ఆటాపోటీ

విండీస్ క్రికెట్ కొడిగట్టిన దీపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్టిండీస్ అంటే ఒకప్పటి సూపర్ ఫాస్ట్ బౌలర్లు గుర్తుకొస్తారు. బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సృష్టించే బ్యాట్స్‌మెన్ గుర్తుకొస్తారు. కానీ, అదంతా గత వైభవమే. నేడు అది కొడిగట్టిన దీపం. బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించే చార్లెస్ గ్రిఫిత్‌లు, మైఖేల్ హోల్డింగ్‌లు, జోల్ గార్నర్లు, మాల్కం మార్షల్‌లు, ఆండీ రాబర్ట్స్‌లు, కొట్నీ వాల్ష్‌లు ఇప్పుడు జట్టులో లేరు. బౌలర్ల భరతం పట్టే రోహన్ కన్హాయ్‌లు, అల్విన్ కాళీచరణ్‌లు, క్లైవ్ లాయిడ్‌లు, వివియన్ రిచర్డ్స్‌లు, గార్డెన్ గ్రీనిడ్జ్‌లు, డెస్మండ్ హేన్స్‌లు, బ్రియాన్ లారాలు ఎంతగా గాలించినా కనిపించరు. గారీ సోబర్స్, రోజర్ హార్పర్, లారీ గోమ్స్ స్థాయి ఆల్‌రౌండర్లు అసలే లేరు. మహమ్మద్ అజరుద్దీన్, జాంటీ రోడ్స్, ఎబి డివిలియర్స్ వంటి ఎంతో మంది ప్రపంచ మేటి ఫీల్డర్లకు పాఠాలు నేర్పించిన గల్ లోగీ ప్రమాణాలు ఇటీవల కాలంలో విండీస్ ఆటగాళ్లు ఎవరిలోనూ లేవు. మెరుగైన సౌకర్యాలు, పారితోషికం పెంపుదల వంటి అంశాలపై క్రికెటర్లు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. 1980 దశకం చివరి నుంచి విండీస్ పతనం ఆరంభమైంది. క్రమంగా స్థాయి పడిపోతూ, ఇప్పుడు నామమాత్రపు జట్టుగా మిగిలిపోయింది. ఈ వాస్తవాలను గ్రహించకుండా, దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా, చీఫ్ కోచ్ ఫిల్ సిమన్స్‌కు ఉద్వాసన పలకడం ద్వారా డబ్ల్యుఐసిబి ఏం సాధించదలచుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. సిమ కోచ్ పదవి నుంచి సిమన్స్‌ను తొలగిస్తున్నామని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని హడావుడిగా ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో ఎవరికీ తెలియదు. అతని స్థానంలో జోల్ గార్నర్‌ను చీఫ్ కోచ్‌గా ఎంపిక చేసి, ఏదో ఘన కార్యాన్ని సాధించినట్టు డబ్ల్యుఐసిబి పొంగిపోతున్నది. సిమన్స్ మార్గదర్శకంలోనే విండీస్ ఆట తీరు కొంతైనా మెరుగుపడింది. 2015లో చీఫ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సిమన్స్ కృషితోనే విండీస్ అదే ఏడాది టి-20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఉన్న మేటి జట్లకు గట్టిపోటీనిచ్చే స్థాయికి చేరుకుంటున్నది. అంతర్గత విభేదాలు, డబ్ల్యుఐసిబి అధికారులతో యుద్ధ వాతావరణం లేకపోతే విండీస్ పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది. జట్టును గాడిలో పెట్టడానికి ప్రయత్నించిన సిమన్స్‌పై వేటుతో డబ్ల్యుఐసిబి ప్రతిష్ఠ కొడిగట్టింది. సమర్థుడిగా పేరుతెచ్చుకున్న ఈ మాజీ ఓపెనర్ సిమన్స్ మొదటి నుంచి డబ్ల్యుఐసిబి వ్యవహార శైలిని నిలదీశాడు. అధికారుల తీరును ఎండగట్టాడు. ఆటగాళ్ల పక్షాన నిలబడి, వారి హక్కులను సంరక్షించాలని గళమెత్తాడు. జట్టులో క్రమశిక్షణా రాహిత్యాన్ని అతను ఏమాత్రం సహించలేదు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే ఎంతటి వారినైనా మందలించడం, తప్పని పరిస్థితుల్లో బెంచ్‌కే పరిమితం చేయడం సిమన్స్ నైజం. అతను ఎవరికీ భయపడలేదు. తన బాధ్యతలేమిటో అతనికి బాగా తెలుసు. వాటిని నిర్వర్తించే క్రమంలో డబ్ల్యుఐసిబి అధికారులతో అనేక సందర్భాల్లో విభేదించాడు. నిరుడు శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టు కూర్పుపై సిమన్స్ బహిరంగంగానే ధ్వజమెత్తడం డబ్ల్యుఐసిబికి మింగుడు పడలేదు. సమర్థులను పక్కకుపెట్టి, అసమర్థులను అందలం ఎక్కించారంటూ సెలక్షన్ కమిటీపై సిమన్స్ మండిపడడాన్ని బోర్డు అధికారులు నిర్లక్ష్యంగానూ, అహంభావంగానూ భావించారు. తమ అస్తిత్వానికే ఎసరు పెడతాడేమోనని భయపడ్డారు. అందుకే, అతనికి ఉద్వాసన పలికారు. అంతర్గత పాలనా వ్యవహారాల్లో, జట్టు ఎంపికలో జోక్యం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ డబ్ల్యుఐసిబి అతనిపై వేటు వేసింది. అయితే, ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వెస్టిండీస్ ఒక దేశానికి పరిమితమైనది కాదు. తొమ్మిది కీలక సభ్య దేశాల సమ్మేళనం. ఒకప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే డబ్ల్యుఐసిబిలో ఇప్పుడు రాజకీయాలు, ఆధిపత్య పోరాటం మొదలయ్యాయ. దాని ఫలితంగానే విండీస్ క్రికెట్‌లో ముసలం పుట్టింది. ఎప్పుడు పుట్టిముంచుతుందోనన్న భయం అభిమానులను వెంటాడుతున్నది.
అసమర్థ బోర్డు
విండీస్ క్రికెట్ వ్యవహారాలను డబ్ల్యుఐసిబి సమర్థంగా నిర్వహించలేకపోతున్నదనేది వాస్తవం. ఆటగాళ్లతో విభేదాలు తీవ్ర స్థాయికి చేరినా, సమస్యను పరిష్కరించే దిశగా సరైన ప్రయత్నాలు చేయలేదు. 2014 అక్టోబర్‌లో భారత్ పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టు షెడ్యూల్ పూర్తికాక ముందే అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిపోయింది. డబ్ల్యుఐసిబితో తలెత్తిన విభేదాలే క్రికెటర్లు ఇలాంటి అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆటగాళ్లలో నమ్మకాన్ని పెంచే దిశగా విండీస్ బోర్డు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. బోర్డు వైఫల్యాలే విండీస్ జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన జట్టు నేడు నిర్వీర్యమైంది. అడుగడుగునా సమస్యలను ఎదుర్కొంటూ, అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్న విండీస్ క్రికెటర్లు ఈమాత్రమైనా ఆడగలుగుతున్నారంటే అది వారి వ్యక్తిగత ప్రతిభే తప్ప డబ్ల్యుఐసిబి తోడ్పాటు, సహకారం ఎంతమాత్రం కాదు. విండీస్ క్రికెట్ గతం ఎంతో ఘనం. భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. డబ్ల్యుఐసిబి వైఖరి మార్చుకోకపోతే, రానున్న రోజుల్లో విండీస్ జట్టు పూర్తిగా పతనమయ్యే ప్రమాదం ఉంది.

చిత్రం.. 1975 వరల్డ్ కప్ ట్రోఫీతో అప్పటి వెస్టిండీస్ కెప్టెన్ క్లయవ్ లాయడ్

- ఎస్‌ఎంఎస్