అదిలాబాద్

నోట్ల కష్టాలు తీర్చేందుకు ముందుకు రావడం అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను గుర్తించి సామాన్య ప్రజలకు మొబైల్ ఏటి ఎం ద్వారా నగదును అందజేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య అన్నారు. గురువారం పట్టణంలోని పాత బస్టాండ్‌లో మారుతిమెగామార్ట్ యజమాని ఆమెడ దేవెంధర్ సొంత ఖర్చులతో మొబైల్ ఏటి ఎంను ప్రారంభించారు. ఈ ఎటి ఎంను ప్రారంభించిన జెసి మాట్లాడుతూ ఈ పివొయస్ మిషన్ ద్వారా ఎలాంటి అదనపు రుసుము వసూలుచేయకుండా తమ డెబిట్ కార్డులతో ప్రజలు రూ.2 వేల వరకు పొందవచ్చని తెలిపారు. ప్రజల కష్టాలను గుర్తించి సేవాభావంతో ఈ సదుపాయాన్ని కల్పించిన వ్యాపారిని అభినందించారు. కేవలం బ్యాంకులు, పోస్ట్ఫాసులే కాకుండా వ్యాపారులు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్రమోడి తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి, రేణుకాదాస్, తదితరులు పాల్గొన్నారు.

ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ ఎన్నిక
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 1: భారత మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ప్లీనరీ సమావేశం భజరంగ్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించగా, కేంద్ర కమిటీ సభ్యులు పల్లెపు ఉపేందర్ రెడ్డి అధ్వర్యంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల నుండి 10 సుమారు 100 మంది సభ్యులతో సమావేశం నిర్వహించగా, 9 మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి కుంటాల రామన్న ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కుంటాల రాములు మాట్లాడుతూ మూత పడ్డ సిమెంట్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని, తాంసి బస్టాండ్ వద్ద రైల్వేలైన్‌పై ఓవర్‌బ్రిడ్జిని నిర్మించాలన్నారు. అదే విధంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు అర్హులైన పేదలకు డబుల్‌బెడ్‌రూంలు మంజూరి చేయాలని, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు వేముల లక్ష్మీ, ఏముల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొడదాం
* జిల్లా కలెక్టర్ చంపాలాల్
ఆసిఫాబాద్, డిసెంబర్ 1: ప్రాణాంతక ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు నడుం కట్టాలని కుమ్రం భీం జిల్లాకలెక్టర్ చంపాలాల్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మందులే లేని ఈవ్యాధి ఓ మనిషి నుండి మరో మనిషికి సోకదని, రక్తమార్పిడి, కలుషిత సిరంజీల కారణంగా ఈవ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. ముందు జాగ్రత్త చర్యలతోనే ఈవ్యాధిని నివారించ వచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రజల్లో ఈప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సూచించారు. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న రోగుల పట్ల ప్రేమాభిమానాలు చూపాలని, వారిని సమాజం నుండి వెలివేయ కూడదని పేర్కొన్నారు. ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా ఈ వ్యాధి గ్రస్థులు దీర్ఘకాలం పాటు జీవించే వీలుందని తెలిపారు. జిల్లాలో గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా 90 వేల మంది నండి రక్తనమూనాలు సేకరించగా వీరిలో 508 మందికి ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు వెల్లడైందన్నారు. ఈవ్యాధి గ్రస్థులకు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. అంతకుముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, అధికారులు ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈసందర్భంగా అంతరాష్ట్ర రహదారిపై మానవహారం ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటి ఛైర్మెన్ గంధం శ్రీనివాస్, ఎంపిపి తారాబాయి, డిఎంహెచ్‌ఓ సుబ్బారాయుడు, వైద్యులు సుధాకర్ నాయక్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

ఎయిడ్స్‌వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం
* హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులను సమాజం ఆదరించాలి
* జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తొడసం చందు

