అదిలాబాద్

అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,్ఫబ్రవరి 6: ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాల ద్వారా వచ్చే ప్రజా అర్జీలపై అధికారులు జవాబుదారితనంతో సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఇన్‌చార్జి కలెక్టర్ కె.కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను శాఖల వారీగా అధికారులు వారంలోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించడంలో జాప్యం జరిగినట్లయితే ఫిర్యాదుదారునికి కారణాలు తెలియజేయాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకు ముందు నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 10 మంది అభ్యర్థులు వారి సమస్యలను విన్నవించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో బానోత్ శంకర్, ముఖ్య ప్రణాళికాధికారి కేశవ్‌రావు, జిల్లా పరిషత్ ఇఈవో జితేందర్ రెడ్డి, డిఆర్‌డివో రాథోడ్ రాజేశ్వర్, డిఈవో లింగయ్య, పశుసంవర్ధక శాఖ జెడి రామరావు, వయోజన విద్య ఏడి దుర్గ్భవాని, బిసి వెల్ఫేర్ అధికారి మేఘనాథ్, డిఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో సంజయ్‌కుమార్, ఎన్ ఐసి రాకేశ్, సెక్షన్ సూపరింటెండెంట్ రవిందర్ పాల్గొన్నారు.
అర్జీదారులు లేక గిరి దర్బార్ వెలవెల
ఉట్నూరు: తమ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయన్న గంపెడాశతో గిరి దర్బార్‌కు ప్రజలు వస్తుండగా ఇటీవల రెగ్యులర్ అధికారులు లేక నమ్మకం సన్నగిల్లడంతో సోమవారం ఐటిడిఏలో నిర్వహించిన గిరిదర్బార్ అర్జీదారులు లేక వెలవెలబోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రాజెక్టు అధికారి స్వయంగా గిరిజనుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి సోమవారం గిరి దర్బార్ ద్వారా అర్జీలు స్వీకరిస్తూ వస్తుండగా అప్పటికప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారం కావడంతో ఆదివాసి గిరిజనులు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. అయితే జిల్లాల పునర్విభజన అనంతరం రెగ్యులర్ పివో ఆర్‌వి కర్ణన్‌ను మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్ళిపోవడంతో అప్పటి నుండి తమ సమస్యలు పరిష్కరించేవారేలేరంటూ అసంతృప్తితో దర్బార్‌కు గిరిజనులు రావడం మానివేశారు. సోమవారం సైతం గిరి దర్బార్‌కు కొంతమంది అర్జీదారులు రాగా ఆర్డీవో విద్యాసాగర్, డిడి శ్రీరాంమూర్తి, ఏపివో జనరల్ నాగోరావు వచ్చిన గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించారు.

డిటిఎఫ్ ఆధ్వర్యంలో
విద్యాపోరాట యాత్ర పోస్టర్లు విడుదల
నిర్మల్, ఫిబ్రవరి 6: కెజిటు పిజి ఉచిత విద్యను ప్రభుత్వ విద్యావ్యవస్థ ద్వారానే అందజేయాలని డిటి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఆర్ అండ్‌బి విశ్రాంతి భవనంలో వచ్చే నెల 6 నుండి 20 వరకు జరిగే విద్యాపోరాట యాత్ర పోస్టర్లను విడుదల చేశారు. డిటిఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి చంద్రశేఖర్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కెజిటు పిజి విద్యను అమలుచేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచినా ఆ దిశగా ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతికి ఒక గదిని కేటాయించాలని, తాగునీరు,మూత్రశాలలు, ఇతర వౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యాహ్న భోజనంలో పాలు, పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు. అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలను మూసివేసి కార్పొరేట్ కళాశాలలకు ఇచ్చిన అనుమతులను రద్దుచేయాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో వౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఈ పోరాట యాత్రలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ నాయకులు రఘోత్తంరెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, గంగాధర్, ఎం.శంకర్, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు డొడ్డు లక్ష్మణ్, పిడిఎస్‌యు జిల్లా ప్రధానకార్యదర్శి వెంకటేష్, టిజెఎసి చైర్మన్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బిఈడి అభ్యర్థులకు టెట్‌లో అవకాశం కల్పించాలి
కలెక్టర్ సమావేశ మందిరం ఎదుట చాత్రోపాధ్యాయుల ధర్నా
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 6: బిఈడి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ సమావేశ మందిరం ఎదుట చాత్రోపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఒకే సంవత్సరంలో బిఈడి పూర్తయ్యేదని, ప్రస్తుతం రెండేళ్లు పొడిగించడంతో ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షలకు అర్హత కోల్పోయే అవకాశం ఉందన్నారు. దీంతో రెండు సంవత్సరాల సమయం వృథా కావడంతో పాటు డిఎస్పీ అవకాశం కోల్పోతామని అన్నారు. ఇప్పటికే గత ఆరేళ్ల నుండి ఎస్పీ నోటిఫికేషన్ లేకపోవడంతో ఎందరో నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని, ఈసారి తమకు అవకాశం కల్పించకుంటే మరో పదేళ్లు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. అనంతరం జెసి కృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వివేకానంద బిఈడి కళాశాల విద్యార్థులు ఈశ్వర్, శివప్రసాద్, రమణ, భాగ్యలక్ష్మి, స్రవంతి, అనసూయ తదితరులు పాల్గొన్నారు.