అదిలాబాద్

ముహూర్తం అదరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 8: జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ చివరి అంకానికి చేరుకోగా దసరా పండగ నాటికి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. ప్రస్తుతం జిల్లా పరిధిలో ఉన్న 61 ప్రధాన శాఖలకు సంబంధించి ఆయా శాఖల కార్యాలయాలు, పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల వివరాలను ఆన్‌లైన్‌లో క్రోడికరించి వర్క్‌టు ఆర్డర్ పోస్టింగులు అందించేందుకు సర్వం సిద్దం చేశారు. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్‌లో నూతన జిల్లాల ప్రక్రియ, పరిపాలన తీరుతెన్నులపై దిశానిర్దేశం చేశారు. దసరా పండగ రోజే కొత్త జిల్లా కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాలు, తహసీల్ కార్యాలయాలు ప్రారంభించేందుకు భవనాలను, సిబ్బంది, ఫర్నిచర్‌ను సిద్ధం చేయాలని, అధికారులకు సెలవులను కూడా రద్దుచేస్తున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల్లో పండగ వాతావరణంలో భారీ ఏర్పాట్ల మద్య ప్రారంభోత్సవాలు జరుపాలని ఆదేశించడంతో ఆదిలాబాద్ జిల్లా మినహా కొత్త జిల్లాలైన కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో హడావుడి నెలకొంది. జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ శనివారం కొత్త జిల్లాల్లో విధులు నిర్వర్తించే అధికారుల కోసం ఇన్నోవ వాహనాలను ప్రారంభించారు. తొమ్మిది మంది డిఎస్పీలకు సైతం కొత్తగా జిల్లాకు చేరుకున్న స్కార్పియో వాహనాలను అందించారు. అయితే నూతనంగా ఏర్పడే సిరికొండ, గాధిగూడ మండలాల్లో పోలీసు స్టేషన్లతో పాటు ఇచ్చోడ సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అధికారులను సన్నద్దం చేశారు. ఇక రెవెన్యూ పరంగా రెండు రోజులుగా కలెక్టర్ జగన్మోహన్, జెసి సుందర్ అబ్నార్, డిఆర్‌వో సంజీవరెడ్డి ఉద్యోగుల స్థానికత ఆధారంగా సర్దుబాటు ప్రక్రియపై బిజీగా గడుపుతున్నారు. దసరా పండగ రోజు ఉదయం 10 గంటలకే అన్ని జిల్లాల్లో ఒకే ముహూర్తానికి కొత్త జిల్లాల పాలన ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడంతో కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించి ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు నిర్మల్‌లో అక్కడి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభిస్తుండగా, ఆసిఫాబాద్ (కొమరంభీం) జిల్లాలో జిల్లా ఇంచార్జి మంత్రి జోగురామన్న, మంచిర్యాలలో హైదరాబాద్‌కు చెందిన మంత్రి పద్మారావులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాలో 3500 మంది పోలీస సిబ్బంది, 4250 మంది రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందితో నాలుగు భాగాలుగా విభజిస్తూ జాబితాను సిద్దం చేయగా, వారికి సోమవారం రోజు వర్క్‌టు ఆర్డర్ కింద పోస్టింగ్‌లు జారీ చేయనున్నారు.
జిల్లా కీలక అధికారుల పోస్టింగ్‌లపై ఉత్కంఠ
కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారుల పోస్టింగ్‌లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంచిర్యాల ఎస్పీగా విక్రమ్‌జిత్ దుగ్గల్, ఆదిలాబాద్ ఎస్పీగా ప్రస్తుత ఓఎస్‌డి విజయ్‌కుమార్‌కు పోస్టింగ్ ఖాయమని భావిస్తుండగా, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు కొత్త ఎస్పీలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే రెండేళ్లకు పైగా ఇక్కడే పనిచేస్తున్న కలెక్టర్ జగన్మోహన్‌ను హైదరాబాద్‌లోని రెవెన్యూ కమిషనరేట్ కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు తెలిసింది. ఆసిఫాబాద్ జిల్లాకు ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం వరకు ఆధికారుల జాబితా వెలువడే అవకాశం ఉంది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
* పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
* ప్రాజెక్టలలో బారీగా చేరిన వరద నీరు.
