హైదరాబాద్

ప్రచారం పొద్దుగూకింది.. మైకుల హోరు సద్దుమనిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 5: ఎన్నికల ప్రచార ఘట్టం బుధవారం సాయంత్రంతో పరిసమాప్తమైంది. ఈనెల 7న జరిగే పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లతో తలమునకలై ఉండగా మరోవైపు పోటీచేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభాలతో ఎరవేసేందుకు వ్యూహం రూపొందిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో భాగంగా ప్రచార పర్వం వేడెక్కగా చివరిరోజు బుధవారం ఉమ్మడి జిల్లాలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీల అగ్రనేతలు రోడ్‌షోలతో హోరెత్తించారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ఇచ్చోడ, భైంసా, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ కేంద్రాల్లో పోటాపోటీగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అగ్రనేతల ప్రచారం జోరందుకుంది. బుధవారం చివరి రోజు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యయోగి భైంసా బహిరంగ సభలో బీజేపీ అభ్యర్థి రమాదేవి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లును ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పాలన చవిచూసిన ప్రజలు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం పార్టీని డీకొట్టే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని యోగి పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ రోడ్‌షో కార్యక్రమంలో బీజేపీ పార్టీ అభ్యర్థి పాయల శంకర్‌కు మద్దతుగా కేంద్రమంత్రి హన్సరాజ్ గంగారాం ప్రచారం చేశారు. స్థానిక సమస్యలను ఎజెండాగా తీసుకున్న కేంద్రమంత్రి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వేలైన్‌తో పాటు సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరిస్తామని, రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మిస్తామని హామీలు గుప్పించారు. కాషాయ జెండాలతో పట్టణంలో కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఉట్నూరు, ఇచ్చోడ కేంద్రాల్లో జరిగిన బహిరంగసభలో మహారాష్ట్ర మంత్రి పంకజాముండె బీజేపీ అభ్యర్థులు సట్ల అశోక్, మడావి రాజులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్ తరపున మంత్రి జోగు రామన్న, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డిలు బల ప్రదర్శనతో భారీ రోడ్‌షో చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థులు సైతం పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. అభ్యర్థుల జాతకాన్ని తేల్చే ఓటరు తీర్పు శుక్రవారం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఎక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనన్న చర్చ ఆసక్తిరేపుతోంది. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది, అధికారులు బుధవారం రాత్రి బస్సులో పోలింగ్ కేంద్రాలకు సామాగ్రితో బయల్దేరి వెళ్ళారు. జిల్లాలోని చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిర్పూర్‌టి నియోజకవర్గాలు నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలుగా ఎన్నికల కమిషన్ గుర్తించడంతో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు గావించారు. సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో భారీ నిఘా తీవ్రతరం చేశారు.

మంచిర్యాలలో నువ్వా... నేనా...
