అదిలాబాద్

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ, సెప్టెంబర్ 18: మండలంలోని హిరాపూర్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మరణించారు. భైంసా మండలంలోని కుంసర్ గ్రామానికి చెందిన సోలంకి సూర్యకాంత్ (35) హిరాపూర్‌లోని తన బంధువుల ఇంటికి వస్తుండగా గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న హిరాపూర్ గ్రామానికి చౌహన్ ఈశ్వర్ (38) ద్విచక్రవాహనాలపై వస్తుండగా ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో సోలంకి సూర్యకాంత్ సంఘటన స్థలంలో అక్కడికక్కడే మృతి చెందగా చౌహన్ ఈశ్వర్‌కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించారు. సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈశ్వర్ మృతి చెందినట్లు ఇచ్చోడ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హోంగార్డులకు దసరా కానుకగా రూ.3వేల బోనస్
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 18: జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులకు దసరా కానుకగా రూ.3వేల చొప్పున అందజేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయంలో జిల్లా హోంగార్డు ప్రతినిధులు ఎస్పీని కలిసి దసరా పండగ సందర్భంగా ముందస్తుగా ఈనెల 25న వేతనం అందించాలని కోరారు. జిల్లా ఎస్పీ స్పందిస్తూ వేతనానికి బదులుగా జిల్లాలోని 225మంది హోంగార్డులకు రూ.3వేల చొప్పున బోనస్ అందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇటీవలే ప్రశాంతంగా ముగిసిన బక్రీద్, గణేష్ ఉత్సవాల్లో హోంగార్డులు బందోబస్తులో కీలకపాత్ర పోషించారన్నారు. పోలీసులు నిర్వహిస్తున్న విధుల్లో చేయూతనిస్తూ నేరాలను అదుపు చేయడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈనెల 25న బోనస్ అందించాలని హోంగార్డుల ఇంచార్జ్ ఆర్‌ఐ బి.జెమ్స్‌ను ఆదేశించారు. జిల్లాలో మొదటిసారిగా హోంగార్డులకు పండగ సందర్భంలో బోనస్ రావడం పట్ల జిల్లా ఎస్పీ నిర్ణయం పట్ల హోంగార్డు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ముందస్తుగా వేతనాలు అందించడంతో హోంగార్డులు నిరుత్సాహాపడకుండా ఎస్పీ ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన విషయమన్నారు. ఎస్పీని కలిసిన వారిలో హైదర్ ఖాన్, సయ్యద్ అలీం, శంకర్, లక్ష్మణ్, ఆశీష్, ఖాలీద్, గణేష్, మహేందర్ రెడ్డి, జయ్ తదితరులు ఉన్నారు.

పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీచేసిన ఎస్పీ
కుభీర్, సెప్టెంబర్ 18: కుభీర్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో మామిడి మొక్కలను నాటారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తనిఖీల్లో భాగంగానే పోలీస్‌స్టేషన్‌ను సందర్శించడం జరిగిందన్నారు. పోలీస్‌స్టేషన్‌లో పెంచిన మొక్కలను చూసి సంతోషించారు. పచ్చని చెట్లతో మాడల్ పోలీస్‌స్టేషన్‌గా మారిందన్నారు. వినాయక నిమజ్జనం శాంతియుతంగా జరిగిందని, దుర్గా నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తామన్నారు. పండుగలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులు సక్రమంగా ఉన్నాయన్నారు. ఆయనవెంట భైంసా డి ఎస్పీ అందెరాములు, ముధోల్ సిఐ రఘుపతి, స్తానిక ఎస్సై కె.రమేష్‌లు ఉన్నారు.

ఆడ పడుచుల ఆత్మగౌరవానికి పెద్దపీట
బతుకమ్మ చీరల పంపిణీలో మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆడ పడుచుల ఆత్మ గౌరవానికి పెద్దపీట వేస్తూనే పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డు, మహాలక్ష్మివాడలో హింది హైస్కూల్, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన పేద మహిళలకు బతుకమ్మ చీరలను మంత్రి జోగురామన్న పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రామన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్దితో పాటు వారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసమే ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ సంస్కృతి, భాష, యాసను గౌరవిస్తూనే అన్ని మతాలకు చెందిన పండగలకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సర్వమత సార్వభౌమత్వం కోసం ప్రభుత్వం పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తుందని, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మహిళల దీవెనలు ఎప్పటికీ ఉండాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీతో పేద మహిళల్లో వెలుగులు నింపుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం కింద పెళ్ళి చేసుకున్న రోజే అధికారులు రూ.75116 అందించేలా ఆదేశాలు జారీ చేశామని, అమ్మ ఒడి పథకం కింద 12వేల నగదుతో పాటు గర్భిణీ బాలింతలకు రూ.2వేలు విలువచేసే కెసి ఆర్ కిట్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తున్నామని రామన్న పేర్కొన్నారు. అన్ని కులాలు, చేతి వృత్తుల వారికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం నిధుల కొరత లేకుండా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద పిల్లలకు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. మహిళలు స్వయం సమృద్దితో ముందుకు వెళితే ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని అన్నారు. వచ్చే జనవరి నాటికి మహిళలకు డబుల్ బెడ్‌రూంలను నిర్మించి ఇస్తామని అన్నారు. పారదర్శకంగా సాగుతున్న ప్రభుత్వ పాలనలో మహిళలే ముందుండి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. ఎంపి గెడం నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని, మహిళల పండగలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందన్న విషయాన్ని గుర్తుచేశారు. సంక్షేమం, అభివృద్ది సమపాళ్ళల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి, జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె రాజన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి వినతులను త్వరితగతిన పరిష్కరించాలి
* జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 18: ప్రజావాణికి వచ్చే వినతులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా వాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించారు. నస్పూర్ మండలానికి చెందిన బండ్ల శ్రీనివాస్ అనే దివ్యాంగుడు మాది చాలా నిరుపేద కుటుంబం అని, ఇల్లు లేక గుడిశలో నివసిస్తున్నామని శ్రీ శిశు సంక్షేమ వికలాంగుల, వయోవృద్దుల శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం కల్పించాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. దివ్యాంగుల చైతన్య వేదిక సభ్యులు దివ్యాంగులకు రుణాలు అందించేందుకు తక్షణమే ప్రకటనలు విడుదల చేయాలని, జిల్లాలోని అన్ని మండలాల ఎంపిడివో, బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి దివ్యాంగులకు రుణాలు అందించేలా చూడాలని వినతి ద్వారా కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడతూ సదూర ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు అర్జీలు పెట్టుకుంటారని, అధికారులు ప్రజల సమస్యలను ఒర్పుగా విని వారిసమస్యలను అర్థం చేసుకుని సాద్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. అధికారులు బాద్యతారహితంగా ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామాన్నారు. అర్జీదారులకు అండగా ఉంటామన్నా మనోదైర్యాన్ని కల్పించాలన్నారు. మా కోసం ప్రజావాణి ఉంది అన్న విశ్వాసాన్ని ప్రజల్లో నింపాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఉన్నతాధికారులు అందుబాటులో ఉన్న లక్ష్యంతోనే ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఆర్‌వో ప్రియాంక, సంబందిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ ఉత్సవాలు సంబరంగా జరుపుకోండి
* ఎమ్మెల్యే, జెడ్పీటీసీల మధ్య వాదులాట * మాల గురిజాలలో బతుకమ్మచీరల దగ్ధం * ఎమ్మెల్యే పై ఆగ్రహం
బెల్లంపల్లి, సెప్టెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలు పంపిణి చేసే కార్యక్రమం బెల్లంపల్లి మండలంలో గొడవకు దారి తీసింది. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య వాదులాట జరిగింది. సోమవారం బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామంలో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా కొనసాగింది. తాను ప్రజాప్రతినిధిని అయినప్పటికీ తనకు తెలియకుండా చీరల పంపిణీ కార్యక్రమం ఎలా చేపడుతారని ఎమ్మెల్యే చిన్నయ్యతో పాటు బెల్లంపల్లి ఆర్డీవో వీరన్న ఇతర అధికారులను జెడ్పీటీసీ కారుకూరి రాంచందర్ నీలదీశారు. ఇటీవల రాజకీయలకు వచ్చిన నీవు ఎమ్మెల్యేగా ఫోజులు కొడుతున్నావు.. నేను విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో పని చేస్తున్నానంటు జెడ్పీటీసీ కారుకూరి రాంచందర్ టీ ఆర్ ఎస్ నాయకులతో గొడవకు దిగారు. దీంతో అరగంట పాటు నాయకులతో వాగ్వివాదం జరిగింది. అనంతరం యథావిధిగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిన్నయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాలప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం దృడ సంకల్పంతో పనిచేస్తుందన్నారు. ముఖ్య మంత్రి కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన ప్రతీ వాగ్దానం అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 44లక్షల మందికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెన్షన్‌లు అందజేస్తుందని తెలిపారు. దసరా పండగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పేదింటి మహిళలందరికి ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల కోసం 223 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. తెలంగాణలో అతి పెద్ద పండుగ అయినా దసరా పండగను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక దసరా పండగను పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. చేనేత వస్త్ర కార్మికుల నుండి చీరలను కొనుగోలు చేసి వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాల కృషిచేసిందని తెలిపారు. అంతే కాకుండా పట్టణంలోని 27 కేంద్రాలను ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు వుండితెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ మహిళలకుసోమవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మండలంలోని మాల గురిజాల గ్రామంలో కొంతమంది వృద్దులు బతుకమ్మ చీరలను దగ్దంచేశారు. కార్యక్రమంలో ఎంపిపి సుభాష్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ సునితరాణి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ చిలువేరు నర్సింగం, జెడ్పీటీసీ కారుకూరి రాంచందర్, ఆర్డివో వీరన్న, తహసిల్దార్ సురేష్, పట్టణ అద్యక్షుడు నారాయణ, కౌన్సిలర్లు శ్రీనివాస్,బి. సుదర్శన్,ఆరెపల్లి సుధాకరాణి, టీఆర్‌ఎస్ నాయకులు భీమా గౌడ్, బత్తుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.