కాసిపేట, అక్టోబర్ 8: శుక్రవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల మండలంలోని చిన్నా పెద్ద వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండలంలోని సల్పలవాగుకు వరద నీరు బారీగా చేరడంతో పరవళ్ళు తొక్కుతుంది. సల్పలవాగుకు బారీగాపొంగి పోర్లడంతో సమీప గ్రామాల ప్రజలు తిలకిస్తున్నారు. అదేవిధంగా మండలంలోని సోనాపూర్, రాళ్ళవాగు, గట్రావుపల్లి, బుగ్గగూడెం లాంటి చెరువులలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా వరద నీరు బారీగా చేరి జలకళతో నిండు కుండాలా మారాయి. చెరువుల నుండి మత్తడి ఏరులై పారుతుంది. అలాగే మండలంలోని పెద్ద ధర్మారం, మామిడిగూడ గ్రామాల మధ్య వాగుకు వరద నీరు బారీగా చేరడంతో రోడ్డుపై నుండి వరద నీరు పారుతుంది. దీంతో పెద్ద ధర్మారం గ్రామం నుండి రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మండలంలో శుక్రవారం నుండి శనివారం సాయంత్రం వరకు ఏకదాటిగా వర్షాలు కురువడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 8: బజార్ హత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన కొక్లె కవిత (22) మనస్థపానికిగురై శనివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బోథ్ సిఐ జయరాం తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్టక్రు చెందిన కొక్లె కవితకు గత మూడు సంవత్సరాల క్రితం మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన కొక్లె విలాస్‌తో వివాహం జరిగింది. కొన్ని రోజుల పాటు దాంపత్య జీవితం సాఫీగా సాగినప్పటికీ తన భర్తతో గొడవ చేసుకొని తన పుట్టింట్లోనే ఉంటానని చెప్పడంతో దానికి భర్త అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. మృతురాలికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు వ్యాయామం
* వ్యాయామశాలను ప్రారంభించిన ఎస్పీ దుగ్గల్
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 8: పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ సంపూర్ణ ఆరోగ్యం పొందాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శనివారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మించిన వ్యాయమశాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక పోలీసులు అత్యవసరవేళ ఎల్లప్పుడు 200 మంది సిద్ధంగా ఉంటారని, వారి ఫిట్‌నెస్ కొరకు నూతన హంగులతో వ్యాయమశాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజల మనోభావాలు సైతం పోలీసులు ధృడంగా ఉండి మాకు రక్షణకు భరోసా కల్గించే విధంగా ఉండాలని కోరుకుంటారని, వారికి అనుగుణంగా పోలీసులు సైతం ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా మంచి యూనిఫాం ధరించి విధుల్లో చురుకుగా ఉండాలని అన్నారు. ఈ వ్యాయమశాలను ఉచితంగా పోలీసలకు అందుబాటులో ఉంటుందన్నారు. స్థానిక పోలీసు కార్యాలయ సిబ్బంది సైతం వినియోగంచుకోవాలని తెలిపారు. మానసికంగా పోలీసులు ధృడంగా ఉండాలని, ఎటువంటి సమస్యలు లేకుండా విధుల్లో ఉండాలని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే సమయంలో హుందాగా వ్యవహరించాలని అన్నారు. పోలీసులకు శారీర దారుఢ్యం ఎంతో ప్రాముఖ్యమైనదని, వ్యవసనాలకు బానిస కాకుండా మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డిలు ఎస్‌ఎం విజయ్‌కుమార్, టి.పనసారెడ్డి, అదనపు ఎస్పీ జిఆర్ రాధిక, ఆర్‌ఐబి జెమ్స్, ఆర్ ఎస్సైలు వి.మధుకర్, బి.పెద్దయ్య, శ్రీనివాస్, వినోద్, సిహెచ్ శ్రీకాంత్, సింహచలం శ్రీనివాస్, ఏఆర్ ఎస్సైలు శ్రీహరి, ఎన్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో భారీ వర్షం
* రోడ్లు జలమయం
* స్థంభించిన జనజీవనం
బెల్లంపల్లి, అక్టోబర్ 8: పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పట్టణంలో జనజీవనం స్థంభించిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 9గంటల నుంచి మద్యాహ్నం 2.30గంటల వరకు వర్షం కురవడంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. పట్టణంలోని రాంనగర్ అండర్ బ్రిడ్జి, శాంతిఖని, సుభాష్‌నగర్, సుబ్బారావుపల్లి, రవీంద్రనగర్ తదితర ప్రాంతాల్లోని ఒర్రెలు, వాగులు ఉప్పొంగి వర్షపు నీరు ప్రవహించింది. పట్టణంలోని పల్లపు ప్రాంతాలైన ఆటో గ్యారేజీ ప్రధాన రహదారి, రాంనగర్, హనుమాన్ బస్తీ ప్రాంతాల్లో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షంతో బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్ల ఎత్తివేత
* 24వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల
కడెం, అక్టోబర్ 8: కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో రెండురోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలమూలంగా ఎగువ ప్రాంతాల నుండి ఇన్‌ఫ్లో వరదనీరు జలాశయం లో చేరుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, భారీగాకురిసిన వర్షాల మూలం గా రిజర్వాయర్‌లో దాదాపు 15వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరదనీరు వచ్చిచేరడం ప్రాజెక్టు జలాశయం నీటి మట్టం 700 అడుగులకు చేరడంతో నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్తచర్యగా శనివారం ప్రాజెక్టుకు చెందిన 7,8,9 వరదగేట్లను పది ఫీట్ల వరకు ఎత్తులేపి దాదాపు 24 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టు జలాశయంలో వేలాది ఇన్‌ఫ్లో వరదనీరు చేరుతుండడంతో నీటిమట్టం పెరుగుతుండడంతో ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్‌రావు, డిఈ నూరొద్దిన్, ఎఈ శ్రీనాథ్ ప్రాజెక్టు వద్దనే ఉండి నీటిమట్టం పెరుగుదల ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందిస్తూ, వారి సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. ప్రస్తుతం 698 అడుగులకు నీటిమట్టాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు.

బాసర క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
* 2790 మంది చిన్నారులకు అక్షర స్వీకారాలు
బాసర, అక్టోబర్ 8: సరస్వతి అమ్మవారి సన్నిధికి శనివారం భక్తులు పోటెత్తారు. శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు కాలరాత్రి అవతారంలో దర్శనమిచ్చారు. ఆలయ సన్నిధిలో ఉదయం 11 గంటలకు ఆలయ అర్చకులు మూల నక్షత్ర సరస్వతి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మూల నక్షత్ర సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుండే కాక మహారాష్ట్ర నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఉదయం, తెల్లవారుజామున 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్షరస్వీకార పూజలకు, దర్శన సేవలకు భక్తులు, చిన్నారులు పోటెత్తారు. మూల నక్షత్రాన అక్షరస్వీకార పూజలు జరిపిస్తే చిన్నారులు ఉన్నతవిద్యలో అభ్యసిస్తారని భక్తుల నమ్మకం. దీంతో అక్షర స్వీకార పూజలకు భారీ వర్షంలోనూ భక్తులు, చిన్నారులు తడుస్తూనే ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అక్షరాభ్యాస పూజలకు ఒక్కోబ్యాచ్‌కు 2గంటల సమయం పట్టడంతో క్యూలైన్‌లో ఉన్న చిన్నారులు, భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అధికారుల ఏర్పాట్లపై హైదరాబాద్‌కు చెందిన మహేష్ అనే భక్తులు ఆలయ ఈవోను ప్రశ్నించారు. దర్శన సేవలకు సైతం 2గంటల సమయంలో పట్టడంతో క్యూలైన్‌లో ఉన్న చిన్నారులు ఇబ్బందులపాలయ్యారు. సుమారు 50 వేలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తమ చిన్నారులకు అక్షరస్వీకార పూజలు నిర్వహించారు. ఎస్‌బిహెచ్ బ్యాంక్ తరపున, ఆలయ ఉద్యోగులు పాలు,బిస్కెట్‌లను చిన్నారులకు పంపిణి చేశారు. ఎన్‌సిసి విద్యార్థులు, బాసర మిషన్ సభ్యులు భక్తులకు సేవలు అందించారు.
