అదిలాబాద్

ప్రతీ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మార్చి 1: గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సర్పంచ్‌లదేనని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) గ్రామంలోని మహిళా ప్రాంగణంలో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్, లక్ష్మణచాంద మండలాల్లోని గ్రామాలకు చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఏర్పాటుచేసిన శిక్షన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై సర్పంచులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఎంపికైన మహిళా సర్పంఛ్‌లు చురుకుగా పాల్గొని గ్రామాభివృద్ధికి కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేందుకు 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో ట్రై సైకిల్ కొనుగోలుచేసి చెత్త సేకరించాలని తెలిపారు. గ్రామాల్లోని వీధి దీపాలకు, ఇండ్లలో ఎల్‌ఈడి బల్బులు ఉపయోగించి కరెంటు ఆదా చేయాలన్నారు. రోడ్డుపై చెత్త లేకుండా చూడాలన్నారు. ప్రతీ గ్రామంలో స్థలాలను గుర్తించి చెట్లను పెంచాలన్నారు. ప్రతీ గ్రామానికి 25ట్రీ గార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్ల ఎస్సీ అభివృద్ది అధికారి కిషన్‌యాదవ్, ఎంపీడీవోలు మోహన్, రమేష్, మల్లేశం, సారంగాపూర్ ఎంపీడీవో, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

పశుగ్రాసం, తాగునీటిపై ప్రణాళికలు సిద్ధం చేయాలి
* జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, మార్చి 1: వచ్చే వేసవి కాలంలో పశువులకు కావాల్సిన పశుగ్రాసం, తాగునీటిపై ప్రణాళికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, వెటర్నరి డాక్టరలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో పశువులకు పశుగ్రాసం, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామాల వారీగా ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న పశువుల సంఖ్య, నీటి వసతి, పశుగ్రాసం సౌలభ్యం వంటి వాటిపై దృష్టిసారించాలన్నారు. వచ్చే సమీక్ష సమావేశంలో పై అంశాలతో సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గావించి సమస్యను అదిగమించాలన్నారు. నీటి తొట్టెలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సురేష్, సహాయ పశుసంవర్ధక శాఖ అధికారి రామారావు, డాక్టర్లు గోపి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

చెట్లను నరికేస్తున్నారు.. స్మగ్లర్లపై ఏది నిఘా..
వన సంరక్షణ సమితులు ఏవి.. స్పందించని అటవీ అధికారులు

గుడిహత్నూర్, మార్చి 1: అటవీ విస్తీర్ణాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందుకోసం కోట్లాది నిధులను సైతం వెచ్చిస్తోంది. ఓ వైపు ప్రభుత్వం పర్యావరణ సమతుల్యం కోసం అటవీ సంపదను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా మరోవైపు కొందరు అడవుల్లోని చెట్లను నరికివేస్తూ పోతున్నారు. కలప నరికివేతను అడ్డుకునే వారే కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గుడిహత్నూర్ మండలం ధమ్‌పూర్, చింతగూడ, దరమడుగు అటవీ ప్రాంతానికి వెళ్ళాలంటేనే ప్రజలు భయపడేవారు. ఈ ప్రాంతంలో అన్ని రకాల చెట్లు ఉన్నాయని, ప్రభుత్వం వన సంపదను పెంచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది. ధమ్‌పూర్, చింతగూడల మద్య 44వ జాతీయ రహదారికి కూతవేట దూరంలో రాజుల హనుమాన్ మందిరం వెనకాలే విచ్చలవిడిగా చెట్లను నరికివేశారు. అటవీ ప్రాంతాన్ని కాపాడాల్సిన అధికారులే స్మగ్లర్లకు చేదోడువాదోడుగా ఉంటున్నారని సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే జిల్లాలో జరిగిన కలప స్మగ్లింగ్ సంఘటనలో సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కలప స్మగ్లింగ్ ఆగడం లేదు. ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్షల మొక్కలను నాటుకున్నప్పటికీ కలప స్మగ్లింగ్‌తో అటవీ ప్రాంతం కనుమరుగైపోతోంది. ధమ్‌పూర్ గ్రామ సమీపంలోనే అటవీ శాఖ నర్సరీ నిర్వహిస్తున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టలేకపోవడంతో గ్రామాల్లో కలప నిల్వలు ఎక్కువయ్యాయి. ఫారెస్ట్ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారే తప్పా కలప స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్మగ్లింగ్ చేసే వారిపై గ్రామస్తులు తిరగబడితే వారిపై స్మగ్లర్లు దాడులు చేయడానికి వెనకాడడం లేదని వారు వాపోతున్నారు. ఒక్కప్పుడు వన సంరక్షణ సమితిలు ఉండేవని, ఇప్పుడు వారు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియకుండా పోయిందని అంటున్నారు. ఈ కలప నరికివేతను అరికట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉన్న కాస్త అటవీ ప్రాంతం కూడా ఏడారిలా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి అటవీ ప్రాంతంలో నిఘా పెంచి కలప కోతను ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

7న జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, మార్చి 1: ఈనెల 7న జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్యా, వైద్య సేవలు, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పన్నుల స్థాయి కమిటీ, ప్రణాళిక ఆర్థికఅంశాలపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. సభ్యులు, ఆయా శాఖల అధికారులు సకాలంలో హజారుకావాలని తెలిపారు.

