అదిలాబాద్

కౌటాల కస్తూర్బాలో పరిస్థితి మరింత విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల/సిర్పూర్ టి, నవంబర్ 17: బుధవారం రోజు భోజనం సక్రమంగా లభించక, అందించిన భోజనం నాణ్యంగా లేకపోవడంతో 23మంది విద్యార్థులు ఏకకాలంలో తీవ్ర అస్వస్థతకు గురై కలవరం రేపిన కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం రెండవ రోజైన గురువారం పరిస్థితి మరింత విషమంగా మారింది. తొలిరోజున అస్వస్థతకు గురైనవారిని ఎమ్మెల్యే కోనప్పలు సిర్పూర్ సామాజిక ఆస్పత్రిలో ప్రత్యేక చొరవతో మెరుగైన చికిత్సలు అందించగా, వారు కోలుకుంటున్న క్రమంలోనే గురువారం ఉదయం ముగ్గురు విద్యార్థినిలు వి.రాజేశ్వరి (7వ తరగతి), లావణ్య (9వ తరగతి), స్వాతి (10వ తరగతి)లను ఆస్పత్రికి పంపించగా, మద్యాహ్నం నుంచి నిమిషాల వ్యవధిలోనే విద్యార్థినిలు ఒక్కొక్కరిగా ఉన్న చోటే తీవ్ర అస్వస్థతకు లోనై కుప్ప కూలిపోవడం ప్రతీ ఒక్కరిని ఆందోళన కలిగించింది. ఇదే సందర్బంలో పూర్తి వివరాలను విచారణ చేస్తున్న ఎంపిపి చదువుల జ్యోతి శ్రీనివాస్, ఎస్సై అశోక్ కుమార్, ఎంపిడివో రాజేశ్వర్, విద్యాధికారి సోమయ్యలు ఈ విషయంపై ఒక్కసారిగా స్పందించి హుటాహుటిన విద్యార్థినిలను పోలీసులు, ప్రైవేటు వాహనాలకు చెందిన జీపుల్లో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఎంపిపి చదువుల జ్యోతి శ్రీనివాస్, ఎస్సై అశోక్‌కుమార్‌లు విద్యార్థినిలను భుజానికి ఎత్తుకొని ప్రత్యేక వాహనాల్లో ఆస్పత్రికి తరలించి వాహనం తిరిగి వచ్చే లోపే వరుసగా విద్యార్థినిలు పడిపోవడంతో ఒక్కసారిగా విద్యార్థినిల తల్లిదండ్రులు, బందువులు, అధికారులు సహా సిబ్బంది ఆందోళన చెందారు. పావని (6వ తరగతి), వనిత (6వ తరగతి), శ్రీదేవి 6వ తరగతి, దుర్గం అనిత (7వ తరగతి), ఉష (9వ తరగతి), సుమిత్ర (10వ తరగతి), సోని (10వ తరగతి), మమత (8వ తరగతి) కూడా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిని సిర్పూర్ సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సుమిత్ర పరిస్థితి కొంత ఆందోళన కరంగా ఉండటంతో ఆక్సిజన్‌తో చికిత్స అందిస్తున్నారు.
అధికారుల తనిఖీలు...రికార్డుల సీజ్
కస్తూర్బాలో విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థతకు గురైన విషయంపై ఎమ్మెల్యే కోనప్ప స్పందనతో ఆయన చొరవ మేరకు జిల్లా అధికార యంత్రాంగం చలించింది. ఇందులో భాగంగా గురువారం జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కృష్ణ నాయక్‌లు వేర్వేరుగా వసతి కస్తూర్బా వసతి గృహాన్ని సందర్శించి వాస్తవ పరిస్థితిని విద్యార్థులను అడిగి తెలుసుకోవడంతో పాటు, స్టోర్ రూమ్, వస్తువులు, పప్పు దినుసులు, విద్యార్థులకు వడ్డించిన అన్నం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దీంతో పాటే జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల విద్యాధికారి సోమయ్య, ఎంపిపి చదువుల జ్యోతి శ్రీనివాస్, ఎంపిడివో రాజేశ్వర్, ఎస్సై అశోక్ కుమార్‌తో కలసి విద్యార్థులను విచారించి వారి స్టేట్‌మెంట్ నమోదు చేయడంతో పాటు ప్రత్యేకాధికారి వీణ వసుందర నుంచి హాస్టల్‌కు సంబంధించిన పూర్తి రికార్డులను స్వాదీన పరుచుకొని సీజ్ చేశారు. అయితే తమకు ఆహారం సక్రమంగా ప్రత్యేకాధికారి అందించలేదని, ఆరోగ్యం విషయంలో కూడా పట్టించుకున్న పాపాన పోలేదని, అడిగితే గతిలేక హాస్టల్‌కు వచ్చిన మీరు పెట్టింది తిని ఉండాలని అంటోందని విద్యార్థినిలు పేర్కొన్నారు. ఈ సందర్బంలో ఎంపిపి జ్యోతి శ్రీనివాస్ ప్రత్యేకాధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేకాధికారిని సస్పెండ్ చేయాలని ధర్నా
కస్తూర్బాగాంధీ వసతిగృహంలో విద్యార్థినిల అగచాట్లకు, అనారోగ్యానికి కారణమైన ప్రత్యేకాధికారి వీణ వసుందరను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు, విద్యార్థుల బందువులు, తల్లిదండ్రులు, విద్యార్థినిలు గురువారం ధర్నాకు దిగారు. వసతి గృహం ప్రధాన ద్వారం వద్ద ఎబివిపి, ఎస్ ఎఫ్ ఐ, ఏ ఐ ఎస్ ఎఫ్ బాధ్యులు బాలకృష్ణ, ప్రవీణ్, దుర్గం రవీందర్‌లు ఈ సందర్బంగా మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రాణాలు గాల్లో దీపంలా మారడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ పరిస్థితికి కారణమైన ప్రత్యేకాధికారి వీణ వసుందరను తక్షణమే సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. పిల్లలంటే చులకనభావం కూడా ఉన్నవారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎంపిపి చదువుల జ్యోతి శ్రీనివాస్ విద్యార్థులను వారి కుటుంబీకులను సముదాయిస్తూ ఎమ్మెల్యే కోనప్ప పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని, బాధ్యులపై ఖచ్చితంగా చర్యలుంటాయని ఆందోళన వద్దని చెప్పగా, ఇదే సందర్బంలో ఎస్సై అశోక్ కుమార్ కూడా వారిని సముదాయించడంతో ధర్నా చేస్తున్నవారు శాంతించి వసతి గృహంలోకి వెళ్లిపోయారు.

