ఆటాపోటీ

గెలిస్తేనే గుర్తింపా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో క్రీడాకారులు ఎవరైనా రాణిస్తేనే గుర్తింపు లభిస్తుందా? మేజర్ టోర్నీలకు వెళ్లే ముందు ఏమాత్రం పట్టించుకోకపోయినా, పతకాలు సాధిస్తే బ్రహ్మరథం పట్టి, ఆకాశానికి ఎత్తేస్తారా? క్రీడాభివృద్ధిపై చిత్తశుద్ధి కంటే, ఏదో ఒక హడావుడి చేసి, బాధ్యత తీరిపోయినట్టు ప్రభుత్వాలు, జాతీయ క్రీడా సమాఖ్యలు, సంఘాలు భావిస్తున్నాయా? చాలాకాలంగా క్రీడల్లో కొనసాగుతున్న తంతును చూస్తుంటే, ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెప్పక తప్పదు. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సరైనా ఆదరణ లేనికారణంగా చాలా కష్టాలే పడింది. అందుకే ఆమె కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత బిశే్వశ్వర్ నంది అధికారులు తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. పతకాలు సాధించిన తర్వాత కోట్లకు కోట్లు కుమ్మరించడం కంటే, మేజర్ టోర్నీలకు వెళ్లే ముందే క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం ఇవ్వడం మంచిదని భారత హాకీ మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ చేసిన వ్యాఖ్యలపై నంది స్పందిస్తూ, ‘ఇది భారత దేశం. ఇక్కడ ఎవరికీ ముందస్తు ప్రోత్సాహం దొరకదు. సౌకర్యాలు లభించవు. కోట్లకు కోట్ల డబ్బు, సన్నానాలు, సత్కారాలు లభించాలంటే అంతర్జాతీయ వేదికలపై ఏదో ఒకటి సాధించాలి. రాణించకపోతే గుర్తింపు ఉండదు’ అన్నాడు. కొడిగట్టిన దీపంలా మారిన భారత క్రీడా రంగం పరిస్థితిని గమనిస్తే నంది మాటలు అక్షర సత్యాలని అంగీకరించాలి.
క్రీడా రంగం.. కొడిగట్టిన దీపం!
భారత క్రీడా రంగం పరిస్థితి గాలిలో దీపంలా మారింది. జాతీయ క్రీడా సమాఖ్యలు, సంఘాల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. ఎవరు ఎవరికి జవాబుదారీ వహించాలో తెలియని దుస్థితి. క్రికెట్‌ను భుజానికెత్తుకొని మోస్తున్న వీరాభిమానులకు మిగతా క్రీడల గురించి తెలిసింది తక్కువే. బడ్జెట్ కేటాయింపులు ఎక్కడికి వెళతాయో, ఏమవుతాయో తెలియదుగానీ, ఏ క్రీడకూ సరైన సౌకర్యాలు లేవు. ఎవరైనా తమంతట తాముగా కష్టపడి, ఉన్నత ప్రమాణాలను అందుకొని, అంతర్జాతీయ వేదికలపై రాణిస్తేగానీ ఎవరినీ పట్టించుకోని దౌర్భాగ్య పరిస్థితి. క్రీడలు అంటే కాలక్షేపంగా భావించేవారు కొందరైతే, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఉపయోగపడే మార్గమని అనుకునేవాళ్లు మరి కొందరు. నిజంగానే క్రీడలపై ఆసక్తి ఉన్న వారికి ప్రోత్సాహం ఉండదు. కనీస సదుపాయాలు కూడా లభించవు. నానా తంటాలుపడి, నిరంతర శ్రమతో ఎదిగినా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అందుకోవడం వారికి అసాధ్యం. అందుకే, మేజర్ టోర్నీల్లో మన క్రీడాకారులు దారుణం పరాభవాలను మూటగట్టుకుంటున్నారు. వెళ్లిన ప్రతి చోటా వైఫల్యాలను ఎదుర్కోవడం ఆనవాయితీగా మారింది. ఒకటో అరో పతకాలు, టైటిళ్లు లభిస్తే యావత్ క్రీడారంగాన్ని మనమే శాసిస్తున్నామనే స్థాయిలో హడావుడి చేయడం, సంబరాలు జరుపుకోవడం మన అల్ప సంతోషానికి నిలువెత్తు నిదర్శనం. ఫిజీ, ఫిన్లాండ్, కెన్యా, ఇథియోపియా వంటి చిన్నచిన్న దేశాలు కూడా పతకాలను కొల్లగొడుతుంటే, ప్రేక్షకపాత్ర పోషించడం మనవంతైంది. సాధించిన ఒకటి రెండు పతకాలకే పొంగిపోయి, నానా హడావుడి చేయడం ద్వారా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ), కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, వివిధ రాష్ట్రాల క్రీడా విభాగాలు, జాతీయ క్రీడా సమాఖ్యలు, సంఘాలు సమర్థంగానే నిర్వహించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మీడియా సైతం వేలం వెర్రిగా విజయాలను భూతద్దంలో చూపుతూ, అదే పనిగా ఊదరగొట్టడంతో విమర్శల నుంచి అన్ని క్రీడా సమాఖ్యలు బాగానే తప్పించుకోగలిగాయి. భారత క్రీడా రంగం వైఫల్యాలకు చిరునామాగా మారినప్పటికీ ఎవరికీ పట్టడం లేదు. బాగు చేయాలన్న తపన ఎవరిలోనూ కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే, బాగుపడుతుందన్న నమ్మకమూ లేదు.
