ఆటాపోటీ

రియో నేర్పిన పాఠాలెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్‌లో దారుణ వైఫల్యం భారత క్రీడా రంగం పతనావస్థకు అద్దం పట్టింది. సరికొత్త పాఠాలను నేర్పింది. రెండు పతకాలకే నానా హడావుడి చేయాల్సిన దుస్థితిని కల్పించింది. మరో నాలుగేళ్లలో జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం ఇప్పటి నుంచే సరైన దిశగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు అంధకారమేనని, అక్కడా పరాభవం తప్పదని రియో అనుభవం స్పష్టం చేస్తున్నది. జాతీయ క్రీడా విధానాన్ని ప్రకటించి, క్రీడా సంఘాలు, సమాఖ్యలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి, కింది స్థాయి నుంచి అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది. మూకుమ్మడి పరాజయాలు మోగించిన ప్రమాద ఘంటికలను కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు వినకపోతే, ఎన్ని దశాబ్దాలు, శతాబ్దాలు గడిచినా దేశ క్రీడా రంగం పరిస్థితి ఏమాత్రం బాగుపడదు. వౌలిక సదుపాయాలను మెరుగుపచకుండా, కింది స్థాయి నుంచి సామర్థ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించకుండా నిర్వహించుకునే జాతీయ క్రీడా దినోత్సవాల వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఇది వాస్తవం.
***
వైఫల్యాలకు సిగ్గుపడడం జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలకు లేదు. నైతిక బాధ్యత తీసుకోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వాలకు రాదు. పరాజయాలను, పరాభవాలను కప్పిపుచ్చుకోవడానికి, విమర్శల వెల్లువ నుంచి బయటపడడానికి ఎదో ఒక చిన్న ఆధారాన్ని వెతుక్కొని హంగామా చేయడం వీటికి వెన్నతోపెట్టిన విద్య. రెండు పతకాలకే ఇంత హడావుడి చేస్తే, 121 పతకాలు సాధించిన అమెరికాలో ఏ స్థాయి ఉత్సవం జరగాలి? ఐదు స్వర్ణాలు, ఒక కాంస్యాన్ని గెల్చుకున్న స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్‌ను ఏ విధంగా సత్కరించాలి? ఏ స్థాయిలో నజరానాలు సమర్పించాలి? మన ఉత్సవాలను, కోట్లకు కోట్లు కుమ్మరించడాన్ని బట్టి చూస్తే ఫెల్ప్స్‌కు మొత్తం అమెరికానే రాసిచ్చినా తక్కువేమో! అతను ఒక్కడు సాధించిన పతకాలు 28. వీటిలో 23 స్వర్ణాలే. ఒలింపిక్స్‌లో సుమారు ఒక దశాబ్దకాలంగా బరిలోకి దిగుతున్నా భారత్‌కు లభించిన పతకాలు 28. వీటిలో స్వర్ణాలు కేవలం తొమ్మిదే. వాటిలో ఎనిమిది హాకీలో వచ్చినవే. ఒకే ఒక స్వర్ణాన్ని బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా గెల్చుకున్నాడు. పతకాల్లో యావత్ భారత దేశం మొత్తం కలిసినా ఫెల్ప్స్ స్థాయిని చేరుకోలేదు. ఇంతకంటే అవమానం ఏమైనా ఉంటుందా? క్రీడలను పట్టించుకోని ప్రభుత్వాలకు జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించే హక్కు ఉందా? పతకాలు సాధించిన వారికి కోట్లకు కోట్లు కుమ్మరించడం కాదు.. ఆ మాత్రం మొత్తాన్ని వౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేస్తే ఉత్తమ ఫలితాలను సాధించలేమా? అంతర్జాతీయ ప్రమాణాలను మన క్రీడాకారులు అందుకోలేరా? క్రీడా సంఘాలు, సమాఖ్యలు, ప్రభుత్వాలే ఆలోచించాలి. వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయకుండా, క్రీడాభివృద్ధికి చిత్తశుద్ధితో బాటలు వేయాలి.
**
1905 ఆగస్టు 29న అలహాబాద్‌లో జన్మించిన ధ్యాన్ చంద్‌ను ప్రపంచ హాకీ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా పేర్కొంటారు. 1921 నుంచి 1956 వరకు భారత సైన్యానికి, 1926 నుంచి 1948 వరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ధ్యాన్ చంద్ 1928, 1932, 1936 సంవత్సరాల్లో భారత్‌ను ఒలింపిక్ విజేతగా నిలబెట్టాడు. 1936లో అప్పటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సమక్షంలోనే ఎలాంటి తడబాటు లేకుండా ధ్యాన్ చంద్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. హిట్లర్ ప్రశంసలు అందుకున్నాడు. ఫైనల్‌లో జర్మనీపై భారత్ 8-1 తేడాతో విజయభేరి మోగిస్తే, అందులో ఆరు గోల్స్ అతను చేసినవే కావడం విశేషం. దేశ భక్తికి, అసాధారణ ప్రతిభా పాటవాలకు మారుపేరైన ధ్యాన్ చంద్ పేరిట 1951లో జాతీయ స్థాయి టోర్నీని ప్రవేశపెట్టారు. 1956లో అతను ఆర్మీ నుంచి రిటైర్‌కాగా, అదే ఏడాది ప్రభుత్వం అతనిని పద్మభూషణ్ అవ్డాతో సత్కరించింది. అనంతరం వౌంట్ అబూ, రాజస్థాన్‌లలో నిర్వహించిన కోచింగ్ క్యాంప్స్‌లో ధ్యాన్ చంద్ శిక్షణ ఇచ్చాడు. పటియాలాలోని జాతీయ క్రీడా సంస్థ (ఎన్‌ఐఎస్)లో చీఫ్ హాకీ కోచ్‌గా ఏడు సంవత్సరాలు పని చేశాడు. జీవిత చరమాంకంలో అతను తన స్వస్థలమైన ఝాన్సీలోనే ఉన్నాడు. 1979 డిసెంబర్ 3న న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భారత హాకీని అత్యున్నత శిఖరాలపై నిలబెట్టిన ధ్యాన్ చంద్ మృతితో క్రీడా ప్రపంచం ఒక అసాధారణ ఆటగాడిని కోల్పోయింది. సమకాలీనుల్లోనేగాక, హాకీ చరిత్రలోనే అతనితో పోలిస్తే వందో వంతు ప్రతిభావంతుడు కూడా ఇప్పటి వరకూ రాలేదు.

