అదిలాబాద్

రెండో విడత హరితహారానికి అంతా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 12: భావితరాల మనుగడను కాంక్షించి చేపట్టిన హరితహారం పథకం అమలుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ జిల్లాలో రెండవ విడత కింద ఈనెల 15, 16 తేదీల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో 3కోట్ల మొక్కలు నాటగా ఈసారి 4కోట్ల మొక్కలు నాటేందుకు అటవీ శాఖ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. నియోజకవర్గానికి 40లక్షల చొప్పున మొక్కలు నాటేల అధికారులు చర్యలు తీసుకుంటుండగా ఇటీవలే మంత్రి జోగురామన్న తూర్పు, పశ్చిమ జిల్లాల్లో పర్యటించి మొక్కలు పెంచుతున్న నర్సరీలను పరిశీలించారు. ఈసారి తొలకరి వర్షాలు ముందుగానే కురిసే అవకాశం ఉండడంతో గుంతలు తవ్వి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టేందుకు వివిధ శాఖల అధికారులు ప్రణాళికలు రూపొదించారు.
గత ఏడాది జిల్లాలో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకంపై విమర్శలు వెల్లువెత్తాయి. మొక్కలు నాటడమే తప్పా వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోకపోవడం, అటవీ వన విభాగం అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం కొందరిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా పథకానికి అవంతరాలు వచ్చిపడ్డాయి. గతేడాది జూలై 3న మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, ఈసారి వర్షాలు అనుకూలిస్తున్న నేపథ్యంలో పక్షం రోజులు ముందుగానే మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా మొత్తం విస్తీర్ణం 16.12 లక్షల హెక్టార్లు కాగా, 7.16 లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో 44 శాతం అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా దానిని 50 శాతానికి పైగా పెంచాలనే లక్ష్యంతో పెద్దఎత్తున మొక్కల పెంపకానికి అధికారులు సిద్దమవుతున్నారు. గతేడాది జిల్లాలోని నియోజకవర్గానికి 40లక్షల చొప్పున మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 575 నర్సరీల్లో 4.19 కోట్ల మొక్కలు పెంచి హరితహారం పథకానికి సరఫరా చేయాలని భావించారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గతేడాది 3కోట్ల మొక్కలే నాటారు. ఈ ఏడాది హరితహారం కోసం 4 కోట్ల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకోగా సామాజిక వన విభాగం అధ్వర్యంలో 110 నర్సరీల్లో 1.10 కోట్ల మొక్కలు, డ్వామా అధ్వర్యంలో 100 నర్సరీల్లో కోటి మొక్కలు, ఐటిడిఏ పివో అధ్వర్యంలో 29 నర్సరీల్లో 29 లక్షల మొక్కలు, సింగరేణి అధ్వర్యంలో 15 లక్షల మొక్కలు, అటవీ మండల విభాగం అధ్వర్యంలో 1.46 కోట్ల మొక్కలు నర్సరీల్లో పెంచుతున్నారు. గత ఏడాది మొక్కల జాతుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని టేకు, పూలు, పండ్లు, శాండివుడ్, రెడ్‌శాండిల్ మొక్కలు పెద్ద మొత్తంలో పెంచుతున్నారు. సోషల్ ఫారెస్ట్ 110 నర్సరీలు, డ్వామా 186, సింగరేణి 3, ఐటిడి ఏ ద్వారా 6 నర్సరీలు ఉన్నాయి. కాగా సోషల్ ఫారెస్ట్ నర్సరీల్లో లక్ష చొప్పున, డ్వామా నర్సరీల్లో 5లక్షలు, ఐటిడిఏ నర్సరీల్లో 410 లక్షలు, అటవీ శాఖ నర్సరీల్లో 2 చొప్పున మొక్కలు పెంచుతున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 15, 16 తేదీల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండడంతో ఇప్పటికే అధికారులు గ్రామాల వారిగా మొక్కలను సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాస్తవ్రేత్తలు తెలుపడంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. సామాజిక విభాగం అధ్వర్యంలో పాఠశాలలు, సామూహిక భూములు, కమ్యూనిటీ భవనాలు, చెరువులు, రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండ్లలో పూలు, పండ్లనిచ్చే మొక్కలను సరఫరా చేయడంతో పాటు కార్యాలయాల్లో, రోడ్డుకు ఇరువైపులా నీడనిచ్చే చెట్లను నాటనున్నారు. అదే విధంగా డ్వామా అధ్వర్యంలోకోటి టేకు మొక్కలు పెంచుతుండగా, రైతుల పొలం గట్లపై టేకు మొక్కలు నాటేందుకు గాను ఉపాధి హామీ పథకం కింద గుంతలు తవ్విస్తున్నారు.