అదిలాబాద్

జిల్లాలో ముమ్మరమైన ఖరీఫ్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, జూన్ 18: కుమ్రం భీం జిల్లాలో ఖరీఫ్ పనులు ముమ్మరమయ్యాయి. సీజన్ ఆరంభంలోనే వర్షాలు సమృధ్దిగా కురుస్తుండడంతో అన్నదాత గత కొద్ది రోజులుగా పొలం పనుల్లో బిజీగా కనిపిస్తున్నాడు. ఈసారి అన్ని మండలాల రైతులు ఎక్కువ శాతం పత్తి పంట పండించడం పట్ల మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే పత్తి సాగు పెరుగుతుండగా, కంది పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది. అయితే పంట సాగు విషయంలో రైతులకు అవగాహన కల్పించేందుకు వేసవిలో వ్యవసాయ శాఖ అధికారులు ఊరూరికి వెల్లి నిర్వహించిన అవగాహన సదస్సులు పెద్దగా ఫలితం ఇవ్వలేదనే చెప్పవచ్చు. నిజానికి పంటమార్పిడి పద్దతి, అంతర్ పంటలు వేసుకోవాలని అధికారులు సదస్సుల్లో సూచించారు. పత్తి పంటతోపాటు పప్పు దినుసులు వేసుకోవాలని కోరారు. ఈవేమీ పట్టించుకోని రైతులు గత ఏడాది పలికి ధరను దృష్టిలో ఉంచుకొని పత్తి పంట పండించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 1.24 లక్షల హెక్టార్ల విస్తీర్ణం సాగులోకి రానుంది. ఇందులో 74వేల హెక్టార్లలో పత్తి, 17 వేల హెక్టార్లలో కంది, 12వేల హెక్టార్లలో వరి పంటలు సాగవ్వనున్నాయి. వీటితోపాటు సిర్పూర్ నియోజక వర్గంలోని కౌటాల, దహగాం, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల్లో ఎప్పటి లాగే రైతులు సోయాబీన్ పంట వేసుకోనున్నారు. గత ఖరీఫ్‌లో ప్రభుత్వ సూచన మేరకు జిల్లాలో ఎక్కువ శాతం రైతులు కంది పంట వేశారు. తీరా సమయానికి గిట్టుబాటు ధర రాక పోవడంతో రైతాంగం తీవ్ర నిరాశకు లోనయ్యింది. దీనికి తోడు గత ఏడాది పత్తి పంట క్వింటాలుకు రూ. 5వేల పై చిలుకు ధర పలికింది. ఈనేపథ్యంలో జిల్లా రైతులు ఈసారి పత్తి పంట సాగు చేసేందుకు సన్నధ్దమయ్యారు. ఇప్పటికే పొలాల్లో దుక్కులు పూర్తి చేసుకొని విత్తనాలు కొనుగోలు చేయడంలో పత్తి రైతులు బిజీగా ఉన్నారు. సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో విత్తనాలు విత్తే ప్రక్రియ పక్షం రోజుల ముందుగానే ముగిసేలా కనిపిస్తోంది. ఇప్పటికే కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల్లో విత్తనాలు నాటే పనులు సగానికిపైగా పూరె్తైనట్లు తెలుస్తోంది. అలాగే ఆసిఫాబాద్, వాంకిడి, తిర్యాణి, రెబ్బెన మండలాల్లో ఇప్పుడిప్పుడే ఖరీఫ్ ఊపందుకుంటోంది. ఈతరుణంలో డిమాండ్‌కు సరిపడా యూరియా, డిఏపి కొరత ఏర్పడడంతో రైతాంగం ఆందోళణ వ్యక్తం చేస్తోంది. సకాలంలో ఎరువుల లభించక పోతే పంట దిగుబడి తగ్గుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆరంభంలోనే యూరియా, డిఏపి అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వర్షాలు సమృధ్దిగా కురిసి జిల్లాలోని వట్టివాగు, చెలిమెల, పాల్వాయి పురుషోత్తం రావుప్రాజెక్టు రిజర్వాయర్లలో నీరు చేరితే గనక ఎప్పటి మాదిరిగానే ఈ ఆయకట్టుదారులు వరి సాగు చేసుకునే వీలుంది. అలా కాని పక్షంలో ఈప్రాజెక్టుల కింది రైతులు సైతం పత్తి, లేదా కంది పంటలను వేసుకునే అవకాశాలు లేక పోలేదు.

