అదిలాబాద్

ఆదిలాబాద్‌లో చలి పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 26: ఆదిలాబాద్ జిల్లాపై చలిపంజా విసరడంతో సామాన్య జనం అల్లాడిపోతున్నారు. రెండు రోజులుగా పొద్దంతా చలిగాలులు, రాత్రి వేళల్లో ఎముకలు కొరికే చలితో గజ గజ వణికిపోతున్నారు. శుక్రవారం 6.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా శనివారం అమాంతంగా 4.4 డిగ్రీలకు పడిపోవడం చలితీవ్రతకు అద్దంపడుతోంది. గత ఏడాది జనవరి మొదటి వారంలో ఈ పరిస్థితి ఉండగా ఈసారి పది రోజుల ముందుగానే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం అందరిలో కలవరం పుట్టిస్తోంది. ఉదయం లేచింది మొదలు పల్లెల నుండి పట్టణాల్లో పాలు, కూరగాయలు అమ్ముకునే చిన్న రైతులు, కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉదయం 6 నుండి 8.30 గంటల వరకు పట్టణాలు, పల్లెలను మంచు దుప్పటి కమ్మేయడంతో ఇక్కడి పరిస్థితి మరో కాశ్మీరాన్ని తలపిస్తోంది. ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 4.4 డిగ్రీలు నమోదు కావడం ఇదే మొదటి సారి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలకు చేరుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఉట్నూరు, బోథ్, బజార్‌హత్నూర్, ఆసిఫాబాద్‌లో 4.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పంజా విసురుతున్న చలి నుండి తట్టుకునేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం 10.30 గంటల వరకు ఇంటి గడప నుండి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇక ఉదయమే పాఠశాలలకు వెళ్ళాల్సిన చిన్నారులు, బడి పిల్లల పరిస్థితి మరింత కలవరపెట్టిస్తోంది. దినమంతా శీతలపవనాలు వీస్తుండగా, రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనజీవనం స్థంభించిపోతోంది. ఉదయం వ్యాయామం కోసం కాలినడకన వెళ్లే పాదచారులు, దినచర్యలో భాగంగా రోడ్లు శుభ్రపర్చే కార్మికులు చలితీవ్రతతో గజ గజ వణికిపోతున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూరు ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలితో జనం అల్లాడిపోతుండగా, పిల్లలు, పెద్దలకు చర్మవ్యాదులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చలిజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో యాచకులు, సామాన్యుల పరిస్థితి అందోళన కల్గిస్తోంది. ఆర్టీసి బస్సుల్లో ఉదయం ప్రయాణించే ప్రజలు కిటికి అద్దాల నుండి వచ్చే చలి గాలులతో నానా అవస్థలకు గురవుతున్నారు. ఇక ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని నార్నూర్, జైనూర్, ఉట్నూరు, సిర్పూర్‌యు, కెరమెరి మండలాల్లో చలిప్రభావం అధికంగా ఉంటుండడంతో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఉట్నూరు పట్టణాల్లో ఉన్ని దుస్తులు, నేపాలి చిరువ్యాపారులు విక్రయించే స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకి క్యాప్‌ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఉత్తరాది చలిగాలుల ప్రభావానికి తోడు జిల్లాలో అటవీ ప్రాంతం కారణంగానే చలి తీవ్రత అధికంగా ఉంటోందని, మరో వారం రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు, చలిగాలులు ఇదే విధంగా ఉంటాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.