ఆటాపోటీ

ఇంగ్లాండ్‌లో మహిళల ‘ప్రపంచ’ యుద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తున్న పదకొండవ మహిళల వరల్డ్ కప్ ఈనెల 24న మొదలై, జూలై 23వ తేదీతో ముగుస్తుంది. ఇంగ్లాండ్‌లో ఈ మెగా టోర్నీ జరగడం ఇది ముచ్చటగా మూడోసారి. ఇంతకు ముందు 1973లో, తిరిగి 1993లో ఇంగ్లాండ్ వేదికగా మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ జరిగింది. మొత్తం మీద 28 రోజుల్లో 31 మ్యాచ్‌లు జరుగుతాయి. డెర్బీలో జరిగే మొదటి మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ జట్ల ఢీ కొంటాయి. 3క్రికెట్ మక్కా2గా పిలిచే లార్డ్స్ మైదానం ఫైనల్‌కు వేదికవుతుంది. మొత్తం ఎనిమిది జట్లు బరిలో ఉన్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రాతిపదికన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు నేరుగా మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాయి. భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు క్వాలిఫయర్స్‌లో నెగ్గి పోటీకి అర్హత పొందాయి. కాగా, ఈ మొత్తం ఎనిమిది జట్లును రెండు గ్రూపులుగా విభజించి టోర్నమెంట్‌ను నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాలు దక్కించుకున్న జట్లు సెమీ ఫైనల్ చేరతాయి. బ్రిస్టల్, డెర్బీ, లీసెస్టర్, టౌంటన్ మైదానాల్లో తలా ఏడు చొప్పున మ్యాచ్‌లు ఉంటాయి. పోటీలకు ఆతిథ్యమిస్తున్న ఇంగ్లాండ్ ఒక్కో మైదానంలో కనీసం ఒక మ్యాచ్ ఆడే విధంగా షెడ్యూల్‌ను రూపొందించారు.

**
ఇంగ్లాండ్ వాతావరణం పేసర్లకు బాగా ఉపయోగపడుతుంది. భారత జట్టులో గూలన్ గోస్వామి, శిఖా పాండే, మాన్సీ జోషి పేసర్లు. ఈ ముగ్గురూ ఇంగ్లాండ్ పిచ్‌ల స్వభావాన్ని తమకు అనుకూలంగా మలచుకొని, స్వింగ్ బౌలింగ్‌లో ప్రత్యర్థులను కట్టడి చేస్తే, మ్యాచ్‌ల ఫలితాలు భారత్‌కు అనుకూలంగా మారుతాయి. ఎక్కువ మంది యువ క్రీడాకారిణులున్న భారత జట్టు గత 15 నెలల కాలంలో 16 వరుస విజయాలను సాధించింది. మహిళల వనే్డ చరిత్రలో అత్యధిక వరుస విజయాల సంఖ్యలో ఇది రెండోది. జట్టులో దాదాపు అందరూ మంచి ఫామ్‌ని కొనసాగిస్తూ, నిలకడగా రాణిస్తున్నారు కాబట్టి, వరల్డ్ కప్‌లో సానుకూల ఫలితాలను పొందే సత్తా భారత్‌కు ఉంది. గత నెల దక్షిణాఫ్రికాలో జరిగిన నాలుగు దేశాల వనే్డ టోర్నీని సాధించిన మిథాలీ రాజ్ సేన మంచి ఊపుమీద ఉంది. ఇదే స్థాయిలో ఆడితే, ప్రపంచ కప్‌లో అద్భుతాలు సృష్టించడం ఖాయం.
**
పురుషుల క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు
మహిళల క్రికెట్‌లో బ్యాట్స్‌విమన్ అనే పదాన్ని వాడాలి. కానీ, చాలాకాలం
కామెంటేటర్లు బ్యాటర్స్ అని పిలిచేవారు. ఆతర్వాత కాలంలో ఆ పదం స్థానంలో బ్యాట్స్‌మన్ అన్న పదం స్థిరపడింది. అటు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో బ్యాటింగ్ చేసే వారిని బ్యాట్స్‌మన్‌గానే సంబోధించడం సామాన్యమైంది.
బౌలర్, ఫీల్డర్, వికెట్‌కీపర్ వంటి పదాల్లో మార్పులు లేనప్పుడు, కేవలం బ్యాటింగ్ విషయంలో ఎందుకు తేడా చూపించాలన్న ఉద్దేశంతో, మహిళా క్రికెట్‌లోనూ బ్యాట్స్‌మన్ అనే పదమే చెలామణి అవుతున్నది.
**

ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని హామీలు గుప్పించినా తరతరాలుగా మహిళల పట్ల వివక్ష కొనసాగుతునే ఉంది. క్రీడలనూ ఈ రుగ్మత పట్టి పీడిస్తున్నది. సామాజిక అధికారం లేని రాజకీయాధికారం ఎందుకూ కొరగాదని చెప్పడానికి అంతర్జాతీయ క్రీడలే ఉదాహరణ. చాలా దేశాల్లో మహిళలు అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చట్టసభల్లోనూ మహిళల సంఖ్య గణనీయంగానే ఉంది. కానీ, క్రీడలకు సంబంధించిన సమగ్ర చట్టాలు, పురుషులతో సమానంగా మహిళలను ప్రోత్సహించడానికి అవసరమైన పథకాలు రావడం లేదు. చాలా వరకు కాగితాలకే పరిమితమై, మహిళా క్రీడారంగాన్ని అపహాస్యం చేస్తున్నాయి. మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్పష్టంగా కనిపిస్తున్న వివక్షే ఇందుకు ఉదాహరణ. ప్రపంచ కప్ క్రికెట్ అంటే అందరికీ పురుషుల విభాగంలో జరిగే టోర్నీనే గుర్తుకొస్తుంది. కానీ, ఆ టోర్నీ కంటే సుమారు రెండేళ్ల ముందుగానే
మొదలైన మహిళల వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ గురించి చాలా మందికి తెలియదు.
అంత వరకూ ఎందుకు, అంతర్జాతీయ మహిళల క్రికెట్ మండలి (ఐడబ్ల్యుసిసి)ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)లో విలీనం చేస్తేగానీ మహిళల ప్రపంచ కప్ పోటీలను నిర్వహించడానికి అవసరమైన కనీస సౌకర్యాలు కూడా అందుబాటులోకి రాలేదు. పురుషుల విభాగంలో వరల్డ్ కప్ 1976లో మొదలైంది. అంతకంటే ముందు, 1973లో ఇంగ్లాండ్ మొట్టమొదటి మహిళల వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీలకు అతిథ్యమిచ్చింది. అనేకానేక ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఒక్కో అడుగు ముందుకేసింది. చాలా దేశాలు ఈ టోర్నీలో ఆడేందుకు నిరాకరించేవి. పోటీలను నిర్వహించేందుకు ఒకటి రెండు తప్ప దేశాలేవీ ఆసక్తి చూపేవికావు. చాలా దేశాల్లో పురుషుల క్రికెట్ మెరిసిపోతుంటే, మహిళా క్రికెటర్లు మాత్రం కనీస సౌకర్యాలు కూడా లేకుండా అల్లాడిపోయారు. చివరికి వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఆర్థికంగా ఆదుకోలేదు. టికెట్లు కూడా కొనలేని స్థితిలో పలు దేశాల మహిళా క్రికెట్ జట్లు వరల్డ్ కప్‌లో ఆడడం మానుకున్నాయి. కొంత మంది వ్యక్తులు, స్వచ్చంద సంస్థల కృషి ఫలితంగా మహిళల వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్లు క్రమంగా పెరిగాయి. 1997లో అత్యధికంగా 11 జట్లు తలపడ్డాయి. 2000 నుంచి దీనిని ఎనిమిది జట్ల టోర్నీగా ఖారారు చేశారు. 2005లో ఐడబ్ల్యుసిసిని ఐసిసిలో విలీనం చేసిన తర్వాత ఇది కూడా ఐసిసి వరల్డ్ కప్‌గానే స్థిరపడింది. పేరుకు చాలా గొప్ప ఈవెంట్‌గా ముద్ర వేయించుకున్నప్పటికీ, ఇప్పటికీ మహిళల వరల్డ్ కప్‌కు ఆదరణ లేదరణ లేదన్నది వాస్తవం. రంజీ స్థాయి క్రికెటర్లు, చివరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వంటి టోర్నీల్లో స్థానిక ఆటగాళ్ల కోటా కింద స్థానం పొందిన ఆడే గల్లీ ఆటగాళ్ల పేర్లు, రికార్డులు చాలా మందికి తెలుసుగానీ, మహిళల విభాగంలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే వారి గురించి మాత్రం తెలియదు. పురుషుల విభాగంలో ఆటగాళ్లు కోట్లకు కోట్లు సంపాదిస్తుంటే, మహిళా క్రికెటర్లు కనీస గుర్తింపు కూడా లేకుండా అల్లాడుతున్నారు. అందుకే, ఆర్థికంగా స్థిరపడిన వారు తప్ప సాధారణ కుటుంబాల నుంచి మహిళలు ఎవరూ క్రికెట్‌ను ప్రొఫషన్‌గా తీసుకోవడం లేదు. ముందుకొస్తున్న వారు సరైన ఆదరణ లేక నిరాశ చెందుతున్నారు. చాలా మంది ప్రతిభావంతులు ఎంతో మంది ఆదరణ లేక అల్లాడుతున్నారు. మీడియా కూడా మహిళా క్రికెట్‌ను నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఐసిసితోపాటు వివిధ దేశాల క్రికెట్ బోర్డులు కూడా కృషి చేయాలి. సమన్యా యం అనే పదానికి నిజంగానే న్యా యం చే యాలి. లేకపోతే, ఎన్ని ప్రపంచ కప్ టో ర్నీలు జరిగినా ఫలితం ఉండదు.