పైలట్ అభినందన్ రాకతో మిన్నంటిన సంబరాలు
ఇచ్చోడ, మార్చి 1: భారత వైమానికదళం కమాండర్ అభినందన్ పాకిస్తాన్ నిర్బంధం నుండి శుక్రవారం సాయంత్రం విడుదల కావడంతో సంబరాలు మిన్నంటాయి. భారత దౌత్యం ఫలించి ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రభుత్వం అభినందన్‌ను వాఘా సరిహద్దు వద్ద భారత త్రివిధ దళాల అధిపతులకు అప్పజెప్పడంతో ఇచ్చోడలో సాయంత్రం శివాజీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలు పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చి టపాసులు పేల్చారు. ఈసంధర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పిందని, యుద్దానికి కూడా వెనకాడబోమని ప్రభుత్వం ప్రకటించడంతో పాకిస్తాన్ ప్రభుత్వం దిగివచ్చి అభినందన్‌ను సురక్షితంగా దేశానికి అప్పజెప్పడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

పకడ్బందీ ఏర్పాట్ల మద్య పోలీసు పరీక్షలు ప్రారంభం

ఆదిలాబాద్, మార్చి 1: ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కానిస్టేబుల్ ఎంపిక దేహదారుఢ్య పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్ల మద్య శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ కేంద్రంలోనే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తుండగా ఉదయం 5 గంటల నుండే అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. పోలీసు హెడ్‌క్వార్టర్‌లో ప్రారంభమైన అర్హత పరీక్షలను జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. తొలిరోజు 600 మంది అభ్యర్థులను పరీక్షలకు ఆహ్వానం పంపగా 495 మంది హాజరయ్యారు. 105 మంది గైర్హాజరుకాగా పోటీ పరీక్షల అనంతరం తొలి రోజు 211 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులై తుది రాత పరీక్షకు అర్హత సాధించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ విష్ణ ఎస్ వారియర్ తెలిపారు. 284 మంది అభ్యర్థులు అనర్హత సాధించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పరీక్షలకు ఈసారి సీసీ కెమెరాలు, రెడియోసెన్సర్ల నిఘాతో పాటు భారీ బందోబస్తు మద్య పోటీలు నిర్వహించగా, ఎండ తీవ్రతలోనూ అభ్యర్థులు అర్హతసాధించేందుకు నానా అవస్థలు పడ్డారు. 800 మీటర్ల పరుగుపోటీల్లో ఎక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించలేక వెనుదిరిగిపోయారు. ఎండల తీవ్రత నేపథ్యంలో శనివారం ఉదయం 3.30 గంటలకే పోలీసు హెడ్‌క్వార్టర్‌కు రావాలని ఎస్పీ ఈ సంధర్భంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 19 రోజుల పాటు జరిగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు క్రమశిక్షణ, నిబద్దత పాటించాలని సూచించారు. ముందుగా అభ్యర్థులకు రిసిప్షన్ కౌంటర్ వద్ద టోకన్లు అందించిన తర్వాత అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించి, బయోమెట్రిక్ విధానంతో వేలిముద్రలు సేకరించి ఎత్తు, చాతి కొలతల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఈ విభాగంలో ఉత్తీర్ణులైన వారికి 800 మీటర్ల పరుగు పరీక్ష పెట్టి మిగితా పోటీలకు వారిని అర్హులుగా తేల్చారు. 800 మీటర్ల పరుగులో అర్హులైన వారిని షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్ ఆ తర్వాత చివరకు 100 మీటర్ల పరుగుపోటీ నిర్వహించారు. పోటీ పరీక్షల సంధర్భంగా జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ ప్రతి విభాగంలోనూ సాంకేతిక పరిజ్ఞానం జోడించి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఏలాంటి లోటుపాట్లు తలెత్తకుండా, అనుమానాలకు తావులేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీడియోరికార్డింగ్‌ను నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి డిజిటల్ స్లిప్‌లను అందిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఏలాంటి ఒత్తిళ్ళకు లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షకు హాజరుకావాలని, ప్రతి చోట వైద్యబృందాన్ని అందుబాటులో ఉంచామన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. సెల్‌ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు వెంట తీసుకరావద్దని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అదనపు ఎస్పీ దక్షణమూర్తి, మంచిర్యాల జిల్లా పోలీసు అధికారులు రవికుమార్, బాలు జాదవ్, గౌస్‌బాబా, ఆదిలాబాద్ ఆదనపు జిల్లా ఎస్పీ కంచ మోహన్, కుమురంభీం అదనపు ఎస్పీ గోద్రు, డీఎస్పీలు ఎల్‌పి నాయక్, నర్సింహారెడ్డి, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కు వినియోగంలో విద్యార్థులదే కీలకపాత్ర
* కలెక్టర్ దివ్య దేవరాజన్
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, మార్చి 1: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, కళాశాల విద్యార్థులు, యువకులు ఓటరు జాబితాలో తమ పేర్లు తప్పక నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేటి యువతకు ఓటు హక్కు ఆయుధం లాంటిందన్నారు. అంతేకాకుండా రంగోళి కార్యక్రమంలో వేసిన ముగ్గులపై విద్యార్థిని నిరోష రాసిన వ్యాఖ్యన్ని సమర్థిస్తూ అభినందించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను పరిష్కరించాలన్నారు. ఈనెల 2,3 తేదీల్లో అన్ని బూత్ స్థాయి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా కుటుంబ సభ్యువులు, బంధువులకు ఓటు హక్కు గురించి తెలియజేయాలని, ఓటు హక్కు లేని అర్హత కలిగిన వారందరికి ఓటు హక్కు నమోదు చేయించాలని యువతకు పిలుపునిచ్చారు. ఏ ఒక్కరు తప్పిపోకుండా అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. అంతకు ముందు లెక్చరర్ సుజాత రాసిన పాటను విద్యార్థులు ఆలపించారు. దేశభక్తికి సంబంధించిన గేయంపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్యానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్, స్వీప్ నోడల్ అధికారి అనే్వష్, ప్రిన్సిపల్ సంతోష్, విద్యార్థులు, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.