Others

శరీర రథానికి ఆత్మే స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధ్యాత్మ విద్యకు జ్ఞాన సాగరాలుగా పరిగణింపబడుతున్న ఉపనిషత్తులలో ఆత్మ వివేచన విశేషంగా జరిగింది. శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు అనబడే పంచ విషయాలను ఆత్మ గ్రహిస్తుంది. ఇది ఇంద్రియాలతో గానీ, సంకల్ప - వికల్ప రూపమైన మనస్సుతోగానీ, మంచి చెడులు విచక్షణ చేసే బుద్ధితో గానీ, జీవుల స్థితికి కారణభూతమైన ప్రాణాలతో గానీ సంబంధం లేక సర్వదాభిన్నమై ఉంటుంది. ఆత్మ గురించి ఛాందోగ్యోపనిషత్తులో ఓ దృష్టాంతం ద్వారా విశదీకరించబడింది.
ఒకసారి దేవదానవులు ఆత్మ స్వరూపం గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకుగాను దేవతలు తమ తరఫున ఇంద్రుడిని, దానవులు తమ నుంచి విరేచనుణ్ణి ప్రతినిధులుగా ఎన్నుకొని వారిని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి విషయం తెలుసుకురమ్మన్నారు. వెంటనే ఇంద్ర, విరేచనులు బ్రహ్మలోకం వచ్చి, ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి కఠోరమైన తపస్సు ప్రారంభించారు... అలా కొంతకాలం తపస్సు చేశాక బ్రహ్మదేవుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.
అప్పుడు ఇంద్ర, విరేచనులు ఆయనకు నమస్కరించి తమ సందేహాన్ని విన్నవించుకున్నారు. బ్రహ్మ క్షణకాలం తటపటాయించి, ‘కళ్ళల్లో, జలాల్లో కనిపించే దేహమే ఆత్మ’ అని చెప్పాడు. ఆ సమాధానానికి విరేచనుడు సంతుష్టి చెందాడు. అతడు దానినే ఆత్మగా భావించాడు.
అయితే ఇంద్రుడు అందుకెంత మాత్రం సంతృప్తి చెందలేకపోయాడు. ‘దేహమే ఆత్మ అనుకుంటే - అది గ్రుడ్డిది, చెవిటిది, కుంటిది కూడా అవుతుంటుంది కదా! అప్పుడు ఆత్మ కూడా ఆ అవలక్షణం రావాలి. అలా జరగదు కాబట్టి దేహ చైతన్యం ఆత్మ చైతన్యం కాదు’ అని ఖండించాడు.
ఈ విధంగా శంకితుడైన ఇంద్రునితో బ్రహ్మ ‘స్వప్న చైతన్యమే ఆత్మ!’ అన్నాడు. దానికీ ఇంద్రుడు ఒప్పుకోకుండా, ‘స్వప్నంలో మానవుడు నవ్వుతాడు, ఏడుస్తాడు, సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. ఆనందమే స్వరూపంగా భావించే ఆత్మలో దుఃఖ సంపర్కం అంగీకృతమవుతుందా?’ అని బ్రహ్మను అడిగాడు.
ఇలా అసంతృప్తుడైన ఇంద్రునికి సుషుప్తి చైతన్యాన్ని ఆత్మగా చెప్పాడు బ్రహ్మదేవుడు. అయినా ఇంద్రుని సందేహం దూరం కాలేదు. ‘సుషుప్తి సమయంలో మానవునికి తన శక్తి విషయంలో కానీ, బాహ్య వస్తు జ్ఞానం కానీ ఉండదు గదా! అటువంటి దానిని ఆత్మగా ఎలా అంగీకరించగలం?’ అని మరల ప్రశ్నించాడు.
బ్రహ్మ చిన్నగా మందహాసం చేసి, ‘మహేంద్రా! ఆత్మ శరీర రూప రథానికి అధిష్టాత. దీనికి బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం, ఇంద్రియాలే అశ్వాలు. వీటి అన్నింటి అస్తిత్వం ఆత్మరూపమైన రథికి సహాయం చేయడానికే. ఈ రీతిగా ఆత్మయే శరీర రథానికి స్వామి. ఆత్మ ప్రేరణతోనే ఈ రథం నడుస్తోంది. ఇది వికార రహితమై, శక్తి స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది. ఆత్మకను నేత్రాలతో ఎవరూ చూడలేరు. అనే్యంద్రియాలతో గ్రహించలేరు. దాని చిహ్నం ఏదీ కనిపించదు. ఏ నామంలోను దానిని పిలవలేం. శాంతమై, అద్వైతమై అది సదా భాసిల్లుతూ ఉంటుంది!’ అంటూ ఆత్మయొక్క స్థితిని సంక్షిప్తంగా తెలిపి ఇంద్రుణ్ణి సంతృప్తి పరిచాడు.
నిజానికి ఈ విశ్వం ఓ కల్పిత వస్తువు. దీని సత్తాను అంగీకరించడానికి ఆత్మ ఆవశ్యకమైన ఉంది. ఆత్మ విశ్వంలోని వస్తువులన్నింటిలో వ్యాపించి ఉంటుంది. ఇది సర్వదా ఉంటూ జీవన కాలంలో విషయానుభవ సర్వస్వాన్నీ పొందుతుంది. అంధకారంలో పడి ఉన్న త్రాడును తొక్కి సర్పభ్రాంతిని పొందుతున్నాం. త్రాడు అనేది ఉండబట్టే సర్పభ్రాంతి కలుగుతుంది. కనుక ఆ కల్పిత సర్పం యొక్క అస్తిత్వాన్ని సిద్ధాంతీకరించడానికి త్రాడు ఉండడం అవసరం. త్రాడనేది లేకపోతే సర్పభ్రాంతి ఉండనే ఉండక అదేవిధంగా ఆత్మను అంగీకరించకపోతే కల్పిత సంసార భ్రమ దానియందు కలగదు. కాబట్టి ప్రపంచాన్ని అంగీకరించడానికి ఆత్మ సిద్ధి స్వతః కలుగుతుంది. ఆత్మవల్లనే ప్రాణులు జీవిస్తున్నాయి అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది.

- చోడిశెట్టి శ్రీనివాసరావు