ఆలయంలో ప్రముఖుల పూజలు
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం బాసర సరస్వతి అమ్మవారిని మాజీ ఎమ్మెల్సీ ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య, దేవాదాయ రీజినల్ జాయింట్ కమీషనర్ ఇడుపులపాటి శ్రీనివాస్‌రావు, జిల్లా డిఆర్‌డిఎ పిడి అరుణకుమారి అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

చిన్న జిల్లాలతోనే నేరాలు అదుపు
* జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, అక్టోబర్ 8: చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల క్షేత్రస్థాయిలో నేర వ్యవస్థను అదుపులోకి తేవడమే గాక పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు దోహదపడుతుందని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శనివారం స్థానిక పోలీసు ఏఆర్‌హెడ్ క్వార్టర్‌లో కొత్త జిల్లాల ఎస్పీలకు, డిఎస్పీలకు కేటాయించిన కొత్త ఇన్నోవా, స్కార్పియో వాహనాలను ఎస్పీ దుగ్గల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులందరికి నూతన వాహనాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త ఎస్పీలకు ఇన్నోవా వాహనాలను, అదనపు ఎస్పీలకు స్కార్పీయో వాహనాలను కేటాయించామన్నారు. అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న 9 మంది డిఎస్పీకు సైతం స్కార్పియో వాహనాలు రావడం జరిగిందన్నారు. చిన్న జిల్లాలతో నేరాలను అదుపు చేసేందుకు ఉన్నతాధికారులకు వీలుకల్గుతుందన్నారు. ప్రతికేసు దర్యాప్తు ఎస్పీ దృష్టిలో ఉంటుందని, కింది స్థాయి అధికారులు సైతం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విధులు నిర్వహిస్తారన్నారు. ఉట్నూర్ డివిజన్ కార్యాలయం నుండి మూడు పోలీసు స్టేషన్‌లు ఆసిఫాబాద్ జిల్లాకు కేటాయించడంతో నూతనంగా ఏర్పడే గాధిగూడ, సిరికొండ పోలీసు స్టేషన్‌లతో పాటు ఇచ్చోడ సర్కిల్ కార్యాలయం, ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ పోలీసు స్టేషన్‌లను ఉట్నూరు డివిజన్‌కు కేటాయించామన్నారు. పూర్తిస్థాయిలో సిబ్బందిని అందించి నాణ్యమైన పోలీసు సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ మిత్రుడు అభిలాష్ బాజడ్, ఓఎస్‌డిలు ఎస్‌ఎం విజయ్‌కుమార్, టి.పనసారెడ్డి, అదనపు ఎస్పీ జిఆర్ రాధిక, ఆర్‌ఐ బి.జెమ్స్, ఆర్‌ఎస్సైలు వి.మధుకర్, సింహచలం శ్రీనివాస్, సిహెచ్ శ్రీకాంత్, వినోద్, బేరా పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

16న జోడేఘాట్‌కు సిఎం రాక
* పర్యాటక పనులను 14లోపు పూర్తి చేయాలి
* భీం వర్ధంతి ఏర్పాట్లపై పోరుగడ్డలో సమీక్ష సమావేశం
కెరమెరి, అక్టోబర్ 8: గోండు వీరుడు కొమురం భీం పోరుగడ్డ జోడేఘాట్‌లో ఈనెల 16న నిర్వహించే 76వ కొమురం భీం వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హాజరవుతున్న నేపథ్యంలో పర్యాటక పనులను ఈనెల 14లోపు పూర్తి చేయాలని ఎంపి గెడెం నగేష్ అధికారులను ఆదేశించారు. మండలంలోని జోడేఘాట్‌లో శనివారం కొమురంభీం వర్దంతి, దర్బార్ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపి గెడెం నగేష్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఐటిడిఎ పివో ఆర్‌వి కర్ణన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి గెడెం నగేష్ మాట్లాడుతూ కొమురం భీం వర్ధంతికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికార యంత్రాంగం సమిష్టి కృషితో పనిచేయాలని అన్నారు. వర్దంతికి వచ్చే ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా నీటిని సరఫరా చేయాలని, ఎల్‌అండ్‌టి శుద్ధనీరు సరఫరా కాని పక్షంలో హట్టి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజలు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 14లోపు మ్యూజియం పనులను పూర్తి చేయాలన్నారు. మ్యూజియంలో ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా పెయింటింగ్, ఫోటోగ్రఫీ చేయాలన్నారు. కొమురంభీం జీవిత చరిత్ర ఫోటోలు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. వర్దంతికి వచ్చే ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేయాలని, స్ర్తి, పురుషులు, విఐపి, విలేఖర్లకు వేర్వేరుగా భోజనాలు ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన సామాగ్రి, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని డిడి రామ్మూర్తిని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న 