అద్దెకు ఆర్టీసీ బస్సులు
* డివిఎం రమేష్
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 17: ప్రజలకు ఏ కార్యక్రమానికైనా ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వడం జరుగుతుందని ఆర్టీసీ డివిఎం రమేష్ అన్నారు. గురువారం ఆయన ఆదిలాబాద్ ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ప్రజలకు ఇక నుండి శుభకార్యాలు, పెళ్ళీళ్లు, తదితర కార్యక్రమాలకు ఆర్టీసి అద్దెబస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. గతంలో ఈ బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ ధరలు ఎక్కువగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను తగ్గించడం జరిగిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ నిర్దేశించిన సమయానికి అంతే చార్జీ ఉంటుందన్నారు. అదనంగా సమయాన్ని ఉపయోగించుకుంటే అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌కు కి.మీటర్‌కు సీజన్‌లో రూ.30, అన్‌సీజన్‌లో రూ.33 చెల్లించాల్సి ఉంటుందని, ఎక్స్‌ప్రెస్‌కు సీజన్‌లో రూ.36, అన్‌సీజన్‌లో రూ.38, డిలక్స్ బస్సుకు సీజన్, అన్‌సీజన్‌లో రూ.37, సూపర్‌లగ్జరి బస్సుకు రూ.38 చెల్లించాలన్నారు. ఈ చార్జీలు సంవత్సరమంతా వర్తిస్తాయని, గతంలో కంటే తగ్గింపు ధరలతో అద్దె బస్సలను యాత్రికులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకరావడం జరిగిందన్నారు. 330 కి.మీటర్లకంటే ఎక్కువగా తిరిగినట్లయితే ప్రతి రెండుగంటలకు ఒకసారి అదనపు చార్జీలు వేయడం జరుగుతుందన్నారు. ప్రజలు విషయం గమనించి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా సంస్థ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ డిఎం సాయన్న, అసిస్టెంట్ డిపో మేనేజర్ కల్పన తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంపై సిఐడి విచారణ
* దోషులను వదిలేది లేదు డిఎస్‌పి రవికుమార్
వాంకిడి, నవబంర్ 17: 2009నుండి 2014 వరకు వాంకిడి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని విజిలెన్స్ సిఐడి డిఎస్‌పి రవికుమార్ అన్నారు.గురువారం వాంకిడి మండలంలోని పలు గ్రామాల్లో విచారణ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలోని బండకాస,మోకాసిగూడ గ్రామాలల్లో విచారణ జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సవాతి పంచాయతీలోని బండకాస గ్రామానికి చెందిన 22 మంది ఇందిరమ్మ లబ్దిదారులను కలిసి వివరాలను సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు. చేపట్టి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్లు రుజువైందని,అయితే ఎంత వరకు అవినీతి జరిగిందో పూర్తి వివరాలతో సమచారాన్ని సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై పూర్తి స్ధాయి విచారణ జరిగి ఉన్నత అధికారులకు సమర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయనతోపాటు సిబ్బంది సర్వర్,సూర్యప్రకాష్‌లు పాల్గొన్నారు.
డిఎస్‌పి విచారణతో ఉలిక్కిపడ్డ అవినీతి పరులు
మండలంలో విజిలెన్స్ డిఎస్‌పి రవికుమార్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిని బయటికి తీయడానికి విచారణ చేపట్టడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆ కుంబకోణంతో సంబందం ఉన్న రాజకీయ నాయకులు,అధికారుల గుండేల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఈ విచారణ తిరిగి మొదలవ్వడంతో అవినీతి పరుల్లో ఉలికి పాటు మొదలైంది.చివరికి ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో, ఇంకెంత మందిని చుట్టుకొంటుందోనని వారు భయాంధోళనకు గురవుతున్నారు.

క్రీడాకారులతోనే దేశానికి కీర్తిప్రతిష్టలు
సిఐడి డిఎస్పీ పులియాల రవికుమార్
బెల్లంపల్లి, నవంబర్ 17: క్రీడాకారులతోనే దేశానికి కీర్తిప్రతిష్టలు పెరుగుతాయని వరంగల్ సిఐడి డిఎస్పీ పులియాల రవికుమార్ తెలిపారు. ఇటీవల బెల్లంపల్లి పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైన సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన రత్నం శారద, సెగ్గెం శ్రావణిలను పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పులియాల రవికుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మహారాష్టల్రోని ఔరంగాబాద్‌లో జరిగే జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఇద్దరు బాలికలు పాల్గొంటారని తెలిపారు. ఈ బాలికలకు ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున రూ.10 కాయిన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సభ్యులు ఎస్‌కె రాజ్‌మహమ్మద్, సాయిబాబా, ప్రిన్సిపాల్ ప్రసూన లత, పీ ఈటీ తోట రాదారాణి తదితరులు పాల్గొన్నారు.

జిన్నింగ్‌లో ప్రారంభమైన పత్తి కొనుగోలు
జిల్లాలోనే అత్యధిక ధర పలికిన పత్తి
వాంకిడి, నవంబర్ 17: మండలంలోని బాలాజీ జిన్నింగ్ మిల్లులో గురువారం నుండి పత్తి కొనుగోలు ప్రారంభమైంది.కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే మొదటి సారి క్వింటల్ పత్తికి 4900 రూపాయల ధర పలికింది.ఇప్పటి వరకు నమోదైన పత్తి ధరలో ఇదే అత్యదికం. ఆసిఫాబాద్,కాగజ్‌నగర్,వాంకిడి పత్తి మార్కెట్‌లల్లో ఇప్పటి వరకు క్వింటల్ పత్తి ధర 4700 నుండి 4850 రూపాయలు మాత్రమే పలికింది.గురువారం వాంకిడి మండల కేంద్రంలోని బాలాజి జిన్నింగ్‌లో మొట్ట మొదటిసారి క్వింటల్ పత్తి ధర 4900 పలకడంతో మండల పత్తి రైతులు పత్తి అమ్మకానికి బారులు తీరారు. ఈ ధర మరో రెండు,మూడు రోజులు కొనసాగుతుందని జిన్నింగ్ మిల్ యజమాని గాదే అవినాష్ తెలిపారు.

జిన్నింగ్ ఫ్యాక్టరీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
ఇచ్చోడ, నవంబర్ 17: మండలంలోని రాణి జిన్నింగ్ ఫ్యాక్టరీలో గురువారం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆకస్మికంగా తనిఖీ చేసి, పత్తి కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు. పత్తి ధర పెరగడంతో రైతులకు వ్యాపారస్తులు చెల్లిస్తున్న ధరపై అడిగి తెలుసుకున్నారు. క్వింటాలు పత్త్ధిర రూ.5050 పెరగడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, తూకాలలో తేడా రావద్దని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. రోజువారీగా మార్కెటింగ్ అధికారులు జిన్నింగ్ ఫ్యాక్టరీలకు వెళ్ళి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా సౌకర్యాలపై ఆరా తీయాలన్నారు. ఎమ్మెల్యే వెంట మార్కెటింగ్ అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

