అదిలాబాద్

రైతుకు చేరువగా వ్యవసాయ శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 6: రెండు దశాబ్దాలుగా ఖాళీ పోస్టులతో అచేతనంగా సాగిలబడిన వ్యవసాయ శాఖ కొత్త పోస్టుల భర్తీతో రైతు సమస్యలు గాడినపడే అవకాశం ఉంది. ప్రభుత్వ శాఖలో కీలకంగా భావించే వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో), మండల వ్యవసాయ అధికారులు (ఏవో) పోస్టులను అర్హులైన అభ్యర్థులచే భర్తీచేయడంతో ఉమ్మడి జిల్లాలోని కార్యాలయాలు జవజీవాలు సంతరించుకోనున్నాయి. తద్వారా రైతు సంక్షేమ పథకాలు మరింత చేరువయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాల్లో పేరుకుపోయిన 176 ఏఈవో పోస్టులను ప్రాధాన్యత క్రమంలో నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయడంతో ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో 29 మంది, ఆసిఫాబాద్‌లో 15 మంది, నిర్మల్‌లో 15, మంచిర్యాల జిల్లాలో 23 మంది ఏఈవోలు మాత్రమే పనిచేయగా ప్రభుత్వం ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవడంతో మొత్తం 176 ఏఈవో పోస్టులు భర్తీకి నోచుకున్నాయి. ఈ నెల 16 నుండి వీరికి హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖలో విధుల నిర్వహణ, రైతులకు చేరువలో సంక్షేమ పథకాల అమలు తీరు, వచ్చే ఖరీఫ్ సీజన్‌లో చేపట్టే ప్రణాళికపై ఏఈవోలకు శిక్షణ కల్పించనున్నారు. అయితే ఖాళీల భర్తీ అనంతరం మరికొన్ని మండలాల్లో కొన్ని పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి అవసరం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 7, నిర్మల్‌లో 7, ఆసిఫాబాద్‌లో 10, మంచిర్యాల జిల్లాలో 10 ఏఈవో పోస్టులు ఖాళీగా మిగిలాయి. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో 70 శాతం ప్రధానంగా పత్తిపంటను సాగుచేస్తుండగా సోయాబీన్ పంటపై కూడా రైతుల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నదాతకు అండగా క్షేత్రస్థాయిలో సూచనలు, సలహాలు అందించడంతో పాటు రైతులు నిర్దిష్టమోతాదులో ఎరువుల వాడకం, పంట సాగుపై సస్యరక్షణ చర్యలు, భూసార పరీక్షలు నిర్వహించేలా రైతులను చైతన్యపర్చాల్సి ఉంది. సబ్సిడీ రుణాలు, పంటల ఇన్సూరెన్స్‌పై రైతుల్లో అవగాహన పెంచనున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం పంట సాగుకు ముందుగానే భూసార పరీక్షలు ప్రతి రైతు నిర్వహించుకునేలా మండల స్థాయిలోనే మినీ భూసార కేంద్రాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రైతులకు ఖరీఫ్‌సాగుపై విస్తృత అవగాహన కల్పించనున్నారు. కొత్తగా నియామకమైన ఏఈవోలకు మూడు గ్రామాల బాధ్యతలను అప్పగించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయ యాంత్రీకరణ పద్దతుల గురించి వివరించనున్నారు. మొత్తానికి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న ఏఈవో పోస్టుల భర్తీతో రైతు సమస్యలు గాడిన పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో 40 మండల స్థాయి వ్యవసాయ అధికార పోస్టులు ఖాళీగా ఉండగా వీటిలో నోటిఫికేషన్ భర్తీద్వారా జిల్లాల్లో కొత్తగా 21 మంది ఏవో పోస్టులు భర్తీకానున్నాయి. వారికి ఇంటర్వ్యూలు కొనసాగుతుండగా పక్షం రోజుల్లో విధుల్లో చేరే అవకాశం ఉంది. ఏదేమైనా కీలకమైన పోస్టులు ఖరీఫ్ సీజన్‌కు ముందే భర్తీ అవుతుండడంతో రైతులకు క్షేత్రస్థాయిలో మేలుచేకూరే అవకాశం ఏర్పడింది.