* మూడు నియోజక వర్గాలలో రసవత్తర పోటీ * నియోజకవర్గాలలో జన నేతలు ఎవరు
మంచిర్యాల, డిసెంబర్ 5: మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్, మహాకూటమి అభ్యర్థుల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా రసవత్తర పోరు సాగుతోంది. బీజేపీ, బీఎల్‌ఎఫ్, బీఎస్పీలు కూడా ఈ మూడు నియోజకవర్గాలలో పోటీలో ఉన్నాయ. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించిన ప్రచారంలో మాత్రందూసుకెళ్లారు. కేసీఆర్, బృందా కారత్, మాయావతి, దేవేంద్ర ఫడ్నవీస్, కోదండరాం, జువేయిలా ఓలరాం, కిషన్‌రెడ్డి, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులతో జిల్లాలో ప్రచారం వేడేక్కింది. బుధవారంతో ప్రచారం ముగియడంతో మైక్‌లు అన్ని బోసిపోయాయి. ఈ ప్రచారంలో ఎవరి ఏజెండా వారే అంటూ ముందుకు సాగుతూ ప్రజలకు హామీలు గుప్పించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో జన నేతలు ఎవరు అనేది ఆసక్తికర చర్చకు తెరలేపింది. మంచిర్యాల నియోజకవర్గంలోని తాజా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మధ్య ప్రధాన పోటీ ఉంది. భూ వివాదాలతోపాటు అభివృద్ధి చేయలేదన్న విమర్శను టీఆర్‌ఎస్ అభ్యర్థి దివాకర్ రావు ఎదుర్కొన్నారు. భూ మాఫియాతో పాటు అక్రమ అస్తులతోపాటు బ్యాంకులకు ఎగనామం అనే వాదానలు కూడా ప్రేమ్ సాగర్‌రావు వైపు దూసుకొచ్చాయ. వీరికి ఆయా పార్టీల మేనిఫేస్టోలో పొందుపరిచిన అంశాలతోపాటు నియోజకవర్గంలోని పలు అంశాలపై ఇచ్చిన హామీలు కలిసివస్తాయా అని భావిస్తున్నా, ఆర్థికబలంతో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ఇద్దరు ఒకే వర్గానికి చెందడంతో సామాజికవర్గానికి చెందిన వారు కూడా ఎనాళ్లు ఈ దొరల పెత్తనం అంటూ, దొరలు ఉన్నంత సేపు నియోజకవర్గం అభివృద్ధి కాదంటూ విమర్శలు చేస్తూ వారికి ధీటుగా ప్రచారాన్ని చేపట్టారు. గత ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యలో పోటీగా నిలిచిన అప్పటి ప్రత్యర్థి అరవిందరెడ్డికి 35,921 ఓట్లు రాగా, దివాకర్ రావుకు 95,171 ఓట్లు పోలవడంతో 50వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ జననేత ఎవరు అనేది చెప్పలేనివిధంగా ఓటర్ నాడి ఉంది. చెన్నూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్, కాంగ్రెస్ అభ్యర్థి బొర్లకుంట వెంకటేష్ నేత మధ్య పోరు కొనసాగుతుంది. 2014 ఎన్నికలలో టీఆర్‌ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, మాజీ మంత్రి గడ్డం వినోద్ మధ్య పోటీ నెలకొన్నప్పటికీ టీఆర్ ఎస్ గెలుపొందింది. మాజీ ఎమ్మెల్యే ఓదెలుకు ఈసారి టికెట్ దక్కకపోవడంతో బాల్క సుమన్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరపున ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బొర్లకుంట వెంకటేష్ నేత పోలీలో నిలిచారు. ఫైర్‌బ్రాండ్ అయిన సుమన్‌ను గెలిపించాలని సభలో కేసీఆర్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ నాయకులు మాత్రం బాల్క సుమన్‌కు ఓటమి తప్పదంటున్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు 38,703 ఓట్లు పోలు కాగా, టీఆర్‌ఎస్‌కు 64,867 ఓట్లు పోలయ్యాయి. 30వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి నల్లాల ఓదెలు గెలిచారు. ఈ ఎన్నికలలో రసవత్తర పోరు నడుస్తున్నప్పటికీ బీజేపీ, బీఎల్‌ఎఫ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ దుర్గం చిన్నయ్య, మహాకూటమి తరఫున సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్, బీఎస్పీ అభ్యర్థి మాజీ మంత్రి గడ్డం వినోద్‌ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. గత ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు 73,779 ఓట్లు పోలు కాగా, సీపీఐకి 21,251 ఓట్లు పోలవడంతో 52వేల పై చిలుకు ఓట్లతో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికలలో మాత్రం ఇక్కడ టీఆర్‌ఎస్, బీఎస్పీ మధ్య పోటీ ఉన్నా బీఎస్పీ అభ్యర్థికి పీఠం దక్కేలా కన్పిస్తోంది. ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థుల మధ్య రసవత్తర పోటీ ఉన్నప్పటికీ మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల ఓటర్ నాడిని అంతుచిక్కడం లేదు.

టీఆర్‌ఎస్ రజాకార్ల పాలనకు ఓటుతో బుద్దిచెప్పండి
* బీజేపీని గెలిపిస్తే ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్
* ప్రజాసేవకుడు పాయల శంకర్‌కు పట్టం కట్టండి
* ఆదిలాబాద్ రోడ్‌షోలో కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం

ఆదిలాబాద్, డిసెంబర్ 5: టీఆర్‌ఎస్‌కు ఓట్లేసి గెలిపిస్తే రజాకార్ల పాలనతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని, అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి హన్సరాజ్ గంగారాం అన్నారు. బుధవారం ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి పాయల శంకర్‌కు మద్దతుగా పార్టీ అధ్వర్యంలో పట్టణంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. డైట్ మైదానం నుండి వినాయక చౌక్, అశోక్ రోడ్డు, దేవిచంద్ చౌక్, గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించగా అడుగడుగునా కార్యకర్తలు భారత్‌మాతాకీ జై అన్న నినాదాలతో హోరెత్తించారు. ఈ సంధర్భంగా అంబేద్కర్ చౌక్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్రమంత్రి హన్సరాజ్ గంగారాం మాట్లాడుతూ మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసి ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని దుయ్యబట్టారు. కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని, పథకాల పేర్లను మార్చి తానే అంతా చేసినట్లు కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆయూష్మాన్ భవ పథకంతో 3.5లక్షల మంది పేద వర్గాలకు కార్పోరేట్ వైద్యం అందించేలా నరేంద్రమోదీ చర్యలు తీసుకుంటే కేసీఆర్ రాష్ట్రంలో అమలు కాకుండా అడ్డుకున్నారన్నారు. పక్కాగృహాల నిర్మాణానికి కేంద్రం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తే ఒక్క రూపాయి ఖర్చుచేయకుండా కేసీఆర్ అసమర్థ పాలన కొనసాగించారన్నారు. కేంద్ర పథకాలను నీరుగారుస్తున్న ఆహంకార ప్రభుత్వాని గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 70ఏళ్ళ పాలనలో గాంధీ కుటుంబమే లాభపడింది తప్పా ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. వారసత్వ రాజకీయాలకు స్వస్థి పలికేందుకే మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని, బీజేపీని గెలిపిస్తే ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు కొత్త రైల్వేలైన్ నిర్మాణం సత్వరమే పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామని, విమానాశ్రయం మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో 150కోట్లతో ప్రధానమంత్రి స్వస్థ్ యోజన కింద సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని, పేదలందరికి మెరుగైన వైద్యం అందించి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే సమర్థుడైన పాయల శంకర్‌ను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ మాట్లాడుతూ తాను రెండుసార్లు ఓటమి చవిచూసినప్పటికీ ప్రజలకు దూరం కాకుండా అందుబాటులో ఉంటూ స్వచ్చందంగా సేవలందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి వేణుగోపాల్, పట్టణ అధ్యక్షుడు ఆకుల ప్రవీణ్, కన్వీనర్ వెంకట్, జిల్లా కార్యదర్శి విజయ్‌సింగ్ షేకావత్, నగేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్, మహాకూటమి దొందుదొందే
* బీజేపీని గెలిపిస్తేనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి
* మహారాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండె
ఇచ్చోడ, డిసెంబర్ 5: తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరగలేదని, అందుకే తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పాటు మహాకూటమిని అభ్యర్థులను ఓడించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని మహారాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండె అన్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైనా బుధవారం బోథ్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఇచ్చోడలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. అన్నివర్గాల ఐక్య ఉద్యమాలు, అనేక మంది విద్యార్థుల బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకలేదని ఆమె విమర్శించారు. తాగు, సాగునీటి సమస్య పరిష్కరించబడలేదని, ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు లభించలేదని విమర్శించారు. కనీసం కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా తెలంగాణ ప్రజలకు అందలేదన్నారు. పొరుగున్న ఉన్న మహారాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మూడు లక్షల పక్కాగృహాలతో పాటు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. తెలంగాణ ప్రజలు కలలుగనే తెలంగాణ సిద్ధించాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తున్నందున కేంద్రం నిధులు రాష్ట్రానికి దక్కాలంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలతో తన తండ్రి అయిన స్వర్గీయ గోపీనాథ్ ముండెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆయన కుమార్తెగా.. నేను మీ ముందుకు వచ్చానన్నారు. సుస్థిర ప్రభుత్వంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు బిజెపితోనే సాధ్యమవుతాయన్నారు. కార్యక్రమంలో యవత్మాల్ ఎమ్మెల్యే దినకర్‌రావు పావుడె, వణి ఎమ్మెల్యే సందీప్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుహాసిని రెడ్డి, పార్టీ నాయకులు గందె విజయ్‌కుమార్, నారాయణ రెడ్డి, కొల్లూరి శేఖర్, బాబాగౌడ్, భీంరెడ్డి, మాదవ్ ఆమ్టె, మచ్చా నారాయణ, మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
* 8వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు
* కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
ఆసిఫాబాద్, డిసెంబర్ 5: జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో ఈనెల 7వ తేదీన నిర్వహించాల్సిన అసెంబ్లీ ఎన్నిలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు, అధికార యంత్రాంగం సైతం ఇందుకోసం సర్వసన్నధ్దంగా ఉందని కుమరం భీం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ మల్లారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియనుందని తెలిపారు. పోలింగ్ గడువు4 గంటలకే ముగుస్తుందని తెలిపారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నధ్దంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పోలింగ్ కేంద్రాలను డిటిజలైజేషన్ చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం 100 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్, 208 పోలింగ్ కేంద్రాల్లో వీడియో గ్రాఫర్స్‌ను ఏర్పాటు చేసి, అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. మిగితా పోలింగ్ కేంద్రాల్లోని పరిణామాలను తెలుసుకునేందుకు ఆఫ్‌లైన్ ఫెసిలిటీని అందుబాటులో ఉంచుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో 532 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1పిఓ, 1ఏపిఓ , 2 ఓపిఓలు ఉంటారన్నారు. జిల్లాను రెండు సెక్టార్లుగా విభజించామని, ఆసిఫాబాద్ సెక్టార్‌లో 41, సిర్పూర్ నియోజక వర్గంలో 29 మంది సెక్టరోల్ అధికారులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈనెల 11న జిల్లా కేంద్రంలో జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సైతం ఏర్పాట్లు పూరె్తైనట్లు తెలిపారు. ఆసిఫాబాద్‌లో 20 రౌండ్లు, సిర్పూర్‌లో 19 రౌండ్లు పాటు ఓట్ల లెక్కింపుజరుగుతుందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. సమావేశంలో జెసి రాంబాబు పాల్గొన్నారు.

