అదిలాబాద్

కన్నుల పండువగా గోండ్వానా వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24: పద్నాలుగవ జాతీయ గోండ్వానా గోండు మహాసభలు రెండవ రోజు కన్నుల పండవగా జరిగాయి. రెండవ రోజు వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రంతో పాటు, దేశంలోని చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేష్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఆదివాసీ, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆద్యంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఒక్కరు ఆదివాసీ వస్తధ్రారణతో సభకు హాజరు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. రెండవ రోజు వేడుకల్లో భాగంగా మొదట కుమరం భీం ఆదివాసీ భవన్ నుండి బజార్‌వాడీ మీదుగా పట్టణ ప్రధాన వీధుల గుండా ఆదివాసీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. గోండుల ఆరాధ్యదైవమైన అంకం రాజు ఆలయానికి చేరుకొని ఆదివాసీలు సంప్రదాయ బధ్దంగా పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మనె్నం వీరుడు కుంరం భీం విగ్రహానికి ఆదివాసీలు నివాళులర్పించారు. ర్యాలీ సందర్భంగా సంప్రదాయ చప్పుళ్లు, బాజా, భజంత్రీలతో హోరెత్తించారు. జాతీయ మహాసభల్లో ఆదివాసీ కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఆట, పాటలు అలరించాయి. చరిత్రను తెలియ చేసే పుస్తకాలు, పలు రకాల వస్తువులు విక్రయించేందుక స్టాల్లు ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంప్రదాయం ఉట్టిపడేలా ప్రత్యేక దుస్తులు, తలపాగా, కండువాలు, నెమలి పింఛం ధరించి ఆదివాసీలు సభకు హాజరు కావడం విశేషం. ఆదివారం సభకు హాజరైన ప్రముఖులు గోండు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునివ్వడం గమనార్హం. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఆదివాసీలను అడవుల నుండి వెల్లగొట్టే కుట్రలకు స్వస్తి పలకాలని పలువురు మహాసభల్లో డిమాండ్ చేశారు. రెండవ రోజు కార్యక్రమంలో జాతీయ గోండ్వానా అధ్యక్షుడు ఎసీపి శౌరి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎన్ ధృవ్, ఎంపి నగేష్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి, జాతీయ గోండ్వానా నాయకులు ఆర్‌ఎన్ ధృవ్, సోనూరాం, మంగ్లేష్, దమయంతి మహేంద్ర, సిడాం అర్జు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబూరావు, ఐటిడిఏ ఛైర్మెన్ లక్కేరావుపాల్గొన్నారు.

అమాత్య పదవిపై మళ్ళీ ఆశలు
రేఖకు అవకాశం దక్కేనా..! రామన్న భవితవ్యం తేలేనా..?

