ఆటాపోటీ

జపాన్ ఒలింపిక్స్ ధ్యేయంగా ‘విజన్ 2020’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో (జపాన్)లో జరిగే 2020 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) 984 కోట్ల రూపాయలతో భారీ ప్రణాళికను రూపొందించింది. 13-15 సంవత్సరాల మధ్య ఉన్న యువ ప్రతిభావంతులను ఎంపిక చేసి ఎనిమిదేళ్ల పాటు వారికి శిక్షణ ఇప్పించి 2020 ఒలింపిక్స్‌లో కనీసం 25 పతకాలైనా సొంతం చేసుకోవాలనేది ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీంతో ‘చిన్నారి ప్రతిభావంతులను ఒడిసి పట్టుకోండి’ అనే నినాదాన్ని భారత క్రీడాప్రాధికార సంస్థ స్లోగన్‌గా తీసుకుంటుందేమో. కేంద్ర క్రీడాశాఖ ఆధ్వర్యంలో అమలు పరిచే ‘విజన్-2020’ కోసం జూనియర్ ఆటగాళ్లను ఎంపిక చేసి మెరుగైన శిక్షణను అందించడంతో పాటు విదేశాల్లో టోర్నీలకు పంపుతారు. ఒలింపిక్స్‌లో మంచి ఫలితాలను సాధించడం కోసం చైనా, తూర్పు ఐరోపా దేశాలు పాటించిన విధానాలను ఆధారంగా చేసుకుని విజన్-2020ని రూపొందించారు. ఆ దేశాలు తమ క్రీడాకారులకు ఎనిమిదేళ్ల పాటు మంచి సౌకర్యాలతో ఉత్తమ శిక్షణ కోసం రూపొందించిన ప్రణాళికలను మన దేశం కూడా అనుసరించాలని సాయ్ నిర్ణయించింది. సాయ్ మాజీ డైరెక్టర్ దేశ్ దీపక్ పాండే సూచనలతో ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం అమలులో సాయ్‌తో పాటు భారత ఒలింపిక్ సంఘం, వివిధ క్రీడా సమాఖ్యలు పాలుపంచుకుంటాయి. 2016-17 వరకు జాతీయ కోచింగ్ క్యాంపులు, విదేశీ టూర్ల కోసం రూ.380 కోట్లను కేటయించారు. 2017 నుంచి 2020 వరకు పై అంశాలపై రూ.300 కోట్లను ఖర్చు చేస్తారు. కాగా, 38 మంది విదేశీ కోచ్‌ల కోసం రూ.90 కోట్లను వినియోగిస్తారు. శిక్షణకు ఎంపికైన క్రీడాకారులకు నెలకు మూడు వేల రూపాయల ఉపకార వేతనాన్ని అందిస్తారు. అయితే, 2020 ఒలింపిక్స్‌కు వ్యక్తిగత విభాగంలో అర్హత సాధిస్తే ఒక్కొక్కరికి మూడు లక్షలు, టీం ఈవెంట్‌లో ఒక్కొక్కరికి లక్షన్నర రూపాయలు చెల్లిస్తారు. ఈ శిక్షణ కోసం ఎంపిక చేయడానికి ఒలింపిక్స్ జాబితాలో ఉన్న ప్రతీ క్రీడకు సమాన ప్రాధాన్యం ఇస్తారు. ఇందు కోసం జోనల్ స్థాయిలో తొలుత 4500 మంది యువ క్రీడాకారులను ఎంపిక చేసి వీరిలో మళ్లీ 2500 మందిని వడగడతారు. వీరిలో 20 నుంచి ముఫ్పై శాతం మంది 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందేలా చూడాలని సాయ్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ ఆటగాళ్లలో 60 నుంచి 70 శాతం 2018 కామనె్వల్త్, ప్రపంచ చాంపియన్‌షిప్స్, 2019 ఆసియా క్రీడల్లో పతకం నెగ్గేలా సాయ్ ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం జూనియర్లకు కూడా సీనియర్లకు ఇచ్చే డైట్‌ను అందిస్తారు. అంతేగాకుండా ఆటగాళ్ల ప్రదర్శనను వీడియో విశే్లషణ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ప్రతీ క్రీడాంశానికి ఒక యోగా నిపుణున్ని నియమిస్తారు. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తే అంతర్జాతీయ వేదికలపై భారత్ అద్భుతాలు సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు.