ఆటాపోటీ

ఓ శకానికి తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జార్ఖండ్ డైనమెట్’ మహేంద్ర సింగ్ ధోనీ వనే్డ, టి-20 ఫార్మాట్స్ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పడంతో, భారత క్రికెట్‌లో ఓ అద్వితీయ శకానికి తెరపడింది. అదే సమయంలో సరికొత్త అధ్యాయానికి పునాది పడింది. ఇన్నాళ్లూ టెస్టు జట్టు కెప్టెన్‌గా టీమిండియాను దూకుడుగా పరుగులు తీయిస్తున్న విరాట్ కోహ్లీ ఇకపై పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లోనూ నాయకత్వం వహించనుండడమే అందుకు కారణం. టీమిండియాకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించిన వారిలో ముందుగా సౌరవ్ గంగూలీ పేరు చెప్పుకోవాలి. అతని నుంచి ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్‌కు జట్టు పగ్గాలు లభించాయి. సమర్థుడైన బ్యాట్స్‌మన్‌గా భారత్‌ను ఎన్నోసార్లు ఆదుకున్న ద్రవిడ్ కెప్టెన్‌గా విఫలమయ్యాడు. దీనితో ద్రవిడ్‌ను తప్పించిన భారత సెలక్టర్లు అతని స్థానంలో యువ వికెట్‌కీపర్ ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అప్పటి నుంచే టీమిండియా కొత్త రూపాన్ని సంతరించుకుంది. ప్రపంచ మేటి జట్టుగా ఎదిగింది. 2007లో 26 ఏళ్ల ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఒక సంచలనమైంది. ఐసిసి ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించడంతో ద్రవిడ్‌పై విమర్శలు వెల్లువెత్తగా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడంలో ధోనీ ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాడు. అదే ఏడాది టి-20 ప్రపంచ కప్‌ను ఐసిసి ప్రవేశపెట్టింది. ఆ టోర్నీని ధోనీ కెప్టెన్సీలో టీ మిండియా కైవ సం చేసుకుంది.
భారత క్రికె ట్ జట్టును ఉన్నత శిఖరాలను చేర్చిన ఘనత ధోనీదే. మైదానంలో ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా స్థిత ప్రజ్ఞుడిలా ముఖంలో ఒత్తిడి కనిపించనీయడు. అందుకే, ‘కెప్టెన్ కూల్’గా పేరు ప్రఖ్యాతుల సంపాదించాడు. ఒక శకానికి తెరపడిందని అందుకే అంటారు. ధోనీ లేని భారత జట్టును ఊహించడం కష్టం కాకపోవచ్చు. కానీ, అతను బలమైన పునాదులు వేసి కట్టిన టీమిండియా భవనం శిథిలం కాకుండా చూడడానికి, ఆ శిఖరాల నుంచి పడిపోకుండా నిలదొక్కుకోవడానికి కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రమించక తప్పదు. కెప్టెన్‌గా వైదొలగుతున్నప్పటికీ, ఆటగాడిగా తాను అందుబాటులో ఉంటానని ధోనీ ప్రకటించడం పరోక్షంగా కోహ్లీకి కలిసొచ్చే అంశం. అపారమైన అతని అనుభవానికి కోహ్లీ దూకుడు తోడైతే, సరికొత్త భారత క్రికెట్ జట్టు ఆవిష్కృతమవుతుంది. కోహ్లీ కెప్టెన్సీతో కొత్త శకం ప్రారంభం కావచ్చు. అదే సమయంలో ఒక గొప్ప శకానికి తెరపడిందన్న వాస్తవాన్ని కూడా జీర్ణించుకోవాలి. అన్ని సమయాల్లోనూ నింపాదిగా ఉండడం మంచిది కాదు. నిజమే. కానీ, అడుగడుగునా దూకుడును ప్రదర్శిస్తే సమస్యలను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ విషయంలో ధోనీ నుంచి కోహ్లీ పాఠాలు నేర్చుకోకతప్పదు. పలు అంతర్జాతీయ వేదికలపై జట్టును ధోనీ విజయపథంలో నడిపించిన తీరును అతను అలవాటు చేసుకోవాలి. జట్టు క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో నాయకత్వ బాధ్యతను స్వీకరించిన ధోనీ వెనువెంటనే టి-20 ప్రపంచ కప్‌ను అందించడం అతని ప్రతిభాపాటవాలకు నిదర్శనం. వనే్డ ప్రపంచ కప్‌లో 28 సుదీర్ఘ విరామానికి తెరదింపిన అతను భారత్‌కు టైటిల్‌ను అందించాడు. 2013లో ఐసిసి చాంపియన్స్ ట్రోఫీని సైతం సాధించిపెట్టాడు. టి-20, వనే్డ విభాగాల్లో ప్రపంచ కప్‌తోపాటు చాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిచిన ఏకైక కెప్టెన్‌గా అతను ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ధోనీ ‘మిస్టర్ కూల్’ అనడంలో తప్పులేకపోవచ్చు. కానీ, చాలా సందర్భాల్లో అతను సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించకపోవడం తప్పు. ఫీల్డింగ్ సర్దుబాట్లలోగానీ, బ్యాటింగ్ ఆర్డర్‌నుగానీ, బౌలింగ్ రొటేషన్‌నుగానీ అతను మార్చినంత వేగంగా బహుశా ఇప్పటి వరకూ మరే ఇతర కెప్టెన్ మార్చలేదేమో! ధోనీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఎలాంటి పర్యవసానాలు ఎదురైనా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. సొంత ప్రయోజనాలను లెక్కచేయకుండా జట్టు విజయాలకే ప్రాధాన్యతనిస్తాడు. ‘మిస్టర్ కూల్’ అన్న ముద్ర వేసిన మీడియా అతనిలోని ఈ రెండో కోణం వైపు దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. తన బ్యాటింగ్ మాదిరిగానే, ఎవరూ ఊహించని రీతిలో జట్టును నడిపించడం ధోనీ అలవాటు. 2007లో జరిగిన మొదటి టి-20 ప్రపంచ కప్‌లో.. అదీ ఫైనల్‌లో.. అందులోనూ ప్రత్యర్థి జట్టు చిరకాల శత్రువు పాకిస్తాన్ అయినప్పుడు జోగీందర్ శర్మ లాంటి ఒక అనామకుడితో అత్యంత కీలకమైన చివరి ఓవర్‌ను చేయించే సాహనం ధోనీ తప్ప ఎవరు చేయగలరు? భారత్, పాక్ జట్లు ఢీ కొంటున్న కారణంగా ఆ మ్యాచ్‌కి ప్రత్యేకత ఏర్పడింది. గౌతం గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులు సాధించడాన్ని మినహాయిస్తే, మిగతా వారు వేగంగా పరుగులు చేయలేకపోవడంతో, భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది. అనంరతం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఒక దశలో విజయానికి 24 బంతుల్లో 54 పరుగుల దూరంలో నిలిచింది. అంతకు ముందు, శ్రీశాంత్ వేసిన ఒకే ఓవర్‌లో 21 పరుగులను పాక్ కొల్లగొట్టడంతో, ఫైనల్‌లో భారత్‌కు ఓటమి తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైంది. నాలుగు ఓవర్లలో 54 పరుగులను సాధించే క్రమంలో హర్భజన్ సింగ్ వేసిన ఓవర్‌లో మిస్బా ఉల్ హక్ మూడు సిక్సర్లు కొట్టాడు. తర్వాతి ఓవర్‌లో శ్రీశాంత్ రెండు సిక్సర్లను సమర్పించుకున్నాడు. అయితే అతను సొహైల్ తన్వీర్ వికెట్‌ను పడగొట్టగలిగాడు. మొత్తం మీద 19 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్తాన్ విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచింది. ఒక వికెట్ మాత్రమే చేతిలో ఉంది. ఏ రకంగా చూసినా, ఫలితం పాక్‌కు అనుకూలంగా ఉంటుందన్నది ఖాయంగా కనిపించింది. నరాలు తెగిపోయే ఉత్కంఠ నెలకొన్న సమయంలో, ఫలితాన్ని నిర్దేశించే చివరి ఓవర్ వేసే బాధ్యతను జోగీందర్‌కు అప్పగించినప్పుడు మ్యాచ్‌ని ప్రత్యక్షంగా లేదా టీవీల్లో చూస్తున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. కామెంటేటర్లు ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. జోగీందర్ బంతిని తీసుకోవడం నుంచి రనప్ ఆరంభించి, బంతి వేసే వరకూ ఉన్న కొన్ని క్షణాల్లోనే ధోనీ నిర్ణయాన్ని విమర్శించడంలో మునిగిపోయారు. అంతర్జాతీయ టోర్నీల్లో జట్టుకు నాయకత్వం వహించడంలో అనుభవం లేని ఒక కెప్టెన్, ఇలాంటి టోర్నీల్లో చివరి ఓవర్ ఎంతటి బాధ్యతాయుతమైందో తెలియని ఒక బౌలర్‌ను ఎంపిక చేశాడంటూ గేలి చేశారు. అందుకు తగ్గట్టుగానే జోగీందర్ మొదటి బంతిని వైడ్‌గా వేశాడు. వెంటనే ఒక డాట్ బాల్ వేశాడు. ఆ ఓవర్‌లో అధికారికంగా అదే మొదటి బంతి. రెండో బంతిని మిస్బా ఉల్ హక్ సిక్స్‌గా మార్చాడు. జోగీందర్‌కు చివరి ఓవర్‌ను ఇచ్చి ధోనీ పొరపాటు చేశాడని ప్రతి ఒక్కరూ విమర్శించడం మొదలుపెట్టారు. కానీ, అతని వ్యూహం ఫలించింది. జోగీందర్ వేసిన మూడో బంతిని అర్థం చేసుకోలేకపోయిన మిస్బా ఫైన్ లెగ్ స్థానంలోకి బంతిని షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, అతని టైమింగ్ సరిగ్గా లేకపోవడంతో, షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రీశాంత్‌కు క్యాచ్‌గా వెళ్లింది. మిస్బా అవుటయ్యాడు. పాక్ ఇన్నింగ్స్ 152 పరుగుల వద్ద ముగిసింది. భారత్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. మొట్టమొదటి టి-20 ప్రపంచ కప్‌ను అందుకుంది. కెప్టెన్సీని చేపట్టిన కొత్తల్లోనే ధోనీ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవడం అతని నాయకత్వం ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది.
భారత క్రికెట్‌ను సరికొత్త నిశానిర్దేశనం చేసిన ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకో వడంతో ఒక శకానికి తెరపడిందని అంటున్న విశే్లషకులే, కోహ్లీ నాయకత్వంలో సరికొ త్త శకం మొదలవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ధోనీతో కోహ్లీని పోల్చడానికి వీల్లేకపో యనా, సహజంగానే ఇప్పుడు పోలిక అనివార్యమవుతుంది. వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లోనూ కోహ్లీకే పగ్గాలు అప్ప చెప్పే అవకాశం ఉందని జాతీయ సెలక్టర్లు అన్యాపదేశంగా చెప్ప డం వల్లే ధోనీ హఠాత్ నిర్ణయం తీసుకున్నాడన్న వాదన వినిపిస్తున్నది. కోహ్లీ ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా స్థిరపడ్డాడని, వనే్డ, టి-20 విభాగాల్లోనూ అతను సమర్థుడేనని జాతీయ చీఫ్ సెలక్టర్ చేసిన వ్యాఖ్యలే ధోనీ తన బాధ్యతల నుంచి వైదొలగడానికి కారణమన్న వా ర్త షికారు చేస్తున్నది. నిజానిజాలు ఎలావున్నా, భారత క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించి ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని స్థానంలో నిలబెట్టిన ధోనీ ప్రమాణాలను కొనసాగించడా నికి కోహ్లీ చాలా కష్టపడాలి. లేకపోతే, టీమిండియా తిరోగమనం తప్పదు. ధోనీ ఆట గాడిగా కొనసాగడం ఒక రకంగా కోహ్లీ అదృష్టమే.