ఆదిలాబాద్, ఫిబ్రవరి 24: రాష్ట్ర మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లా నుండి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి మాత్రమే అవకాశం లభించగా మలి విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మిగతా శాసనసభ్యుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. తొలి విస్తరణలో పదిమందికి మాత్రమే బెర్త్ లభించగా, ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది శాసనసభ్యులకుగాను ఇంద్రకరణ్ రెడ్డికి ప్రాతినిథ్యం దక్కడంతో నిర్మల్ జిల్లాకు రాజకీయపరంగా ప్రాధాన్యత లభించినట్లైంది. సమర్థనీయత, రాజకీయ అనుభవం, విధేయతను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గంలో ఐకె రెడ్డికి చోటు దక్కడంతో పార్టీ శ్రేణులంతా అభినందనలతో ముంచెత్తారు. నాలుగు రోజులుగా తీరిక లేకుండా కార్యకర్తలు, నేతలు హైదరాబాద్ తరలివెళ్ళి సన్మానాలు, శుభాకాంక్షలు చెబుతూ అల్లోల మెప్పు పొందుతున్నారు. అయితే ఊహించని విధంగా జోగు రామన్నకు అమాత్య పదవి లభించకపోవడం ఆయన వర్గీయుల్లో తీవ్ర నిరాశకు గురిచేసింది. అటవీ శాఖ, బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వర్తించిన జోగు రామన్నకు ఈసారి తన క్యాబినెట్‌లో కేసీఆర్ చేర్చుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పైగా, అటవీ శాఖను మోసిన రామన్న నుండి ఈ శాఖను తిరిగి ఇదే జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డికి కట్టబెట్టడాన్ని రామన్న వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. విస్తరణలో అవకాశం దక్కక నిరాశకు లోనైన రామన్నకు మలివిడతలో చాన్స్ దక్కకపోతే రాజకీయ భవితవ్యం ఏమిటనే ప్రశ్న కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఆసిఫాబాద్ మినహా మిగిలిన తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యేలు మలి విడత మంత్రివర్గ విస్తరణపై ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. తూర్పు జిల్లా నుండి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాల్క సుమన్‌కు బెర్త్ ఖాయమన్న ప్రచారం జరగగా.. తొలి విడతలో ఆయనకూ మొండిచేయే ఎదురైంది. మలివిడతలోనైనా పదవి దక్కుతుందా అన్నది అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇందుకు కారణం ఇదే పార్లమెంట్ నియోజకవర్గపరిధిలోని ధర్మపురి నుండి గెలిచిన కొప్పుల ఈశ్వర్‌కు కేసీఆర్ మంత్రివర్గంలో చేర్చుకోవడంతో సుమన్‌కు రెండోసారి పదవి దక్కకపోవచ్చని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఇందుకు కారణం తొలిసారిగా ఎమ్మెల్యే కావడం, మరోవైపు అదే సామాజికవర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్‌కు చోటు లభించడమేనంటున్నారు. తొలి ప్రభుత్వం ఏర్పాటు నుండి మంత్రి పదవి ఊరిస్తూ వస్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఈసారీ చుక్కెదురైంది. మహిళా కోటా కింద గతంలోనూ ఆశాభంగానికిగురైన రేఖానాయక్‌కు ఈసారి తప్పనిసరిగా పదవి వస్తుందని అంతా భావిస్తూ వచ్చారు. వార్త కథనాల్లోనూ ఆమెపేరే ముందు వరసలో నిలిచింది. తీరా పది మందితో కొలువుదీరిన క్యాబినెట్‌లో ఒక్క మహిళ అభ్యర్థి కూడా లేకపోవడంతో పార్టీ శ్రేణుల నుండి కాస్త అసంతృప్తి కూడా ఎదురైంది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖానాయక్‌కు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరగగా ఇదే జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డికి రావడంతో రేఖా వర్గీయులు నిరాశకు గురికావాల్సి వచ్చింది. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రసంగానికి సమాధానం చెప్పిన కేసీఆర్ త్వరలోనే ఇద్దరు మహిళలకు క్యాబినెట్‌లో చోటు కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో రేఖానాయక్ వర్గీయుల్లో కొత్త ఆశలకు జీవం పోసినట్లైంది. టీఆర్‌ఎస్ నుండి రేఖానాయక్, పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎన్నిక కాగా, వీరి ముగ్గురిలో ఇద్దరికి బెర్త్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. రెండోసారి ఎన్నికైనా రేఖానాయక్‌కు మహిళా కోటాతోపాటు ఎస్టీ కోటా కింద పదవి తథ్యమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురిని మినహాయిస్తే ఇటీవలే కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ ఆకుల లలిత, కొత్తగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యవతి రాథోడ్ పేరును ప్రకటించడంతో వీరిద్దరిలో ఎవరికైనా బెర్త్ దక్కే అవకాశం లేకపోలేదని నేతలు అంచనాకు వస్తున్నారు. మహిళా కోటాలో రేఖా అధికంగా ఆశలు పెట్టుకోగా, ఊహించని పరిణామం జరిగితే పార్లమెంట్ ఎన్నికల అనంతరం మలి విడత విస్తరణలో మూడుసార్లు ఎన్నికైన కోనేరు కోనప్ప, రెండుసార్లు ఎన్నికైన రాథోడ్ బాపురావు పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో మలివిడత మంత్రివర్గ విస్తరణపై శాసనసభ్యుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తుండడం గమనార్హం.

