అదిలాబాద్

ముదురుపాకాన మున్సిపల్ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 6: జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ బల్దియాలో టీ ఆర్ ఎస్ గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరడంతో పరిపాలనపై ప్రతిష్టంభన నెలకొంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో మంత్రి జోగురామన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషాల మద్య ఆధిపత్య పోరు ముదురుపాకాన పడడంతో పరస్పర ఫిర్యాదులు, రాజకీయ ఒత్తిళ్ళ నడమ అధికారులు, ఇంజనీర్లు నలిగిపోతున్నారు. పట్టణాభివృద్ది, సమస్యలపై ఏమాత్రం దృష్టిసారించని కౌన్సిలర్లు ప్రతి సమావేశంలోనూ పరస్పర నిందారోపణలతో సమావేశాలు సాగించడం పరిపాటిగా మారింది. గత ఏడాది మంత్రి జోగురామన్న, చైర్‌పర్సన్ మనీషాల మద్య అధిపత్య పోరు వ్యవహారం మంత్రి కెటిఆర్ వరకు వెళ్లడంతో ఇరువర్గాలను మంత్రి సముదాయించి సమస్యను సద్దుమనిగేలా చేశారు. తిరిగి ఇటీవల పట్టణంలోని వివిధ వార్డుల్లో అభివృద్ది పనుల వ్యవహారంలో తమకు పనులు దక్కడం లేదని అలకబూనిన కౌన్సిలర్లు గ్రూపులుగా విడిపోయి మున్సిపల్ కేంద్రంగా రాజకీయాలు సాగించడం ఆసక్తికరంగా మారింది. మంత్రి వర్గీయులుగా ఉన్న కొందరు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఆకస్మికంగా వేకువజామునే వార్డుల్లో తనిఖీలు చేయడం, నాసిరకం సామాగ్రి, పనులపై ఫిర్యాదు చేయడం, మరోవైపు బినామీ పారిశుద్ద్య కార్మికుల పేరుపై ప్రతినెల డబ్బులు తీసుకోవడం మున్సిపాలిటీలో అలజడి సృష్టించింది. ఈ వ్యవహారం మరింత ముదరగా రిజినల్స్ ఆండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చైర్‌పర్సన్‌పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంపై చైర్‌పర్సన్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌కింద 36 వార్డుల్లో మున్సిపల్ ఇంజనీర్లు పర్యటించి కొలతలు తీసుకోవడం వెనక మంత్రి జోగురామన్న ఉద్దేశపూర్వకంగానే తమను చెక్‌పెట్టడానికి రాజకీయాలు సాగిస్తున్నారని చైర్‌పర్సన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఒక్కో వార్డులో 60 లక్షల విలువైన డ్రైనేజీలు, సిసి రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్దం చేయగా ఈ విషయం తమకు తెలియకుండా ఒక వర్గానికి ఇంజనీర్లు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ చైర్‌పర్సన్ వారిపై మండిపడి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంతేగాక తనకు సమాచారం ఇవ్వలేదని మున్సిపల్ ఇంజనీర్లు, ఇద్దరు డిఈలు, ఐదుగురు ఏఈలకు షోకాజు నోటీసులు జారీ చేయడం బల్దియాలో కలకలం రేపుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మద్య తాము నలిగిపోతున్నామని, ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కొందరూ అధికారులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటే మరికొందరూ మాత్రం మంత్రి జోగురామన్న దగ్గర తమ గోడు వెల్లబోసుకున్నారు. చైర్‌పర్సన్ రంగినేని మనీషా మాత్రం రాజకీయ పట్టుసడలకుండా తన వర్గం కౌన్సిలర్లకు భరోసా కల్పిస్తూ ప్రత్యర్థి రాజకీయాలపై అమితుమీకి సిద్దం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

పెండింగ్ కేసుల దర్యాప్తులో డిఎస్పీలే కీలకం
* డిఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ శ్రీనివాస్