మొట్టమొదటిసారి, 1973లో మహిళల ప్రపంచ కప్‌ను ప్రవేశపెట్టినప్పుడు సెమీ ఫైనల్స్, ఫైనల్ లేవు. రౌండ్ రాబిన్ మ్యాచ్‌లను నిర్వహించేవారు. ఎక్కువ పాయింట్లు సంపాదించిన జట్టును విజేతగా ప్రకటించేవారు. ఈ విధానంలో, మొదటిసారి ఇంగ్లాండ్ మొత్తం 17 పాయింట్లు సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా రెండో స్థానం సంపాదించింది. 1978లోనూ ఇదే విధానాన్ని కొనసాగించారు. ఈసారి ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో విజేతగా నిలిస్తే, ఇంగ్లాండ్‌కు రెండో స్థానం దక్కింది. 1982 నుంచి రౌండ్ రాబిన్ విధానంతోపాటు, నాకౌట్ పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. ఈ విధానంలో జరిగిన మొదటి వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై ఆహ్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ 60 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 58 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 1988లోనూ ఆస్ట్రేలియా టైటిల్ దక్కించుకుంది. ఇంగ్లాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఇంగ్లాండ్ 60 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులకు పరిమితమైంది. అనంతరం ఆసీస్ 44.5 ఓవర్లలో, కేవలం రెండు వికెట్లు చేజార్చుకొని 129 పరుగులు చేసి ట్రోఫీని అందుకుంది. 1993లో ఇంగ్లాండ్ టైటిల్ సాధించింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 67 పరుగుల తేడాతో ఓడించింది. ఇంగ్లాండ్ 60 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు సాధిస్తే, కివీస్ 55.1 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. 1997లో ఆస్ట్రేలియా విజేతగా నిలిస్తే, న్యూజిలాండ్ వరుసగా రెండోసారి రన్నరప్ ట్రోఫీని తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.3 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా 47.4 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసి, ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాను నాలుగు పరుగుల తేడాతో ఓడించింది. న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌట్‌కాగా, చివరి వరకూ పోరాడిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 49.1 ఓవర్లలో 180 పరుగుల వద్ద ముగిసింది. 2005లో భారత జట్టు అద్వితీయ ప్రతిభ కనబరచింది. టైటిల్ సాధించలేకపోయినప్పటికీ, రన్నర్‌ప్‌గా నిలవగలిగింది. ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ఆతర్వాత భారత్ 46 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ కావడంతో, ఆసీస్ 98 పరుగుల భారీ తేడాతో గెలిచింది. 2009లో ఇంగ్లాండ్‌కు టైటిల్ దక్కింది. ఈ జట్టు ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాంగ్ చేసిన న్యూజిలాండ్ 47.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్‌కాగా, ఇంగ్లాండ్ 46.1 ఓవర్లలో ఆరు వికెట్లు చేజార్చుకొని లక్ష్యాన్ని ఛేదించింది. చివరిసారి, 2013లో జరిగిన వరల్డ్ కప్‌లో ఆసీస్ విజయభేరి మోగించింది. వెస్టిండీస్‌ను 114 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది. ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 259 పరుగులు సాధిస్తే, వెస్టిండీస్ 43.1 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. గత వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన విండీస్ ఈసారి క్వాలిఫై కాలేకపోవడం విచిత్రం.
*
మిథాలీ మైలురాయి!
భారత కెప్టెన్ మిథాలీ రాజ్ వరల్డ్ కప్ పూర్తయ్యేలోగా ఒక అరుదైన మైలురాయిని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ 177 మ్యాచ్‌లు (158 ఇన్నింగ్స్) ఆడిన ఆమె 5,781 పరుగులు చేసింది. మరో 212 పరుగులు సాధిస్తే, మహిళల వనే్డల్లో అత్యధిక పరుగులు సాధించిన చార్లొట్ ఎడ్వర్డ్స్ రికార్డును అధిగమిస్తుంది. 34 ఏళ్ల మిథాలీకి బహుశా ఇదే చివరి వరల్డ్ కప్. కాబట్టి, టైటిల్ సాధించడానికి అమె సర్వశక్తులు ఒడ్డనుంది. ఈ క్రమంలోనే అత్యధిక స్కోరు మైలు రాయిని సులభంగానే దాటే అవకాశాలున్నాయి.

**
భారత జట్టు
మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (ఆల్‌రౌండర్), స్మృతి మందానా, వేదా కృష్ణమూర్తి, మోనా మేష్రామ్, పూన మ్ రావత్, దీప్తి శర్మ, ఝూలన్ గోస్వామి, శిఖా పాండే, ఏక్తా బిస్త్, సుష్మ వర్మ, మాన్సీ జోషి, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్, నుజాత్ పర్వీన్.

భారత కెప్టెన్ మిథాలీ రాజ్

-శ్రీహరి