స్‌లోనూ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. రెండు దేశాలు ఇంత వరకూ 59 టెస్టులు ఆడాయి. వాటిలో భారత్ 9, పాకిస్తాన్ 12 చొప్పున విజయాలు సాధించగా, 38 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ జట్లు తలపడిన 127 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో నాలుగు మ్యాచ్‌ల ఫలితాలు తేలలేదు. మిగతా వాటిలో భారత్ 51 మ్యాచ్‌లను గెల్చుకోగా, పాకిస్తాన్ 72 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. టెస్టులు, వనే్డల్లో పాకిస్తాన్ కంటే వెనుకంజలో ఉన్న భారత్ టి-20 ఇంటర్నేషనల్స్‌లో మాత్రం మెరుగైన రికార్డును కొనసాగిస్తున్నది. ఈ ఫార్మాట్‌లో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు జరగ్గా, భారత్ ఆరు విజయాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించింది. పాకిస్తాన్ ఒక మ్యాచ్‌ని గెల్చుకుంది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
బౌలింగ్‌లో పాక్ టాప్
వనే్డ ఇంటర్నేషనల్స్ బౌలింగ్ విభాగానికి వస్తే భారత్‌పై పాకిస్తాన్ ఆధిక్యంలో ఉంది. వసీం అక్రం 48 మ్యాచ్‌ల్లో 60, సక్లాయిన్ ముస్తాక్ 35 మ్యాచ్‌ల్లో 57 చొప్పున వికెట్లు పడగొట్టి మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు. మూడో స్థానాన్ని అకీబ్ జావేద్‌తో కలిసి భారత బౌలర్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ పంచుకుంటున్నారు. ఈ ముగ్గురూ తలా 54 వికెట్లు కూల్చారు. అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణలోనూ పాక్‌దే అగ్రస్థానం. అకీబ్ జావేద్ ఒక మ్యాచ్‌లో 37 పరుగులకు 7, ఇమ్రాన్ ఖాన్ 14 పరుగులకు ఆరు, నవేద్ ఉల్ హసన్ 27 పరుగులిచ్చి 6 చొప్పున వికెట్లు కూల్చి, మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. భారత్ తరఫున సౌరవ్ గంగూలీ ఒక వనే్డ ఇన్నింగ్స్‌లో 16 పరుగులకు 5 వికెట్లు సాధించి, ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.

- శ్రీహరి