అదిలాబాద్

బాసరలో ఆలయంలో భక్తుల కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర: సుప్రసిద్ద పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి నిలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు,చిన్నారులు అమ్మవారి దర్శన క్యూలైన్‌లో బారులు తీరారు. భక్తులు తమ చిన్నారులకు ఆలయంలోని అక్షరాభ్యాస మండపాల్లో ఆలయ అర్చకులచే అక్షరస్వీకార పూజలు ఘనంగా నిర్వహింపచేశారు. అనంతరం ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే ఆలయానికి ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.5 లక్షలు ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆలయంలో ప్రముఖుల పూజలు...
బాసర అమ్మవారి సన్నిధిలో ఆదివారం ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలుచేశారు. సినీ రంగానికి చెందిన ప్రముఖ గాయని సంగీత దర్శకురాలు ఎం. ఎం శ్రీలేఖ, మనులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిచెంత ఆలయ అర్చకులు వారిచే ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహింపచేసి హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆలయ చరిత్ర, అమ్మవారి విశిష్టతను ఆలయ అర్చకులు వారికి వివరించారు.

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు
* ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్
నార్నూర్, ఫిబ్రవరి 21: ఏజెన్సీ గిరిజనుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తుందని ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్ అన్నారు. ఆదివారం మండలంలోని అర్జునికొలాం గూడలో కొలాం గిరిజన అభివృద్దిపై సమావేశం ఏర్పాటు చేయగా ఆయన పాల్గొని మాట్లాడారు. కొలాం గిరిజనులు అన్నిరంగాల్లో వెనకబడి ఉన్నారని, వారి అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ సమావేశాల ద్వారా మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ఆదిమ కొలాం గిరిజనులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వారికి అందుతున్న పథకాలపై సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గిరిజనులు తమకు ఐటిడిఏ ద్వారా ఎలాంటి సంక్షేమ ఫలాలు అందడంలేదని పివో దృష్టికి తీసుకరాగా అధికారులతో చర్చించి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామాల్లో ఎదుర్కొంటున్న ప్రదాన సమస్యలను సిఎం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు. కొలాం గూడేల్లో ఐటిడిఏ ద్వారా సిసి రోడ్లు నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలు అర్హులైన పేదవారికి అందే విధంగా చూస్తానని. ప్రతి మండలంలో 80 యూనిట్ల చొప్పున మంజూరి చేస్తామన్నారు. రుణాలు అందించడంలో బ్యాంకు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అర్హులైన వారికి బ్యాంకు కన్సల్ట్ కల్పించి రుణాలు అందజేయాలని గిరిజనులు పివోకు విన్నవించారు. అధికారులతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని పివో వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపిపి రాథోడ్ గోవింద్‌నాయక్, జడ్పీటీసీ రూపవతి పుష్కార్, స్థానిక సర్పంచ్ మడావి జంగుబాయి, ఎంపిటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

22 నుండి సురభి నాటక ప్రదర్శనలు
* జిల్లా కలెక్టర్ జగన్మోహన్
ఆదిలాబాద్ టౌన్,్ఫబ్రవరి 21: తెలుగు నాటక రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత బృందం సభ్యులచే ఈనెల 22 నుండి 24వ తేదీ వరకు నిర్మల్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో సురభి నాటక ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భారీ సెట్టింగ్‌లు, ఫైర్ వర్క్‌లతో, ట్రిక్‌సీన్లతో నాటక ప్రదర్శనలు నిర్వహించబడుతాయని అన్నారు. 131 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రకలిగిన సురభి పౌరాణిక, జనాపద నాటక ప్రదర్శనలు జిల్లా ప్రజలను ఎంతగానో ఆకట్టుకోనున్నాయని అన్నారు. ఫిబ్రవరి 22న శ్రీకృష్ణ లీలలు పౌరాణిక నాటకం, 23న జై పాతాళభైరవి జాన పద నాటకం, 24న మాయాబజార్ పౌరాణిక నాటకాలు రోజు సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శనలు నిర్వహించబడుతాయని అన్నారు. ఈ కార్యక్రమాలకు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నాటకాలను వీక్షించాలని కోరారు.

