అదిలాబాద్

టిఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఫిబ్రవరి 4: రాష్ట్రంలో అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని టిడిపి జిల్లా అధ్యక్షులు లోలం శ్యాంసుందర్ విమర్శించారు. శనివారం నిర్మల్‌లోని ఆర్‌అండ్‌బి విశ్రాంతి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కెసిఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. కెజి టూ పిజి ఉచిత విద్యను అందజేస్తామని చెప్పి నేటికి ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా వారి భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను అధికారంలోకి రాగానే పర్మినెంట్ చేస్తామని చెప్పిన కెసిఆర్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినవారి గోడును పట్టించుకునేనాథుడే లేడన్నారు. రోజుల తరబడి కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నప్పటికీ వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగ, అసంఘటిత రంగాలపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కాగా, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్ధతు ధరను చెల్లించని దుస్ధితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఇలాంటి అనేక ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి పోరాడేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాచరణ రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 20న నిర్మల్‌లోని ఎన్‌టిఆర్ మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు టిడిపి అగ్రనేతలు రేవంత్‌రెడ్డి, ఎల్.రమణ తదితరులు హాజరవుతున్నారన్నారు. సభకు నిర్మల్ జిల్లాలోని టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూషన్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు గండ్రత్ రమేశ్, నాయకులు పూదరి నరహరి, శౌకత్, బద్రి శ్రీనివాస్, మహిబూబ్ తదితరులు పాల్గొన్నారు.

నూతన పోలీసు కార్యాలయానికి స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 4: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలనే ఆదేశాల మేరకు శనివారం జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ కె.కృష్ణారెడ్డిలు ఆదిలాబాద్ సమీపంలోని బట్టిసావర్‌గాం శివారులో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. సర్వే నెం. 72లో ప్రభుత్వం ఇటీవల సేకరించిన 18 ఎకరాల ప్రదేశంలో జిల్లా పోలీసు కార్యాలయం నిర్మించేందుకు అనువుగా ఉంటుందని భావించారు. కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతితో బేటీ అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ స్థలాలను పరిశీలించారు. ఎస్పీ వెంట ల్యాండ్ సర్వే అధికారి రాజేందర్, మావల ఎస్సై రాజు, సిసి ఎం.పోతరాజు తదితరులు పాల్గొన్నారు.

బాసర ఈవోగా సుధాకర్ రెడ్డి

ఆదిలాబాద్, ఫిబ్రవరి 4: జ్ఞాన సరస్వతి బాసర దేవాలయ కార్యనిర్వాహణాధికారిగా గద్వాల జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్‌వో) ఎ.సుధాకర్ రెడ్డిని నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనరేట్ నుండి శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బాసరలో గత 16నెలల నుండి ఈవోగా పనిచేస్తున్న ఎం.వెంకటేశ్వర్లును దేవాదాయ శాఖ కమిషనరేట్‌లో వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఆయనకు ఇంకా పోస్టింగ్ జారీ కాలేదు. అయితే జిల్లాల పునర్విభజనకు ముందు ఆదిలాబాద్ ఆర్డీవోగా పనిచేసిన ఎ.సుధాకర్ రెడ్డి పదోన్నతిపై జోగులాంబ గద్వాల జిల్లాకు జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ అయ్యారు. తాజాగా అక్కడి నుండి బాసర ఈవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బాసర దేవస్థానం అభివృద్ధికి, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని, మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తానని కొత్త ఈవో సుధాకర్ రెడ్డి ఆంధ్రభూమికి వివరించారు.

యాదవులకు 75శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ
* రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
లక్ష్మణచాంద, ఫిబ్రవరి 4: రాష్ట్ర ప్రభుత్వం 75శాతం సబ్సిడీపై యాదవులకు గొర్రెలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం లక్ష్మణచాంద మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ సుజాత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని యాదవులకు 75శాతం సబ్సిడీపై గొర్రెలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం అదికారులు లబ్ధిదారులను గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ ఆసుప్రతుల్లో ప్రసవం చేయించుకునే వారికి పోషకాహారం కోసం రూ.5వేలు, మూడు నెలల తర్వాత మరో రూ.5వేలు, ప్రసవం తర్వాత రూ.5వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.9వేలను కలిపి మొత్తం రూ.15వేలను మహిళలకు అందజేస్తుందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తహీనత పరీక్షలు, హిమోగ్లోబిన్ శాతం, షుగర్, టీబీ, పరీక్షలు, వాటికి మందులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో సాధారణ డెలవరీ అయ్యేలా చూడాలని వైద్యులకు సూచించారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. దీనిని సర్పంచులు, ఎంపీటీసీలు బాధ్యతగా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఓడీ ఎఫ్ మరుగుదొడ్లు కట్టుకునేలా ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ, పశు సంవర్దక శాఖ, రెవెన్యూ, వైద్య శాఖలపై ఈ సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ పద్మ, నిర్మల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎఫ్ ఏస్ సీ ఏస్ ఛైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఎంపీడీ ఓ, తహసీల్దార్ నారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీపీలు పాల్గొన్నారు.

కొత్త ప్రాజెక్టులు కాదు, కాల్వలను బాగుచేయండి
* కుమరంభీ ఆసిఫాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి సత్తన్న
వాంకిడి, ఫిబ్రవరి 4: రైతుల ఉసురు తీస్తున్న రాష్ట్ర సర్కార్ కొత్త ప్రాజెక్టులు కట్టడం కోసం ప్రాకులాడుతుందని, రైతుల భూములను లాక్కొంటు వారిని దిక్కులేకుండా చేస్తుందని, అలా కాకుండా ఉన్న ప్రాజెక్టులకు గల కాల్వలను ముందు బాగుచేయాలని సిపిఐ పార్టీ కుమరంభీ ఆసిఫాబాద్ కన్వీనర్ బద్రి సత్తన్న డిమాండ్ చేశారు. శనివారం మండలానికి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ రైతుల సమస్యలను తీసుకొని కొత్త ఉద్యమానికి త్వరలో తెరలేపనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న పాత ప్రాజెక్టుల కిందున్న ఆయకట్టు రైతులందరికి ముందుగా నీరందించే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త ప్రాజెక్టు నిర్మాణం పేరుతో పర్సంటేజీలు దండుకోవడానికి ఆ పార్టీ నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారే తప్ప రైతులకు న్యాయం చేయడానికి కాదని ఆయన విమర్శించారు. వందల కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టులకు సంబందించిన కాల్వలను ఎందుకు బాగుచేయడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇక నుండి సిపిఐ పార్టీ రైతుల పక్షం ఉండి పోరాటం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిరుపేదల పిల్లలు చదువుతున్న వసతి గృహాల పరిస్ధితి మరీ అధ్వాన్నంగా మారిందని ఆయన విమర్శించారు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులుగాని, జిల్లా అధికారులుగాని వసతి గృహాలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.వసతి గృహాల విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణి చేసిన యునిఫార్మ్ డ్రెస్సులు ఇప్పటి వరకు కుట్టించలేదని, యూనిఫార్మలు కుట్టించడానికి డ్రెస్సు ఒక్కటికీ 16,కటింగ్ చేయడానికి కేవలం ఒక్కోతలకు 6 రూపాయలతో టెండర్లు పిలిచినందుకే టెండర్లు రావడలేదని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని పెంచితే విద్యార్ధులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఆయనతోపాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు,వాంకిడి మండల సిపిఐ కార్యదర్శి ఓ.గోపినాద్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు బొయిరె ప్రకాష్, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.