తెలంగాణలో పాలన చేతకాకే ముందస్తు ఎన్నికలు
* బీజేపీతోనే రాష్ట్రంలో పారదర్శకమైన పాలన సాధ్యం
* రాహుల్‌గాంధీ ఎక్కడికి వెళ్లిన విఫలమయ్యారు
* రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పాడుదాం
* బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
భైంసా రూరల్/ముధోల్, డిసెంబర్ 5: ప్రజలు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేయాలని మెజార్టీ కట్టబెట్టిన నాలుగేళ్లన్నరకే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు తెరాస వెళ్లిందని, భారతీయ జనతా పార్టీతోనే రాష్ట్రంలో పారదర్శకమైన పరిపాలన సాధ్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. బుధవారం భైంసా పట్టణంలోని పార్డీ(బీ) బైపాస్ రోడ్డు సమీపంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న పార్టీకి బుద్దిచెప్పాలని కోరారు. వైద్యవృత్తిలో ఉన్న వారు అమెరికతో పాటు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రదేశాలకు వెళ్లక స్థానికంగానే ఉంటూ ప్రజలకు సేవ చేయడానికి అసెంబ్లీ బరిలో నిలబడ్డారని తెలిపారు. సామాన్యకార్తలకు బీజేపీలో ఉన్నత స్థానాల్లో అవకాశం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. బీజేపీ పార్టీ తెరాసతో కుమక్కు అవుతుందని ప్రతిపక్షాలు అరోపించడం అర్థరహితమని తెలిపారు. గత 15 సంవత్సరాల నుండి టీడీపీ, టీఆర్‌ఎస్, టీడీపీ కాంగ్రెస్‌పార్టీలు కలిసి పోటీ చేశాయని అన్నారు. బీజేపీ పార్టీ ఇప్పటి వరకు పై పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదని స్పష్టం చేశారు. 2014 తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో మోది నేతృత్వంలో ఆధికారంలోకి రావడంలో పాటు 20 రాష్ట్రాల్లో ఆధికారంలోకి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో జేడీ ఎస్‌కు తమకు బీ టీమ్‌గా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ తరువాత జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. దేశంలోని ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడానికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు ఓవైసీ భయపడతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మహకుటమికి ఆధికారంలోకి రాదని అన్నారు. కేంద్రంలో అవినీతి లేని ప్రభుత్వం బీజేపీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని కోదాడ నుండి మహబుబ్‌నగర్ వరకు చూసిన ఒక్క డబుల్‌బెడ్‌రూం ఏర్పాటు కాలేదన్నారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హమీని విస్మరించారని తెలిపారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. రాష్ట్ర సాధన కొరకు అమరులైన వారిని ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పాలించాలని మెజార్టీ కట్టబెట్టిన పాలన చేతకాక ముందుగానే అసెంబ్లీని రద్దుచేశారన్నారు. భారతీయ జనతాపార్టీ ఆధికారంలోకి వస్తే ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. తెరాస కుటంబ పార్టీ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. ఓవైసీలకు ప్రభుత్వాలు భయపడుతున్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అములు కాకుండా తెరాస ప్రభుత్వం అడ్డుకుందని వివరించారు. ఆధికారంలోకి వచ్చిన వెంటనే ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే బెల్లంపల్లి అన్నివిధాల అభివృద్ది
* రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలా చారి
బెల్లంపల్లి, డిసెంబర్ 5: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి పరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. బుధవారం పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఆటో ట్రాలీ అసోసియేషన్ అధ్యక్షుడు సాలే నర్సయ్య, అంజాద్‌ఖాన్‌ల ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో ట్రాలీ సభ్యులు చేరారు. అనంతరం వేణుగోపాలాచారి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో బెల్లంపల్లిలో ఆటోలకు స్థలం, ఆటో డ్రైవర్లకు ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. 40సంవత్సరాలుగా ఇండ్ల పట్టాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే ఇండ్ల పట్టాలు జారీ చేస్తామన్నారు. అంతేకాకుండా ఎర్కల సంఘం అధ్యక్షుడు ఉండ్రాటి మల్లయ్య అధ్వర్యంలో కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. చెన్నూర్‌లో చెల్లని నాణెం బెల్లంపల్లిలో ఎలా చెల్లుతుందని విమర్శించారు. ఎన్నికలలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక మంచిర్యాల వద్ద గల ఎల్లంపల్లి నీటిని బెల్లంపల్లి ప్రజలకు అందిస్తామని, సింగరేణి ఆసుపత్రిని అభివృద్ధి పరిచి కార్మికులకు వైద్యం అందిస్తామన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు మల్రాజు శ్రీనివాస రావు, కో-ఆప్షన్ మెంబర్ నిజాం ముద్దీన్, నాయకులు నెలి రమేష్ తదితరులు పాల్గొన్నారు.