అదిలాబాద్

భూ నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జూలై 23: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని రాష్ట్ర దేవాదాయ, గృహ నిర్మాణ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం మండలంలోని గుడిపేట, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో చేరుతున్న నీటి వివరాలతో పాటు ప్రస్తుత నీటి మట్టం, ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న గ్రామస్థుల పరిస్థితుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న నీటిమట్టాని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్దిగా కురుస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, చెరువులు, వాగులు నీటితో నిండి నిండు కుండలా దర్శనమిస్తున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో ఇటు ప్రజలకు, రైతాంగానికి సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు లేవన్నారు. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలని ఆదేశించారు. ఇంటి అడుగు స్థలం పరిహారంతో పాటు బాధితులకు అందించాల్సిన పరిహారం, పునరావాస విషయంలో ఎలాంటి అన్యాయం జరుగబోదని తెలిపారు. అనంతరం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రాజెక్టు పరిస్థితి, నిర్వాసితుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. తొమ్మిది గ్రామాల ప్రజలకు ఇంకా పరిహారం అందించాల్సి ఉందని ప్రాజెక్టు అధికారులు ప్రస్తుతం 11 టిఎంసీలకు పైగా నీటి నిల్వ ఉందని తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం మంత్రికి వినతి
ఎల్లంపల్లి ప్రాజెక్టు సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిర్వాసితులు వినతి పత్రం అందించారు. అనంతరం సమస్యలను విన్నవించారు. పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని, పునరావాస కాలనీల్లో దేవాలయాల నిర్మాణంకోసం నిదులు కేటాయించాలని నిర్వాసితులు కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, డిసిఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కారుకూరి చంద్రవౌళి, మాదవరపు రాజేశ్వర్ రావు, అంకం మారుతి, ఒడ్డె శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ సత్తయ్య, మమత సూపర్‌బజార్ చైర్మన్ ఎర్రం తిరుపతి, ఎలుక రమేష్, ఇరిగేషన్ డిఇ పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిది
* మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా
ఆదిలాబాద్ టౌన్, జూలై 23: హరితహారంలో భాగంగా నాటుతున్న వేలాది మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా అన్నారు. శనివారం పట్టణంలోని వినాయక్‌చౌక్‌లో మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా చైర్‌పర్సన్ మనీషా మాట్లాడుతూ వాతావరణంలో సమతుల్యత లోపించి గత ఏడాది వర్షాలు సక్రమంగా కురియక పంటలను నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అదే విధంగా భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయి ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కోవల్సివచ్చిందన్నారు. అటవీ సంపదను పెంపొందించినట్లయితే వర్షాలు సమృద్దిగాకురియడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించవచ్చని అన్నారు. చెట్లతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని, బావి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హరితహారం కింద నాటే మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, డిఈ శ్రీనివాస్, ఈఈ నాగమల్లేశ్వర్ రావు, ఏఈ నవీన్, కౌన్సిలర్లు అందె శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

నాటిన మొక్కల సంరక్షణ ప్రజాప్రతినిథులదే
* విద్యార్ధులు ఉత్తమ సంస్కారాన్ని అలవచ్చుకోవాలి
* గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ అనితా రాంచంద్రన్
నిర్మల్ రూరల్, జూలై 22: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను ప్రజాప్రతినిథులే సంరక్షించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రాంచంద్రన్ అన్నారు. మండలంలోని లెఫ్ట్‌పోచంపాడ్ బాలికల గురుకుల సంక్షేమ పాఠశాలలో శనివారం మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో ఉత్తమప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు ప్రోత్సాహక బహుమతులను అందించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. ప్రజాప్రతినిథులు ఏలాంటి సాకు చేప్పకుండా ముందుండి మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు. విద్యార్ధులు క్రమశిక్షణతో చదివి సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఉత్తమసంస్కారం అలవర్చుకోని తల్లితండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. ప్రతి విద్యార్ధి తలో మొక్కను నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఉన్నత చదువులు చదివి జీవితాల్లో స్ధిరపడ్డాక మీరు నాటిన మొక్కలు ఎదిగిన తీరును చూసి ఆనందిచ్చవచ్చన్నారు. హరితహారంలో నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గ్రామిణాభివృద్ధి శాఖ అడిటర్ సౌమ్య, ఎంపిపి అల్లోల సుమతి, ఆర్డీవో శివలింగయ్య, ఎంపిడివో గజ్జారాం, పాఠశాల ప్రిన్సిపాల్ గంగన్న తదితరులు పాల్గ్గొన్నారు.