మరో నాలుగు కొత్త మండలాల ఏర్పాటుకు కార్యాచరణ
* రెవెన్యూ డివిజన్‌గా ఖానాపూర్
* అధికారుల కసరత్తు..
* ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించిన ఎమ్మెల్యేలు
నిర్మల్, ఫిబ్రవరి 24: జిల్లాలో ప్రస్తుతం ఉన్న 19 మండలాలకు తోడుగా మరో నాలుగు కొత్త మండలాలను ఏర్పాటుచేసి అదనంగా రెవెన్యూ డివిజన్‌గా ఖానాపూర్‌ను ఏర్పాటుచేయడానికి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. కొన్ని రోజుల క్రితమే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి రెవెన్యూ డివిజన్‌తోపాటు నాలుగు మండలాల ఆవశ్యకతను తీసుకువచ్చి వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్, సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి, తానూర్ మండలంలోని బేల్‌తరోడా, మామడ మండలంలోని పొన్కల్ గ్రామపంచాయతీలను మండలాలుగా ఏర్పాటుచేయడానికి అధికారులు కార్యాచరణను వేగవంతం చేశారు. ప్రస్తుతం ఉన్న మండలాలు గ్రామాలకు దూరంగా ఉండడంతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను, పరిపాలన పరంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు విన్నవించడంతో ముఖ్యమంత్రి అందుకు అంగీకరిచినట్లు తెలిసింది. సీ ఎం ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ తన కార్యాచరణను మొదలుపెట్టి కొత్తగా ప్రతిపాదించిన నాలుగు మండలాలు, రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన నైసర్గిక స్వరూపం, ఓటర్ల వివరాలు, జనాభా వివరాలతో పాటు అక్కడున్న వౌళిక సౌకర్యాలపై నివేదికలు రూపొందించి వెంటనే పంచాయతీరాజ్ శాఖకు పంపాలంటూ జిల్లా కలెక్టర్ ఉత్వర్వులు జారీచేశారు. దీంతో మండల అధికారులంతా ఆ దిశగా కార్యాచరణను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వడ్యాల్ మండల కేంద్రంలో వడ్యాల్‌తోపాటు కంజర, నర్సాపూర్, బాబాపూర్, రాచాపూర్, కనకాపూర్, వడ్యాల్ తాండ, బోరిగాం గ్రామాలను, పొన్కల్ మండలంలో పొన్కల్‌తోపాటు అనంతపేట్, పోతారం, ఆదర్శనగర్, కమల్‌కోట్, బండల ఖానాపూర్, నల్దుర్తి, వెంకటాపూర్, గ్రామాలు, బేల్‌తరోడా మండలంలో బేల్‌తరోడాతోపాటు బోరిగాం, మహలింగి, బామ్ని, సాంలీ, నిగ్వా, న్యూసాంలీ, కుమారి గ్రామాలను ఈ మండలాల్లో విలీనం చేయనున్నారు. అలాగే రెవెన్యూ డివిజన్‌గా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. నూతన మండలాలతోపాటు ఖానాపూర్ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైతే ప్రజలకు పరిపాలనపరమైన ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు అధికారులు మండలాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

భక్తి పారవశ్యమైన గాంధారి ఖిల్లా
వేలాది సంఖ్యలో తల్లిని దర్శించుకున్న భక్తులు
ఖిల్లాను పర్యాటక కేంద్రంగా చేస్తా
ఎమ్మెల్యే బాల్క సుమన్
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 24: మూడు రోజులుగా గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి ప్రత్యేక పూజలందుకుంటోంది. శుక్రవారంతో మొదలైన జాతర ఆదివారం ఆదివాసీ నాయక్‌పోడ్ వంశస్తులు ఘనంగా నిర్వహించారు. శనివారం అర్దరాత్రి ఈ వంశస్తులు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కల్పించారు. బెల్లంపల్లి ఎసిపి బాలుజాదవ్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు పలు స్వచ్చంద సంస్థలు నీటి వసతి కల్పించడంతో పాటు హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశారు. చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ మైసమ్మ తల్లిని దర్శించుకుని ఖిల్లా ఏర్పాటు చేసిన దర్బార్‌లో పాల్గొని మాట్లాడారు. వచ్చే సంవత్సరం జాతరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గుట్ట కింది భాగం నుంచి పైభాగం వరకు వీది దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ఖిల్లా చుట్టు ఆదివాసీలు కోరినట్లు అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేక్ పెద్ద దర్బాజ మైసమ్మ తల్లిని దర్శించుకొని అధికారికంగా జాతరను నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ ఆర్ దృష్టికి జాతర విశేషాలను విఫులంగా వివరించి ప్రత్యేకంగా నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి ఆదివాసీ నాయక్‌పోడ్ వంశస్తులతో పాటు భారీ సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ఆదివాసీ నాయక్‌పోడ్‌ల నృత్యాలు...
జాతర సమయంలో ఆదివాసీ నాయకుల వంశస్తులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతరలో పోతురాజు వేషాదారణ, ముఖ్యమంత్రి కేసీ ఆర్ వేషాదారణతో ఇచ్చిన ఉపన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అమ్మవారిని దర్శించుకున్నవారిలో ఎంపిపి బొలిశెట్టి కనకయ్య, జడ్పిటిసి కంభగోని సుదర్శన్ గౌడ్, బొక్కల గుట్ట సర్పంచ్ బొలిశెట్టి సువర్ణ, తహసిల్దార్ దుర్గ, ఎంపిడివో ప్రవీణ్ కుమార్‌లతో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు.