అదిలాబాద్

అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జనవరి 26: గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం నిర్మల్‌లో అట్టహాసంగా జరిగాయి. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరిగిన ఈ వేడుకలు పట్టణ ప్రజలకు కనువిందుచేశాయి. పట్టణంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఇలంబరిది పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కలెక్టర్‌తోపాటు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, జెసి శివలింగయ్యలు పాల్గొన్నారు. పతాకావిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సాయుధ బలగాల కవాతు అనంతరం పెద్ద ఎత్తున హాజరైన ప్రజలనుద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. శాఖల వారీగా ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల వివరాలను వివరించారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు. ప్రభత్వుం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల వల్ల ప్రజలకు ఏమేరకు లబ్ధి చేకూరుతుంది.. మొదలగు అంశాలను సవివరంగా తెలియజేశారు. జిల్లాలోని ఎస్సారెస్పీ, గడ్డెన్నవాగు, కడెం ప్రాజెక్టుల నుండి సంవత్సరానికి 1370 టిఎంసిల నీటిని సేకరించి 1176 గ్రామాలకు స్వచ్చమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఈయేడాది చివరి నాటికి అన్ని ఆవాసాలకు నీరందించడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అలాగే మిషన్ కాకతీయ కింద మొదటి దశలో రూ.50 కోట్లను వెచ్చించి 121 చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టామని, వీటిలో 119 పనులు పూర్తయ్యాయన్నారు. రెండవ దశలో 120 చెరువుల పునరుద్దరణకు 48 కోట్ల నిధులు వెచ్చించామన్నారు. జిల్లాలోని స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టు నుండి రబీ పంటల కోసం 16వేల ఎకరాలకు సాగునీరందించనున్నామని వివరించారు. సదర్‌మాట్ నూతన బ్యారేజి నిర్మాణం కోసం 516.23 కోట్లను మంజూరుచేసిందని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూసేకరణ చేపడుతున్నామని, సాగునీటి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే సంక్షేమ పథకాలైన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామన్నారు. ఆయా పథకాల ద్వారా వేలాది మంది జంటలకు రూ.51 వేల చొప్పున అందజేశామన్నారు.
వివిధ శాఖల శకటాల ప్రదర్శన
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శకటాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయశాఖ, పశుసంవర్ధక, మత్స్యశాఖ, గృహనిర్మాణశాఖ, గ్రామీణ తాగునీటి సరఫరాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపకశాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జాఫ్రాపూర్ ప్రభుత్వ ఉన్నతపాఠశాలకు చెందిన విద్యార్థులు బతుకమ్మపాటపై ప్రదర్శించిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. అలాగే స్తానిక రవి ఉన్నత పాఠశాల, చాణక్య, గౌతం, విజయ, వాసవి పాఠశాలల విద్యార్థులు దేశభక్తి గేయాలు, బతుకమ్మ పాటలు, తెలంగాణ పాటలపై చేసిన నృత్యాలు కనువిందుచేశాయి.
వివిధ స్టాళ్ల ఏర్పాటు
వేడుకల్లో భాగంగా మినీస్టేడియంలో జరిగిన సంబరాల్లో వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను ఏర్పాటుచేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలిపే స్టాళ్లు ఆకట్టుకున్నాయి. చేనేత, ఆప్కో, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ, మెప్మా, రేషన్ దుకాణాలు, ఉద్యానవనశాఖ, ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్ల స్టాళ్లను ఏర్పాటుచేసి ఆయాశాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు ప్రచారం చేశారు.

చిన్న జిల్లాలతో అభివృద్ధి వేగవంతం
* గణతంత్ర వేడుకల్లో ఎస్పీ శ్రీనివాస్
ఆదిలాబాద్ రూరల్, జనవరి 26: చిన్న జిల్లాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, పోలీసు శాఖలో సంస్కరణలతో ముందుకు వెళ్ళాలని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. గురువారం 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పోలీసు శాఖ అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, పోలీసు శిక్షణ కేంద్రంలో డిఎస్పీ కె.సీతారాములు, ఆదిలాబాద్ డిఎస్పీ కార్యాలయంలో ఎ లక్ష్మీనారాయణలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించిన విద్యార్థులకు మిఠాయిలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలను కాపాడుతున్న జిల్లా పోలీసులకు, ప్రజలకు, అధికార అనధికార ప్రముఖులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీసులు మెరుగైన పోలీసు వ్యవస్థకు కృషి చేయాలన్నారు. ఎల్లవేళలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ నేరాలను తగ్గించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లా పోలీసులు రానున్న రోజుల్లో ఆర్థిక నేరాలను గణనీయంగా తగ్గించేందుకు నూతన అంశాలను జిల్లాలో ప్రవేశపెడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు అన్వర్ ఉల్ హఖ్, జి.రామన్న, ఎస్‌కె ఫరీద్, సిసి ఎం పోతరాజు, ఎఎస్సై యునుస్‌ఖాన్, హెడ్ కానిస్టేబుల్ ఎస్.ప్రేంసింగ్, సిబ్బంది విఠ్ఠల్, సంతోష్, సురేష్, కిషన్, మిర్జా సలీం బేగ్, విష్ణు, ప్రకాష్ రెడ్డి, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

టవరెక్కిన పంచాయతీ వివాదం
ఖానాపూర్ రూరల్, జనవరి 26: మండలంలోని బాదన్‌కుర్తి గ్రామానికి చెందిన అంబటి రాజేంధర్ అనే యువకుడు గురువారం టవరెక్కి ఆత్మహత్య చేసుకోవడానికి పట్టణంలోని ఎంపిడివొ కార్యాలయం ముందు గల 132/33 హై టెన్షన్ లైన్ టవరెక్కాడు. 2 గంటపాటు పోలీసుల గుండెల్లో రైళ్లను పరిగెత్తించాడు. తన డిమాండ్లను నెరవేర్చేంతవరకు తాను టవర్ దిగేది లేదని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. రిపబ్లిక్‌డే సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు పెద్ద ఎత్తున టవర్‌వద్ద మోహరించారు. ఖానాపూర్ ఎస్సై వినయ్‌కుమార్ ఎంతో సౌమ్యంగా తనను కిందికి రావాలని, తన డిమాండ్లను నెరవేరుస్తానని అన్నప్పటికి తాను ఇంకొంచెం పైకి ఎక్కుతూనే బెదిరింపులకు గురిచేశాడు. రాజేంధర్‌కు గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సంతానం కోసం హైదరాబాద్, కరీంనగర్ కార్పోరేట్ ఆసుపత్రిలో తన భార్యకు చికిత్సలుచేయించినప్పటికి సంతానం కలగదని డాక్టర్లు తెలియజేశారని, ఆయన తన భార్యతో విడాకుల కొరకు జగిత్యాల కోర్టుకు అప్పీలుచేసుకున్నానని అన్నాడు. తన భార్య కరీంనగర్ జిల్లా గోడూరు గ్రామపెద్దలు పంచాయతీ నిర్వహించి 5 లక్షల రూపాయలు జరిమానా విధించగా ఈ పంచాయతీ వివరాలు తెలుసుకున్న బాదన్‌కుర్తి కాపుసంఘం నాయకులు ఆ పంచాయతీని మద్యలోనే ఆపివేసి పిల్లవారిని తమ గ్రామంలో కులంఫీజు కట్టినట్లయితే తమకు 12 లక్షల 50 వేలు ఇప్పిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడని రాజేంధర్ తెలియజేశాడు. ఇదే క్రమంలో బాదన్‌కుర్తి గ్రామకుల పెద్దల సమక్షంలో గత వారం రోజుల క్రితం నిర్వహించిన పంచాయతీలో తమ కుటుంబ సభ్యులను, తనను కులపెద్ద శ్రీనివాస్ 12 లక్షలు కట్టుమని వేధిస్తున్నాడని, ఆయన వచ్చేంత వరకు టవర్ దిగేది లేదని భీష్మించి టవర్‌పై కూర్చున్నాడు. ఖానాపూర్ ఎస్సై వెంటనే పెద్దమనిషిని పిలిపించి పెద్దమనిషి, రాజేంధర్ కుటుంబ సభ్యులను పిలిపించి తమకు న్యాయం చేయాలని 2 గంటలపాటు పోలీసు అధికారులకు ముచ్చెమటలు తెప్పించి తీరా ఒప్పందం ప్రకారం టవర్ దిగాడు. రాజేంధర్ టవర్ ఎక్కడం వల్ల 10 సబ్‌స్టేషన్లలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో విద్యుత్ యాజమాన్యానికి రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని ఎ ఈ తెలియజేశారు. ఈమేరకు రాజేందర్ కుటుంబ సభ్యులను, బాదన్‌కుర్తి కులసభ్యులను పిలిపించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు.

గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి ప్రత్యేక కృషి
* జిల్లా కలెక్టర్ కర్ణన్
మంచిర్యాల, జనవరి 26: గ్రామాల సంపూర్ణ అభివృద్ధి కోసం వైద్యం, ఉపాధి కల్పన పారిశుద్యం వౌళిక వసతుల కోసం నీతి అయోగ్‌కు ప్రణాళికలు పంపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గ్రామాల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా విజన్ 2027 ద్వారా గ్రామాలను ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని నీతి ఆయోగ్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా కలెక్టర్ హాజీపూర్ మండలంలోని వేమనపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామ అభివృద్దిపై తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కోసం గ్రామాలలో అంతర్గత రహదారులు కల్పించాలని, పరిసరాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనలు ఏర్పాటు చేయాలని, డంపింగ్ యాడ్‌లను ఏర్పాటు చేయాలని, గ్రామ ప్రజల కోసం బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు కోరిన విధంగా నీతి ఆయోగ్‌కు ప్రతిపాదనలు పంపిస్తామని గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పోందిన నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉంటారని, పిల్లలకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత దుస్తుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ప్రైవేట్ మోజును వీడి ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించాలని, ప్రభుత్వ ఆసుపత్రులోనే వైద్య సేవలు మెరుగైనందున ఆసుపత్రులోనే డిలివరీ చేయించుకోవాలని, డిజిటల్ పద్దతిలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. మైక్రో ఎటిఎం సౌకర్యం కల్పిస్తున్నామని 15 రోజులలో ముల్కల్లలో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేస్తామని దీనితో వచ్చే ఆధాయం గ్రామ అభివృద్దికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎంపిపి బేర సత్యనారాయణ, జడ్పీటిసి ఆశాలత, వైస్ ఎంపిపి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి వెంకటేశ్వరరావు, ఎంపిటిసి మంగ, సర్పంచ్ డేగ బాపు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, తహశీల్దార్ మోహన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సంజీవరెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.