అక్షర

పాలమూరు నుడికారంతో ‘రామాయణం బతుకమ్మ పాట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో
తొలి రామాయణం
బతుకమ్మ పాట
జి.యాదగిరి సంపాదకత్వం
పేజీలు: 139
వెల: రు.100/-
ప్రతులకు: ముచ్చర్ల
దినకర్‌రావు
వెనె్నల సాహిత్య అకాడమీ
బి.సి.కాలనీ,
నాగర్‌కర్నూల్ 509209
చరవాణి: 9440704535

‘బతుకమ్మ’ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక! కష్ట సుఖాలను పాటలో నిక్షిప్తం చేసి అనాదిగా తెలంగాణ ఆడపడుచులు ఆడుకుంటున్న ఆట! బతుకు దెరువును మెరుగుపరిచే అమ్మను పూలతో ఆరాధించే వేడుక ‘బతుకమ్మ’! ఇప్పుడు వాడుకలో వున్న బతుకమ్మ పాటలు అనేకం అజ్ఞాత మహిళలచే ఆశువుగా అల్లబడినవి కావడం విశేషం. జానపద, ఇతిహాస, చారిత్రక ఘట్టాలతో పాటు సున్నితమైన మానవ సంబంధాలకు అద్దం పట్టే బతుకమ్మ పాటల్లోని సాహిత్య విలువలు అమూల్యమైనవి! లయబద్ధంగా, రాగయుక్తంగా ఆడుతూ పాడే బతుకమ్మ పాటల్లో తెలంగాణ ప్రజల జనజీవనం ప్రతిబింబిస్తుంది. పూలతో ఇష్టదైవాన్ని పూజించడం విశ్వవ్యాప్తమైతే..ఆ పూలనే భగవంతునిగా ఆరాధించడం తెలుగువారి ప్రత్యేకత..బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అనేకమంది కవులు, రచయితలు పాటలను రాసారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజల జీవన మూలాలున్న ‘బతుకమ్మ పాట’ను రామాయణం బతుకమ్మ పాటగా తెలంగాణా గడ్డమీద ఎనభై అయిదేండ్ల క్రితం రాసి ముద్రించిన ఘనత అచ్చమైన గ్రామీణ కవి బుక్క సిద్ధాంతి గారికి దక్కుతుంది. తెలంగాణాలో తొలిసారిగా రామాయం ఇతివృత్తాన్ని బతుకమ్మ పాటలుగా మలిచి బుక్క సిద్ధాంతి ఆనాడే ఓ గ్రంథాన్ని వెలువరించారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఎల్లమ్మ రంగాపురం గ్రామం సిద్ధాంతిగారి గ్రంథంయొక్క ప్రాముఖ్యతను గుర్తించి..వెనె్నల సాహిత్య అకాడమీ నాగర్‌కర్నూల్ వారి సౌజన్యంతో..‘తెలంగాణలో తొలి రామాయణ బతుకమ్మ పాట’ పేరుతో ఆ గ్రంథాన్ని పునర్ముద్రించారు.
భారతీయులం మనం ఆది కావ్యంగా భావించే రామాయణాన్ని బతుకమ్మ పాటలుగా తీర్చిదిద్దడంలో బుక్క సిద్ధాంతి గారి కృషి ప్రశంసనీయం! రామాయణ కథకు బతుకమ్మ పాటలు రాసి ..పూర్వ రామాయణంలో శ్రీరామచంద్రుల వారిని నాయకుడిగా ఆరు ఖండాల్లో చక్కగా ఆవిష్కరించారు. అలాగే ఉత్తర రామాయణంలో కుశలవులను ఏక ఖండంలో చిత్రించారు. పండిత వంశానికి చెందిన బుక్క సిద్ధాంతిగారు ఓ ప్రణాళిక బద్ధంగా ఈ గ్రంథమందు తమ రచనను కొనసాగించడం విశేషం!