ఆదిలాబాద్, డిసెంబర్ 1: ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలు విడనాడి సమాజంలో వారిని ఆదరించి, వ్యాధి నిర్మూలనకు సంఘటితంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తొడసం చందు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును రిమ్స్ డైరెక్టర్‌తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ తొడసం చందు మాట్లాడుతూ హెచ్‌ఐవి వ్యాధి ప్రాణాంతకం కాదని, వ్యాధి సోకిన వారు ఎలాంటి అపోహలకు గురికావద్దని, వ్యాధి నివారణకు మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు. అదే విధంగా హెచ్‌ఐవి వ్యాది సోకకుండా ముందస్తు నివారణలు తీసుకోవాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 2016 అక్టోబర్ నాటికి 2లక్షల 4వేల 807 మంది స్వచ్చందంగా హెచ్ ఐవి పరీక్షలు చేయించుకోగా వారిలో 1385 మందికి హెచ్‌ఐవి నిర్ధారణ జరిగిందని, వీరిలో 793 పురుషులు ఉండగా 488 మంది మహిళలు, 102 మంది గర్భిణీ స్ర్తిలు ఉన్నారని అన్నారు. 2012 నుండి హెచ్ ఐవి సోకిన గర్భిణీ స్ర్తిలకు 14వ వారం నుండి నూతన చికిత్స విధానం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని, దీని వలన తల్లిబిడ్లకు హెచ్‌ఐవి వ్యాధి సోకే అవకాశం 30 శాతం నుండి 5 శాతం తగ్గించవచ్చన్నారు. జిల్లాలోని 1429 మంది హెచ్‌ఐవి బాధితులకు రిమ్స్, ఆదిలాబాద్, ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఆర్‌టి కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నామన్నారు. హెచ్‌ఐవి సోకిన వ్యక్తులు ఆత్మస్థైర్యంతో మంచి జీవితం గడపడానికి ఆదిలాబాద్‌లోని హెచ్‌ఐవి పాజిటీవ్ పీపుల్ నెట్‌వర్క్ సంస్థ ద్వారా వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచి సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జోగు ఫౌండేషన్, రమ అశోక్ చారిటేబుల్ సంస్థ ద్వారా హెచ్ ఐవి వ్యాధి గ్రస్తులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం నుండి వినాయక్ చౌక్, రైతు బజార్, ఎన్టీ ఆర్ చౌక్ మీదుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, హెచ్ ఐవి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై నినాదాలు చేశారు. సమావేశంలో ఎయిడ్స్ ఇజల్లా పోగ్రాం అదికారి డాక్టర్ శోభ పవార్, డిప్యూటి డిఎంహెచ్‌వో డాక్టర్ సాధన, జోగు ఫౌండేషన్‌సంస్థ చైర్మెన్ జోగు ప్రేమేందర్, జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి ఉమా దేవి, జిల్లా రెడ్‌క్రాస్ సోసైటి కార్యదర్శి రాంచందర్ మహాత్మే, సామాజిక కార్యకర్త బండారు దేవన్న, ఆదిలాబాద్ పీపుల్స్ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ సరిత, వైద్య శాఖ డిపిఎంలు, మెడికోలు, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్చంద సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎయిడ్స్ నియంత్రణకు ప్రతీ ఒక్కరు కృషిచేయాలి
* జిల్లా కలెక్టర్ ఇలంబరిది
నిర్మల్, డిసెంబర్ 1: ఎయిడ్స్ నియంత్రణకు ప్రతీ ఒక్కరు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలంబరిది అన్నారు. గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్‌లో నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎయిడ్స్ నియంత్రణకు ప్రతీ ఒక్కరు తమ బాధ్యతగా గుర్తించి కృషిచేయాలన్నారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుండి ఈర్యాలీ ప్రారంభం కాగా పాతబస్టాండ్ మీదుగా రైతు బజార్ వరకు సాగింది. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ విద్యార్థులు ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్‌వొ జలపతినాయక్, అదనపు డి ఎం అండ్ హెచ్‌వొ శ్రీనివాస్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ పట్టణాభివృద్ధి కృషి
* మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 1: పట్టణంలోని 36 వార్డుల అభివృద్దికి కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా అన్నారు. గురువారం పట్టణంలోని 6వవార్డులో సిసి రోడ్డు, మురికి కాలువల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సంధర్భంగా చైర్‌పర్సన్ మనీషా మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణాన్ని అందాల ఆదిలాబాద్‌గా తీర్చిదిద్దడానికి పార్టీలకతీతంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ గ్రామాలు, పట్టణాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, దీనిలో భాగంగానే కోట్లాది నిధులతో అంతర్గత సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణంలోని ప్రజలకు వచ్చే రెండేళ్లలో తాగునీటి కష్టాలను తీర్చేందుకు మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి శుద్దజలం అందించడం జరుగుతుందని, ఈ పథకం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగమల్లేశ్వర్‌రావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
* నీతి ఆయోగ్ సిఈవో సుబోత్‌కాంత్