సచిన్ రికమెండేషన్!
ధోనీకి కెప్టెన్సీ ఇవ్వమని భారత సెలక్టర్లకు ప్రతిపాదించింది ఎవరో తెలుసా? సహజంగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా, తన పని ఏదో తాను చేసుకుంటూ పోయే సచిన్ తెండూల్కర్ స్వయంగా ధోనీ పేరును రికమెండ్ చేశాడంటే ఆశ్చర్యం కలగక మానదు. అందరితోనూ స్నేహ పూర్వకంగా ఉంటూ, మైదానంలో తలెత్తే ఎంతటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఉండడం వంటి లక్షణాలే ధోనీకి జట్టులో ఒక ప్రత్యేకతను ఆపాదించాయి. ఈ లక్షణాలే సచిన్‌ను కూడా ఆకట్టుకోవడంతో, అతను ధోనీ పేరును కెప్టెన్సీకి సూచించాడు.

అవార్డులు రివార్డులు
ధోనీకి దక్కిన అవార్డులు, రివార్డులకు లెక్కేలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) రెండు సార్లు (2008, 2009) అతనిని బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఏడుసార్లు (2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014) ఐసిసి వరల్డ్ వనే్డ ఎలెవెన్ జట్టులో స్థానం సంపాదించాడు. 2009, 2010, 2013 సంవత్సరాల్లో అతనికి ఐసిసి టెస్టు టీమ్స్‌లో చోటు దక్కింది. 2007-08 సీజన్‌కు అతను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్ రత్న’ను అందుకున్నాడు. 2013లో ఎల్‌జి పీపుల్స్ చాయిస్ అవార్డును స్వీకరించాడు. 2011లో డి మోంట్‌ఫోర్ట్ యూనివర్శిటీ ధోనీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. వివిధ సంఘాలు, సంస్థలు పలు మార్లు సత్కరించాయ.

సూపర్ కెప్టెన్
భారత క్రికెట్ చరిత్రలోనే గొప్ప కెప్టెన్లలో ఒకడిగా ధోనీ గుర్తింపు పొందాడు. అతను టెస్టుల్లో భారత్‌కు 60 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. వీటిలో టీమిండియా 27 విజయాలను నమోదు చేసింది. 18 మ్యాచ్‌ల్లో ఓడగా, 18 టెస్టులు డ్రా అయ్యాయి. వనే్డ ఇంటర్నేషన్స్‌లో 199 మ్యాచ్‌ల్లో జట్టుకు సారథ్య బాధ్యతలు వహించాడు. 110 విజయాలను సాధిస్తే, 74 మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూశాడు. మొత్తం మీద వనే్డల్లో 54.45, టెస్టుల్లో 58.06 శాతం విజయాలతో అతను భారత సూపర్ కెప్టెన్‌గా పేరు సంపాదించాడు. వనే్డల్లో రికీ పాంటింగ్, అలాన్ బార్డర్‌తోపాటు ధోనీ మాత్రమే కెప్టెన్‌గా వందకుపైగా విజయాలను సాధించాడు. ఒక జట్టుకు ఎక్కువ వనే్డల్లో నాయకత్వం వహించిన వారిలో రికీ పాంటింగ్, స్ట్ఫిన్ ఫ్లెమింగ్ తర్వాత మూడో స్థానంలో ధోనీ ఉన్నాడు. అందుకే అతను కెప్టెన్సీ నుంచి నిష్క్రమించడంతో ఒక శకం ముగిసింది.
*

- శ్రీహరి