సమ్మె విచ్ఛినానికి కుట్రలు
* ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి
తాండూర్, జూన్ 18: సింగరేణిలో సమ్మెను విచ్ఛినం చేసేందుకు యాజమాన్యం, టిబిజికెఎస్ నేతలు కుట్రలు చేస్తున్నరని ఎఐటియుసి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి ఆరోపించారు. గోలేటిలోని కెఎల్ మహేంద్రభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరయ్యే కార్మికులను, ఆపరేటర్లను కోరుకున్న చోటికి బదిలీలు చేయిస్తామని అధికారులు, నాయకులు గనులపై మందు, విందు పార్టీలు ఇస్తూ కార్మికులను ప్రలోభాలకు గురి చేస్తున్నరని ఆయన విమర్శించారు. కార్మికులు పూర్తిగా హాజరైనా రాని బొగ్గు ఉత్పత్తిని సమ్మెలో తక్కువ కార్మికులతో ఎక్కువ ఉత్పత్తిని సాధించినట్లు తప్పుడు ప్రచారం చేయడం శోచనీయమన్నారు. ఎటువంటి నిబంధనలు లేకుండా ప్లేడే చేయవచ్చని యాజమాన్యం ఎంత ప్రచారం చేసిన మెజార్టీ కార్మికులు సమ్మె వైపే మొగ్గు చూపుతున్నరని ఆయన పేర్కొన్నారు. కార్మికులు, కార్మిక బిడ్డల శ్రేయస్సు కోసం టిబిజికెఎస్ నేతలు సమ్మె విచ్ఛినం ప్రయత్నాలు మానుకోని సమ్మెకు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి, జగ్గయ్య, శేషు, రాజేష్, దివాకర్, భిక్షమయ్య, కిరణ్‌బాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

హిట్లర్ పాలన కోనసాగిస్తున్న కేసిఆర్
* మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు
దండేపల్లి, జూన్ 18: ముఖ్యమంత్రి కెసిఆర్ హిట్లర్ పాలన కోనసాగిస్తున్నాడని ఆదిలాబాద్ మాజీ శాసనమండలి సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో ఆదివారం ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కెసిఆర్ ఏన్నో వాగ్ధానాలు ఇచ్చాడని తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చి తను చేప్పిందే వేధంగా రాష్ట్రాన్ని పాలిస్తూ, ఇతర పార్టీల నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, రెండు పడకల గదులు,దళీతులకు మూడు ఎకరాల సాగు భూమి ఇస్తామని ప్రకటించిన కేసిఆర్ ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ వస్తే ప్రజలు బాగుపడుతారని పేర్కొన్న ముఖ్యమంత్రి వారి కుటుంబాన్ని మాత్రం బాగు చేసుకుంటున్నాడని ఆయన పేర్కోన్నారు. రైతులు అమ్మిన దాన్యానికి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చేప్పిన ప్రభుత్వం నేలలు గడుస్తున్న ఇంతవరకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ కావడం లేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని హామి ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి, మంచిర్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమాలకర్ రావు, మాజీ ఎంపిపి అక్కల వెంటకేశ్వర్లు, నాయకులు కర్ణాల కిషన్, రాంచందర్, ముద్దసాని వేణు, గణపతి, శ్రీహరి, జిడ్డుగు రాయలింగు, పీసరి స్వామి గౌడ్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కల కృష్ణ, బండ ఉదయ్‌లు పాల్గొన్నారు.

