అదిలాబాద్

సిఎం దృష్టికి ఆదివాసీల సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 18: ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకవెళ్తామని, ఎజెన్సీలో నకిలీ ధృవపత్రాల జారీపై విచారణ జరిపించి గిరిజనులకు న్యాయం చేస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్‌లోని డైట్‌మైదానంలో ఆదివాసీ సంస్కృతి సమ్మేళనం నిర్వహించగా మంత్రి జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సంధర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనుల ఆనాదిగా ఎదుర్కొంటున్న రిజర్వేషన్ల సమస్య ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, ఈ విషయమై ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాకు చెందిన తాను, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో చర్చించడం జరిగిందన్నారు. సున్నితమైన గిరిజనుల వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు, అందోళనల నేపథ్యంలో చీఫ్ సెక్రెటరీతో పాటు డిజిపి, ప్రభుత్వ యంత్రాంగం జిల్లాకు దిగివచ్చి పలుమార్లు గిరిజన సంఘాలతో చర్చించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను లోతుగా పరిశీలించి, ఆదివాసీ గిరిజనులకు చట్టబద్దంగా న్యాయం చేసే అంశంపై దృష్టిసారించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రిజర్వేషన్ల వ్యవహారంపై పరిశీలిస్తున్నారని మంత్రి అన్నారు. ఆదివాసీల సంస్కృతి విశిష్టమైనదని, వారి సంస్కృతి పరిరక్షణతో పాటు హక్కుల సాధన కోసం శాంతియుతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అందోళన ద్వారా సాధించేది ఏమి ఉండదని, విధ్వంస ఘటనలకు పూనుకోవద్దని ఆదివాసీలకు మంత్రి సూచించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్న ప్రధాన డిమాండ్ నేపథ్యంలో ఇరువర్గాల మద్య సామరస్యదోరణితో వ్యవహరించి చర్యలు తీసుకుంటామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో అధికారులు నకిలీ ఏజెన్సీ ధృవపత్రాలు జారీ చేస్తున్నట్లు ఆదివాసీ సంఘాల నుండి వస్తున్న ఆరోపణ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆదివాసీ హక్కుల సంఘం రాష్ట్ర జెఏసి చైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం శాంతిపూరితంగానే అందోళన చేస్తున్నామని అన్నారు. ఆనాదిగా అడవులను ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజన తెగల సమస్యలను పరిష్కరించి, వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు ఉపేందర్ మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుండి లంబాడా తెగను తొలగించి, ఆదివాసీ గిరిజనులకు రిజర్వేషన్ సౌకర్యం పెంపొందించాని, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీరని నష్టానికి గురవుతున్నారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆదివాసీ, గిరిజనుల అభివృద్దికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. తమ సంస్కృతి పరిరక్షణ కోసమే జిల్లా వ్యాప్తంగా సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని, ఆదివాసీలను సంఘటితం చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. శాంతియుతంగా ఉద్యమాలు కొనసాగించి హక్కులు సాధించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సోయం చిన్నయ్య, మున్సిపల్ చైర్మెన్ రంగినేని మనీషా తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆదివాసీ గిరిజనులు ప్రదర్శించిన కళారూపాలు, సంగీతవాయిద్యాలు ప్రతి ఒక్కరిని అలరింపజేశాయి.