పాలమూరు నుడికారంతో రూపుదిద్దుకున్న ఇందలి రామాయణం బతుకమ్మ పాటలు లయబద్ధంగా పాడుకోవడానికి యోగ్యంగా వున్నాయి.వాల్మీకి రామాయణంలో లేని, రంగనాధ రామాయణంలో వున్న అంశాలను సిద్ధాంతిగారు పాటల్లో చక్కగా నిక్షిప్తం చేసారు.
ఈ గ్రంథంలో కాకాసురుని కథ, లక్ష్మణరేఖ, కైకసి రావణునికి హితబోధ, ఇంద్రజిత్తు నాగాస్త్ర ప్రభావం, శుక్రుని సలహాతో హోమం, కాలనేమి వృత్తాంతం, మాల్యవంతుని వృత్తాంతం, రావణ నాభిని బాణంతో రాముడు కొట్టడం, కుశలవుల బతుకమ్మ పాటలను పొందుపరిచారు. వీటితోపాటు అహల్య శాప విమోచనం, శూర్పణఖ ప్రేరణతో రావణుడు సీతాపహరణకు పూనుకోవడం వంటి అంశాలను రేఖామాత్రంగా పాటల్లో ప్రస్తావించారు. బాలకాండ, అయోధ్యకాండ, శివ ధనుర్భంగం, పరశురామ గర్వభంగం, అరణ్యకాండ, శ్రీరామ వనవాసం, వంటి ఘట్టాలను సిద్ధాంతిగారు బతుకమ్మ పాటల్లో రమ్యంగా చిత్రించారు. వాల్మీకి మహాముని సీతను దర్శించే సన్నివేశాన్ని బతుకమ్మ పాటలో అందంగా దృశ్యమానం చేసారు. దేశీ ఛందస్సుతో..ద్విపద రూపంలో కొన్ని మార్పులతో ఉయ్యాలపాటగా మార్చి తీర్చిదిద్దారు. పాలమూరు నుడికారంతో, పల్లె పదబంధాలతో సాగే ఇందలి పాటలు అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆడుతూ పాడుతూ రామాయణాన్ని మననం చేసుకోవడానికి ఈ పాటలు ఉపకరిస్తాయి
రామాయణం బతుకమ్మ పాటలను ఉయ్యాలో అంటూ కొనసాగించారు. అయితే అయోధ్యకాండ, అరణ్యకాండ, కైకేయి వరములడుగుట, శ్రీరామ వనవాసం, కిష్కింద కాండ, సుందరకాండ, యుద్ధకాండలను మాత్రం ‘వలలో’ అంటూ పాటల్ని అల్లినారు. అలాగే కుశలవుల పాటలను కూడా ‘వలలో’ అంటూ గానం చేసుకోవడానికి వీలుగా తీర్చిదిద్దారు. వాల్మీకి సుకుని కల్పించుట, శ్రీరాముడు అశ్వమేథంబు చేయనూహించుట, శ్రీరాముడు యుద్ధానికి వెళ్లే ఘట్టాలుకూడా ‘వలలో’ అంటూ పాడుకోవడానికి యోగ్యంగా మలచబడ్డాయి.
‘‘మనుజులెవరైనను ఉయ్యాలో మాపు రేపుయైన ఉయ్యాలో
భక్తితో పాడిన ఉయ్యాలో పోషించు రాసువులు ఉయ్యాలో
మంగళం శ్రీరామ ఉయ్యాలో మమ్మేలు జయరామ ఉయ్యాలో
మంగళం శీతమ్మఉయ్యాలో మమ్మేలు వో జనని ఉయ్యాలో’’
అంటూ శ్రీరామాయణం బతుకమ్మ పాటలను మంగళప్రదంగా సంపూర్ణం చేసారు.
జి.యాదగిరి సంపాదకత్వంలో నాగర్‌కర్నూల్ వెనె్నల సాహిత్య అకాడమీ వారు ముచ్చర్ల దినకర్ రావుగారి సహకారంతో ఈ గ్రంథాన్ని పునర్ముద్రించడం అభినందనీయం.. తెలంగాణ పద బంధాలపై, తెలంగాణ నుడికారాలపై పరిశోధన చేసే వారికి ఈ పాటల్లో కావల్సినంత సమాచారం దొరుకుతుంది. భావితరాలకు సైతం ఉపయుక్తమైన గ్రంథమిది!

-దాస్యం సేనాధిపతి