ఆదిలాబాద్, డిసెంబర్ 1: దేశవ్యాప్తంగా ప్రజల్లో నగదు రహిత లావాదేవీలపై విస్తృత అవగాహన కల్పించడమే గాక వ్యాపార వాణిజ్య రంగంలో డిజిటల్ విధానంతో నగదు మార్పిడిలు, కొనుగోళ్లకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇందుకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామని నీతి ఆయోగ్ సిఈవో సుబోత్ కాంత్ జిల్లా కలెక్టర్లు, అధికారులకు సూచించారు. గురువారం దేశరాజధాని నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ లావాదేవీల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రస్తుతం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న నగదు లావాదేవీల సమస్యలను పరిష్కరించడానికి గాను గ్రామ, పట్టణ ప్రజలకు డెబిట్‌కార్డులు, క్రెడిట్‌కార్డు, ఆన్‌లైన్ నగదు చెల్లింపులపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, బ్యాంకుల ద్వారా డిజిటల్ పేమెంట్స్ నిర్వహణ కోసం యుపి ఐ, యు ఎస్ ఎస్‌బి, డెబిట్‌కార్డ్స్, ప్రీపేడ్ కార్డ్స్, వాలెట్స్, ఆధార్ అనేబుల్ పేమెంట్ ద్వారా చెల్లింపుల కొరకు మోబైల్ ఫోన్ ద్వారా బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసి నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, బ్యాంకు అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా నగదు మార్పిడిలు, వివిధ రకాల కొనుగోళ్ళ నిర్వహణకు పలు మార్గదర్శకాలు జారీ చేసి అమలు చేయాలన్నారు. మోబైల్ బ్యాంకింగ్ విధానం అమలుపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి, సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి, ఎల్‌డిఏం జె.ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి రాజేశ్వర్ రాథోడ్, మున్సిపల్ కమీషనర్ మంగతయారు, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, ఎన్‌ఐసి డిఐవో రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

నగదురహిత లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలి
* జిల్లా కలెక్టర్ ఇలంబరిది
నిర్మల్, డిసెంబర్ 1: జిల్లాస్థాయి అధికారి నుండి గ్రామస్థాయి అధికారి వరకు ప్రతీ ఒక్కరికి నగదు రహిత లావాదేవీల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఇలంబరిది అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, బ్యాంకర్లతో డిజిటల్ చెల్లింపులు, లావాదేవీలపై నిర్వహించిన పవర్ ప్రజెంటేషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ జిల్లాలోనగదు రహిత లావాదేవీలు నిర్వహించనున్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు డిజిటల్ చెల్లింపులపై వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతీశాఖ డిజిటల్ చెల్లింపులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ ఫీల్డ్ అసిస్టెంట్లకు, కూలీలకు డిజిటల్ పేమెంట్స్‌పై అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఐసిడి ఎస్, డి ఎస్‌వొ, విద్యాశాఖ, కార్మికశాఖ, వైద్యశాఖలు అవగాహన పెంపొందించుకుని క్షేత్రస్థాయి సిబ్బందికి నేర్పించాలన్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆసుపత్రుల వద్ద పివొయస్ మిషన్లను ఏర్పాటుచేసి నగదు రహిత లావాదేవీలు జరగేటట్లు చూడాలని డిఎం అండ్‌హెచ్‌వొకు సూచించారు. అంతేకాకుండా కిరాణా దుకాణాల వద్ద, రేషన్ షాపుల వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్మికులకు ఇబ్బందులు కలగకుండా బ్యాంక్ ఖాతాలను ప్రారంభించి డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూడాలని కార్మికశాఖ అధికారిణి ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ శ్రీనివాస్ నగదు రహిత డిజిటల్ చెల్లింపులు ఎలా చేయాలో, ఎన్ని విధాలుగా చేయవచ్చో పవర్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. యు ఎస్, ఎ ఎస్‌డి, యుపి ఐ, ఈ-వ్యాలెట్, పివొయస్, ఎ ఈపియస్ విధానాల ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య, లీడ్‌బ్యాంక్ మేనేజర్ ప్రసాద్, ఎస్‌బిహెచ్ మేనేజర్ మృత్యుంజయ్ ప్రధాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మాటల్లోకాదు.. చేతల్లో సమాజసేవ
* విద్యాభివృద్ధికి కోనప్ప సేవలు అమోగం
* మధ్యాహ్న భోజన ప్రారంభోత్సవంలో మంత్రి జోగు రామన్న
కౌటాల, డిసెంబర్ 1: మారుమూల ప్రాంతంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్ని వర్గాల ప్రజలకు చేరువగా ఉంటూ సమాజసేవకు అంకితమైన నేతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని రాష్ట్ర అటవీ,పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న కొనియాడారు. గురువారం సిర్పూర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప ట్రస్టు ద్వారా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రారంభించిన మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రితో పాటు ఇన్‌చార్జి జడ్పీ చైర్మెన్ మూల రాజీరెడ్డి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి, కొమురం భీం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రామన్న