సమ్మెలో మందు, విందులేలా...
* ఒకే గమ్యం, ఒకే లక్ష్యం ఇదేనా..?
బెల్లంపల్లి, జూన్ 18: సింగరేణి యజమాన్యం ఒకే గమ్యం, ఒకే లక్ష్యం సిద్దాంతాన్ని చెప్పుకుంటుండగా సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో గనులు, ఓపెన్‌కాస్టులలో జరుగుతున్న నిరవధిక సమ్మెలో లక్ష్యానికి నిబంధనలకు విరుద్ధంగా సింగరేణి యజమాన్యం పనిచేస్తుందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సమ్మె ద్వారానే హక్కులు సాధించబడుతాయని, జాతీయ కార్మిక సంఘాలు చెప్పుతుండగా సింగరేణి యజమాన్యం మాత్రం సమ్మె ద్వారా నష్ట జరుగుతుందని సమ్మె చట్ట విరుద్దం అని మైకుల ద్వారా ప్రచారాలు చేయిస్తుంది. కార్మిక సంఘాలు, సింగరేణి యజమాన్యం వద్ద ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ముఖ్య భూమిక పోషించే కార్మికులు పోరాటాలు చేసి హక్కులు సాధించే వైపు కార్మిక సంఘాలు తమ మనుగడ సాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా, గత నాలుగు రోజులుగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం సమ్మెను కొనసాగిస్తున్నారు. 70 శాతం మంది కార్మికులు విధులకు హాజరవుతూ యజమాన్యం, టిబిజికెఎస్ చెప్పడం. సమ్మె విజయవంతం అయిందని సమ్మెలో కార్మికులు పాల్గొంటున్నారని కార్మిక సంఘాలు చెప్పడం గత మూడు రోజులుగా జరుగుతునే ఉంది. కొంతమంది కార్మికులు 14వ తేదీన 2,3 షిఫ్ట్‌లకు వెళ్లగా వారిని అక్కడే నిర్బంధించి సింగరేణి వ్యాప్తంగా భూగర్భ గనులు, ఓపెన్ కాస్టుల్లో పనులు చేయించడం అంతేకాకుండా యజమాన్యం కార్మికులను ప్రలోభాలకు గురిచేసి బలవంతంగా విధులోకి దించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 1, కైరీ గూడ బిపి ఏ ఓసిపి 2 తదితర గనులలో యజమాన్యం నిబంధనలకు విరుద్దంగా కార్మికులను ప్రలోభాలకు గురి చేసి విందులు వినోదాలకు ఆకర్శితులను చేసి విధులోకి దింపడం ఏ నిబంధనలోకి వస్తుందో యజమాన్యం తేల్చాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇదేనా ఒకే గమ్యం, ఒకే లక్ష్యం మద్యం సేవించి మాంసం తింటే కార్మికులు అనారోగ్యాలకు గురవుతారని యజమాన్యం అనేక సార్లు గనులు, డిపార్ట్‌మెంట్‌లు ప్రచారం కూడా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు మద్యం అందజేయడం, మాంసం వడ్డించడం ఇటువంటి నిబంధనలు ఎలా వర్తిస్తుందో అనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తం అవుతుంది. మద్యం సేవించి మాంసం తినడం ద్వారా కార్మికుల అనారోగ్యానికి గురవుతారు. కార్మిక కుటుంబాలల్లో వ్యక్తమవుతుంది. సమ్మె చట్టవిరుద్ధమన్న యజమాన్యం విధులు చట్ట పరిధిలోకి రావా అని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయాలకు సింగరేణి యజమాన్యం సమాధానం చెప్పాలని కార్మికులు వారి కుటుంబాలు కోరుతున్నారు.

సరస్వతి నామస్మరణతో మారుమ్రోగిన బాసర
* వేలాదిగా తరలివచ్చిన భక్తులు
* చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు
బాసర, జూన్ 18: ప్రసిద్ద పుణ్యక్షేత్రం సరస్వతిదేవి కొలువుదీరిన బాసర అమ్మవారి క్షేత్రం ఆదివారం భక్తజనంతో పులకించిపోయింది. సరస్వతిదేవి చెంత అక్షర శ్రీకార పూజలు జరిపించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నుండేకాకుండా మహారాష్ట్ర నుండి సైతం భక్తులతో ఆలయ వసతి గదులు, ప్రైవేటు గదులు సందడిగా మారాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస పూజలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, భక్తులు అమ్మవారి దర్శన సేవల కోసం క్యూలైన్‌లో బారులుతీరారు. దర్శనానికి గంటకుపైగా సమయం పట్టడంతో భక్తులు, చిన్నారులు క్యూలైన్‌లో ఇబ్బందులపాలయ్యారు. దేవాదాయశాఖ అధికారులు భక్తులకు సేవలు అందించారు. పాఠశాలలు ప్రారంభం నేపథ్యంలో అక్షరాభ్యాస పూజలు జరిపించడానికి భారీగా తరలివచ్చారు. ప్రైవేటు వాహనాలు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. సుమారు 1200 మంది చిన్నారులకు ఆలయ అర్చకులు అక్షరాభ్యాస పూజలు ఘనంగా నిర్వహించారు. రూ.8 లక్షల వరకు ఆలయానికి ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

మండలంలో విస్తారంగా వర్షాలు
జోరుగా పత్తి నాట్లు - ఆనందంలో రైతులు
* సకాలంలో వర్షాలతో 90 శాతం పూర్తి అయిన పత్తినాట్లు,
* రెండవసారి విత్తే నష్టం నుండి గట్టెకెక్కిన రైతన్న
* ఎరువులు, బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరుతున్న రైతులు.
వాంకిడి, జూన్ 18: మండలంలో ఈ ఏడాది జూన్ మొదటి నుండే విస్తారంగా వర్షాలు పడుతుండడంతో మండల పత్తి రైతులు జోరుగా పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఈవిధంగా సకాలంలో వర్షాలు పడడంతో వారానందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో నెలకొన్న వాతావరణం చూస్తుంటే ఈ సారి నాటిన ప్రతి విత్తనం మొలకెత్తుతుందని వారంటున్నారు.గత నాలుగైదు సంవత్సరాలుగా సకాలంలో వర్షాలు పడకపోవడంతో రెండు,మూడు సార్లు విత్తనాలు నాటడంతో తీవ్ర నష్టకలిగేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వారంటున్నారు.వర్షం కోసం ఎదురుచూస్తున్న మండల పత్తి రైతులకు మే 27 నుండే వర్షం రావడంతో వ్యవసాయ పనులు చేసుకొంటూ జూన్ మొదటి వారం నుండే విత్తనాలు నాటుతున్నారు. ఈ సారి వేసిన పత్తి విత్తనాలు వర్షం ప్రవాహానికి కొట్టుకొని పోలేదని,ట్రాక్టర్‌తో దుక్కిదున్ని వేసిన పత్తి విత్తనాలు లోపలికి పోలేదని,అదేవిధంగా విత్తనాలపై మట్టి గట్టిగా కూర్చోవడం వంటిది జరగదని, మట్టి మృదువుగా ఉండడంతో మొలకెత్తవనే బాదలేదని వారంటున్నారు.మండలంలోని దాదాపు 90 శాతం మంది పత్తి రైతులు ఇప్పటికే విత్తనాలు నాటారని వారు పేర్కొంటున్నారు. విత్తనాలు వేసిన తర్వాత ఇలా అనుకూలంగా వర్షాలు రావడం చాలా ఏళ్ళతర్వాత ఇదే ప్రధమం అని వారంటున్నారు.ప్రతి సంవత్సరం విత్తనాలు వేసిన తర్వాత ఎప్పుడైనా ఒక మోస్తరు వర్షం వచ్చేదని దాంతో పత్తి 90శాతం మొలకేత్తేదని,అయితే ఈ సారి పంటకు అనుకూలంగా వర్షం రావడంతో పత్తి మొలకెత్తడానికి చాలా అనువైన వాతావరణం నెలకొందని వారంటున్నారు. ఈ సంతవ్సరం మండలంలో దాదాపు 28వేల ఎకరాల్లో పత్తి పంటను వేస్తున్నారని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటికే దాదాపు 24 వేల ఎకరాల్లో పత్తి నాట్లు అయినట్లు వారంటున్నారు.అనుకూలమైన వాతావరణంలో ఈ సారి రెండవ సారి విత్తనాలు విత్తే పరిస్ధితినుండి గట్టెక్కినట్లు వారానందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంత సజావుగా సాగుతున్న తరుణంలో తగినంత ఎరువులు,బ్యాంకు రుణాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
* ఇద్దరి పరిస్థితి విషమం
ఉట్నూరు, జూన్ 18: మండల కేంద్రంలోని కొమురంభీం ప్రాంగణం ఎదురుగా గల రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొమురంభీం ప్రాంగణం ఎదురుగా గల రోడ్డుపై ఆటోను ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ ఢీకొట్టడంతో మోటారుసైకిల్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సింగరేణిలో సమ్మె సడలింపు
* 50 శాతం కార్మికుల విధులకు హాజరు
* ఓసిపిలలో 80 శాతం
శ్రీరాంపూర్ రూరల్, జూన్ 18: సింగరేణిలో జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె సింగరేణిలో సడలింపు జరిగింది. ఓసిపిలలో 80 శాతం కార్మికులు హాజరు కాగా భూగర్భగనులలో 50శాతం కార్మికులు హజరయ్యారు. ఆదివారం శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులలో కార్మికుల హాజరుశాతం పెరిగింది. అదే విధంగా ఓసిపిలో ఉత్పత్తితోపాటు కార్మికుల హాజరుశాతం కూడా పెరిగింది. సింగరేణి యజమాన్యం, టిబిజికెఎస్ సమ్మె విచ్చిన్నానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసి శుక్ర, శనివారం, విధులు నిర్వహించిన కార్మికులకు ఆదివారం ప్లేడే కల్పించడంతో కార్మికులు ఎక్కువ శాతం హాజరయ్యారు. అయినప్పటికీ సింగరేణిలో పూర్తిస్థాయిలో పనులు నిర్వహించేందుకు కార్మికులు అన్ని డిపార్ట్‌మెంట్‌లకు చెందిన కార్మికులు అందుబాటులో లేకపోయ్యారు. అదే విధంగా శ్రీరాంపూర్ ఓసిపిలో మొదటి బదిలీ, రెండో బదిలీ కార్మికులు హాజరైనప్పటికీ సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అదే విధంగా జే ఏసి కార్మిక సంఘాల నాయకులు ఉదయం ఓసిపి ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో ముందస్తు సమాచారంతో ఓసిపి ప్రధాన ద్వారం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని గనులపై పోలీసుల బందో బస్తు నిర్వహించారు. ఓసిపి వద్ద ఏఐటియూసి మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, మండల సహాయ కార్యదర్శి లింగ మూర్తి, హెచ్‌ఎంఎస్ బ్రాంచ్ నాయకులు తిరుపతి, ఖరీం ఉల్లాలతోపాటు 10మంది కార్మిక సంఘాల నాయకులను అరెస్టుచేసి శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రైతు సమగ్ర సర్వే గడువు పెంపు
* మిగిలిన 20శాతం నమోదుపై మల్లగుల్లాలు
* భూ సర్వేలో లక్షా 9వేల మంది రైతులుగా నిర్దారణ

ఆదిలాబాద్, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాల అమలుకోసం భూముల సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టడంతో ఆదిలాబాద్ జిల్లాలో 80శాతం వ్యవసాయ భూముల వివరాలు నమోదయ్యాయి. గత నెల 10వ తేదీన రైతు సమగ్ర సర్వేను ప్రారంభించగా ఈనెల 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సర్వే ముగిసినప్పటికీ అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో మిగిలిన 20శాతం భూముల నమోదుకోసం గడువును మరో 10 రోజులు పెంచారు. ఈనెలాఖరులోగా మిగిలిన భూముల వివరాలను, రైతుల నమోదు