పోలియో మహమ్మారిని తరిమెద్దాం
* ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్
ఉట్నూరు, ఫిబ్రవరి 21: పోలియో మహమ్మారిని ఐక్యంగా తరిమేసి పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వి కర్ణన్ అన్నారు. ఆదివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో మహమ్మారిని తరిమేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయని అన్నారు. మొదటి విడత జనవరిలో పోలియో చుక్కల కార్యక్రమానికి చక్కని స్పందన వచ్చిందని, రెండవ విడత కార్యక్రమానికి కూడా మంచి స్పందన వస్తుందన్నారు. అదనపు జిల్లా వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏజెన్సీ వ్యాప్తంగా 980 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా లక్షా 16వేల 372 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని అన్నారు. వీటి పరిశీలకులుగా డాక్టర్ బాబులాల్, శోభల పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు. వాహనాలు వెళ్లని గ్రామాలకు సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని, అదే విధం ఉట్నూరు సంతలో సైతం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి విమల, డిఎంవో అల్హం రవి, సర్పంచ్ బొంత అశారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ ఆశయాలు తెలంగాణ సమాజానికి స్ఫూర్తి
* విగ్రహావిష్కరణ సభలో మంత్రి జోగురామన్న
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఫిబ్రవరి 21: పరాయిపాలనలో పీడిత వర్గాల విముక్తికోసం, తెలంగాణ నవ సమాజ ఆశయ సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ బావి తరాలకు స్ఫూర్తిప్రధాతగా నిలుస్తారని, ఆయన ఆకాంక్షను నెరవేర్చే దిశగా ప్రభుత్వం బాటలు వేస్తోందని రాష్ట్ర అటవీ,పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ దివంగత ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని మంత్రి అవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆ కాలనీకి జయశంకర్ కాలనీగా నామకరణం చేశారు. అనంతరం మంత్రి రామన్న మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని ప్రేరేపితం చేసి సాహీత్యపరంగా, సామాజిక అంశాల పరంగా అనేక ఉద్యమాలు చేసిన మహానీయుడిగా కొనియాడారు. ఆయన ఆశయాల స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె ఉవ్వేత్తున ఎగిసిపడిందని, రాష్ట్ర నవ నిర్మాణంలో ఆయన ఆశయాలు నెరవేరుస్తున్నామని అన్నారు. ఈ సంధర్భంగా నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో చిరు ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే బోరువెల్స్ మంజూరి చేసి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఏప్రిల్ తర్వాత కమ్యూనిటీ హాల్ కోసం రూ.5లక్షల కేటాయిస్తామని అన్నారు. అంచలంచెలుగా తాగునీరు, విద్యుత్, వైద్యం సౌకర్యంతో పాటు ప్రార్థణ మందిరాల నిర్మాణాలు చేపడుతామని అన్నారు. ఈ సంధర్భంగా నాల్గవ తరగతి ఉద్యోగులు మంత్రి రామన్నను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎస్ కె మహమూద్, అశోక్ గౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి, పట్టణ అధ్యక్షులు సయ్యద్ సాజిదోద్దిన్, టీ ఆర్ ఎస్ నాయకులు ఆరె నారాయణ, బోజారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, జోగు ఫౌండేషన్ చైర్మెన్ జోగు ప్రేమేందర్, కౌన్సిలర్లు దోని జ్యోతి, సత్యనారాయణ, ఎంపిపి శుక్ల తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో యువతపాత్ర కీలకం