ఆదిలాబాద్ రూరల్, జనవరి 5: శాంతి భద్రతల పర్యవేక్షణలో సిఐ, ఎస్సైలకు డిఎస్పీలు మార్గదర్శకులుగా వ్యవహరిస్తూ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం స్థానిక డిఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేశారు. ఎస్పీ ముందుగా సాయుధ పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డిఎస్పీ స్థాయిలో దర్యాప్తు చేసే ఎస్సీ, ఎస్టీ కేసులు, మహిళ హత్యకేసులకు సంబంధించి దస్త్రాలను పరిశీలించి, పెండింగ్ కేసులను డిఎస్పీ ఏ.లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ పోలీసు స్టేషన్లను ఉట్నూరు డివిజన్‌లో చేర్చడం వల్ల ఆదిలాబాద్ డివిజన్ అధికారిపై పనిభారం తగ్గిందని, దీంతో కేసుల దర్యాప్తు వేగవంతంగా సాగే అవకాశం ఏర్పడిందన్నారు. పోలీసు వ్యవస్థను ఆధునీకరించేందుకు రాష్ట్రప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు శ్రీకారం చుడుతుందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా పోలీసులకు ఇంటర్‌నెట్ కనెక్షన్‌తో కూడిన సిమ్‌కార్డులను ఉచితంగా అందజేయడం జరుగుతుందని, త్వరలో నెలకు వన్‌జిబి డాటాతో పాటు రూ.100 టాక్‌టైమ్ ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో విశేష కృషి చేస్తున్న జిల్లా పోలీసులు టెక్నాలజీ రంగంలో సైతం ముందుండాలనే లక్ష్యంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. పోలీసులు, హోంగార్డులు విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, ఎటువంటి సమస్యలున్నా నేరుగా సంప్రదించాలని సూచించారు. పోలీసుల సంక్షేమానికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు. నేరం చేసి (మిగతా 3వ పేజీలో)

ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలంటూ మృతదేహంతో రాస్తారోకో
* రెండు గంటలపాటు స్తంభించిన రాకపోకలు
ఇచ్చోడ, జనవరి 5: గుడిహత్నూర్ బస్టాండ్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొని శృతి(11) అనే విద్యార్థిని మృతి చెందగా గురువారం గ్రామస్తులు, విద్యార్థులు మృతదేహంతో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారికి ఇరువైపుల సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో రెండు కి.మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సంధర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బస్టాండ్ సమీపంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి మరణిస్తున్నారని, గతంలో అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం ఈ ప్రమాదాల సంఖ్య పెరుగుతూ పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణం జరిగే సమయంలో సదరు కాంట్రాక్టర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడంతోనే ప్రమాదాలు సంభవిస్తున్నాయని వారు అన్నారు. బస్టాండ్ సమీపంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, రోడ్డు క్రాస్‌చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దాటాల్సి వస్తోందని అందోళన వ్యక్తం చేశారు. బస్టాండ్ ప్రక్కనే పాఠశాలలు ఉండగా విద్యార్థులు ప్రతి రోజు రోడ్డు దాటడానికి జంకుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బస్టాండ్ సమీపంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా రాస్తారోకోను విరమింపజేయడానికి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కృషి చేసినప్పటికీ ఫలించలేదు. జిల్లా కలెక్టర్ లిఖిత పూర్వకంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇస్తేనే అందోళనను విరమిస్తామని వారు స్పష్టం చేయడంతో ఇక్కడి పరిస్థితిని జిల్లా అధికారులకు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అందోళన కారులకు నచ్చజెప్పి త్వరలోనే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించి, రోడ్డు ప్రమాదా లు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా, లిఖిత పూర్వకం గా ఇవ్వాలంటూ గ్రామస్తులు పట్టుపట్టారు. దీంతో జెసి కృష్ణారెడ్డి లిఖితపూర్వకంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో అందోళనకారులు రాస్తారోకోను విరమించుకున్నారు.