కసరత్తు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు పూర్తయిన సర్వే ప్రకారం జిల్లాలో లక్షా 9వేల మంది రైతులు తమ పంట భూముల రికార్డులను నమోదు చేయించగా వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారుల ఉమ్మడి సర్వే సమయంలో అందుబాటులో లేని 2500 మంది రైతులకు నోటీసులు కూడా జారీ చేశారు. వీరు వెంటనే తమ పంట భూముల వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనెలాఖరులోగా వివరాలు అందించకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో లక్షా 32వేల500 మంది రైతులుగా నిర్దారించగా, ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయ రికార్డుల ప్రకారం లక్షా 22వేల మంది రైతులు జిల్లాలో ఉన్నట్లు తేల్చిచెబుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని గ్రామాల్లో రైతులు భూములను కౌలుకు ఇచ్చి పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లడం, మరికొంత మంది రైతులు అర్బన్ ఏరియాల్లో తమ పంట భూములను రియల్ ఎస్టెట్ ప్లాట్లుగా లే అవుట్లు చేయడం, మరోవైపు అసైన్డ్, ఈనామ్ భూముల వివరాల లెక్కలు అధికారులకు అందకపోవడంతో సుమారు 15శాతం రైతుల భూముల వివరాలు నమోదు చేసే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డులు ఓ విధంగా, వ్యవసాయ శాఖ భూముల వివరాలు మరో విధంగా ఉండడంతో పొంతన కుదరడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన రైతులను గుర్తించి, పంట భూముల వివరాలను సేకరించేందుకు రైతు సమగ్ర సర్వే చేపట్టగా 80శాతం పైగా రైతుల వివరాలు నమోదయ్యాయి. వ్యవసాయ శాఖకు చెందిన విస్తరణ అధికారులు జిల్లా వ్యాప్తంగా 94 క్లస్టర్ల పరిధిలో 510 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించి, లక్షా 9వేల మంది రైతుల వివరాలు సేకరించారు. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, విఆర్‌వోలు, విఆర్‌ఏల సహకారంతో రైతు సమగ్ర సర్వే కొనసాగుతుండగా ఈ గడువును ఈనెలాఖరు వరకు పొడగించడంతో మరో పది శాతం మంది రైతులు సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇతర ప్రాంతాలకు వెళ్ళిన రైతుల ఇండ్లకు నోటీసులు అందజేయగా మిగిలిన లక్ష్యాన్ని సాధించి, నివేదిక సమర్పించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతుండడం గమనార్హం.
సోయా విత్తనాల పంపిణీకి 54 కౌంటర్లు
జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విత్తనాల పంపిణీపై దృష్టిసారించారు. గత ఖరీఫ్‌లో పత్తిపంట విస్తీర్ణం తగ్గించి, కంది, సోయా పంటలు వేయగా మార్కెట్‌లో పత్తికి గిట్టుబాటు ధర లభించగా, సోయా, కందులకు ధర రాకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఈసారి వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటల గురించి సూచనలు, సలహాలు ఇవ్వడం లేదు. తద్వారా రైతులు 15శాతం పత్తి సాగు విస్తీర్ణణాన్ని పెంచుకోవడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే పత్తి మొలకెత్తి అనుకూలించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే 33.3శాతం రాయితీతో రైతులకు సోయా విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 54 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనాలు పంపిణీ చేస్తోంది. నకిలీ విత్తనాల బెడదను అరికట్టేందుకు ప్రత్యేకంగా విజిలెన్స్ మానిటరింగ్ బృందాలను రంగంలోకి దించారు.