ఆటాపోటీ

జారుడు మెట్లపై క్రీడారంగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తేజం పివి సింధుకు మహిళల బాడ్మింటన్‌లో రజతం.. ఎవరూ పట్టించుకోని సాక్షి మాలిక్‌కు మహిళల రెజ్లింగ్‌లో కాంస్యం.. రియో ఒలింపిక్స్‌లో మేజర్ ఈవెంట్స్ ముగిసే సమయానికి భారత్ సాధించిన పతకాలివి. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప మిగిలిన ఈవెంట్స్‌లో పతకాలు వస్తాయన్న ఆశ లేదు. గతంలో ఎన్నడూ లేనంత భారీ బృందం రియోకి వెళ్లింది. 118 మంది పోటీపడడం సంఖ్యా పరంగా ఒక రికార్డు. సింధు ప్రతిభ.. సాక్షి పోరాటం.. దీపా కర్మాకర్ శ్రమ.. రియోలో ఇంతకు మించి భారత్ సాధించిందేమీ లేదు.
***
భారత క్రీడా రంగ పరిస్థితి నానాటికీ అధ్వాన్నంగా మారుతోంది. జారుడు మెట్లపై పైకెక్కడానికి విఫలయత్నం చేస్తున్నది. అంతర్జాతీయ మేజర్ ఈవెంట్స్‌కు అట్టహాసంగా వెళ్లడం, పరాభవాలను మూటగట్టుకొని స్వదేశానికి చేరుకోవడం భారత్ క్రీడాకారులకు ఆనవాయితీగా మారింది. రియో ఒలింపిక్స్‌లోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. బాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో పివి సింధు ఓటమిపాలై రజత పతకాన్ని సంపాదించగా, అంతకు ముందు రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని అందుకుంది. కీలక ఈవెంట్స్ ముగిసే సమయానికి భారత్‌కు ఈ రెండు పతకాలే దక్కాయి. మొత్తం మీద, ఏ క్రీడ చూసినా ఏమున్నది గర్వకారణం అంటూ ఈ వైఫల్యాలను చూసి బాధపడడం తప్ప అభిమానులు చేయగలిగింది ఏమీ లేదు. ఒలింపిక్స్‌లో ఒకప్పుడు గొప్పగా రాణించామంటూ ఎగిరిపడడమే తప్ప వర్తమాన పరిస్థితి కారణాలను వెతుక్కోవడానికిగానీ, సమస్యలను పరిష్కరించడానికిగానీ కృషి జరగడం లేదు. ఒలింపిక్స్‌లో మన దేశం అత్యధికంగా ఎనిమిది స్వర్ణ పతకాలను హాకీలో గెల్చుకుంది. వ్యక్తిగత ఈవెంట్‌లో అభినవ్ బింద్రా ఒక్కడే స్వర్ణ పతకాన్ని అందుకోగలిగాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బింద్రా ఈ ఫీట్ సాధించే వరకూ మనకు ఇండివిజువల్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకం అంటే ఏమిటో తెలియదు. ఏథెన్స్ ఒలింపిక్స్ షూటింగ్‌లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రజత పతకాన్ని, అట్లాంటా ఒలింపిక్స్‌లో టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, సిడ్నీ ఒలింపిక్స్‌లో మహిళా వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. బీజింగ్‌లో విజేందర్ సింగ్ బాక్సింగ్‌లో, సుశీల్ కుమార్ రెజ్లింగ్‌లో కాంస్య పతకాలను అందుకున్నారు. అదే విధంగా లండన్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో విజయ్ కుమార్, రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజత పతకాలను సాధించగా, బాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, మహిళల బాక్సింగ్‌లో మేరీ కోమ్, షూటింగ్‌లో గగన్ నారంగ్, రెజ్లింగ్‌లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకాలను స్వీకరించారు. మొత్తం మీద రియో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు వరకూ భారత్ ఖాతాలో తొమ్మిది స్వర్ణం, నాలుగు రజతం, 11 కాంస్యాలతో మొత్తం 24 పతకాలు ఉన్నాయి. అమెరికా స్టార్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ఒక్కడే ఒలింపిక్స్‌లో భారత్ కంటే ఎక్కువ పతకాలు సాధించడం విశేషం. మన క్రీడా రంగం ఎంతగా విఫలమవుతున్నదో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
