అదిలాబాద్

ప్రైవేట్ కళాశాలలపై తనిఖీలు ఏమైనట్లు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, జూన్ 18:ప్రభుత్వం ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాలలపై తనిఖీలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏఒక్క కళాశాలపై కూడా కేసు నమోదు చేయలేదని, ప్రైవేట్ కళాశాలలతో ప్రభుత్వం కుమ్మక్కైందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి వెంకట్ అన్నారు. శనివారం ఆర్‌అండ్‌బి విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్లసమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో అధిక ఫీజులు, అరకొర సౌకర్యాలు కలిగి ఉన్నా వాటిపై నియంత్రణ లేకుండా పోయిందన్నారు. నిబంధనలు పాటించని వాటిపై తనిఖీలు చేపట్టి, కళాశాలలను మూసివేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క కళాశాలపై చర్యలు తీసుకోలేదన్నారు. ప్రైవేట్ కళాశాలల యజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం నామమాత్రంగా తనిఖీలు చేపడుతూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. విద్యారంగాన్ని వ్యాపాపరంగా మలుచుకొని రాష్ట్రంలో కొన్ని వేలకొద్ది ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయని, నిబంధనలను తుంగలో తొక్కుతూ లాభార్జనే ధ్యేయంగా అందినకాడికి దోచుకుంటున్నారని అన్నారు. ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైన నిబంధనలు విరుద్దంగా నడుస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజురియంబర్స్‌మెంట్ నిధులను విద్యార్థులకు ఇవ్వకుండానే కొన్ని కళాశాలలు ఫీజుల కింద వసూలు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, కార్యవర్గ సభ్యులు లంక రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శని త్రయోదశి వేడుకలు
దండేపల్లి, జూన్ 18: మండలంలోని గూడెం గోదావరి నదిలో శనేశ్వరాలయంలో శనివారం శని త్రయోదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనేశ్వరునికి తైలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాకుడు భూమన్న స్వామి మాట్లాడుతూ శనేశ్వరునికి పూజలు నిర్వహించుకుంటే ఏలిననాటి శనిదూరమవుతుందన్నారు. ఈ సందర్భంగా భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మంచిర్యాలకు రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మంజూరు
మంచిర్యాల, జూన్ 18: మంచిర్యాలకు రెండవ అదనపు జిల్లా సెషన్సు కోర్టు (్ఫస్ట్‌ట్రాక్ కోర్టు) మంజూరైనట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టులో జరిగే వ్యవహారాలన్నీ మంచిర్యాలలో ఏర్పడనున్న సెషన్సు కోర్టులోనే జరిగే అవకాశం ఉంది. దీంతో వివిధ రకాల న్యాయపరమైన లావాదేవీలకు జిల్లా కేంద్రానికి వెళ్లే కక్ష్యదారులకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయన్నారు. మంచిర్యాల జిల్లాగా ఏర్పడనున్న తరుణంలో ఈ ప్రాంత అవసరాలను గుర్తించి అడిగిన వెంటనే కోర్టు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు చేరువయ్యేందుకే పోలీసు జనమైత్రి
* భైంసా సబ్‌డివిజన్‌లో జిల్లా ఎస్పీ సుడిగాలి పర్యటన
* పర్యావరణాన్ని పరిరక్షించాలని హితవు
* ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
భైంసా రూరల్, జూన్ 18: ప్రజలకు మరింత చేరవయ్యేందుకే జనమైత్రి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు ఎస్పీ విక్రమ్‌జిత్ సింగ్ దుగ్గల్ అన్నారు. శనివారం భైంసా సబ్ డివిజన్ పరిధిలోని కుంటాల, లోకేశ్వరం, తానూర్, ముధోల్, కుభీర్, భైంసా పట్టణ గ్రామీణ ప్రాంత పోలీస్‌స్టేషన్లలో సుడిగాలి పర్యటన జరిపి ఆయా పోలీస్‌స్టేషన్లలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ దుగ్గల్ మాట్లాడారు. ప్రజలకు సుపరిపాలన లక్ష్యంగా పోలీసులను చేరువచేసేందుకు అన్ని గ్రామాల్లో జనమైత్రి సమావేశాలు ఏర్పాటుచేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతీ ఒక్కరు చెట్లను నాటాలని సూచించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
జిల్లా ఎస్పీ సుడిగాలి పర్యటన....
జిల్లా ఎస్పీగా విక్రమ్‌జిత్‌సింగ్ దుగ్గల్ బాధ్యతలు చేపట్టి నెలరోజులు గడవముందే భైంసా సబ్ డివిజన్ పరిధిలో రెండుసార్లు పర్యటన చేపట్టారు. గడిచిన 8వ తేది ఒఎస్‌డి పనసారెడ్డితో భైంసాకు వచ్చిన ఎస్పీ శనివారం మాత్రం ఒక్కరే డివిజన్‌లో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఆయా పోలీస్‌స్టేషన్‌లలో నెలకొన్న సమస్యలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్‌లో జనమైత్రి, ఇంకుడు గుంతల నిర్మాణం, చెట్ల పెంపకం పట్ల అధికారులతో సమీక్షించి సూచనలు అందించారు. గ్రామసభల్లో ప్రజలకు చేరువకావాలని తెలిపారు. ఐక్యంగా ఉంటూ ఉత్సవాలను జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో భైంసా డిఎస్పీ అందె రాములు, సిఐలు వినోద్, రఘు, రఘుపతితోపాటు ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

రాముని చెరువులో అక్రమ నిర్మాణాలు
* అడ్డుకున్న పౌర సేవా సమితి నాయకులు
* పూర్తి హద్దులు నిర్మిస్తామన్న మున్సిపల్ చైర్‌పర్సన్ వసుందర
మంచిర్యాల అర్బన్, జూన్ 18: పట్టణంలోని రాముని చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను వివాదానికి దారి తీస్తున్నాయి. చెరువులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న సమాచారంతో పౌర సేవా సమితి నాయకులు నిర్మాణాలను అడ్డుకున్నారు. పార్కు స్థలం కింద చెరువులో చేపడుతున్న నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ వసుందర పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాముని చెరువు విస్తీర్ణం మొత్తం 47 ఎకరాలు పూర్తి హద్దులు నిర్మించాకే మిగిలిన భూమిలో పార్కు స్థలం కింద పరిగణిస్తామన్నారు. రాముని చెరువు కింద భూములను ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల సహాయంతో చెరువు భూములను గుర్తించి హద్దులు నిర్మిస్తామన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామన్నారు. హైటెక్ సిటి ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారనే సమాచారం మేరకు పరిశీలించి అక్రమ కట్టడాలను నిలిపివేశామన్నారు. ఇకపై పూర్తి హద్దులు నిర్మించాకే నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పౌర సేవా సమితి నాయకులు,హైటెక్ సిటీ వాసులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

హామీలను నెరవేర్చి అధికార పార్టీ మాట నిలబెట్టుకోవాలి
* లేకుంటే గళ్లపట్టి అడిగేది ప్రతిపక్షమే
* టిడిపి జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్
బెల్లంపల్లి, జూన్ 18: ఎన్నికల్లో ఇచ్చి నహామీలను నెరవేర్చి ఈ ప్రభుత్వం మాటనిలబెట్టుకోవాలని, లేకుంటే గళ్లపట్టి అడిగేది ప్రతిపక్ష పార్టీయేనని మాజీమంత్రి, జిల్లా టిడిపి అధ్యక్షుడు బోడ జనార్దన్ అన్నారు. శనివారం పట్టణంలోని టిఎన్‌టియుసి కార్యాలయం లో టిడిపి పట్టణ సమావేశానికి జనార్దన్ ముఖ్యఅతిథిగాహాజరై మాట్లాడా రు. తాను అధికారంలోకివస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పిన కెసిఆర్ అధికారంలోకి వచ్చాక ఏఒక్క హామీని నెరవేర్చక అనవసరపు మాటలతో కొత్త సమస్యలు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఫామ్ హౌస్‌కే పరిమితమైన కెసిఆర్ ప్రతిపక్ష పార్టీల నాయకులను టిఆర్‌ఎస్‌లోకి పిలిపించుకుని కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం వస్తే ఇక ఆంద్రోళ్లే ఉండరని, ఇంటింటికో ఉద్యోగంఇస్తామని, రాష్ట్రం ఏర్పడ్డాక నిధులు, నియామకాలపై దృష్టి పెట్టడం లేదన్నారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు నీళ్లను తూర్పు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఇవ్వకుండా మెదక్‌జిల్లాకు తరలిస్తే టిడిపి చూస్తూఊరుకోదని, పైపులు పగులగొట్టినీటిని మళ్లించుకుంటామని హెచ్చరించారు. బతుకమ్మ సంబరాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో వేలాది కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్నారు. ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ అంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అసలు నల్లాల నుంచి నీరు ఇస్తాడా అనే అనుమానం ఉంద న్నారు. టిడిపి బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జి పాటి సుభద్ర మాట్లాడుతూ బెల్లంపల్లిలో టిడిపిని బలోపేతం చేసుకోవాలన్నారు. కెసిఆర్ మాటల గారడి తో కాలక్షేపం చేస్తున్నారన్నారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు మేడి పున్నంచంద్, మురుకూరి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి దామెర శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు సంజీవరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మదసూదన్, రాజ్‌కుమార్ పాండే, సాజిద్ పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
