అక్షర

గాంధీజీ పర్యావరణ స్పృహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్ముడు-పర్యావరణము
కోడూరి శ్రీరామమూర్తి
వెల: రు.120/-
ప్రతులకు: చినుకు పబ్లికేషన్స్
గాంధీనగర్, విజయవాడ

నేడు ప్రపంచాన్ని వేధిస్తున్నవి రెండు సమస్యలు; 1.టెర్రరిజం, 2.పర్యావరణం. ఒకటి మానవ జాతి మీద ఉప్పెనలా విరుచుకుపడుతుంది. రెండవది చల్లగా, చాపకింది నీరులా గాలి, నీరు, నేలను కలుషితం చేస్తు జీవకోటికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ఈ ప్రమాదంనుంచి పర్యావరణ నిపుణులు ఎన్నో ఏళ్లనుండి హెచ్చరిస్తున్నా, జీవకోటి యావత్తును కాపాడాల్సిన మనం అలక్ష్యం చేస్తున్నాము. సునామీలు, ఎల్‌నినోలవల్ల విలవిల్లాడిపోతున్నాము.
జాతిపిత మహాత్మాగాంధీ ఒక గొప్ప దార్శనికుడు. ఎన్నో సందర్భాల్లో ప్రకృతి-మానవుని మధ్య ఉండాల్సిన సంబంధం గురించి బోధించాడు. ఆయనో శాస్తవ్రేత్తగానీ, వైజ్ఞానికుడుగానీ కాదు. ఆయన ఒక గొప్ప మానవతావాది. పర్యావరణ సమస్య గురించి మాత్రమే కాకుండా హరిత వినియోగదారుడు (గ్రీన్ కన్సూమర్) ఎలా వుండాలో చెప్పడమే కాక ప్రకృతికి హాని కలుగ చేసే వస్తువులు (ఏనుగు దంతాలు, దుప్పి కొమ్ములు, పులి చర్మాలు) వాడడం నీతి విరుద్ధమన్నారు. పెన్సిలు, కాగితం లాంటి వస్తువులను పొదుపుగా వాడమన్నాడు. మానవుని అవసరాలకు సరిపడా భూమి ఇవ్వగలదు. కాని అత్యాశకు సరిపడా ఇవ్వలేదు అన్నాడు. అత్యాశ ప్రకృతి వినాశనానికే దారి తీస్తుందన్నాడు.
కోడూరి శ్రీరామమూర్తిగారు గాంధీ తత్వంపై గత నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. సుమారు ఏభై ఏళ్ల క్రితం గాంధీజీ పర్యావరణం దాని పరిరక్షణపై ప్రకటించిన అభిప్రాయాలు నేటికీ అన్వయింపబడడం గమనించారు. అయితే ఆయన గాంధీ బోధనల్ని యధాతథంగా మనముందుకు తేకుండా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖులు రాసిన పుస్తకాలను అధ్యయనం చేసారు.రేచల్ కార్సన్ (1907-1964) రాసిన ‘సైలెంట్ స్ప్రింగ్’, డా.ఇ.ఎం.షూమాషర్ రాసిన ‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’, రామచంద్ర గుహ, ఆర్నాల్డ్ టాయెన్‌బీ లాంటి ప్రసిద్ధుల అభిప్రాయాలు, ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డిపి) వారి మానవాభివృద్ధి నివేదికలు క్షుణ్ణంగా చదివారు. పర్యావరణం పరిరక్షణపై వీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు గాంధీగారు 1948కంటె ముందు వెలిబుచ్చిన అభిప్రాయాల సారూప్యత గమనించారు. ఈ రెండు అభిప్రాయాల నేపథ్యంలో నేటి పర్యావరణ పరిస్థితిని గమనించి ఈ పుస్తకాన్ని మనముందుకు తెచ్చారు.
పది అధ్యాయాల్లో చక్కని, సరళమైన భాషలో ప్రపంచ వనరులు వాటి (దుర్) వినియోగం వివరించారు. అభివృద్ధి చెందిన దేశాలు వెలువరించే ఉద్గారాలు వాటి ఫలితంగా జీవావళికి కలుగుతున్న కలుగబోయే దుస్థితిని వివరించారు.
పర్యావరణంపై స్పృహ కలిగించడానికి ఐక్యరాజ్యసమితి వారు ప్రకటించిన ‘దినాలు’ సమావేశాలు, చట్టాలు, పాఠకులకు మరింత అవగాహన కలగడానికి చదవాల్సిన పుస్తకాల లిస్టు అనుబంధంగా ఇచ్చారు. పర్యావరణంపై గాంధీజీ భావనల్నీ, ఆలోచనల్ని పాఠకులు చక్కగా అవగాహన చేసుకునేందుకు పనికివస్తుంది ఈ పుస్తకం.

-కూర చిదంబరం