8్ఫట్ల కొమురంభీం విగ్రహాన్ని రెండు రోజుల్లో ఏర్పాటు చేసి రంగులు వేయాలన్నారు. వర్ధంతికి వచ్చే ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్లును ఆదివాసీలు అదికంగా ఉన్న ప్రాంతాల నుంచి నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రత్యేక వైద్యులతో వైద్యశిభిరాలు ఏర్పాటుచేసి అందుకు సరిపడా మందులు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని అడిషనల్ జిల్లా వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డిని ఆదేశించారు. భీం వర్దంతికి ముఖ్యమంత్రి వస్తున్నందున హట్టి నుంచి జోడేఘాట్ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సిఐ ప్రసాదరావుకు సూచించారు. అనంతరం ఐటిడిఎ పివో కర్ణన్ మాట్లాడుతూ మ్యూజియం పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఈ నెల 14న తమకు అప్పగించాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. మ్యూజియం పనులను రాత్రి, పగలు పనులు చేసి పూర్తి చేయాలన్నారు. వర్ధంతి అయ్యే వరకు అధికారులు సెలవుపై వెళ్లవద్దన్నారు. మ్యూజియంలో పెయింటింగ్, తలుపులు, కిటికీలు అన్ని పనులను రెండు రోజుల్లో పూర్తి చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. వర్దంతి అయ్యేవరకు ట్రాన్స్‌కో లైన్‌మెన్ స్థానికంగా ఉంటూ విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు స్టాల్స్‌లను ఏర్పాటు చేయాలని, హెలిప్యాడ్, పార్కింగ్ పనులను సత్వరమే చేపట్టాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధి కోసం తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గోండు వీరుడు కొమురంభీంను గుర్తించి రూ.25కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది భీం ఖ్యాతిని కెసిఆర్ విశ్వవ్యాప్తం చేశారన్నారు. జోడేఘాట్ గ్రామస్తులకు 60డబుల్ బెడ్‌రూమ్‌లను మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పురాణం సతీష్ మాట్లాడుతూ గత పాలకులు కొమురంభీంను విస్మరించారని, ప్రత్యేక రాష్ట్రంలో కొమురంభీంకు కెసిఆర్ గుర్తింపునిచ్చారన్నారు. గతంలో కొమురంభీం వర్దంతికి వెళ్లాలన్నా ప్రజాప్రతినిధులను వెళ్లనిచ్చేవారు కాదని, హట్టి వద్దే పోలీసులు అడ్డుకునేవారని, కానీ స్వరాష్ట్రంలో మొట్టమొదటిసారి పోరుగడ్డలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివాసీలకు గుర్తింపునిస్తూ రూ.25కోట్లతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. కాంగ్రెస్, టిడిపి నాయకులు ఆదివాసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకొని లబ్దిపొందారు తప్ప వారి సంక్షేమాన్ని ఏరోజు పట్టించుకోలేదన్నారు. వర్దంతి వరకు అధికారులు ఎవరూ కూడా సెలవుపై వెళ్లవద్దని, 17న సెలవు ప్రకటించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు భారీగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జోడేఘాట్ పర్యాటక పనులను గొడుగు సహాయంతో పరిశీలించారు.
నిరుద్యోగులకు గిరి ఎక్స్‌ప్రెస్‌ల పంపిణీ
మండలంలోని హట్టి ఆశ్రమ పాఠశాల ఆవరణలో శనివారం జిల్లాలోని 13మంది గిరిజన నిరుద్యోగులకు టాటామ్యాక్స్, మహేంద్రా కంపెనీలకు చెందిన 13గిరి ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఎంపి నగేష్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఐటిడిఎ పివో కర్ణన్‌లు రిబ్బెన కట్‌చేసి వారికి అందించారు. జిల్లా మొత్తంగా గిరి ఎక్స్‌ప్రెస్‌లు 50పంపిణీ చేయడం జరిగిందని, ఇందులో భాగంగానే ఈరోజు 13మందికి పంపిణీ చేశారు. సిసిడిపి పథకం కింద (పిటిజి) కొలాం గిరిజనులకు మాత్రమే పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపి మాట్లాడుతూ మద్యం, గుట్కాలు సేవించి వాహనాలు నడపవద్దని హితవు పలికారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమీక్షా సమావేశంలో ఆర్డీవో ఐలయ్య, ఎంపిపి మాచర్ల గణేష్, సర్పంచ్ భీము, భీమ్ మనవడు కొమరం సోనేరావు, ఏపీవో నాగోరావు, డిడి రామ్మూర్తి, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌వో ప్రభాకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ కోవ దేవ్‌రావు, గిరిజన నాయకులు ఆత్రం లక్ష్మణ్, సిడాం జగన్నాథ్‌రావు, కుర్సింగ దండురావు, సిడాం అర్జు, ఆత్రం బొజ్జీరావు, కుడిమేత సోము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా వాంకిడి సిఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.