* డిసిసి అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, జూన్ 18: ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్ పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చినప్పటికి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినప్పటికి స్వలాభం కోసం తప్పా తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని మరిచిందన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను ఇప్పటికి ఇవ్వకపోవడంతో వారి చదువులు అగమ్యగోచరంగా మారాయన్నారు. రైతులకు మూడవ విడత రుణమాఫీ నిధులను ఇప్పటికి జమచేయకపోవడంతో రైతులకు బ్యాంక్‌లు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని, బ్యాంకుల చుట్టూ రైతులు తిరగాల్సిన పరిస్థితులు దాపురించాయని మండిపడ్డారు. రైతు సంక్షేమమే ధ్యేయమని చెప్పుకుంటున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమి లేదన్నారు. పింఛన్లను సక్రమంగా ఇవ్వక, అర్హులైన వారికి కొత్త పించన్లను మంజూరుచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉందని చెప్పుకుంటున్నప్పటికీ 2 లక్షల కోట్ల లోటుందని వాపోయారు. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసి ఆర్ ఇప్పటికి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీలిచ్చినప్పటికి ఇప్పటికి అమలులోకి రాలేదన్నారు. మాటల ప్రభుత్వమే తప్పా చేతల్లో కన్పించడం లేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సరికెల గంగన్న, అజహర్, బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సహకారంతోనే నేరాల అదుపు
* జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్
ముధోల్, జూన్ 18: ప్రజల సహకారంతోనే నేరాలను అదుపు చేస్తామని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. సిబ్బంది నుండి గౌరవవందనం స్వీకరించారు. పోలీసు స్టేషన్ ఆవరణలోని గార్డన్‌ను పరిశీలించారు. అనంతరము సర్కీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు పోలీసులు ప్రజల మధ్య సత్సంబందాలను పెంపొందించేందుకు పోలీసులు మీకోసం జనమైత్రి గ్రామసభలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా ప్రజలకు చేరువకావడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తామని అన్నారు. ముఖ్యంగా పోలీసుల, ప్రజల మధ్య సత్సంబందాలతో నేరాలు తగ్గుముఖం పడతామని తెలిపారు. ప్రజలు కుల, మతాలకు ఆతీతంగా ఐక్యంగా ఉంటేనే ఆభివృద్ది సాధ్యమని పేర్కొన్నారు. తనిఖీల ముఖ్యద్దేశం శాంతిభద్రతల పర్యవేక్షణ, ఎస్సీ, ఎస్టీ కేసుల వివరాలు, మైనార్టీల కేసుల వివరాలు పరిశీలించేందుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని అకాంక్షించారు. రంజాన్ మాసం అన్నివర్గాల ప్రజలకు ముఖ్యమైందని తెలిపారు. సమాజంలోని చెడును దూరం చేసి మంచిని పెంపొందించాలని అన్నారు. యువకులు సన్మామార్గంలో నడవాలని సూచించారు. ప్రజలు ఐక్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. ఎక్కడైతె నేరాలు అదుపులో వుంటాయో అక్కడ పరిశ్రమలు సహితం వస్తాయని తెలిపారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. పండగలను శాంతియుతంగా జర్పుకువాలని అన్నారు. జనమైత్రి గ్రామసభల నిర్వహనను పరిశీలించినట్లు వెల్లడించారు. హిందు, ముస్లీం సోదరులు కలిసి మెలిసి పండుగాలను జర్పుకువాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో అవసరమని అన్నారు. విలేకరుల సమావేశంలో భైంసా డి ఎస్పీ అందెరాములు, ముధోల్ సి ఐ రఘుపతి, ముధోల్ ఎస్సై ఎన్. శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జనమైత్రితో ప్రజల మధ్య సత్సంబందాలు
ఎస్పీగా విక్రమ్‌జిత్ దుగ్గల్ బాధ్యతలను స్వీకరించిన అనంతరము ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబందాలు పెంపోందించేందుకు పోలీసులు మీకోసం జనమైత్రి గ్రామసభలు నిర్వహించడం మంచి ఫలితాలను ఇస్తుందని ముధోల్ మండల ఉపాధ్యక్షులు ఎజాజోద్దిన్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పీ పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన అనంతరము మైనార్టీ నాయకులు సన్మానించారు. ఆయన మాట్లాడుతు భైంసా, ముధోల్ ప్రాంతంలో గతంలో కంటే ప్రస్తుతం ప్రజల మధ్య సత్సంబందాలు మెరుగైయ్యాయని తెలిపారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ ప్రజలకు చేరువ అయ్యేందుకు జనమైత్రి గ్రామసభలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ప్రజాప్రతినిధులుగా శాంతిభద్రతల పరిరక్షణకు తమవంతుగా సహకరిస్తామని తెలిపారు. ముఖ్యంగా మతసామరస్యంను కాపడడానికి కృషి చేస్తామని వివరించారు. ముధోల్ మతసమరస్యానికి ప్రతికని తెలిపారు. ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి ఉంటారని వెల్లడించారు. ఆయన వేంట నాయకులు ఖాలీద్ పటేల్, ఇమ్రాన్‌ఖాన్, తదితరుల పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో సంస్థాగత కసరత్తు షురూ
* దిగ్విజయ్ జిల్లా పర్యటనతో నేతల్లో కదలిక
* మంచిర్యాలలో నేటి సమావేశానికి పిసిసి నేతల హాజరు
* ప్రాజెక్టులపై ‘పవర్‌పాయింట్’ కౌంటర్‌కు సన్నాహాలు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జూన్ 18: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, జోరందుకున్న నేతల వలసల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ జిల్లా పర్యటన నేతల్లో కదలిక తెచ్చింది. ఇంతకాలం స్తబ్దతగా ఉన్న నేతలు ఇక టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, ప్రజలకు చేరువయ్యేందుకు సన్నాహాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా గ్రూపులు, అంతర్గత విభేదాలతో పార్టీ బలహీన పడుతోందని, కాంగ్రెస్‌లో ఇంతకాలం కీలక పదవులు అనుభవించి టిఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపడంపై దిగ్విజయ్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేయడం గమనార్హం. రెండు రోజుల కిందట ఆదిలాబాద్‌లో మకాం వేసిన దిగ్విజయ్ జిల్లా కాంగ్రెస్ సీనియర్లతో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించడమే గాక కలిసికట్టుగా పార్టీకోసం పనిచేయాలని హితబోద చేశారు. జిల్లాలో పునర్విభజన అనంతరం రాజకీయ సమీకరణలు కూడా మారుతున్నందున నేతలు నియోజకవర్గాల్లో పట్టుపెంచుకుంటూనే సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పిసిసి కమిటీ నేతలు కూడా జిల్లాల వారీగా సమావేశాలకు సన్నద్ధం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా నుండి సాగునీటి ప్రాజెక్టుల ఉద్యమ కమిటీలో మాజీ ఇరిగేషన్ మంత్రి సి.రాంచంద్రారెడ్డికి రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు అప్పజెప్పారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించేలా కాంగ్రెస్ సీనియర్లు సమావేశాలకు సన్నద్దమవుతున్నారు. ఆదివారం మంచిర్యాలలో జరిగే నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని పకడ్బందీగా మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి అధ్వర్యంలో నిర్వహించనుండగా ఈ తొలి సమావేశానికి ఏఐసిసి కమిటీ నాయకులు మాజీ ఎంపి వి.హన్మంతరావు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజల్లోకి తీసుకువెళ్లేలా నేతలు నిర్దేశం చేయనున్నారు. ఈనెల 20న ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశానికి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు హాజరై పెన్‌గంగా బ్యారేజీ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి జరుగుతున్న నష్టం గురించి, ఇక్కడి ప్రయోజనాలను దెబ్బతీసేలా మహారాష్టత్రో కుదుర్చుకున్న ఒప్పందాలపై చర్చించనున్నారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కౌంటర్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందిచారు. ఇందులో సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన ఉన్న నేతలకు కమిటీలో బాధ్యతలు అప్పగించి, ప్రజల్లోకి ఈ వ్యవహారాలను తీసుకవెళ్లేలా కసరత్తు సాగిస్తున్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించిన అనంతరం వారం రోజుల్లో నిర్మల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్ర జాతీయ నాయకులను ఆహ్వానించేలా జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్‌లు సన్నాహాలు సాగిస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేలా కమిటీలు వేయనున్నారు. ఈనెల 30లోగా మండల, బ్లాక్ కమిటీ, జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకునేలా కార్యాచరణ సిద్ధం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వం 123 జీవోకు వ్యతిరేకంగా రైతుల నుండి బలవంతంగా భూములు సేకరించి, పునరావాసం కల్పించాలన్న డిమాండ్‌తో అందోళన కార్యక్రమాలు కూడా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను కలుపుకొని వలసలను నివారించేందుకు ఈ సమావేశాలు ఎంతగానో దోహదపడుతాయని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.