కారణాలెన్నో!
రియో ఒలింపిక్స్‌లో భారత బృందం దారుణ వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఎన్నో కారణాలున్నాయని కేంద్రానికి సమర్పించనున్న నివేదికలో క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పేర్కొంది. రియోలో 117 మంది పోటీపడినప్పటికీ, కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కిన విషయం తెలిసిందే. మహిళల బాడ్మింటన్‌లో పివి సింధు రజత పతకాన్ని, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని అందుకోగా, మిగతా వారంతా నిరాశ పరిచారు. ఈ వైఫల్యాలపై వివరణనిస్తూ, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు చేయాల్సిందిగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అటు అథ్లెట్లను, ఇటు జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలను కోరింది. కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ అందరికీ పేరుపేరున లేఖలు రాసి, వివరాలు సమర్పించాలని కోరారు. దీనిపై సాయ్ స్పందించింది. ఫిట్నెస్ సమస్య భారత్ వైఫల్యాలకు ప్రధాన కారణమని సాయ్ తన నివేదికలో పేర్కొంది.
సైనా నెహ్వాల్ మోకాలి గాయంతోనే రియో వెళ్లిందని, అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆమెకు శస్త్ర చికిత్స జరిగిందని సాయ్ గుర్తుచేసింది. వైఫల్యాలకు ఫిట్నెస్ సమస్య ఒక కారణమైతే, చాలా మంది అథ్లెట్లు పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోవడం మరో కారణమని పేర్కొన్నది. షూటర్ అభినవ్ బింద్రా, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పతకాలను తృటిలో కోల్పోయారని తెలిపింది. అదే విధంగా రెజ్లర్ వినేష్ ఫొగట్ గాయపడడంతో ఒక పతకం చేజారిందని తెలింది. కోచ్‌లు, ప్రత్యేకించి విదేశీ కోచ్‌ల సేవలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించింది. చాలా క్రీడలకు మన దేశంలో ఆదరణ లేకపోవడాన్ని కూడా సాయ్ ప్రస్తావించింది. స్విమ్మింగ్, ట్రయథ్లాన్, ఫెన్సింగ్, జూడో, తైక్వాండో వంటి ఈవెంట్స్‌లో మన దేశం తరఫున పోటీ నామమాత్రమేనని వ్యాఖ్యానించింది. రికార్డు స్థాయిలో వందకుపైగా అథ్లెట్లు ఒలింపిక్స్‌కు అర్హత దక్కించుకోవడాన్ని చూస్తే పరిస్థితి ఆశాజనకంగానే ఉందని పేర్కొంది. అయితే, పతకాలు సాధించే స్థాయి ప్రమాణాలను అందుకోవాలంటే మరింత ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడింది.
సమస్యలు తెలియవా?
