ఆటాపోటీ

ఇద్దరు మొనగాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెజిల్‌లో ప్రారంభమైన రియో ఒలింపిక్స్‌లో సుమారు 10,500 మంది క్రీడాకారులు పతకాల కోసం పోటీపడుతున్నప్పటికీ, ఇద్దరిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. వారిలో ఒకరు స్ప్రింట్ వీరుడు, ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌కాగా, మరొకరు అమెరికా స్విమ్మింగ్ హీరో మైఖేల్ ఫెల్ప్స్. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలేలోనూ స్వర్ణాలను సాధించి ‘డబుల్ ట్రిపుల్’ను తన ఖాతాలో వేసుకున్న బోల్ట్ రియోలోనూ అదే స్థాయిలో రాణించి ‘ట్రిపుల్ ట్రిపుల్’ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇటీవలే కాలి కండరాలు బెణకడంతో బాధపడిన బోల్ట్‌కు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుందా లేదా అన్నది చివరి వరకూ ఉత్కంఠ రేపింది. జమైకా అమెచ్యూర్ అథ్లెటిక్స్ సంఘం (జెఎఎఎ) పాలక మండలి తీసుకున్న నిర్ణయంతో అతని రియో ప్రయాణానికి లైన్ క్లియరైంది. సాధారణంగా జమైకాలో జరిగే ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొని, మెరుగైన ప్రదర్శనను కనబరచిన వారికే మెగా ఈవెంట్‌లో పాల్గొనే అర్హత లభిస్తుంది. అయితే, ట్రయల్స్ నుంచి కండరాల నొప్పి కారణంగా వైదొలగిన బోల్ట్ జర్మనీలో ప్రత్యేక వైద్య సేవలు పొందాడు. అతని ఎడమకాలి కండరాలు స్వల్పంగా చిట్లినట్టు వైద్యులు గుర్తించారు. వైద్య పరిభాషలో దీనిని గ్రేడ్-1 గాయంగా పేర్కొంటారు. అది చాలా చిన్న సమస్య. అందుకే కొద్ది రోజుల్లోనే గాయం నయమైంది. కాగా, ఇంతకు ముందు వెన్నునొప్పితో బాధపడిన బోల్ట్ దాని నుంచి పూర్తిగా కోలుకోక ముందే కండరాల నొప్పి ఒకానొక దశలో అతని కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టింది. అయితే, ఒలింపిక్స్‌లోగా తాను కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసిన బోల్ట్ తనను ఎంపిక చేయాల్సిందిగా జెఎఎఎ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అతని అభ్యర్థనను పరిశీలించిన అధికారులు సానుకూలంగా స్పందించారు. అతనికి రియో టికెట్ దక్కింది. అక్కడ బోల్ట్ ‘ట్రిపుల్ ట్రిపుల్’ను సాధించే క్రమంలో అతను పాల్గొనే మూడు విభాగాల్లో ఫైనల్స్ ఈనెల 14, 18, 19వ తేదీల్లో జరుగుతాయి.
ఒలింపిక్ చరిత్రలోనే అత్యధిక పతకాలు సాధించి, ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న సూపర్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ లండన్ ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఆ తర్వాత మనసు మార్చుకొని మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు. రియోలో అతను పాల్గొనే 100 మీటర్లు, 200 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్‌లో చాంద్ లె క్లొస్ గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది. లండన్ ఒలింపిక్స్‌లో మాదిరిగానే ఈ రెండు విభాగాల్లో వీరిద్దరూ ఈనెల 9, 12 తేదీల్లో జరిగే ఫైనల్స్‌లో ఢీకొనే అవకాశం ఉంది. మొత్తం మీద ఒలింపిక్ పతకాల సంఖ్యను మరింతగా పెంచుకునే ఊపుమీద ఉన్న ఫెల్ప్స్ ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తాడో, ఈత కొలనులో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో చూడాలి. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో బోల్ట్, స్విమ్మింగ్‌లో ఫెల్ప్స్ ఈసారి ఒలింపిక్స్‌లో స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఈ ఇద్దరు మొనగాళ్ల పోటీని చూసేందుకు అభిమానులు ఎగబడడం ఖాయం.

చిత్రాలు.. ఉసేన్ బోల్ట్, మైఖేల్ ఫెల్ప్స్,