మాట్లాడుతూ కోనేరు కోనప్ప సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయమని, ఆయన చేసే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వానే్న ఆలోచింపజేస్తూ ఆయన కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుందన్నారు. పేదల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవిశ్రాంతంగా కృషి చేస్తుండగా నియోజకవర్గంలోని ప్రజల కోసం, విద్యార్థుల కోసం కోనప్ప కూడా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మూడేళ్లుగా నిర్వహిస్తున్న ఈ అన్నదానంతో ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం అత్యంత ఆనందదాయకమైతే ఇదే సంధర్భంలో వారికి కడుపునిండా భోజనం పెట్టిన భాగ్యం, తృప్తి కోనప్పకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్న కెసి ఆర్, పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ కడుపునిండా పౌష్టికాహారం తినేందుకు సన్నబియ్యంతో భోజనం పెట్టడం జరుగుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఏ పాలకులు చూపని శ్రద్ధ విద్యారంగంపై తమ ప్రభుత్వం పెట్టిందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు 140 ప్రారంభించగా, మరో 90 పాఠశాలలు మంజూరి చేయడం జరిగిందన్నారు. రెండేళ్లలో 250 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించిన ప్రభుత్వం, బిసిల కోసం 119 రెసిడెన్షియల్ పాఠశాలలను వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రారంభించనుందని, విద్య అనే ఆయుదం ఉంటే ఎవరూ మనన్ని ఓడించలేరని, అది లేకుంటే ఎక్కడైనా ఓడిపోతామని విద్యార్థులకు ఉద్బోదించారు. ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన కెసి ఆర్ ప్రారంభించిన షాదిముబారక్, కళ్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూం తదితర కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తున్నాయని, పారిశ్రామిక రంగంలో గుజరాతును వెనక్కినెట్టి మన ముఖ్యమంత్రి దేశంలోనే మొదటి స్థానంలో నిలువడం ఆయన చిత్తశుద్దికి నిదర్శణమన్నారు. ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకై విద్యార్థులు నడుం భిగించి ప్రతి ఇంటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని విద్యార్థిని, విద్యార్థులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎంత సేవ చేసిన తక్కువేనని, పేదరికాన్ని జయించేందుకు విద్యార్థిని, విద్యార్థులు విద్యాపరంగా ఎదగాలనే సంకల్పంతో 60 నుండి 80 కిలో మీటర్లు ప్రతినథ్యం ఆర్టీసి బస్సులో ప్రయాణించి, ప్రభుత్వ కళాశాలలకు వస్తున్నారని, ఈ తరుణంలో వారికి ఆకలిబాధను తీర్చడం తన కనీస ధర్మమని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం కోసం తాను ప్రయత్నానికి ఎంతో మంది దాతలు తమవంతుగా సహకరించారని, ప్రస్తుతం కూడా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈసారి ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను నియోజకవర్గంలోని 8, 9, 10వ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకు 11వేల పుస్తకాలు అందించడం జరిగిందని, అదే విధంగా కోనేరు చారిటేబుల్‌ట్రస్టు అధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థిని విద్యార్థులకు చలిభారి నుండి రక్షణ కోసం అందరికి రగ్గులను అందించామని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకంటే తానే ఎక్కువగా సంతోషిస్తానని, విద్యార్థులు ఆమేరకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతమైన కౌటాల ప్రభుత్వ కళాశాలల్లో 750 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని, వారు పట్టుదలతో చదువుతున్న పద్దతిని చూసేందుకు డిప్యూటి సిఎంతో పాటు ఇతర ముఖ్యులను తీసుకవచ్చి పరిస్థితిని మరింత బాగుపర్చేందుకు మంత్రి రామన్న కృషి చేయాలని, మారుమూల ప్రాంతమైనందునా అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా మధ్యాహ్న భోజన ప్రారంభానికి హాజరైన మంత్రితో పాటు ఇతర ప్రముఖులంతా కోనేరు చారిటేబుల్ ట్రస్టు తరుపున నియోజకవర్గంలోని 2200 మంది విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యే వరకు చేపట్టే మధ్యాహ్న భోజనంపై ప్రశంసించారు. దీంతో పాటు ఉర్దూ కళాశాల అధ్యాపకులకు సంబంధించి వేతనాలు అందని విషయంపై ఎమ్మెల్యే కోనప్ప పలువురు దాతల సహకారంతో కలిసి లక్షా 50వేలు వేతనాలుగా అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పద్మసత్యనారాయణ, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్‌రావు, నాన్నయ్య, లక్ష్మణ్, రాంనాయక్, స్థానిక నాయకులు హన్మండ్లు, దామోదర్‌రావు, వెంకయ్య, రవిందర్, కట్ట ప్రసాద్, జాకిర్ షరీఫ్, కోనేరు కృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు.