అదిలాబాద్

వైద్యశాఖలో భర్తీకి నోచుకోని కీలక పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 11: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వైద్యశాఖలో కీలక అధికారుల పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంతో వైద్యసేవలకు తీరని విఘాతం ఏర్పడుతోంది. పర్యవేక్షణలోపం, పాలనపరమైన ఇబ్బందులతో వైద్య ఆరోగ్యశాఖ కునారిల్లుతోంది. కొత్త జిల్లా లు ఏర్పడిన తరువాత గతంలో ఉమ్మడి జిల్లాకు డిప్యూటీ డిఎంహెచ్‌వోలుగా, పోగ్రాం ఆఫీసర్లుగా పనిచేసిన అధికారులను నాలుగు జిల్లాలకు డిఎంఆండ్‌హెచ్‌వోలుగా నియమించారు. కాగా, ఈనలుగురూ ఇన్‌చార్జిలే కావడం గమనార్హం. గతంలో క్లస్టర్లకు ఎస్పీహెచ్‌వోలుగా నియామకంచేసిన అధికారులను ప్రస్తుతం డిప్యూటీ డిఎంహెచ్‌వోలుగా, జాతీ య కార్యక్రమాల నిర్వహణ అధికారులుగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో జాతీయ కార్యక్రమాల నిర్వహణపరంగా సీనియర్ అధికారులు ప్రోగ్రాం ఆఫీసర్లుగా ఉండడంతో ఆ కార్యక్రమాల నిర్వహణ సజావుగా సాగేది. ప్రస్తుతం కొత్త జిల్లాలుగా ఏర్పడిన తరువాత జాతీయ కార్యక్రమాల నిర్వహణపరంగా గతంలో ఎస్పీహెచ్‌వోలుగా వ్యవహరించిన అధికారులు పర్యవేక్షిస్తుండడంతో కొంత అనుభవలోపం ఎదురవుతోంది. ఉమ్మ డి జిల్లాలో డిఎంహెచ్‌వోగా వ్యవహరించిన జలపతినాయక్ జిల్లాలు ఏర్పడిన అనంతరం నిర్మల్ జిల్లాకు డిఎంహెచ్‌వోగా నియమితులయ్యారు. ఆదిలాబాద్‌కు డాక్టర్ తొడసం చందు డిఎంఆండ్‌హెచ్‌వోగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ జాతీయ కార్యక్రమాల నిర్వహణ అధికారిగా విశేష అనుభవం ఉంది. మంచిర్యాలకు డాక్టర్ భీష్మ డిఎంహెచ్‌వోగా ఉన్నారు. ఆయన సీనియర్ డిప్యూ టీ సివిల్ సర్జన్ కావడంతోపాటు గతంలో జాతీయ కార్యక్రమాల నిర్వహణ అధికారిగా వ్యవహరించారు. కుమురంభీం జిల్లాకు డాక్టర్ సుబ్బరాయుడు కూడా ఉమ్మడి జిల్లాలో పోగ్రాం ఆఫీసర్‌గా పనిచేశారు. ఈ నలుగురు డిప్యూటీ సివిల్ సర్జన్‌లే కావడం గమనార్హం. డిఎంహెచ్‌వోలుగా సివిల్ సర్జన్ స్థాయి అధికారులను నియమించాలి. కానీ, ప్రభుత్వం పదోన్నతులు కల్పించకపోవడంతో డిప్యూటీ సివిల్ సర్జన్లు సీనియార్టీ ఉన్నా పదోన్నతి పొందలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ సివిల్ జర్జన్ పదోన్నతి కల్పించినా కొంతమంది డిఎంహెచ్‌వోలు తప్పుకునే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. తమకంటే సీనియర్ డిప్యూటి సివిల్ సర్జన్లకు సివిల్ సర్జన్ పదోన్నతి లభిస్తే ప్రస్తుతం డిఎంహెచ్‌వోలుగా ఉండీ సీనియార్టీ లేకుంటే డిప్యూటీ డిఎంహెచ్‌వగా, ప్రోగ్రాం అధికారిగా కింది పోస్టుకు వేళ్లే పరిస్థితి కూడా ఉంది. త్వరలో ప్రభుత్వం పదోన్నతులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖలో చర్చ జరుగుతుండగా అదే జరిగితే పైన పేర్కొన్న పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం నాలుగు జిల్లాలకు డిప్యూటీ డిఎంహెచ్‌వోలుగా, ప్రోగ్రాం ఆఫీసర్లుగా ఉన్న అధికారులాదీ అదే పరిస్థితి. డిప్యూటి సివిల్ సర్జన్‌ను డిప్యూటి డిఎంహెచ్‌వోగా, ప్రోగ్రాం ఆఫీసర్లుగా నియమించాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఈబాధ్యతల్లో ఉండడం గమనార్హం. నిర్మల్‌లో డిప్యూటి డిఎంహెచ్‌వోలుగా ఉన్న డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మురళీకృష్ణ, ఆదిలాబాద్ డాక్టర్ సాధన, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, మంచిర్యాలలో డాక్టర్ సునిల్‌రావు, డాక్టర్ అనిత, కుమురంభీం జిల్లాలో డాక్టర్ సీతారాంలు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు అయినప్పటికీ డిప్యూటి డిఎంహెచ్‌వోలుగా కొనసాగుతున్నారు. కాగజ్‌నగర్ డిప్యూటి డిఎంహెచ్‌వో డాక్టర్ నిర్మలదేవి ఒక్కరే డిప్యూటి సివిల్ జర్జన్ కావడం గమనార్హం. ఇక ప్రోగ్రాం అధికారులుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లే కొనసాగుతున్నారు. ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులుగా పనిచేస్తూ అటు డిప్యూటి డిఎంహెచ్‌వోలుగా, ప్రోగ్రాం అధికారులుగా వ్యవహరిస్తుండడం వారికి ఇబ్బందిగా మారింది. ప్రధానంగా జాతీయ కార్యక్రమాల నిర్వహణపరంగా ఏ చిన్న సమస్య తలెత్తినా వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. అదే సంధర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లలో సీనియర్లకు డిప్యూటి సివిల్ సర్జన్‌గా పదోన్నతి పక్రియ కూడా పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం పదోన్నతులు కల్పించి అన్ని పోస్టులు భర్తీచేసిన పక్షంలో ఉమ్మడి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది.

అక్కకొండ ఆలయ అభివృద్దికి కృషి
* రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
కడెం, ఫిబ్రవరి 11: మండలంలోని ఎలగడప పంచాయతీ పరిధిలో గల దిల్దార్‌నగర్ సమీపంలో ఉన్న అరణ్యప్రాంతంలో గోదావరి నదీతీరాన కొండ గుహపై వెలసిన శ్రీ అక్కకొండ లక్ష్మినర్సింహస్వామి ఆలయ అభివృద్దికి తనవంతు కృషిచేస్తానని తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం శ్రీ అక్కకొండ లక్ష్మినర్సింహస్వామి ఆలయంను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆజ్మీర శ్యాంనాయక్‌లు సందర్శించి ఈ సందర్బంగా ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి స్తానిక ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీ అక్కకొండ లక్ష్మినర్సింహస్వామి ఆలయం ప్రాచీనకాలంనాటిదని, ఆలయ అభివృద్ది కోసం కృషిచేస్తామని, గతంలో కూడా ఆలయ అభివృద్దికి రూ.10 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. అలాగే ప్రస్తుతం కూడా ఆలయ అభివృద్దికి మాసాయిపేట్ నుండి అక్కకొండ ఆలయం గోదావరి వరకు బిటి రోడ్డు నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆలయం ఎదుట అరణ్యంలో ఉన్న శివాలయంను కూడా అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టి ఆర్ ఎస్‌ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసి ఆర్ పెద్ద ఎత్తున ఆలయాల అభివృద్దికి కృషిచేస్తూ నిధులు మంజూరుచేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో శ్రీ అక్కకొండ ఆలయం మరింత అభివృద్ది అయ్యే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. అలాగే లింగాపూర్ శివాలయానికి నిధులు మంజూరుచేసి అభివృద్దిచేస్తామన్నారు. ఈ సందర్భంగా 2017 శ్రీ అక్కకొండ లక్ష్మినర్సింహస్వామి ప్రచురించిన క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. అలాగే మామడ మండలం పొన్కల్ గ్రామం వద్ద నిర్మాణం చేపట్టనున్న సదర్‌మాట్ మినీ బ్యారేజి నిర్మాణంపై రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఈ బ్యారేజి నిర్మాణం వల్ల కడెం,ఖానాపూర్ మండలాలకు పుష్కలంగా సాగునీరందుతుందని ఆయన తెలిపారు. పొన్కల్ బ్యారేజి నిర్మాణంతో ఈ సాగునీరు వేరే ప్రాంతాలకు వెళ్తుందన్న అనుమానాలను ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయని, వారి ఆరోపణలు అవాస్తవంగా ఉన్నాయన్నారు. రెండు పంటలకు సాగునీరందించాలన్న ఉద్దేశంతో పొన్కల్ వద్ద సదర్‌మాట్ బ్యారేజి నిర్మాణం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసి ఎం ఎస్ వైస్ ఛైర్మెన్ ఎట్టం దేవన్నయాదవ్, కడెం ఎంపిపి బుక్య అమ్మిబాపురావు, ఎఫ్ ఎసి ఎస్ ఛైర్మెన్ రాంకిషన్‌రెడ్డి, గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నాయకులు ఆజ్మీరశ్యాంనాయక్, తెలంగాణ ట్రాన్స్‌కో విజిలెన్స్ ప్రత్యేకాధికారి మురళీధర్‌రావు, ఎలగడప సర్పంచ్ వౌనికభూమేష్, ఎంపిటిసి కళావతి శ్రీనివాస్, కడెం మండల తహసిల్దార్ నర్సయ్య, అక్కకొండ ఆలయ కమిటి ఛైర్మెన్ జగ్గారావు, వైస్ ఛైర్మెన్ రాపర్తి లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి కొప్పుల లక్ష్మినర్సయ్య, టి ఆర్ ఎస్ నాయకులు బాపురావు, బుక్యబాపురావు, రాజేశ్వర్‌రెడ్డి, భూమేష్, ఆకుల లచ్చన్న, ఆలయ కమిటి సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఏడాదిలోగా ప్రతీ ఇంటికి స్వచ్చమైన తాగునీరు
* నిర్మల్‌ను వంద శాతం స్వచ్ఛ జిల్లాగా మార్చుదాం
* అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి అల్లోల
నిర్మల్, ఫిబ్రవరి 11: ఈ ఏడాది డిసెంబర్ 31లోగా నిర్మల్ జిల్లాలోని ప్రతీ ఇంటికి స్వచ్చమైన తాగునీరు ఇవ్వడానికి మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తిచేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యాగార్డెన్‌లో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్య శాఖ ఆద్వర్యంలో రాష్ట్ర స్వచ్చ్భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని సర్పంచ్‌లకు, ప్రజాప్రతినిదులకు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. నిర్మల్ జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి సాయశక్తుల ప్రయత్నిస్తున్నామన్నారు. వందశాతం స్వచ్చ జిల్లాగా మార్చడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. కరెంటు సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడవద్దన్నారు. 600 కోట్లతో రాష్ట్రంలో సిసి రోడ్లు నిర్మించడానికి చర్యలు చేపట్టామన్నారు. ప్రతీ గ్రామంలో ప్రతీరోడ్డు సిసి రోడ్డుగా మార్చనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్మల్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్దికి నిధులు మంజూరుచేస్తున్నారన్నారు. రైతులు తమ పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. ఆధునిక వ్యవసాయ పద్దతులను తెలుసుకోవడానికి ఇటీవల వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడం జరిగిందని, వారి సేవలను ఉపయోగించుకుని అధిక దిగుబడులను సాధించాలని సూచించారు. ఇళ్లులేని వారికి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని, నియోజకవర్గంలోని ఎల్లపెల్లిలో 50 ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అక్రమాలు జరగకుండా అర్హులకే అందేటట్లుగా కలెక్టర్ ఎంపికచేస్తారన్నారు. నిర్మల్ ఆసుపత్రిలో 10 బెడ్‌లతో ఐసియు ప్రారంభించడానికి మంజూరు లభించిందన్నారు. ఆర్మూర్ నుండి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్ వేయడానికి రైల్వేమంత్రి అంగీకరించడం జరిగిందన్నారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. హరితహారంలోనాటిన మొక్కలు ఎండిపోకుండా ఎన్ ఆర్ ఈజియస్‌లో నీరుపోసి రక్షించాలన్నారు. నిర్మల్ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ముధోల్,ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖాశ్యాంనాయక్, జిల్లా కలెక్టర్ ఇలంబరిది, జాయింట్ కలెక్టర్ శివలింగయ్య, ఎఫ్‌ఎసిఎస్ చైర్మెన్ రాంకిషన్‌రెడ్డి, మార్కెట్ చైర్మెన్ దేవేందర్‌రెడ్డి, ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ కమిటి ఛైర్మెన్ హరీష్‌రావు, డిపివో నారాయణ, ఎంపిపి సుమతి, ఎంపిపిలు, జడ్పీటిసిలు, సర్పంచ్‌లు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సద్గురు సేవాలాల్ ఉత్సవాలను విజయవంతం చేద్దాం
* కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్
ఆసిఫాబాద్ రూరల్, ఫిబ్రవరి 11: కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత మొట్టమొదటి సారిగా నిర్వహించే సద్గురు సంత్‌సేవాలాల్ 278 ఉత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. ఈ ఉత్సవాలను అధికారులు, ప్రజా ప్రతినిదులు సమన్వయంగా జరుపుకోవాలన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన ఉత్సవాల ఏర్పాటుపై సమీక్షించారు. ఈ నెల 15 వ తేదీన పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 278వ సంత్‌సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని 16వ తేదీన మండలాలల్లో గ్రామ స్థాయిలో జరుపుకోవాలన్నారు. రెండు నియోజక వర్గాల లంబాడ కమ్యూనిటీ ప్రజలకు జిల్లా కేంద్రంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు సంస్కృతిక కళాకరులతో ర్యాలీగా బయలుదేరి సేవాలాల్ మహారాజ్ దర్శనంతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. అన్ని సంబందిత శాఖా ల అధికారులు వారికి కేటాయించిన నిధులను సక్రమంగా నిర్వహించాలని, ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలో మొట్ట మొదటి సారిగా జరుపుకుంటున్న సేవాలాల్ ఉత్సవాలను లంబాడ సోదరి, సోదరమణులు ఉత్సవ కమిటీ అధికారులు అందరూ కలిసి ఈ సేవాలాల్ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. మన జిల్లాలో కెరమెరి మండలంలోని జోడేఘాట్‌తో పాటు లంబాడాలకు పర్యాటక కేంద్రం అయిన శంకర్‌లొద్ది ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పరంగా నిధులతో కేటాయించి సమికృత గిరిజనాభివృద్ది సంస్థ ద్వారా మరిన్ని నిధులు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు తీసుకురావడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. అలాగే 15 వ తేదీన ఈ ఉత్సవాలను జరుపుకునే సందర్బంగా సెలవు ప్రకటించాలని కలెక్టర్‌ను కోరారు. గతంలో ఉన్నట్లయితే సెలవు ప్రకటిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఆర్డీవో పాండురంగరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు శంకర్‌నాయక్, సుధాకర్ నాయక్, ఇంతిలాల్ నాయక్, గోవింద్ నాయక్, ఎంపిపి తారాబాయి, ఎంపిటిసిలు మేకల నారాయణ, బాబురావు, ఉత్సవ కమిటీ కన్వీనర్ జనార్థన్, తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగాన్ని ప్రైవేటీకరణం చేయడం సరికాదు
* విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 11: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేటీకరణం చేయడం సరికాదని విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం ఎస్టీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కెజి టు పిజి ఉచిత విద్యను అందిస్తామని చెప్పి మూడేళ్లకాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆదిశగా చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీ విశ్వవిద్యాలయాల పేరిట పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండా చేసేందుకు కుట్రలు పన్నుతుందన్నారు. దీనిలో భాగంగా రిలయన్స్ సంస్థకు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించిందని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజురియంబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.రంగన్న, సుధాకర్, రుకోదర్, రాహుల్, కళావతి, సురేష్, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పెళ్లి చేసుకోమని బలవంతపెట్టడం వల్లే హత్య
* మహిళను హత్యచేసిన నిందితుల అరెస్ట్
* డిఎస్పీ మనోహర్‌రెడ్డి
ఖానాపూర్/ఖానాపూర్ రూరల్, ఫిబ్రవరి 11: ఖానాపూర్‌లోని శివాజీనగర్‌లో ఈనెల 4న హత్యచేసిన నిందితులను పట్టుకున్నట్లు నిర్మల్ డిఎస్పీ మనోహర్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయం త్రం ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్పీ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భర్తలేక కొడుకుతో శివాజీనగర్‌లో జీవిస్తున్న సన్నాయిల సాయ వ్వ(33)కు అదే వీధికి చెందిన బానుక రాజేశ్వర్(రాజు)తో మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. కొంతకాలంగా తనను పెళ్లిచేసుకొమ్మని రాజేశ్వర్‌ను వేధించడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయ. సాయవ్వ సెల్‌ఫోన్ లో వేరే నెంబర్లు చూసిన రాజు ఆమె తనతోనే కాకుండా ఇతరులతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుందని భావించాడు. ఇక ఆమెను అంతమొందించాలని పథకం రచించాండు. దాని ప్రకారం 4న రాత్రి 10.15 గంటలకు హతుడు రాజేశ్వర్.. సాయవ్వ ఇంటికివెళ్లి ఆమెను తీసుకుని సదర్‌మాట్ కాలువవైపు వెళ్లారు. ఆ సమయంలో మద్యాన్ని వెంట తీసుకెళ్లాడు. సాయవ్వకు మద్యం తాగించి ఆమె మత్తులోకి జారుకోగానే ఆమె చీరతోనే గొంతుకు ఉరి భిగించి హత్యచేశాడని డిఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని సదర్‌మాట్ గట్టు వరకు మోసుకెళ్లాడని, మరోసారి ఆమె మొకంపై నీళ్లుచల్లి చనిపోయిందా.. లేదాని పరీక్షించుకున్నాడు. చనిపోయిందని నమ్మాకే మృతదేహాన్ని సదర్‌మాట్ కాలువలో పడేశాడన్నారు. హత్యచేసిన రాజేష్‌ను శనివారం ఉద యం ఖానాపూర్ బస్టాండ్‌లో అరెస్టు చేశారు. కాగా, సాయవ్వ సెల్‌ఫోన్ రాజేశ్వర్ చెప్పడంతో వేదం స్కూల్ ప్రాంతంలో పడేసిన కిశోర్‌ను అరెస్ట్‌చేశామని, వీరిద్దరిని శనివారం కోర్టులో ప్రవేశపెట్టడంజరిగిందన్నారు. సాయవ్వ సెల్‌ఫోన్ పిన్ నంబర్లపై మరింత విచారణ జరగాల్సి ఉందని, త్వరలోనే ఈ హత్యలో ఎవరైన ఉన్నది లేనిది చేధిస్తామని డిఎస్పీ మనోహర్‌రెడ్డి అన్నారు. ఇందులో సిఐ నరేష్‌కుమార్, ఎస్సై వినయ్‌కుమార్, ఎఎస్సైలు నారాయణ, ఐడిపార్టీ పోలీసులు పాల్గొన్నారు.

గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి
* మార్కెట్ చైర్మెన్ కుమ్ర భగవంత్‌రావ్
జైనూర్, ఫిబ్రవరి 11: గ్రామీణప్రాంత యువకులు క్రీడల్లో రాణించాలని జైనూర్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మెన్ కుమ్ర భగవంత్‌రావ్ అన్నారు. ఆయనతో పాటు జైనూర్ ఎస్సై శ్రీనివాస్ శనివారం మండలంలోని గౌరి కొలాంగూడలో కొలాంల ఆరాధ్యదైవం కుమ్రసూరు స్మారకార్థం ఏర్పాటు చేసిన వాలీబాల్, కబడ్డీ పోటీలను వారు ప్రారంభించారు. ఈ సంధర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని, వారితో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానీయుల పేరిట క్రీడాపోటీలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. క్రీడలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, గెలుపు ఓటములు ఆటలో సహాజమని అన్నారు. క్రీడల వల్ల తమలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి క్రీడల్లో ప్రతిభకనబర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాల, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆత్రం రాజు, గేడం లక్ష్మణ్, పాఠశాల హెచ్ ఎం కమ్ము, నిర్వాహకులు మెస్రం మోతిరాం, సిడాం భీంరావు, సిడాం బొజ్జు తదితరులు పాల్గొన్నారు.

హమాలీల సమస్యలు పరిష్కరించాలి
* ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బాలరాజ్
ఆదిలాబాద్ టౌన్,్ఫబ్రవరి 11: గోడౌన్‌లలో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బాలరాజ్ అన్నారు. శనివారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోడౌన్‌లలో పనిచేస్తున్న కార్మికులనే తప్పా ప్రైవేట్ వ్యక్తులను పనిచేయించరాదని అన్నారు. సివిల్‌సప్లయ్ హమాలీ సంక్షేమ సంఘం కార్మికులకు ప్రత్యేకంగా కార్మిక చట్టాలు తీసుకరావాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కార్మికులకు పింఛన్‌తో పాటు ఉద్యోగ భద్రత, యూనిఫాంలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐటియుసి జిల్లా కార్యదర్శి ఎస్.విలాస్, ఆశన్న, అప్పారావు, అప్రోజ్, శంకర్, రమేష్, నరేష్, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

బాసరలో భక్తజన సందడి
బాసర, ఫిబ్రవరి 11: బాసర సరస్వతి దేవి సన్నిధిలో భక్తుల సందడి కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో గోదావరి నదితీరం సందడిగా మారింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నదీతీరాన గల శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, చిన్నారులు అమ్మవారి దర్శనసేవల కోసం క్యూలైన్‌లో బారులు తీరారు. భక్తులు,చిన్నారులు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అక్షరాభ్యాస పూజలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లుచేశారు. అమ్మవారి అన్నదాన సత్ర భవనంలో భక్తులు,చిన్నారులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ. 3 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు.

విద్యారంగంలో ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
* నిర్మల్‌కు చేరిన విద్యాపోరాట బస్సుయాత్ర
* డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్యాముల్
దివ్యనగర్, ఫిబ్రవరి 11: విద్యారంగంలో ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యాముల్ డిమాండ్‌చేశారు. విద్యారంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో చేపట్టిన విద్యాపోరాట బస్సుయాత్ర శనివారం నిర్మల్‌కు చేరుకుంది. ఈ యాత్రకు పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాలులు అర్పించారు. తదుపరి శ్యాముల్ మాట్లాడుతూ విద్యను రక్షించాలనే ఏకైక ఎజెండాతో ఈయాత్రను చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న విధంగానే విద్యారంగాన్ని పరిక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యను ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారానే అందించాలని, రిలయన్స్ సంస్థకు భూమిని, రిజర్వేషన్‌లు లేని ప్రవేశాలకు అనుమతిలు ఇవ్వకూడదన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును విరమించుకుని ప్రస్తుతం ఉన్న విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో జరిగే విద్యాపోరాట యాత్రలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని విజ్ఞప్తిచేశారు. విద్యారంగంలోకి పెట్టుబడులు రావడం, వ్యాపారం చేయడం కొరకు కార్పోరేట్ పెట్టుబడుల సంస్థలు ప్రపంచీకరణ విధానాలు ప్రవేశించిన 1990 నుండి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు. 14 ఏళ్లలోపు బాలబాలికలందరికి నిర్బంధ ఉచిత విద్యను ప్రభుత్వాలు అందించాలని రాజ్యాంగంలోని 45వ అధికరణ చెప్పినా మన ప్రభుత్వాలు 67 ఏళ్లుగా అమలుచేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టిపిటి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొండల్‌రెడ్డి, పిడి ఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు నర్సయ్య, టివివి రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, విద్యాపోరాట యాత్ర కన్వీనర్ చంద్రశేఖర్‌రావు, ఐ ఎఫ్‌టియు జిల్లా ప్రధానకార్యదర్శి రాజన్న, అఖిలభారత రైతు సంఘం ఎం.శంకర్, పిడి ఎస్‌యు నాయకులు వెంకటేష్, ప్రజాఫ్రంట్ నాయకులు అజయ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, కె. ఎంపి యస్ నాయకులు నర్సప్ప, సిపి ఐ నాయకులు ఎస్ ఎన్ రెడ్డి, పిడి ఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.