తూకంలో మోసాలు జరగకుండా పత్తి కొనుగోళ్లు
* మార్కెట్‌యార్డులో కనీస మద్దతు ధర కల్పించాలి
* ఇంద్రవెల్లి మార్కెట్‌యార్డును సందర్శించిన ఇన్‌చార్జి కలెక్టర్

ఆదిలాబాద్, నవంబర్ 17: రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మార్కెట్‌యార్డుల్లో కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు పత్తి తూకంలో, తేమ శాతం పేరిట మోసాలకు తావులేకుండా రైతులకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత అధికారులు, వ్యాపారులపై ఉందని ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తికొనుగోళ్ళ విధానంపై వ్యాపారస్తులతో ఇంచార్జి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించి, పత్తి కొనుగోళ్లలో పాటించాల్సిన నియమాలపై పలు సూచనలు జారీచేశారు. ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు రైతులు తీసుకువచ్చిన పత్తికి తూకం వేసిన అనంతరం జిన్నింగ్ మిల్లు వరకు రవాణా ఖర్చుల భారాన్ని రైతులపై రుద్దవద్దని సూచించారు. ప్రభుత్వ మద్దతు ధరకు తగ్గకుండా రైతుల నుండి పత్తి కొనుగోళ్లు జరుపాలని, తేమశాతం పేరిట, కోతల పేరిట ఇబ్బందులకు గురిచేయవద్దని కాటన్ వ్యాపారస్తులకు సూచించారు. అనంతరం ఇంద్రవెల్లిలోని ఆంధ్రాబ్యాంక్‌ను సందర్శించిన ఇంచార్జి కలెక్టర్ బ్యాంక్ ద్వారా ప్రజలకు అందిస్తున్న లావాదేవీలపై ఆరా తీసి, అక్కడున్న ప్రజలతో నోట్ల మార్పిడిలో ఎమైన ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకు సిబ్బంది సహకరిస్తున్నారని ఖాతాదారులు వివరించారు. బ్యాంకు అధికారులనుద్దేశించి ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైనంత డబ్బు నిల్వలు తెప్పించడంతో పాటు ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రజలకు రూ.100, రూ.50 నోట్లు అందుబాటులో ఉంచాలని ఆంధ్రాబ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించారు. అనంతరం ఇంద్రవెల్లిలోని పలు కిరాణ దుకాణాలను పరిశీలించి తూకం కాంటాలు సక్రమంగా ఉన్నాయో లేవో పరిశీలించి, తూకంలో ప్రజలకు నష్టం కల్పించినట్లయితే దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత ఉట్నూరు మండలం శాంపూర్‌లో రైతులు చేపడుతున్న పాలిహౌస్ కూరగాయాలు నర్సరీని ఇంచార్జి కలెక్టర్ సందర్శించారు. జిల్లాలోని రైతులు పాలిహౌస్ పథకానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం అందిస్తున్న రాయితీ రుణాల ద్వారా అధిక మొత్తంలో లాభాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ అధికారి ఆర్.సంతోష్‌కుమార్, ఇంద్రవెల్లి తహసీల్దార్ దేవిదాస్, ఇతర అధికారులతో పాటు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన సమావేశంలో ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ వసంత్‌రావు, జిన్నింగ్ వ్యాపారులు సంతోష్, నర్సద్ నాయక్‌లతో పాతు తదితరులు పాల్గొన్నారు.

రబీ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ చంపాలాల్
ఆసిఫాబాద్, నవంబర్ 17: జిల్లాలో రబీసాగుపై రైతుల్లో సరైన అవగాహన కల్పించి, అధిక దిగుబడికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చంపాలాల్ అన్నారు. రబీలో వేసుకునే ఆరుతడి పంటలపై వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో గురువారం ఆయన సమీక్ష జరిపారు. ప్రాజెక్టులు, చెరువుల్లో ఉన్న నీటి లభ్యతను బట్టి పంటలు వేసుకునేలా రైతులకుఅ అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై విత్తనాలు అందచేయాలన్నారు. మరోవైపు నకిలీ విత్తనాల బారిన రైతులు పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వారాబంది ప్రకారం ప్రాజెక్టులు, చెరువుల నుండి వదిలే నీటి వివరాలను ముందుగా విడుదల చేయాలన్నారు. నీటి పన్ను వసూళ్లును పూర్తి చేయాలని ఆయన తహశీల్దార్లను ఆదేశించారు. మిషన్ కాకతీయ ఫేస్ 1, 2 ద్వారా 13.500 ఎకరాలకు నీరు పారకం జరుగుతుందని, జైకా నిధుల కింద చేపట్టిన పనులతో మరో 10వేల ఎకరాలకు సాగునీరందివ్వవచ్చని, ఇందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలు సిధ్దం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. రబీలో ఎక్కువగా కూరగాయలు పండించేలా ఉద్యాన వన, హార్టికల్చర్ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
కస్తూర్బా పాఠశాలలను తనిఖీ చేయాలి
జిల్లాలోని ఆయా మండలాల్లో పని చేస్తున్న తహశీల్దార్లు తప్పని సరిగా తమ పరిధిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు దృష్టికి వచ్చినా వెంటనే తెలియ చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను పెండింగ్‌లో లేకుండా చూడాలని సూచించారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి అద్వైత్‌కుమార్ సింగ్, ఇరిగేషన్ ఇఇ గుణవంత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అలీమ్ అహ్మద్, ఇరిగేషన్ ఎ ఇలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

