ఆటాపోటీ

అనధికార ప్రపంచకప్ వింబుల్డన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెన్నిస్ ర్యాకెట్ చేతపట్టిన ప్రతి ఒక్కరికీ వింబుల్డన్ ఒక కల. ఈ టోర్నీ గురించి ఎన్నో కలలు కంటారు. ఎన్నో ఆశలు నింపుకొంటారు. అక్కడి టెన్నిస్ కోర్టుల్లో గడిపిన ప్రతి క్షణాన్ని మధుర స్మృతిగా కలకాలం మదిలో దాచుకుంటారు. అక్కడ క్వాలిఫయర్స్‌ను నెగ్గి మెయిన్‌డ్రా చేరుకుంటే చాలు టెన్నిస్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకున్నందుకు సార్థకత చేకూరిందని అనుకుంటారు. ఇక టైటిల్ గెలిస్తే జన్మధన్యమైందని మురిసిపోతారు. వింబుల్డన్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. టెన్నిస్‌లో అనధికార ప్రపంచ కప్ వింబుల్డన్. టెన్నిస్‌లో మాత్రమే కనిపించే విలక్షణమైన పద విన్యాసాలకు, కళాత్మక విలువలకు, క్రీడాస్ఫూర్తికి సజీవ సాక్ష్యం వింబుల్డన్. ఇది కేవలం ఒక టోర్నీ మాత్రమే కాదు.. టెన్నిస్ చరిత్రకు ప్రతిరూపం. ఒక్క మాటలో చెప్పాలంటే వింబుల్డన్ లేని టెన్నిస్ లేదు. వింబుల్డన్‌ను గెలవాలని అనుకోని మనసు ఉండదు. నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో రారాజు వింబుల్డన్. పవర్ ప్లే దూసుకొచ్చి, కళాత్మక విలువలు భూస్థాపితమవుతున్న రోజుల్లో ఇప్పటికీ టెన్నిస్‌ను సుందర దృశ్యకావ్యంలా మన కళ్ల ముందు ఆవిష్కరిస్తున్న టోర్నీ వింబుల్డన్. ఈనెల 27 నుంచి జూలై 10వ తేదీ వరకు జరిగే 130వ వింబుల్డన్ టోర్నీ మరోసారి అభిమానులకు పసందైన టెన్నిస్ విందును అందించేందుకు సిద్ధమైంది.
ఘన చరిత్ర
ప్రాచీన కాలం నుంచి వివిధ విధానాలుగా ఆడుతూ వస్తున్న టెన్నిస్‌కు ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్ ఆధునిక రూపాన్నిచ్చింది. టెన్నిస్‌ను అవుట్ డోర్ గేమ్ మాదిరి ఆడాలన్న ఆలోచన మేజర్ వాల్టర్ క్లాప్టన్ వింగ్‌ఫీల్డ్‌ది. 1873లో స్పెయిరిస్టయిక్ పేరుతో వేల్స్‌లో అవుట్ డోర్ టెన్నిస్‌ను ఆరంభంచాడు. ఒక రకంగా వింబుల్డన్‌కు ఇదే పునాది రాయి. స్పెయిరిస్టయిక్ టోర్నీ కొద్దికాలంలోనే ప్రాచుర్యాన్ని పొందింది. అయితే, ఆ పేరును పలకడానికి చాలా మంది ఇష్టపడలేదు. అవుట్ డోర్ టెన్నిస్‌ను స్పెయిరిస్టయిక్ కాకుండా లాన్ టెన్నిస్ అనే పేరుతో పిలవడం ఆరంభించారు. 1874లో బెర్ముడాకు వెళ్లిన మేరీ ఇవింగ్ అవుటర్‌బ్రిడ్జి అనే మహిళ న్యూయార్క్ నగరానికి తిరిగి వచ్చేటప్పుడు బ్రిటిష్ ఆర్మీ అందచేసిన టెన్నిస్ రాకెట్, ఇతర పరికరాలను తనతో తీసుకెళ్లింది. అమెరికాలో టెన్నిస్ మొదటిసారి అడుగుపెట్టింది. ఆరేళ్ల కాలంలో బ్రిటన్‌తోపాటు అమెరికాలోనూ టెన్నిస్‌కు విశేష ఆదరణ లభించింది. 1880 దశకం మొదట్లోనే టెన్నిస్ క్రీడా రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఐరోపా, అమెరికా ఖండాల్లో 1886 సంవత్సరంలో బ్రిటన్‌లో లాన్ టెన్నిస్‌కు స్పష్టమైన రూపం వచ్చింది. నియమ నిబంధనలు ఖరారయ్యాయి. ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్ 1887లో ఏర్పడింది. అదే ఏడాది జూలై 7న వింబుల్డన్‌లో లాన్ టెన్నిస్ టోర్నమెంట్ ఆరంభమైంది. మొట్టమొదటి టోర్నీ కేవలం పురుషుల సింగిల్స్ విభాగానికే పరిమితమైంది. ఒక షెల్లింగ్‌ను చెల్లించి టికెట్లు తీసుకున్న సుమారు 200 మంది ప్రేక్షకులు హాజరుకాగా, 22 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. స్పెన్సర్ గోరె తొలి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, బాలురు, బాలికల విభాగాల్లో సింగిల్స్, డబుల్స్ పోటీలు రంగ ప్రవేశం చేశాయి. వెటరన్, వీల్‌చైర్, లెజెండ్స్ విభాగాల్లోనూ పోటీలను నిర్వహిస్తున్నారు. అతి తక్కువ కాలంలో విశేష ఆదరణ పొందిన వింబుల్డన్ నేడు క్లాసికల్ టెన్నిస్‌కు మారుపేరుగా మారింది. ప్రతిష్ఠాత్మక టోర్నీగా ఎదిగింది. వింబుల్డన్ లోగోలో ఆకుపచ్చ, వంగ రంగులు కలిసి ఉంటాయి. టెన్నిస్ ర్యాకెట్లును క్రాస్‌గా ఉంచిన బొమ్మ లోగోలో కనిపిస్తుంది.
ఎన్నో ప్రత్యేకతలు
వింబుల్డన్ టెన్నిస్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ లక్షణాలే వింబుల్డన్‌ను విలక్షణ టోర్నీగా నిలబెట్టాయి. గ్రాస్ కోర్టుపై జరుగుతున్న ఏకైక టోర్నీ ఇది ఒక్కటే. ఈ టోర్నీ కోసమే వింబుల్డన్ కోర్టుల్లో గడ్డిని ఏడాది పొడవునా సంరక్షిస్తుంటారు. పచ్చికను ఎప్పటికప్పుడు కత్తిరిస్తుంటారు. గ్రౌండ్‌లో ఎక్కడ చూసినా పచ్చిక ఎత్తు 8 మిల్లీ మీటర్లే ఉంటుంది. మిగతా టోర్నీలో ఎక్కడా లేని డ్రెస్ కోడ్‌ను వింబుల్డన్‌లో పాటిస్తున్నారు. క్రీడాకారులు తప్పనిసరిగా తెల్ల దుస్తులే ధరించాలి. చివరికి బూట్లు కూడా తెల్లవే. ఎవరైనా డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘిస్తే అంపైర్లు సదరు ఆటగాళ్లకు సూచనలు చేస్తారు. 2013 వింబుల్డన్ ఆడుతున్నప్పుడు రోజర్ పెదరర్ వేసుకున్న కాలి బూట్ల సోల్ నారింజ రంగులో ఉందట. అంపైర్ వెంటనే అతనిని పిలిచి, తర్వాతి మ్యాచ్‌లో అడుగు భాగం తెల్లగా ఉండే బూట్లు వేసుకోవాలని సూచించాడు. వింబుల్డన్‌లో డ్రెస్ కోడ్‌ను ఎంత ఖచ్చితంగా అమలు చేస్తారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఈ డ్రెస్ కోడ్‌ను వ్యతిరేకించిన అండ్రీ అగస్సీ 1988 నుంచి 1990 వరకూ వింబుల్డన్ టోర్నీలో పాల్గొనలేదు. తెల్ల డ్రెస్సు వేసుకొని మ్యాచ్‌లు ఆడడం ఇబ్బందిగా ఉందని, ఆ నిబంధనను మార్చాలని అతను పలుమార్లు నిర్వాహకులను కోరాడు. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రెస్ కోడ్‌ను మార్చేది లేదని నిర్వాహకులు తేల్చిచెప్పారు. ఇప్పటికీ ఆ విధానం యథాతథంగా అమలవుతున్నది.

చిత్రం పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్
చిత్రం మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్

- ఎస్‌ఎంఎస్