మొక్కలు నాటడం ఫోటోల కోసం కాదు
* సంరక్షించే బాధ్యత భుజానికెత్తుకొండి
* అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
జన్నారం, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫోటోలతో ఫోజులివ్వకుండా తమ గురుతర బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం హరితహారంలో భాగంగా మండలంలోని మార్కెట్ యార్డులో మంత్రి రామన్న, ఎమ్మెల్యే రేఖానాయక్‌లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ రానున్న తరుణంలో మొక్కలు పెరిగి చెట్లుగా ఎదిగితే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండుతాయన్నారు. మొక్కల సంరక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. కొన్ని సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవల్సి వచ్చిందన్నారు. అటవీ సంపద తగ్గడంతోనే వర్షాలు కురవడంలేదని, దీంతో పంటల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఏప్రభుత్వం కూడా చేపట్టనివిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుచూపుతో హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కృషి చేసినప్పుడే పథకం లక్ష్యం నెరవేరుతుందన్నారు. హరితహారంపై అధికారులు గ్రామ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. కాగా ఈ సందర్భంగా మంత్రి రామన్న సమక్షంలో జట్పీటీసీ సభ్యురాలు నూతి లక్ష్మి టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో ఎంపిపి సిహెచ్ రాజేశ్వరి సత్యం, పొన్కల్ సర్పంచ్ దర్శనాల అనసూయ, ఎంపిటీసీ జోష్న, సహకార సంఘ చైర్మన్ రాజవౌళి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీష్, మండల పార్టీ అధ్యక్షుడు రాజరాంరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా, మండల నాయకులు జనార్దన్, భరత్‌కుమార్‌లతో పాటు తహశీల్దార్ సత్యనారాయణ, ఎడీవో రమేష్, ఎపిడి శ్రీనివాస్, కో-అప్షన్ సభ్యుడు పసి ఉల్లా, ఎంపిటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

31న ఐటిడిఏ పాలక వర్గ సమావేశం
* పివో ఆర్‌వి కర్ణన్
ఉట్నూరు, జూలై 23: ఈనెల 27కు బదులు 31వ తేదీన ఐటిడిఏ పాలకవర్గ సమావేశం నిర్వహించనున్నందున అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ ఆదేశించారు. శనివారం కొమురం భీం ప్రాంగణంలోని పిఎమ్మార్సీ భవనంలో జిల్లా అధికారులతో గత పాలకవర్గ సమావేశంలో సభ్యులు లేవలెత్తిన అంశాలకు సంబంధించిన చర్యలపై సమీక్షించారు. ఈ సంధర్భంగా పివో కర్ణన్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు 31న జరిగే పాలకవర్గ సమావేశానికి అధికారులంతా పూర్తి సమాచారంతో హాజరుకావాలన్నారు. గతంలో సభ్యులు లేవనెత్తిన అంశాలలో తీసుకున్న చర్యలు నివేదికల ద్వారా తెలుపాలని, లేనట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోథ్ మండలం సాయినగర్, కన్గుట్ట, జాతర్లలో నీటి కాలుష్యం వల్ల డయేరియా ప్రబలే అవకాశం ఉన్నందునా నీటిని ల్యాబ్‌లో పరిక్షించాలని, క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని అన్నారు. ఆర్‌డబ్ల్యూ ఎస్‌ఏఈ, ఆసుపత్రి వైద్యాధికారి ఎంపిడీవోను కలిసి పకడ్బందీ చర్యలు చేపట్టాలనిన్నారు. అడ ప్రాజెక్టు పైపు లీకేజి అవుతూ గుంతల్లో నీళ్లు నిలుస్తున్నాయని, తద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో సమస్యను పరిష్కరించాలన్నారు. అనంతరం పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి జలపతి నాయక్, విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి, మలేరియా అధికారి అల్హాం రవి, డిడి రాంమూర్తి, ఏపివో జనరల్ నాగోరావు, అదనపు వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