స్వాతంత్య్రానికి పూర్వం, 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో నార్మర్ ప్రిచర్డ్ పురుషుల 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హర్డిల్స్‌లో సాధించిన రజత పతకాలను మన ఖాతాలోనే వేసుకొని సంబరపడిపోతున్నాం. నిజానికి పిచర్డ్ భారతీయుడు కాడు. అప్పుడు భారత్ అసలు స్వతంత్ర దేశమే కాదు. కానీ, అతని పతకాన్ని మన జాబితాలోకి చేర్చేకున్నాం. 1947లో స్వాతంత్య్రం రాకముందు మూడు ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కైవసం చేసుకున్న స్వర్ణ పతకాలను సైతం మన ఘనతగానే పరిగణిస్తున్నాం. నిజం చెప్పాలంటే, 1948 లండన్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సాధించిన స్వర్ణమే స్వతంత్ర భారత దేశానికి తొలి పతకం. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో కషాబా దాదాసాహెబ్ జాదవ్ పురుషుల ఫ్రీస్టయిల్ బాంటమ్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సంపాదించాడు. ఇండివిజువల్ ఈవెంట్‌లో అదే మనకు మొదటి పతకం. తర్వాత 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ కాంస్య పతకాన్ని అందించగలిగాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరికి కాంస్య పతకం లభిస్తే, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ పురుషుల డబుల్ ట్రాప్‌లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వ్యక్తిగత ఈవెంట్స్‌లో మనకు అదే మొదటి రజత పతకం. 2008 బీజింగ్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, బాక్సింగ్‌లో విజేందర్ సింగ్ కాంస్య పతకాలను అందిస్తే, 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. సూక్ష్మంగా చెప్పాలంటే, ఒలింపిక్స్‌లో భారత్ పాల్గొంటున్న నాటి నుంచి లెక్కవేస్తే, మన దేశం ఇండివిజువల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం కోసం 108 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. బింద్రా స్వర్ణ పతకాన్ని అందించాడన్న ఆనందంకంటే, జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న మనం ఒలింపిక్ పతకాల కోసం మొహం వాచిపోవడం అంతులేని బాధనే మిగిలిస్తున్నది. లండన్ ఒలింపిక్స్‌లో మనకు ఒక్క స్వర్ణ పతకం కూడా దక్కలేదు. రియోలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది.
చేజారిన పతకాలు...
ఒలింపిక్స్‌లో మన దేశానికి చెందిన ఏడుగురు అథ్లెట్లతోపాటు, 400 మీటర్ల రిలే జట్టు కూడా తృటిలో పతకాలను చేజార్చుకోవడం దురదృష్టకరం. 1948 ఒలింపిక్స్ పురుషుల ట్రిపుల్ జంప్‌లో హెన్రీ రెబెల్లో కాంస్య పతకాన్ని అందుకునే అవకాశాన్ని కొద్దిలో కోల్పోయి, నాలుగో స్థానంతో సంతృప్తి చెందాడు. 1960 రోమ్ ఒలింపిక్స్ పురుషుల 400 మీటర్ల పరుగులో ‘్ఫ్లయింగ్ సిఖ్’ మిల్కా సింగ్ కాంస్య పతకాన్ని చేతులారా కోల్పోయాడు. తన పోటీదారులు ఎంత దూరంలో ఉన్నారోనన్న ఉత్కంఠను అణచుకోలేక వెనక్కు చూస్తూ పరిగెత్తడంతో కనీసం రజత పతకాన్ని సాధించే సత్తావున్న అతను నాలుగో స్థానానికే పరిమితమయ్యాడు. 1964 ఒలింపిక్స్ పురుషుల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఫైనల్స్ వరకూ చక్కటి ప్రతిభ కనబరచిన గురుచరణ్ సింగ్ రణ్‌దావా ఐదో స్థానానికి పడిపోయాడు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోలేకపోవడమే అతని వైఫల్యానికి ప్రధాన కారణం. 1976 ఒలింపిక్స్ పురుషుల 800 మీటర్ల విభాగంలో శ్రీరాం సింగ్ ఏడో స్థానంలో నిలిచాడు. అతను కూడా కనీసం కాంస్య పతకం సాధించే సత్తావున్న రన్నరే. కానీ, మితిమీరిన టెన్షన్ అతనిని పతకాలకు దూరంగా నెట్టేసింది. ఇక 1984 ఒలింపిక్స్‌లో ‘పరుగుల రాణి’ పిటి ఉష దురదృష్టవశాత్తు కాంస్య పతకాన్ని కోల్పోయింది. మహిళల 400 మీటర్ల పరుగులో ఆమె కేవలం సెకనులో వందో వంతు వెనగ్గా లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ చరిత్రలోనే ఇంత స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోవడం అంతకు ముందు ఎన్నడూ జరగలేదు. కాగా, రిలే విభాగంలో ఎండి వల్సమ్మ, వందనారావు, షైనీ అబ్రహంతో కలిసి రిలే ఈవెంట్‌లో పాల్గొన్న ఉష కడవరకూ తీవ్రంగా పోరాడింది. కానీ, మిగతా అథ్లెట్లు అదే స్థాయిలో రాణించలేకపోవడంతో 7వ స్థానానికి పరిమితమైంది. రియో ఒలింపిక్స్‌లో యువ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తీవ్ర స్థాయిలో పోటీపడినప్పటికీ, స్వల్ప తేడాతో కాంస్య పతకాన్ని కోల్పోయి, నాలుగో స్థానంతో సంతృప్తి చెందింది.
అట్టహాసంగా రియోకు..
రిక్త హస్తాలతో ఇంటికి..
భారత బృందం అట్టహాసంగా రియో డి జెనీరోకు బయలుదేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 118 మంది రియో వెళ్లారు. ఒలింపిక్స్‌కు ముందే డోపింగ్ సమస్య భారత క్రీడా రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. బీజింగ్‌లో కాంస్యం, లండన్‌లో రజత పతకాలను గెల్చుకున్న సుశీల్ కుమార్‌ను పక్కకునెట్టేసి, రియోలో పోటీపడే అవకాశాన్ని చేజిక్కించుకున్న నర్సింగ్ పంచమ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలం కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కోర్టుకెక్కి, భారత జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) అనుమతి పొంది నర్సింగ్ రియోకు వెళ్లాడు. కానీ, భారత డోపింగ్ నిరోధక విభాగం (నాడా) అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. నర్సింగ్ కేసును విచారించిన తర్వాత కోర్టు అతనిపై నాలుగేళ్ల సస్పెన్షన్ వేటు విధించింది. ఫలితంగా రియోలో అతను పోటీ అవకాశాన్ని కోల్పోయాడు. మొత్తం మీద భారత ఒలింపిక్స్ చరిత్రలోనే మొదటిసారి వందకుపైగా అథ్లెట్లు పోటీలో దిగడంతో, అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కనీసం పాతిక పతకాలు లభిస్తాయని వివిధ క్రీడా సంఘాల అధికారులు జోస్యం చెప్పారు. ఎనిమిదికి తక్కువ కాకుండా పతకాలు దక్కుతాయని వివిధ సర్వే నివేదికలు స్పష్టం చేశాయి. షూటింగ్, బాడ్మింటన్, టెన్నిస్ విభాగాల్లో పతకాల పంట పండుతుందని అంతా ఆశించారు. హాకీలో పతకం లభించే అవకాశం ఉందని క్రీడా పండితులు అంచనా వేశారు. మిగతా విభాగాల్లో ఒకటో రెండో పతకాలు దక్కకపోతాయా అనుకున్నారు. కానీ, ఒకదాని తర్వాత మరొకటిగా ఒక్కో విభాగంలోనూ చేదు అనుభవమే ఎదురైంది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అవసరమైన కనీస అర్హతను మాత్రమే అందుకోగలిగిన చాలా మంది క్రీడాకారులు అసలు సిసలైన పోటీలో నిలవలేక చేతులెత్తేశారు. జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్ ఎంతో శ్రమించినా నాలుగో స్థానానికి పరిమితమైంది. సాక్షి మాలిక్ రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని అందుకొని, భారత్ పతకాల ఖాతాను తెరిస్తే, బాడ్మింటన్ స్టార్ పివి సింధు రజత పతకాన్ని చేర్చింది. భారీ అంచనాలతో రియోకు వెళ్లిన భారత బృందం ఇంత దారుణంగా విఫలం కావడం భారత క్రీడా రంగం పతనావస్థకు అద్దం పడుతున్నది.

ఇండివిడ్యువల్ ఈవెంట్‌లో దేశానికి
రజత పతకాన్ని సాధించిపెట్టిన
తొలి మహిళ పివి సింధు

రియోలో భారత్‌కు
తొలి పతకాన్ని అందించిన
జిమ్నాస్ట్ సాక్షి మాలిక్

- ఎస్‌ఎంఎస్