ఆరుబయట మలవిసర్జన ఆరోగ్యానికి హానికరం
* కలెక్టర్ ఆర్వీ కర్ణన్
మంచిర్యాల, జనవరి 5: ఆరుబయట మలవిసర్జన ఆరోగ్యానికి హానికరమని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గురువారం పట్టణంలోని 5 వ వార్డు వాల్మికి నగర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్బంగా 5వ వార్డు ప్రాంతంలో మరుగుదొడ్లు లేక ప్రాంత వాసులు మల విసర్జన ఆరుబయట చేస్తున్నారని తెలిసి ఆగ్రహాం వ్యక్తం చేసారు. స్వచ్ఛ భారత్ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించుకోవాలన్నారు. వార్డులోని ప్రజలతో మాట్లాడుతూ దాదాపు 600 మంది నివసించే ఈ ప్రాంతంలో ఏ ఒక్కరు వ్యక్తి గత మరుగుదొడ్డి లేక పోవడం, ఏండ్ల తరబడి మరుగుదొడ్లు ఎందుకు నిర్మించుకోలేరని ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తున్న ఈ పథకాన్ని ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారని ప్రాంత వాసులను అడిగి తెలుసుకున్నారు. ఆరు బయట మల విసర్జన వల్లన మనకు, మన పిల్లలకు మలేరియా, డయేరియా వ్యాధులు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంట్లో టి వి , ఫ్రిడ్జి, తప్పక భావిస్తారో మరుగుదొడ్ల నిర్మాణం కూడా అదే విధంగా భావించాలన్నారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ వెంకన్నను ఆదేశిస్తూ వార్డులో 3 ప్రదేశాలలో 5 మరుగుదొడ్ల నిర్మాణం చొప్పున 15 మరుగు దొడ్లను పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో ఈ నెల 26 లోగా నిర్మించి ప్రాంత వాసులకు ఉపయోగ పడే విధంగా చూడాలని ఆదేశించారు. పిల్లలను పనుల పేరుతో బడికి మాన్పించరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ వీరబ్రహ్మయ్య, మున్సిపల్ కమీషనర్ వెంకన్న, ప్రాంత వాసులు, తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన భోజనం
* కలెక్టర్ ఇలంబరిది
లోకేశ్వరం, జనవరి 5: అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు పౌష్టికాహారం, ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మంచి చదువును అందజేసి వారి ఎదుగుదలకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలంబరిది సూచించారు. గురువారం మండలంలోని మన్మద్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం,ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందస్తు టూర్ ప్రొగ్రాం ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఐసిడి ఎస్ సూపర్‌వైజర్‌ను విధుల నుండి సస్పెండ్‌చేసేందుకు నోటీసులను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే సెలవుకోసం దరఖాస్తు పెట్టకుండా విధులకు గైర్హాజరైన అంగన్‌వాడీ టీచర్‌కు షోకాజు నోటీసును జారీచేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. అనంతరం పొట్‌పెల్లి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు, తాగునీటి కోసం ఏర్పాటుచేయనున్న అంతర్గత పైప్‌లైన్ల నిర్మాణం పనులపై గ్రామస్తులతో చర్చించి పలు సూచనలుచేశారు. గ్రామంలో నగదురహిత లావాదేవీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఐసిడి ఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.విజయలక్ష్మి, సర్పంచ్‌లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి
* జాయింట్ కలెక్టర్ శివలింగయ్య
నిర్మల్, జనవరి 5: ప్రజాస్వామ్య పటిష్టత కోసం 18 సంవత్సరాలు నిండిన ప్రతీ యువతీ, యువకులు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదుచేసుకోవాలని నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య సూచించారు. గురువారం పట్టణంలోని సోమవార్‌పేట్‌లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు ఆవశ్యకతపై నిర్వహించిన డిజిటల్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటరు జాబితాలో తమపేరు నమోదుచేసుకునేందుకు ప్రతీ ఒక్కరు సన్నద్దం కావాలన్నారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదై ఓటింగ్‌లో వందశాతం తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు ఎలా వేయాలి, పోలింగ్‌స్టేషన్ ఎక్కడ ఉందనే విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మేడారం అపర్ణ ప్రదీప్, మండల విద్యాధికారి సురేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘురాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని
పరిశీలించిన జెసి...