రియో ఒలింపిక్స్‌లో మన దేశం నుంచి 117 మంది పోటీపడినా, కేవలం రెండు పతకాలతోనే సరిపుచ్చుకోవాల్సి రావడంతో సర్వత్రా నిరసలను వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కూడా భారత బృందం తీరుపై అసంతృప్తితో ఉంది. అందుకే, రియో ఒలింపిక్స్‌లో వైఫల్యాలపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విచారణను చేపట్టింది. పరాజయాలు, పరాభవాల పర్వం పూర్తయిన తర్వాత ఇప్పుడు హడావుడి చేయడం వల్ల సర్కారు ఏం ఆశిస్తున్నదో అర్థం కాదు. విమర్శల నుంచి తప్పించుకోవడానికి, క్రీడా రంగాన్ని తాము మాత్రమే ఉద్ధరిస్తున్నామని ప్రకటించుకోవడానికి తప్ప ఈ విచారణ వల్ల ఫలితం ఉండదన్నది అందరికీ తెలిసిన నిజం. రజతాన్ని సాధించిన సింధు, కాంస్యాన్ని అందుకున్న సాక్షి తప్ప మిగతావారంతా మూకుమ్మడిగా విఫలంకావడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న ప్రభుత్వానికి క్రీడా రంగంలో నెలకొన్న సమస్యలు నిజంగానే తెలియవా? ఈ వైఫల్యాలకు కారణాలు కనిపించడం లేదా? గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బృందాన్ని పంపినప్పటికీ కేవలం రెండు పతకాలకే పరిమితం కావాల్సి రావడంపై పెల్లుబుకుతున్న నిరసనలకు అడ్డుకట్ట వేయడానికే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ హడావుడి చేస్తున్నదన్న విమర్శలు లేకపోలేదు. భారత బృందం వైఫల్యాలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం 2020 టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఒక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన తర్వాతే క్రీడా మంత్రిత్వ శాఖలో కదలిక వచ్చింది. క్రీడా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి మార్గాలను చూపడం ఈ టాస్క్ఫోర్స్ బాధ్యత. అంతేగాక, మరో నాలుగేళ్లలో జరిగే ఒలింపిక్స్‌లో ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, ఎక్కువ సంఖ్యలో పతకాలను కొల్లగొట్టడాని తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించాలి. ప్రధాని ప్రకటన వెలువడిన తర్వాత క్రీడా మంత్రిత్వ శాఖ హడావుడిగా చర్యలకు ఉపక్రమించింది. రియో వైఫల్యాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. రియోకు వెళ్లిన బృందంలోని ప్రతి ఒక్కరికీ లేఖలు రాసింది. వైఫల్యాలకు కారణాలను వివరించాలని కోరింది. క్రీడా రంగాన్ని మెరుగుపరచడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. ఇంతకీ లేఖలు అందుకున్న వారు ఇచ్చే వివరణలు ఏమిటో? వారు చేయబోయే సూచనలు ఏవో ప్రభుత్వానికి తెలియవా? క్రీడా రంగం ఎదుర్కొంటున్న దుస్థితిని కూడా చూడలేనంతగా గాఢ నిద్రలో ఉందా? ఈ ప్రశ్నలకు సర్కారే సమాధానం చెప్పాలి.
ప్రభుత్వానికి, జాతీయ క్రీడా సమాఖ్యలు, సంఘాలకు చిత్తశుద్ధి ఉంటే, క్రీడాకారుల ప్రతిభాపాటవాలను పెంచడానికి, అత్యుత్తమ ప్రమాణాలను అందుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అందుకుగాను స్పష్టమైన వ్యూహరచన చేయాలి. రియో ఒలింపిక్స్ వైఫల్యాలే భారత క్రీడా రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దం పడుతున్నాయి. పరాజయాలకు గల కారణాలను తెసుకొని, వాటిని సరిద్దాలి. భవిష్యత్తులో అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేయాలి. వాటిని పకడ్బందిగా అమలు చేయాలి. రాబోయే కాలంలో అడ్డంకులను ఏ విధంగా అధిగమించాలన్న విషయంపై స్పష్టమైన విధానాలను అనుసరించాలి.
వివిధ స్థాయిలో, వివిధ హోదాల్లో ఉన్న వారి బాధ్యతలు ఏమిటి? వాటిని ఎంత వరకూ సమర్థంగా నిర్వహిస్తున్నారు? ఎక్కడైనా పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయా? ఒకవేళ సమస్యలు ఉంటే వాటిని సరిదిద్దే మార్గాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కోవాలి. క్రీడాభివృద్ధికి సమగ్ర విధానాన్ని అనుసరించకపోతే, అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పదేపదే పరాభవాలు తప్పవు.

జవాబుదారీ ఎవరు?
ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా దారుణంగా విఫలమైతే ఎవరో ఒకరికి సమాధానం చెప్పుకోవాలనే భయం వెంటాడుతుంటుంది. అందుకే, సాధ్యమైనంత వరకూ జాగ్రత్తగా ఉంటారు. తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తారు. కానీ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి మొదలు పెడితే భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) వరకూ ఎవరూ పరాజయాలకు జవాబుదారీ వహించరు. ఎవరిపైనా వేటు పడదు. ప్రభుత్వాల నుంచి సహాయసహకారాలు తీసుకోవడం, బడ్జెట్‌లో కేటాయింపులను క్రమం తప్పకుండా ఖాతాల్లోకి వేసుకోవడం మినహాయస్తే అధికారులు ఎవరూ జవాబుదారీకి ముందుకు రావడం లేదు.

- శ్రీహరి