అడవుల విస్తీర్ణం పెంపుపై మొక్కలు నాటాలి
* రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న
* లక్ష్మీపూర్‌లో మొక్కలు నాటిన మంత్రి రామన్న
కడెం, జూలై 23: తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంపుకై మొక్కలు నాటి భావి తరాల కోసం మొక్కలను పెంచాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. శనివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న మండలంలోని లక్ష్మిపూర్‌లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలను మంత్రి జోగురామన్న, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపిపి బుక్య అమ్మిబాపురావు మొక్కలను నాటారు. అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి రామన్న మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించడంలో కూడా ఈ ఉత్సాహంతో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కెసిఆర్ కలలుగన్న లక్ష్యం నెరవేరుతుందన్నారు. హరితతెలంగాణ ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 12కోట్ల 40లక్షల మొక్కలు నాటగా రికార్డుస్థాయిలో ఆదిలాబాద్ జిల్లాలోనే కోటి 80 లక్షల మొక్కలు నాటి రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉన్నామన్నారు. పచ్చదనం బాగుంటేనే కరువును దూరంచేసి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తద్వారా పంటలు బాగా పండుతాయని మంత్రి అన్నారు. పర్యావరణ సమతుల్యతతోపాటు మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. రాష్ట్రంలో కరువును అధిగమించడానికి మూడు సంవత్సరంలో 230 కోట్ల మొక్కలను నాటడానికి ప్రణాళికలు రూపొందించామని, ప్రభుత్వం ఈ ఉద్దేశంతో హరితహారం పథకం చేపట్టినందుకు ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. అలాగే మొక్కలను విరివిగా నాటాలని ఆయన కోరారు. రాష్టవ్య్రాప్తంగా పెద్దఎత్తున మొక్కలునాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులకు సంబంధించిన పొలాల గట్లపై 2 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం ఉందన్నారు. అంతరించిపోతున్న అటవీ సంపదను రక్షించడానికి ప్రతీఒక్కరు ముందుకురావాలని, అటవీ శాఖ ఖాళీ ప్రదేశాల్లో కోటి 33 లక్షల మొక్కలు నాటలనే లక్ష్యం ఉందన్నారు. గ్రామానికి 40 వేల మొక్కలు, నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా తెలంగాణకు హరితహారం ముందుకుసాగుతుందని, నాటిన మొక్కలను సంరక్షించడానికి వెదురుకర్రలతో సంరక్షణగా పెట్టడం జరుగుతుందన్నారు. ఈ గ్రామసభలో గ్రామానికి చెందిన పలువురు నాయకులు, గ్రామస్థులు తమ గ్రామాల్లో పంటలపై అడవి పందులు, కోతులు దాడిచేస్తూ పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని, దీంతో తాము తీవ్రంగా పంటలు నష్టపోతున్నామని, దీనిని నివారించాలని మంత్రికి విన్నవించారు. మంత్రి రామన్న మాట్లాడుతూ అడవిపందులు, కోతుల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అడవి పందులను చంపడానికి లైసెన్సులు కూడా ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. అలాగే కోతుల నివారణ కొరకు ప్రభుత్వం నిర్మల్ సమీప ప్రాంతంలో ఒక ప్రాజెక్టును ఏర్పాటుచేయనుందని, ఇందులో గ్రామాల్లో ఉన్న కోతులను పట్టి అక్కడే ఉంచి, వాటి సంతాన అభివృద్ధి కాకుండా ఆపరేషన్ చేయించి మళ్లీ అడవుల్లో వదలడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అడవులు ఉంటేనే వర్షాలు సమృద్దిగా కురుస్తాయని, ఉన్న అడవులు అంతరించిపోవడంతో గత కొనే్నళ్ల నుండి రాష్ట్రంలో అనావృష్టి, అతివృష్టి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్, డిసిసిబి చైర్మన్ దామోదర్‌రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ ఛైర్మెన్ సక్కారాం శ్రీనివాస్, వైస్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, నవాబ్‌పేట్ సర్పంచ్ రాజమణి, తహశీల్దార్ నర్సయ్య, ఎంపిడివొ శ్రీలత, కవ్వాల్ టైగర్‌జోన్ ఫీల్డ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ గుప్త, డిఎఫ్‌వో రాంకిషన్ యాదవ్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌గౌడ్, నాయకులు పాకాల రాంచందర్, జొన్నల చంద్రశేఖర్, ఆకుల లచ్చన్న, మండలాధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, హపావత్ రాజేందర్‌నాయక్, నాయకులు సతీష్, శంకర్, నల్లగొండ, రాజేశం, రవిగౌడ్, ఎక్సైజ్ సిఐ బాపురావు, సిఐ నరేష్‌కుమార్, ఎస్సైలు ఆరిఫొద్దిన్, బాలకృష్ణ, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వట్టివాగు నీరు విడుదల చేసిన మంత్రి ఐకె
ఆసిఫాబాద్ రూరల్, జూలై 23: ఆసిఫాబాద్, రెబ్బెన నియోజక వర్గాలకు సాగునీరందించే వట్టివాగు ప్రాజెక్టు నీటిని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి గొడం నగేష్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, కోనేరుకోణప్ప తదితరులు శనివారం విడుదల చేశారు. ప్రాజెక్టులో 236.850 మీటర్ల నీరు నిలువ ఉన్నందున ఐదు వేల ఎకరాల వరి పంటకు నీరించేందుకు ఈనీరు ఉపయోగ పడుతోందని ఈసందర్భంగా మంత్రి ఐకె విలేఖర్లకు తెలిపారు. వట్టివాగు ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం రూ.80 కోట్ల మంజూరీ చేయాలని ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 12 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సాగు, తాగునీటికి అధిక ప్రాధాన్య ఇస్తోందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి తారాబాయి, జెడ్పీటిసి అరిగెల నాగేశ్వర్ రావు, మార్కెట్ కమిటి ఛైర్మెన్ గంధం శ్రీనివాస్, సబ్‌కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఇరిగేషన్ సిఇ భగవంత్ రావు, ఇఇ బద్రినారాయణ, సింగిల్ విండోఛైర్మెన్ అలీ, అధికారులు, తెరాస నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్లకు ఆన్‌లైన్ గుర్తింపుకార్డుల జారీ
* ప్రయాణికుల భద్రతకై జిల్లా ఎస్పీ వినూత్న ప్రయోగం
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జూలై 23: ఆభద్రత భావానికి గురయ్యే ఆటో ప్రయాణికులకు పూర్తి భద్రత, పోలీసు శాఖ తరపున భరోసా కల్పించేందుకు ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ఆటో ఆన్‌లైన్ గుర్తింపు కార్డుల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఆటోలో ప్రయాణించే మహిళలు, యువతులు పలు సందర్భాల్లో డ్రైవర్ల చేతిలో ఆఘాయిత్యాలు, ఆభద్రతభావానికి గురవుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు సురక్షితమైన భద్రత కల్పించే లక్ష్యంతో శనివారం ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ వినూత్నంగా ఆన్‌లైన్ గుర్తింపు కార్డులను జారీచేశారు. ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్లు వారి పూర్తి వివరాలతో పోలీసు శాఖకు ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేయడమేగాక ఆటో నెంబర్లను కూడా డిజిటల్ సిస్టంలో నిక్షిప్తం చేసి స్మార్ట్ కార్డులను జారీ చేస్తున్నారు. తద్వారా ప్రయాణికులకు ఆటో డ్రైవర్లపై భరోసా కల్గడమే గాక పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రతిరోజు తిరిగే వేలాది ఆటో డ్రైవర్ల వివరాలు పారదర్శకంగా ఉంచేందుకు వీలుకల్గనుంది. ఆటో డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, డ్రెస్‌కోడ్ తదితర అంశాలను తప్పనిసరిగా పాటించే విధంగా డ్రైవర్లకు పోలీసు శాఖ తరుపున శిక్షణ కల్పించారు.
ఆటోల డిజిటలైజేషన్ సంస్కరణలు
తొలిసారిగా ఆటో రిక్షాల డిజిటలైజేషన్ ద్వారా డ్రైవర్ల వివరాలతో కూడిన స్మార్ట్‌కార్డుల జారీ ప్రజలకు పూర్తి భరోసా, విశ్వాసాన్ని కల్పిస్తుందని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని తనిషా గార్డెన్‌లో ఆటో డ్రైవర్లతో సమావేశమైన ఎస్పీ ఆన్‌లైన్ విధానంతో చేపట్టిన సంస్కరణలను వివరించారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు, యజమానుల పూర్తి వివరాలు ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందని, తెలంగాణలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో ఆన్‌లైన్ ద్వారా ఆటో డ్రైవర్లు, ఓనర్ల వివరాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ విధమైన రక్షణ వ్యవస్థను తీసుకరావడం జరిగిందని, త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుందని అన్నారు. ఈ విధానంప్రయాణికుల రక్షణ కల్పించడంతో పాటు ఆటో డ్రైవర్లకు వారి కుటుంబాలకు ఆసరాగా ఉంటుందన్నారు. కాగా ఆటోయూనియన్ అద్వర్యంలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్‌ను శాలువా పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆటో డిజిటలైజేషన్ హైదరాబాద్ సంస్థ డైరెక్టర్ ఎడ్ల సందీప్, డిఎస్పీ ఎ.లక్ష్మినారాయణ, ట్రాఫిక్ సిఐ యండి షేర్ అలి, పట్టణ సిఐలు ఎన్.సత్యనారాయణ, ట్రాఫిక్ ఎస్సైలు శ్రీనివాస్, వేణుగోపాల్‌రావు, పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎండి నరుూం, సంతోష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

గూడెం గోదావరిలో వరద ఉద్ధృతి
దండేపల్లి, జూలై 23: మండలంలోని గూడెం గ్రామం వద్ద గల గోదావరి నదిలో శనివారం నీటి ఉద్ధృతి పెరిగింది. కడెం ప్రాజెక్టు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని గోదావరికి వదలడంతో గోదావరిలో నీటి మట్టం పెరిగి పాతవంతెనకు సమాంతరంగా నీరు ప్రవహిస్తోంది. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30గంటల వరకు రాకపోకలు నిలిపివేశారు. చిన్న, మధ్యతరగతి వాహనాలను అనుమతించిన అధికారులు వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో రెండు గంటల పాటు వాహనాలను నిలిపివేసి 4గంటల ప్రాంతంలో మళ్లీ అనుమతించారు. వరద ఉద్ధృతి ఇలాగే కొనసాగితే రాత్రికి వంతెన మునిగే ప్రమాదముందని అధికారులు తెలిపారు.

చెట్లు పకృతి వైపరీత్యాలను నిలువరిస్తాయి
* రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న
ఉట్నూరు, జూలై 23: చెట్లు ప్రకృతి వైపరీత్యాలను నిలువరించడంతో పాటు నీరు, ప్రాణవాయువు, నీడను ఇస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. హరితహారంలో భాగంగా శనివారం మంత్రి రామన్న, ఎమ్మెల్యే రేఖానాయక్, ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్‌లు కలిసి స్థానిక మండలంలోని నాగపూర్ గ్రామ రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ గతంలో విరివిగా చెట్లు ఉండేవని, దానివల్ల పర్యావరణంలో ఎలాంటి మార్పులు రాకుండా కాలానికి అనుగుణంగా వర్షాలు కురిసేవన్నారు. ప్రస్తుతం చెట్లు లేకపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ప్రకృతి వైపరిత్యాలు సంభవించి అనేక విధాలుగా నష్టపోతున్నారని అన్నారు. మానవ మనుగడకు దోహదపడే చెట్లను పెంచినట్లయితే మనిషికి ప్రాణవాయువు, నీరు, నీడనిస్తుందనే సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. చెట్ల సంరక్షణకు మహిళా గ్రూపు సభ్యుల ద్వారా పెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈనెల 8 నుండి నేటివరకు రాష్టవ్య్రాప్తంగా 14కోట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 20 శాతం మేరకు అడవులు ఉన్నాయని, వాటిని 33 శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 7లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ మూడున్నర లక్షల హెక్టార్లలో చెట్లు లేవని, రాబోయే మూడు సంవత్సరాలలో 230 కోట్ల మొక్కలు అటవీ ప్రాంతంలో, 100 కోట్లు మైదాన ప్రాంతంలో, మరో 120 కోట్లు ఇతర ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. అనంతరం హరితహారంపై పలువురు విద్యార్థులు ర్యాలీ చేపట్టగా మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉట్నూరు ఆర్డీవో ఐలయ్య, తహసీల్దార్ రాథోడ్ రమేష్, ఎంపిడీవో లక్ష్మణ్, ఎంపిపి విమల బాయి, జడ్పీటీసీ జగజీవన్, ఉట్నూరు, నాగపూర్ సర్పంచ్‌లు బొంత అశారెడ్డి, హరినాయక్ తదితరులు పాల్గొన్నారు.