* ప్రొఫెసర్ కోదండరాం
నిర్మల్, ఫిబ్రవరి 21: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్‌లోని మున్సిపల్ ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన యువతకు ఉద్యోగ, ఉపాధికల్పనపై ప్రత్యేక అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేలాది సంఖ్యలో హాజరైన విద్యార్థులనుద్దేశించి ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వివిధ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోందన్నారు. ముఖ్యంగా గ్రూప్2 లో ప్రకటించిన 459 ఉద్యోగాలు సరిపోవని, కనీసం వీటి సంఖ్యను 2 వేలకు పెంచాలని డిమాండ్‌చేశారు. కాగా ఆయా ఉద్యోగాలను సాధించేందుకు యువత కఠోర దీక్షతో సన్నద్దం కావాలని సూచించారు. ముఖ్యంగా తెలంగాణ చారిత్రాత్మక, ఆర్థిక, రాజకీయ అంశాలపై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలన్నారు. వాటిని విడి విడిగా చదవకుండా సమగ్రంగా కలుపుకొని చదివి పరీక్షలకు సిద్దం కావాలన్నారు. అలాగే స్వాతంత్రం కంటే ముందు నిజాం సంస్థానంలో రూపొందించబడ్డ ముల్కీ నిబంధనలను తెలుసుకుని ఉండాలన్నారు. స్వాతంత్రం అనంతరం హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రాలో తెలంగాణ రాష్ట్రం విలీనం, ఫజల్ అలి కమిటి నివేదిక, ఆంధ్ర మహాసభ ఉద్యమంతోపాటు 1969లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమంపై విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వీటితోపాటు ఆరు సూత్రాల పథకం, 610 జీవోలను క్షుణ్ణంగా చదవాలని పేర్కొన్నారు. అలాగే నాటి శాతవాహనుల చరిత్ర నుండి కాకతీయుల, నిజాం పరిపాలన వరకు చరిత్రను చదవాలని తెలిపారు. ప్రాచీన జైన,బౌద్ద మత ప్రభావం తెలంగాణ ప్రాంతంపై ఏ విధంగా ఉంది అనే అంశాలను విద్యార్థులు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలన్నారు. అంతకుముందు టివివి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కృష్ణం రాజు మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితోనే ఉద్యమంలాగా ఉద్యోగాల కోసం సిద్దమై విజయం సాధించాలన్నారు. ఉద్యోగాలతోపాటు ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పించి యువతలో నైపుణ్యాలు పెంచాలన్నారు. ఇందుకోసం చిన్నా, మద్యతరహా పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరారు. చివరగా పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రొఫెసర్ కోదండరాంను శాలువతో ఘనంగా సత్కరించారు. అలాగే గిరిజన యూనివర్సిటిని జిల్లాలోనే ఏర్పాటుచేసేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు కోదండరాంకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టివివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణగౌడ్, రాష్ట్ర కార్యదర్శి ఎ.విజయ్‌కుమార్, టి ఎన్జీవో అధ్యక్షులు ప్రభాకర్, నాయకులు అమర్‌నాథ్‌రెడ్డిలతోపాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ఖరీఫ్‌లో నైనా సాగునీరు అందేనా..?