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. గురువారం పట్టణంలోని సోమవార్‌పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భోజనం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్తానిక కౌన్సిలర్ అపర్ణ, ఎం ఈవొ సురేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘురాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నివాస గృహాలను కూల్చివేస్తే దాడులు
* లీజు పత్రాలుంటే బహిర్గతం చేయాలి
* ఆర్డీఓ కార్యాలయం ఎదుట రాజకీయ జేఏసి, కౌన్సిలర్ల ధర్నా
బెల్లంపల్లి, జనవరి 5: బెల్లంపల్లి పట్టణంలో ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకుంటున్న ఇండ్లను సింగరేణి అధికారులు దౌర్జన్యంగా కూల్చివేయడం హేయమైన చర్య అని నివాస గృహాలను కూల్చివేస్తే దాడులు తప్పవని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, టిడిపి జిల్లా అధ్యక్షుడు బోడ జనార్థన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు చొప్పదండి దుర్గ్భావానీ, సిపి ఐ పట్టణ కార్యదర్శి మంతెన మల్లేష్; సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి అధికారులు ఇండ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ గురువారం మున్సిపల్ కౌన్సిలర్లు చిట్యాల మధు, ఎలిగెటి శ్రీనివాస్, రాజ్‌లాల్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు ఎలూరి వెంకటేష్, వైస్ చైర్మన్ నూనెటి సత్యనారాయణ, వ్యాపారస్తులు, బిజేపి నాయకులు, రాజకీయ జే ఏసి ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి కాంట చౌరస్తా మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. మందమర్రి జీ ఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేసారు. అనంతరం ఆర్డీ ఓ వీరన్నకు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్బంగా రాజకీయ జేఏసి నాయకులు మాట్లాడుతూ బెల్లంపల్లిలో ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్న ఇండ్లను సింగరేణి ఎస్ అండ్ పిసి అధికారులు కూల్చివేయడ ం సిగ్గుచేటన్నారు. సింగరేణి అధికారు లు ఇండ్లను కూల్చివేస్తే బెల్లంపల్లి ప్రజ లు చూస్తూ ఊరుకోరని బెల్లంపల్లిలో అడుగు పెడితే తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని తీవ్రంగా హెచ్చరించారు. బెల్లంపల్లి భూములపై సింగరేణి లీజు గడువు ఉంటే ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేసారు.
అంతేకాకుండా కొత్తగూడెం, గోదావరి ఖని, శ్రీరాంపూర్ తదితర సింగరేణి ప్రాంతలలో గత పాలకులు ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇచ్చారని, మందమర్రి ఏరియా జిఎం రాఘవులు బెల్లంపల్లిలో ఇండ్లను కూల్చివేయడం మానుకోవాలన్నారు. ఇండ్లను అధికారులు కూల్చివేస్తుంటే ప్రజల ఓట్లతో గెలిచిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వౌనం వహించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ పసుల సునిత రాణి బెల్లంపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్న ఇండ్లకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేసారు. ఈ విషయమై బెల్లంపల్లి ఆర్డీ ఓ వీరన్న మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని లీజు భూములపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని లీజు భూములపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు

దాడులు చేసి పట్టుకున్న కలప
బెజ్జూర్, జనవరి 5: బెజ్జూర్ మండలం కుకుడ లో గురువారం పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో సుమారు లక్ష రూపాయల కలపను స్వాధీనం చేసుకున్నారు. కౌటాల సి ఐ అచ్చేశ్వర్ రావు, బెజ్జూర్ ఎఫ్ ఆర్ ఓ ఆధ్వర్యంలో అటవీ పోలీస్ అధికారులు దాడులు నిర్వహించి భారీ కలపను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో కర్జవెల్లి డిప్యూటీ రెంజ్ అధికారి జమీల్, బెజ్జూర్ ఏ ఎస్సై మేరాజ్, సెక్షన్ అధికారులు ముసావీర్, రామకృష్ణ, సోంజీ, రమాదేవి, పోలీస్ మరియు అటవీ సిబ్బంది పాల్గొన్నారు.