ఆటాపోటీ

క్రికెట్ విలువలకు ట్యాంపరింగ్ చీడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంతి ఆకారాన్ని మార్చడం క్రికెట్‌లో కొత్త కాకపోయనా, ఇటీవల కాలంలో కొత్త పుంతలు తొక్కుతున్నది. అడ్డదారులు వెతుకుతున్న క్రీడాకారులు సరికొత్త విధానాలను అవలంభిస్తూ, ట్యాంపరింగ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఐసిసి ఈ మహమ్మారిని కూకటి వేళ్లతో సహా పెకల్చడానికి ఏం చేస్తుందో చూడాలి.
**
క్రికెట్‌ను వేధిస్తున్న సవాలక్ష సమస్యల్లోకి బాల్ ట్యాంపరింగ్ కూడా వచ్చి చేరింది. ఇది కొత్తకాక పోవచ్చు. కానీ, ఇటీవల కాలంలో ఈ సంఘటనలు గణనీయంగా పెరుగుతున్నాయి. కెమెరా కన్నుకు దొరకకుండా, అంపైర్లు లేదా బ్యాట్స్‌మెన్ దృష్టికి రాకుండా బంతి ఆకారాన్ని మార్చడానికి, అది స్వతఃసిద్ధమైన స్వభావాన్ని కోల్పోయేలా చేయడానికి ఆటగాళ్లు కొత్తకొత్త విధానాలను అవలంభిస్తున్నారు. షైనింగ్ పేరుతో బంతిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్, భారత సారథి విరాట్ కోహ్లీపై వచ్చిన ఆరోపణలు సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. డు ప్లెసిస్‌పై భారీ జరిమానా విధించిన ఐసిసి సకాలంలో ఫిర్యాదు రాలేదన్న కారణంగా కోహ్లీని విడిచిపెట్టింది. నేరాల తీవ్రత, వాటి స్థాయి, ఐసిసి వేస్తున్న శిక్షలు వంటి అంశాలను పక్కకుపెడితే, ఈ పెడధోరణులు క్రికెట్ పరువు తీస్తున్నాయన్నది వాస్తవం. ఈ సంఘటనలు క్రీడాస్ఫూర్తిని మంటగలుపుతున్నాయి. ఐసిసి సరైన దిశలో ఆలోచించి, నిబంధనలను మారిస్తే ట్యాంపరింగ్‌కు కొంతవరకైనా కళ్లెం వేయవచ్చు. కానీ ఎప్పటికప్పుడు కొత్తకొత్త పోకడలతో ట్యాంపరింగ్ కూడా ఆధునికతను సంతరించుకుంటున్నది. ఒక్కో కొత్త విధానం తెరపైకి వచ్చినప్పుడు ఒక్కో రకంగా నిబంధనావళిని మార్చడం సాధ్యం కాదన్నది నిజం. ఆటగాళ్ల వైఖరిలో మార్పు వస్తే తప్ప క్రికెట్ పరువు తీస్తున్న ఇలాంటి సంఘటనకు తెరపడదు. బాల్ ట్యాంపరింగ్ కోసం గాఢమైన పదార్ధాలను తినడాన్ని కూడా ఆటగాళ్లు అలవాటు చేసుకోవడం దురదృష్టకరం. మిగతా జట్లతో పోలిస్తే, బాల్ ట్యాంపరింగ్‌కు భారత క్రికెటర్లు పాల్పడిన సంఘటనలు చాలా తక్కువ. అయతే, కోహ్లీ పేరు తెరపైకి రావడంతో భారత అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. క్రికెట్ విలువలకు నిలువుపాతర వేసే ట్యాంపరింగ్ రోగం మన ఆటగాళ్లకు కూడా అంటుకుందా అని భయపడుతున్నారు.
**
జయాపజయాలు దైవాధీనాలని అంటారు. గెలిచినా ఓడినా ఒకే రీతిలో స్పందించడమే క్రీడాస్ఫూర్తి. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని, అందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కవచ్చన్న సిద్ధాంతం రాజ్యమేలుతున్నది. మిగతా రంగాలను కుదిపేస్తున్న ఈ జాఢ్యం ఇప్పుడు క్రీడా రంగాన్ని కూడా భ్రష్టుపట్టిస్తున్నది. అక్రమ విధానాల్లో గెలవడానికి చేసే ప్రయత్నాలు ప్రధానమైనది, అత్యంత ప్రమాదకరమైనది బాల్ ట్యాంపరింగ్. ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చేసే ప్రక్రియనే ట్యాంపరింగ్ అంటున్నాం. బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడం లేదా తీవ్రంగా గాయపరచడం దీని ప్రధాన లక్ష్యం. ఇలాంటి అనైతిక, అవాంఛిత ధోరణుల వల్ల ‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్ రూపం మారిపోతున్నది. వేగంగా పతనమవుతున్న విలువల కారణంగా ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్‌లు, స్పాట్ ఫిక్సింగ్‌లు క్రికెట్ పరువును తీసేశాయి. తాజా బాల్ ట్యాంపరింగ్ సంఘటనలు క్రికెట్‌పై అభిమానులకు ఉన్న నమ్మకానికి నిలువుపాతర వేస్తున్నాయి. ఎబి డివిలియర్స్ అందుబాటులో లేనికారణంగా దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఫఫ్ డు ప్లెసిస్, భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్యాంపరింగ్ వివాదాలు ఈ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చాయి. క్రికెట్‌లో జరిగే మోసాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) హెచ్చరిస్తునే ఉంది. అప్పుడప్పుడు కొంత మందిపై చర్యలు తీసుకుంటునే ఉంది. కానీ, క్రికెట్ మూలాల్లోకి వ్యాపిస్తున్న ఈ మహమ్మారిని కూకటివేళ్లతో పెకళించడం అనుకున్నంత సులభం కాదు.
నిబంధనలు బేఖాతరు
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్న సామెతను క్రికెటర్లు నిజం చేస్తున్నారు. స్వయం శక్తిపై నమ్మకం లేనప్పుడు కృత్రిమంగా సృష్టించుకున్న విధానాలతో గట్టెక్కే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. క్రికెట్‌లో అన్యాయాలు, అక్రమాలు, అవాంఛనీయ ధోరణులు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఐసిసి ఎన్నో నిబంధనలను తెచ్చింది. కానీ, అడ్డదారులు తొక్కేవారు విజయవంతంగా వాటికి గండికొడుతున్నారు. నిబంధనలను బేఖతారు చేస్తున్నవారు కొందరైతే, నిబంధనల్లోని లొసుగులను పసిగట్టి, వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వారు మరికొందరు. దారులు ఏవైతేనేం, అందరూ కలసికట్టుగా నిబంధనలను అతిక్రమిస్తునే ఉన్నారు. అతి కొద్దిమంది నిజాయితీపరులు ఉన్నప్పటికీ మోసకారుల మధ్యలో ఉంటున్నందుకు వారికీ విమర్శల తాకిడి తప్పడం లేదు.
స్పష్టతలేని 42.3 నిబంధన
ఐసిసి నిబంధనల్లోని 42.3 అధికరణలో స్పష్టత లేకపోవడం చాలా మంది క్రికెటర్లకు వరంగా మారింది. బంతి మెరుపు తగ్గకుండా ఉండడానికి దానిని దుస్తులపై బలంగా రుద్దడం, లాలాజలాన్ని పూసి మరింత షైనింగ్‌కు ప్రయత్నించడం తప్పుకాదు. అయితే, ‘కృత్రిమ పదార్ధం’ ఏదీ బంతిని షైనింగ్ చేయడానికి ఉపయోగించకూడదని 42.3 అధికరణ స్పష్టం చేస్తున్నది. ఇంతకీ ఏది ‘కృత్రిమ పదార్ధం’ అన్న విషయంపై వివరణ లేదు. క్రికెట్ ఆడుతున్నప్పుడు, ప్రత్యేకించి టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు గంటల తరబడి మైదానంలో నిలబడాలి. ఆ సమయంలో అలసట తెలియకుండా, దాహం వేయకుండా ఉండడానికి కొంత మంది చూయింగ్ గమ్ లేదా మింట్ బిళ్లలను చప్పరిస్తుంటారు. మధ్యమధ్యలో ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు. ఇవన్నీ కృత్రిమ పదార్ధాల కిందకు వస్తాయా? రావా? అన్న అంశంపై ఐసిసి స్పష్టతనివ్వలేదు. డు ప్లెసిస్ కేసులో అతను మింట్ నములుతూ, దానితో కూడిన లాలాజలాన్ని బంతికి రుద్దాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఐసిసి అతని మ్యాచ్ ఫీజు మొత్తాన్ని జరిమానాగా విధించింది. ఎనర్జీ డ్రింక్స్ తాగినా, చూయింగ్ గమ్ నమిలినా, వాటిలోని పదార్థాలు లాలాజలంలో కలవకుండానే ఉంటాయా? ఆ సమయాల్లో బంతిపై లాలాజలాన్ని రుద్ది, షైనింగ్‌కు ప్రయత్నిస్తే లేనితప్పు మింట్ తింటే వచ్చిందా అని డు ప్లెసిస్ వాదిస్తున్నాడు. ఐసిసి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఐసిసి ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. తీగ లాగితే డొంక కదిలిన రీతిలో డు ప్లెసిస్ వివాదం ఐసిసి 42.4 నిబంధనలోని లోపాలను బహిర్గతం చేసింది. ‘కృత్రిమ పదార్ధాలు’ అనే పదానికి సరైన నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. మింట్ తినడమే తప్పయితే, చూయింగ్ గమ్, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, స్నాక్స్ కూడా తప్పే. మైదానంలో ఆటగాళ్లు ఏమీ తినకూడదు. మంచి నీళ్లు తప్ప ఏమీ తాగకూడదు. ఇది సాధ్యమేనా? ఐసిసి ఈ నిబంధనను సవరించి, పటిష్టంగా అమలు చేయగలుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.
కోహ్లీ కేసు..
విరాట్ కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు బ్రిటిష్ మీడియా చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి టెస్ట ఆడుతున్నప్పుడు కోహ్లీ బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించాడని నిరూపించడానికి ఫొటోలను కూడా చూపింది. అయితే, ఐసిసి నిబంధనల ప్రకారం, ఒక మ్యాచ్‌లో ఎవరైనా ట్యాంపరింగ్‌కు పాల్పడితే, ఆ విషయాన్ని ప్రత్యర్థి జట్టు కెప్టెన్ లేదా ఆటగాళ్లు వెంటనే ఫీల్డ్ అంపైర్ల దృష్టికి తీసుకురావాలి. వారు బంతిని పరిశీలించి, ట్యాం పరింగ్ జరిగిందా లేదా అన్నది నిర్ధారిస్తారు. అంతేగాక, టీవీ రీప్లే ద్వారా సమాచారాన్ని తెలుసుకోవాల్సిందిగా థర్డ్ అంపైర్‌ను కోరుతారు. ఈ వివాదం మొత్తం మ్యాచ్ రిఫరీ దృష్టికి వెళుతుంది. ఫీల్డ్ అంపైర్ నుంచి మ్యాచ్ రిఫరీ వరకూ ఎవరైనా సరే ట్యాంపరింగ్ జరిగిందని అనుమానిస్తే, వెంటనే ఆ విషయాన్ని ఐసిసికి తెలియపరుస్తారు. మొత్తం మీద ఫిర్యాదు చేయడానికి నిబంధనల ప్రకారం ఐదు రోజుల గడువు ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఫిర్యాదు అందకపోతే, ఆతర్వాత ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటిని ఐసిసి పరిగణలోకి తీసుకోదు. కోహ్లీ కేసులో, విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన తర్వాత బ్రిటిష్ మీడియా ఆరోపణలు చేసింది. నిర్ణీత సమయంలో ఫిర్యాదు అందలేదుకాబట్టి, విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ఐసిసి స్పష్టం చేసింది. అయితే, ఆలస్యంగా బయటకు వస్తే, నేరం నేరంకాకుండా పోతుందా అన్నది బ్రిటిష్ మీడియా ప్రశ్న. కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం ఆ మ్యాచ్ వీడియోను పరిశీలిస్తున్న సమయంలో తెలిసిందని బ్రిటిష్ పత్రికలు, చానెళ్లు అంటున్నాయి. ఆ సంఘటన ఇంగ్లాండ్ ఆటగాళ్లు లేదా ఫీల్డ్ అంపైర్ల దృష్టికి రాకపోయి ఉండవచ్చని, అందుకే వారు పట్టించుకోలేదని వ్యాఖ్యానిస్తున్నాయి. ఐదు రోజుల్లోపుగా ఫిర్యాదు చేయలేదన్న సాకుతూ కోహ్లీపై విచారణకు ఆదేశించకపోవడం అన్యాయమని మండిపడుతున్నాయి. మొత్తానికి ట్యాంపరింగ్ నిబంధనల్లోని ఈ అంశం కూడా వివాదానికి కారణమైంది. ఐసిసి నింబంధనావళిలో మార్పులు అవసరమన్న డిమాండ్ పెరుగుతున్నది.
ట్యాంపరింగ్ అంటే ఏమిటి?
క్రికెట్ బంతిని ‘గ్లేజ్ బాల్’ అంటారు. గుండ్రని కార్క్‌పై పురికొస లేదా సుత్లీదారాన్ని చాలా గట్టిగా చుడతారు. దానిపైన రెండు భాగాలుగా ఉన్న తోలు దినె్నలను కలిపి కుడతారు. కొత్త బంతి చాలా నునుపుగా ఉంటుంది కాబట్టి వేగంగా కదులుతుంది. కుట్లు (సీమ్) ఉన్న భాగం నేలకు తగిలితే బంతి అదే వేగంతో దిశను మార్చుకుంటుంది. దీనినే స్వింగ్ అంటారు. పాలిష్ పెట్టి, ఎంతో నునుపుగా తయారు చేస్తారు కాబట్టే కొత్త బంతిపై పట్టుబిగించి, స్పిన్ బౌలింగ్ వేయడం సులభ సాధ్యం కాదు. అందుకే, కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు బౌల్ చేస్తారు. పిచ్‌పై పడడం, ఆతర్వాత బ్యాట్స్‌మెన్ బలంగా కొట్టడం వంటి కారణాలతో ఓవర్లు గడుస్తున్న కొద్దీ బంతి పాతపడుతుంది. షైనింగ్‌ను కోల్పోతుంది. మెరుపు తగ్గితే, బంతి వేగం కూడా పడిపోతుందనే ఉద్దేశంతో ఫీల్డర్లు లేదా బౌలర్లు తమ చేతికి బంతి అందిన వెంటనే దానిని దుస్తులకు బలంగా రుద్దుతారు. లాలాజలాన్ని దానిపై పూస్తూ, పాలిష్ చేస్తున్న రీతిలో రుద్దుతూ మెరుపు తగ్గకుండా ప్రయత్నిస్తారు. సహజంగా బంతికి ఒకవైపు మాత్రమే షైనింగ్ ఉండేలా జాగ్రత్త పడతారు. ఆ విధంగా మెరుస్తున్న భాగమే నేలకు తగిలే విధంగా బౌలర్ బంతులను సంధిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే, ఫీల్డర్లంతా బంతికి ఒకవైపు షైనింగ్ తగ్గకుండా తంటాలు పడతారు. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా, క్రమంగా బంతి పాతపడుతుంది. అప్పుడు ఫాస్ట్ బౌలర్లు (సీమర్లు లేదా పేసర్లు) అదే వేగంతో బంతులు వేయలేరు. ఆ సమయంలోనే స్పిన్నర్లు రంగ ప్రవేశం చేస్తారు. బంతి పాతబడడంతో వారికి గ్రిప్ బాగా దొరుకుతుంది. అప్పుడు ఫీల్డర్లు బాగా దెబ్బతిన్న భాగాన్ని విడిచిపెట్టి, రెండో భాగాన్ని పాలిష్ చేస్తారు. పేసర్లు షైనింగ్ ఉన్న భాగం నేలకు తగిలేలా బంతులు వేస్తే, స్పిన్నర్లు అందుకు భిన్నంగా దెబ్బతిన్న భాగం తగిలే విధంగా బౌల్ చేస్తారు. చేతి వేళ్లను లేదా మణికట్టును తిప్పడం ద్వారా బంతిని స్పిన్ చేస్తారు. దెబ్బతిన్న భాగం మొదటిగా నేలకు తగిలితే బంతి అత్యంత వేగంగా దిశను మార్చుకుంటుంది. పొరపాటున షైనింగ్ ఉన్న భాగం నేలకు తగిలితే, బ్యాట్స్‌మన్ షాట్ కొట్టలేని విధంగా బంతి గుడ్ లెంగ్త్‌లో ఫ్లైట్ అవుతుంది. బౌలింగ్ విధానానికి అనుగుణంగా బంతిని మెరిపించడం అనేది అనాదిగా వస్తున్న ప్రక్రియ. ఇదంతా క్రికెట్ నిబంధనలకు లోబడే జరుగుతుంది. కానీ, సహజమైన పద్ధతుల్లో కాకుండా, ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించడానే్న ట్యాంపరింగ్ అంటారు. కొంత మంది మొహానికి లేదా ఒంటికి ముందుగానే వేజ్‌లైన్ లేదా కోల్డ్‌క్రీమ్‌లను రాసుకొని, ఆతర్వాత దానిని బంతికి రద్దుతారు. కొంత మంది నాలుకతో లాలాజాలాన్ని బంతిపై పూస్తున్నట్టు నటిస్తూ పళ్లతో కొరుకుతారు. సీమ్ లేదా బంతిపైన ఉండే రెండు అర్ధ్భాగాలను కలుపుతూ వేసే కుట్లను గోళ్లతో తీసేస్తారు. బంతికి ఒక వైపు భాగాన్ని పీలర్ లేదా సీసాల మూతలు లేదా ఇతరత్రా వస్తువులతో గీరుతూ ధ్వంసం చేస్తారు. బంతి ఆకారాన్ని మార్చడానికి అనుసరించే వివిధ విధానాలు ట్యాంపరింగ్ కిందకు వస్తాయి. అయితే, నోట్లో ఏదైనా ఘాటైన పదార్ధాన్ని లేదా తినుబండారాన్ని నములుతూ, దాని సాయంతో బంతిని ట్యాంపరింగ్ చేయడం ఆటగాళ్లు కొత్తగా అనుసరిస్తున్న విధానం. దీనిని నియంత్రించాలంటే ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చక తప్పదు. ముందుగా 42.3 అధికారణను సవరించాలి. లేకపోతే ట్యాంప రింగ్ కేసులు పెరుగుతునే ఉంటాయ. క్రికెట్ పరువును తీస్తునే ఉంటాయ.

- విశ్వ