తిర్యాణి, ఫిబ్రవరి 21: మండలంలోని చెలిమెల వాగు ప్రాజెక్టు గత దశాబ్దకాలం నుండి ఆధునీకరణకు నోచుకోక అధికారులు,నాయకులు హమీలతోనే సరిపెడుతూ వస్తున్నారే తప్ప అమలుకు మాత్రం నోచుకోవడం లేదని చెలిమెల వాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు.కనీసం ఈఖరీఫ్‌లోనైనా ఆధునీకరణ జరుగుతుందేమోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.గత 1998సంవత్సరంలో 6వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.28కోట్లతో చెలిమెల వాగు ప్రాజెక్టును నిర్మించారు.అయితే ఈప్రాజెక్టు ప్రారంభం అయిన అనతికాలంలోనే ప్రాజెక్టులో పూడిక వచ్చి చేరడంతో పాటు కాల్వలన్ని ఎక్కడికక్కడ గండ్లు పడ్డాయి.దీంతో 6వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సిన ప్రాజెక్టు ప్రస్తుతం వేయి ఎకరాలకు కూడా నీరు అందించలేని దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈప్రాజెక్టు నిర్మాణం కంటే ముందు తాము వర్షాధార పంటలను వేసుకునే వారమని ప్రాజెక్టు ప్రారంభంతో తమ పంట చేనులన్నింటిని వరి పంట పొలాలుగా మార్చుకున్నామని అయితే ప్రాజెక్టులో పూడికతో పాటు కాల్వలకు పడ్డ గండ్ల కారణంగా తాము వరి పంటను వేసుకుందామంటే నీరు అందని పరిస్థితి వేరే ఇతర పంటలను వేసుకుందామంటే వర్షాలు బాగా కురిసినట్లయితే తమ పంటలు నీట మునిగే పరిస్థితి నెలకొందని దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా గత దశాబ్ద కాలం నుండి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని అధికారులకు,ప్రజాప్రతినిధులకు విన్నవించుకుంటూ వస్తున్నప్పటికిని హమీలు గుప్పిస్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం పెట్టడంలేదని ప్రతి ఖరీఫ్ కంటే ముందు కాల్వలకు ఏవో నామమాత్రంగా మరమ్మత్తులు చేపడుతూ చేతులు దులుపుకుంటున్నారని రైతులు పేర్కోంటున్నారు.కాగా ఆసిఫాబాద్ ఎమ్మేల్యే కోవ లక్ష్మి ఇటీవల తిర్యాణి మండలాన్ని సందర్శించినప్పుడు ప్రాజెక్టు ఆధునీకరణ విషయమై నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావుతో మాట్లాడటం జరిగిందని సానుకూలంగా స్పందించిన మంత్రి రూ.23కోట్లతో ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులు మంజూరు చేయనున్నట్లు హమి ఇచ్చారని ఎమ్మేల్యే పేర్కోన్నారు.ఈఖరీఫ్ ప్రారంభం అయ్యే నాటికి ప్రాజెక్టు ఆధునీకరణ జరిగేలా చూసి తమను ఆదుకోవాలని ఆయకట్టు రైతులు అధికారులను,ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

నిర్మల్‌లో ఎస్టీ కమీషన్ ఛైర్మెన్‌కు ఘన స్వాగతం
* రెండు రోజులపాటు జిల్లాలో పర్యటన
నిర్మల్, ఫిబ్రవరి 21: గిరిజనుల స్థితిగతులపై, దళితుల సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఆదివారం జిల్లాకు వచ్చిన ఎస్టీ కమీషన్ చైర్మెన్ డాక్టర్ ఎస్.చల్లప్పకు నిర్మల్‌లో అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆర్‌అండ్‌బి విశ్రాంతి భవనంలో కలెక్టర్ జగన్‌మోహన్‌తోపాటు నిర్మల్ ఆర్డీవో శివలింగయ్యలు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ చల్లప్ప మాట్లాడుతూ జిల్లాలో కయితీ లంబాడాలు, వాల్మీకి బోయ కులస్థుల స్థితి గతులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రావడం జరిగిందన్నారు. సోమవారం ఉట్నూర్ మండలంలోని సాలెవాడ(బి), ఇంద్రవెళ్లి మండలంలోని అడ్యానాయక్ తాండ, బజార్‌హత్నూర్ మండలం చింత్‌కారా గ్రామాల్లో తమ బృందం పర్యటిస్తుందన్నారు. అలాగే మంగళవారం నేరడిగొండ మండలంలోని గౌలిగూడ, ఆరెపల్లి, లింగాల, గ్రామాల్లో పర్యటిస్తామని అలాగే బోథ్ మండలంలోని గుట్టపక తాండాలో లంబాడాలు, బోయ కులస్థుల జీవనస్థితిగతులను పరిశీలిస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్ మాట్లాడుతూ కమిటి పర్యటించనున్న ప్రాంతాలకు చెందిన తహశీల్దార్లు, గ్రామరెవెన్యు అధికారులు, మండల రెవెన్యు ఇన్స్‌పెక్టర్లు నిర్దేశించి ఫార్మెట్‌లో లంబాడ, వాల్మీకి బోయ కులస్థుల సమాచారాన్ని సేకరించి కమిటి సభ్యులకు అందజేయాలని సూచించారు.