ధ్యాన్ చంద్ ఎవరో.. ఆయన సాధించిన అసాధారణ విజయాలు ఏమిటో తెలియకుండానే ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించడాన్ని మించిన ఆత్మవంచన మరొకటి లేదు. హాకీ మాంత్రికుడిగా ప్రపంచ దేశాల మన్ననలు అందుకున్న ధ్యాన్ చంద్ పేరుతో ఒక స్టేడియం నిర్మించి, ఒక అవార్డును ప్రకటించడం మాత్రమే ఆయన సేవలకు గుర్తింపు కాదు. ధ్యాన్ చంద్ జయంతిని క్రీడా దినోత్సవంగా ప్రకటించడం ఒక్కటే ఆయనను స్మరించుకోవడం అనిపించుకోదు. క్రీడా లోకంలో త్రివర్ణ పతకాన్ని ఆయన ఏవిధంగా రెపరెపలాడించాడో, అదే స్థాయిలో అంతర్జాతీయ వేదికలపై అద్భుత విజయాలు సాధించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి. ధ్యాన్ చంద్ స్ఫూర్తిని మరచిపోయి, ఆయన చూపిన మార్గాన్ని విస్మరించి, నామమాత్రంగా చేసే జాతీయ క్రీడా దినోత్సవాలకు ఎలాంటి విలువ లేదు.

హాకీ అసలు జాతీయ క్రీడ అవునోకాదో తెలియదు. హాకీలో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశనం చేసిన ధ్యాన్ చంద్‌ను ఎప్పుడో మరచిపోయాం. ఆయన జయంతి ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంటూ అట్టహాసంగా కార్యక్రమాలను నిర్వహించడం, ఆతర్వాత పట్టించుకోకపోవడం ఆనవాయితీగా మారింది. రియో ఒలింపిక్స్‌లో కేవలం రెండు పతకాలతో సంతృప్తి చెందడం, ఏదో ఘనతను సాధించినట్టు ఆర్భాటాలు చేయడాన్ని మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు. రియోకు 118 మందితో కూడిన బృందం వెళితే నలుగురంటే నలుగురు శక్తి వంచన లేకుండా పోరాడారు. మిగతా వారంతా విహార యాత్రను పూర్తి చేసుకొని తిరిగి వచ్చేశారు. బాడ్మింటన్‌లో పివి సింధు రజతాన్ని, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్యాన్ని అందుకుంటే, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్ అథ్లెట్ లలితా బాబర్ పతకాలు సాధించలేకపోయినా శక్తికి మించి శ్రమించారు. అంతే.. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్‌లో భారత్ చూపిన ‘అసాధారణ’ ప్రతిభ ఇది!

( చిత్రం) ధ్యాన్ చంద్

- శైనీ