పెద్దనోట్లు రద్దుచేస్తే ఉలిక్కిపడతారెందుకు..?
కెసిఆర్ నల్లధనంపై అందరికీ అనుమానాలు
నిప్పులు చెరిగిన టిడిపి అధినేత రమణ

ఆదిలాబాద్, నవంబర్ 17: నల్లధనం వెలికితీత కోసం ప్రధాని నరేంద్రమోది పెద్దనోట్లను రద్దుచేస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ స్వాగతించాల్సింది పోయి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించడం పలు అనుమానాలకు ఆస్కారం కల్గిస్తోందని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కోర్టులో కేసు విచారణకు హాజరైన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎల్.రమణ, టిటిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి రాథోడ్ రమేష్‌తో కలిసి మాట్లాడారు. దేశంలో లక్షలాది కోట్ల నల్లధనాన్ని కుబేరుల నుండి వెలికితీసేందుకే మోది సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ హర్షిస్తున్నారని, ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడం ద్వారా ఆయన వద్ద బ్లాక్‌మనీ నిల్వలు ఉన్నట్లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. అసలే ప్రజా అవసరాలకు నిధుల కొరతతో రాష్ట్రం అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి కెసి ఆర్ విలాసవంతమైన జల్సాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రమణ దుయ్యబట్టారు. రాష్టప్రతి భవన్‌లో 130 గదులు ఉంటే ఇందుకు పోటీగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాత భవనాలను కూల్చివేస్తూ ఆధునాతన విలాసవంతమైన 150 గదుల భవన నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు ఖర్చుచేయడం ఎంతమేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓవైపు రుణమాఫీ అమలుజరగకా పంట దిగుబడులు చేతికి రాక నష్టాల ఊబిలో పడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి కుటుంబం మాత్రం ఇవేమి పట్టించుకోకుండా విలాసవంతమైన ఖర్చులతో దుబారచేస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా గత మూడేళ్లలో కూతురు కవిత కోసం బతుకమ్మల పేరిట రూ.30 కోట్లు దారపోశారని, తెలంగాణలో రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండి ఒక్క రోజులో హైదరాబాద్‌కు తిరిగివచ్చే పరిస్థితి ఉండగా తనయుడు కెటి ఆర్ మాత్రం హెలిక్యాప్టర్ ద్వారా పర్యటనలు గావిస్తూ ప్రజలపై పెనుభారాన్ని రుద్దుతున్నారని రమణ విమర్శించారు. మరోవైపు అల్లుడు హరీష్‌రావు నియోజకవర్గంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నా చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. మిషన్ భగీరథ కోసం ఇతర సంక్షేమ పద్దుల నిదులను దారిమళ్ళిస్తూ అవినీతికి తెరదీస్తున్నారని, కేంద్రం గత ఏడాది రైతుల ఇన్‌పుట్ సబ్సిడి పరిహారం కింద తెలంగాణకు రూ.798 కోట్లు విడుదల చేస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నిధులను ఇతర పథకాలకు మళ్ళించారని ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక లోటుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలపై అప్పుల భారాన్ని రుద్దుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని, ప్రజల సమస్యలను పక్కనపెట్టి పార్టీని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. గతంలో రైతు బ్యాంక్ ద్వారా తీసుకున్న పంట రుణం రూ.15వేలు ఉంటే ముఖ్యమంత్రి కెసిఆర్ మోసపూరిత హామీల వల్ల రూ.40వేలకు చేరుకుందని, రుణమాఫీ, ఫీజురియంబర్స్‌మెంట్, పంట నష్టపరిహారం నిధులు వెంటనే విడుదల చేయాలని రమణ డిమాండ్ చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో టిటిడిపి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ యూనిస్ అక్బాని, నిర్మల్ జిల్లా కన్వీనర్ లోలం శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.