ఉద్యమంలా సాగిన మలివిడత పల్స్‌పోలియో
* జిల్లాలో 3.6లక్షల చిన్నారులకు పోలియో చుక్కలు
* ఆదిలాబాద్‌లో చుక్కల మందు వేసిన కలెక్టర్, ఏఎస్పీ
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఫిబ్రవరి 21: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం మలివిడతగా ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. ఊరూ..వాడల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను పోలియో కేంద్రాల వద్దకు తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుండే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీలు పోలియో వ్యాక్సిన్లతో సిద్దంగా ఉండి పిల్లలకు చుక్కలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 3లక్షల 62వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని 866 గ్రామపంచాయతీల్లో, 1860 ఆవాస గ్రామాల్లో 5లక్షల పోలియో వ్యాక్సిన్లను సిద్దంగా ఉంచారు. ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదిలాబాద్‌లోని శాంతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో పోలియో చుక్కలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంధర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకే 16 సంవత్సరాలుగా పల్స్‌పోలియో వ్యాక్సిన్లను ప్రభుత్వం ఉద్యమంగా పిల్లలకు వేస్తోందని, ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడ పోలియో కేసు నమోదు కాలేదన్నారు. ముందస్తు జాగ్రత్తగానే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యంత్రాంగం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తుందని అన్నారు. పిల్లల ఆరోగ్యం బాగుంటేనే బావి తరాల సమాజం క్షేమంగా ఉంటుందని, పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు దృష్టిసారించాలని అన్నారు. డిఎంఅండ్‌హెచ్‌వో జలపతి నాయక్ మాట్లాడుతూ జిల్లాలో 3లక్షల 62వేల మంది పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలు వేయడం జరిగిందని, ఏజెన్సీలో 95 శాతం పోలియో చుక్కలు వేశామని అన్నారు. గత నాలుగేళ్లుగా జిల్లాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చందు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
కజ్జర్లలో పోలియో చుక్కలు వేసిన అదనపు ఎస్పీ రాధిక
తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ జిఆర్ రాధిక పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. గ్రామాల్లో మహిళలు చైతన్యవంతమైతేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని, స్వచ్చంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.

బిసి వర్గాల్లో అసమానతలు రూపుమాపుదాం
* 2,300 కోట్లతో బిసి సంక్షేమ బడ్జెట్
* పద్మశాలి సన్మాన కార్యక్రమంలో మంత్రి జోగు రామన్న
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఫిబ్రవరి 21: ఆనాధిగా అన్నిరంగాల్లో వెనకబాటు తనాన్ని చవిచూస్తున్న బిసి వర్గాల్లో సాంఘిక అసమానతలు రూపుమాపి వారి జీవనప్రమాణాలు పెంపొందించేందుకే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుపరుస్తోందని, ఈ బడ్జెట్‌లో 2,300 కోట్ల నిధులను బిసిలకు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని శాంతినగర్ కాలనీలో గల పద్మశాలి కమ్యూనిటీ హాల్‌లో రూ.8లక్షల వ్యయంతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రామన్న ప్రసంగిస్తూ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనకబడ్డ పద్మశాలీల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది 50వేల మంది బిసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు సబ్సిడీపై రుణాలు అందించి, వారి జీవనోపాధి కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో టెక్స్‌టైల్ పార్కు అనుబంధంగా పరిశ్రమలు వచ్చేలా ముఖ్యమంత్రితో చర్చిస్తానని, అన్ని సంఘ భవనాలకు ఓకే చోట భవన సముదాయం నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ 1 నుండి బిసిలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. ఈ సంధర్భంగా పేదలకు రేషన్‌కార్డులు, రుణాలు, ఇతర పక్కాగృహాలు మంజూరి చేసేలా తన వంతు కృషి చేస్తానని పద్మశాలి కులస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం కమ్యూనిటీ ప్రాంగణంలో రూ.30లక్షలతో కూడిన భవన నిర్మాణానికి మంత్రి హామీ ఇచ్చారు. ఏడాదికి రూ.10లక్షల చొప్పున నిధులు మంజూరి చేసి భవనాన్ని పూర్తిచేస్తామని అన్నారు. అంతేగాక తెలంగాణ ఉద్యమనేత కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆదిలాబాద్‌లో నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యక్షుడు జిట్ట రమేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి మాట్లాడుతూ తన వంతుగా పద్మశాలీలకు చేయూతనందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి మంచకట్ల ఆశమ్మ, జిల్లా అధ్యక్షుడు ఎనగంటి రాజవౌళి, ప్రధాన కార్యదర్శి ఎస్.లక్ష్మినారాయణ, కాసర్ల శ్రీనివాస్, నాయకులు మోర విఠ్ఠల్, వెంకటేష్, అశోక్, నారాయణ, శివకుమార్, గుట్ట సుమన్, వెంకటేశ్వర్లు, బిసి సంఘం అధ్యక్షులు ఈర్ల సత్యనారాయణ, టీఎన్జీవో అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.