అదిలాబాద్

హౌసింగ్ డిఇ, భార్య పిల్లలు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హౌసింగ్ డిఇ, భార్య పిల్లలు ఆత్మహత్య
ఆసిఫాబాద్, జూలై 30: హైదరాబాద్ సమీపంలోని ఘట్‌కేసర్ వద్ద ఆసిఫాబాద్ హౌసింగ్ డిప్యూటీ ఇంజనీర్ సత్యనారాయణ, అతని కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదరీతిలో మృతిచెందడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిఇ, అతని కుటుంబ సభ్యుల మృతిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న హౌసింగ్ ఇన్‌చార్జి డిఇ సత్యనారాయణ వైద్య చికిత్సల నిమిత్తం భార్య, కుమార్తెలు, కొడుకుతో కలిసి ఆసిఫాబాద్ నుండి శుక్రవారం ఉదయం కారులో హైదరాబాద్ బయలుదేరారు. నిన్ననే వరంగల్ వచ్చి తన ఇద్దరు కూతుళ్లను వెంట తీసుకెల్లిన డిఇ సత్యనారాయణ రాత్రి అంకుసాపూర్ వద్ద కారులోనే మృతి చెంది కనిపించగా, అతని భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు పక్కనే రైల్వేట్రాక్‌పై శవాలై కనిపించడం సంచలనం రేకెత్తిస్తోంది. పట్టణంలోని బజార్‌వాడీలో నివాసం ఉంటున్న సత్యనారాయణ కుటుంబానికి చుట్టుపక్కల వారితో పెద్దగా పరిచయాలు లేవని తెలుస్తోంది. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణకు కుటుంబ, ఆర్థిక సమస్యలు ఇబ్బందిగా పరిణమించినట్లు తెలుస్తోంది. వయస్సుపై బడ్డ కూతుళ్ల వివాహాలు కాలేదనే ఆవేదన, నిత్యం తలనొప్పిగా మారిన కుటుంబ కలహాల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని, ఈ షాక్‌లో వెంటే ఉన్న కుటుంబ సభ్యులు సైతం రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకొని ఉంటారని అర్థమవుతోంది. ఏదిఏమైనా డిఇ, అతని కుటుంబ సభ్యులు ఐదుగురు ఒకే సారి మృత్యువాత పడడం జిల్లావాసులను కలచివేసింది.

అదుపుతప్పిన స్కూల్ బస్సు
* సౌండ్‌సిస్టం మోత
* తృటిలో తప్పిన భారీ ప్రమాదం
* సంఘటనపై ఆర్‌టివొ కార్యాలయం ఆరా, డ్రైవర్‌పై కేసు నమోదు
కుభీర్, జూలై 30: మండలంలోని గోడాపూర్ గ్రామ శివారులో శనివారం స్కూల్ బస్సు అదుపుతప్పిన సంఘటనలో భారీ ప్రమాదం తప్పింది. భైంసా పట్టణంలోని వివేకానంద పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ఏపి 01 జి 8747 ఉదయం 7.30 గంటల ప్రాంతంలో విద్యార్థులతో వెళ్తూ అదుపుతప్పి రోడ్డు కిందికి పంట చేనులోకి చొరబడి ఒకవైపు ఒరిగిపోయింది. బస్సులో 35 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు పల్టీ కొట్టి ఉంటే భారీ ప్రమాదమే చోటుచేసుకునేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ సంఘటనలో నర్సింగ్ అనే విద్యార్థి చేయి విరగగా పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. స్కూల్ బస్సు మితిమీరిన వేగంతో వెళ్లడంతోనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిర్మల్ ఆర్‌టివొ కార్యాలయం అధికారులు సైతం సంఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గురైన బస్సులో సౌండ్‌సిస్టం మోత విపరీతంగా వినిపించిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ సంఘటనలో గాయాలపాలైన విద్యార్థిని ప్రవళిక తండ్రి, సూర్యవంశీ రోహిదాస్ ఫిర్యాదుమేరకు బస్సుడ్రైవర్ జాదవ్ చంద్రకాంత్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తుజరుపుతున్నట్లు ఏ ఎస్సై లతీఫ్ తెలిపారు.

ఐక్య ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షునిగా సబ్బని కృష్ణ
బెల్లంపల్లి, జూలై 30: పట్టణంలోని కన్నాల బస్తీకి చెందిన సబ్బని కృష్ణను ఐక్య ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినట్లు ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి వనం సుధాకర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఎంసిపిఐయు రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఐక్య ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ సమావేశంలో సబ్బని కృష్ణను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు. గత 36 సంవత్సరాలుగా గాయకుడిగా, రచయితగా, నటుడుగా సేవలందిస్తున్నారనిన తెలిపారు. ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తిస్తూ ప్రజలను ఉద్యమాల వైపు నడిపిస్తున్న ప్రజాకళాకారుడు సబ్బని కృష్ణ అని తెలిపారు. ఎంసిపిఐయు ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా కృష్ణ పనిచేస్తున్నారని, ఆయన నియామకం పట్ల జిల్లాలో పార్టీ, ప్రజానాట్య మండలి బలోపేతం అవుతుందని తెలిపారు.

అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడి అరెస్టు
మంచిర్యాల అర్బన్, జూలై 30: పలు ఘరానా మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోసగాన్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు మంచిర్యాల ఏ ఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మాదాసు వౌనిక అనే యువతి 2013లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాజీపూర్ ఎస్సై రవి ప్రసాద్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ఉత్తర ప్రదేశ్‌లో సోదాలు నిర్వహించగా, రశీద్ అహ్మద్ అనే ఘరానా మోసగాన్ని పట్టుకొని అతని నుంచి రూ.2.50లక్షలను స్వాదీన పరుచుకున్నట్లు తెలిపారు. యువతి ఆర్టీసీ బస్సులో అతికించిన మూడు రోజుల్లో మీ సమస్య పరిష్కారం ప్రకటన ఆధారంగా అందులో ఉన్న సెల్‌నెంబర్‌ను సంప్రదించగా, రశీద్ అహ్మద్ అనే వ్యక్తి బాబా మీర్జాగా నామకరణంతో పరిచయమయ్యాడు. మీకు ఎలాంటి సమస్యలున్నా మూడు రోజుల్లో మీ సమస్యలకు పరిష్కారం అయ్యేలా పూజలు నిర్వహిస్తామని యువతిని నమ్మబలికి యువతి నుంచి రూ.5లక్షలు ఆ వ్యిక్తి బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయాలని తెలపడంతో యువతి పూర్తిగా నమ్మి డబ్బులు డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేసిన మరుక్షణం నుంచి ఆ వ్యక్తికి పలుమార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో హాజీపూర్ పోలీసు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘరానా మోసాన్ని పసిగట్టిన ఎస్సై రవిప్రసాద్, సిబ్బంది ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ గ్రామంలో సోదాలు నిర్వహించగా, రశీద్ అహ్మద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. ఇతనిపై ఐపిసి 420సెక్షన్ కేసు నమోదు చేసినట్లు ఏ ఎస్పీ తెలిపారు. ఈ విధంగా అబద్దపు ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దని, ప్రజలు మూఢ నమ్మకాలను నమ్మకూడదన్నారు. ఇలాంటి మోసాలకు గురికావడం ఎక్కువ శాతం చదువుకున్న వారే కావడం గమనార్హం. ఇప్పటికైనా బస్‌స్టేషన్లలో గానీ, ఇతర ప్రదేశాల్లో గానీ అతికించిన వాల్‌పోస్టర్లపై జాగ్రత్త పాటించాలని సూచించారు. ఈ కేసులో పురోగతి సాదించిన హాజీపూర్ ఎస్సై రవిప్రసాద్, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సి ఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై రవిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

నేటి నుండే గోదావరి తీరాన భక్తుల పుణ్యస్నానాలు
* జిల్లాలో నాలుగు చోట్ల ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జూలై 30: గోదావరి నది నుండి బృహస్పతి సింహరాశి నుండి కన్యరాశిలోకి ప్రవేశించే 12 రోజుల అంత్య పుష్కరాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భక్తుల కోసం ఏర్పాట్లు చేసింది. గోదావరి నది జిల్లాలో ప్రవహించే బాసర, సోన్, మంచిర్యాల, చెన్నూర్‌లో అంత్యపుష్కరాలకు ఏర్పాట్లు గావించినప్పటికీ ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఇందుకు కారణం గత ఏడాది నిర్వహించిన గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం భక్తుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలనే ఈసారి అంత్యపుష్కరాలకు వినియోగించనున్నారు. స్నానపు ఘట్టాల్లో తాత్కాలికంగా మహిళల కోసం స్నానం ఆచరించేందుకు షెడ్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది జూలై 14 నుండి 25 వరకు జరిగిన ఆది పుష్కరాల్లో లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించగా ఈసారి గోదావరి అంత్యపుష్కరాల ఘట్టానికి భక్తులు సాధారణ స్థాయిలోనే వచ్చే అవకాశం ఉందని దేవాదాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే బాసర, చెన్నూర్, సోన్, మంచిర్యాలలో జరిగే అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు మొక్కుబడిగా సాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది పుష్కరాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి స్నాన ఘట్టాల వరకు రోడ్లు, మురికి కాలువలు, ఘాట్ల నిర్మాణం, స్నానపు గదుల నిర్మాణం చేపట్టినప్పటికీ అవి రెండు మూడు నెలలకే మరమ్మత్తులకు గురికావడంతో ఈసారి భక్తులు ఇక్కట్లుపడే అవకాశం ఉంది. ఈనెల 31 నుండి ఆగస్టు 11వ తేదీవరకు అంత్యపుష్కరాలు జరుగుతాయని అధికారులు పేర్కొంటుండగా బృహస్పతి ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశించడంతో 12 ఏళ్లు 12 రాశుల్లో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. గత ఏడాది జూలై 14 నుండి 25 వరకు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించడంతో ఆదిపుష్కరాలు వైభవంగా నిర్వహించగా ఆదివారం నుండి కన్యరాశిలోకి 12రోజుల పాటు ప్రవేశించడంతో గోదావరి పుష్కరాల ఘట్టం ముగియనుంది. ఆ తర్వాత కృష్ణ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి గోదావరి నదికి వరద నీరు చేరడంతో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు, శ్రాద్దాలు, పిండప్రదానాలు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
నేటి నుండి ఆరంభం కానున్న గోదావరి అంత్యపుష్కరాల నేపథ్యంలో ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని నాలుగు కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆదిలాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ్‌కుమార్ ఆంధ్రభూమికి తెలిపారు. బాసర నుండి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు 5 బస్సులు నడుపుతున్నామని, హైదరాబాద్ నుండి కూడా రిజర్వేషన్ బుకింగ్‌తో కూడిన బస్సులు నడుస్తాయని తెలిపారు. చెన్నూర్ కేంద్రం నుండి పుష్కరఘాట్ వరకు రెండు బస్సులు, మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి గోదావరి తీరంవరకు రెండు బస్సులు, సోన్ నుండి పుష్కరఘాట్ వరకు రెండు బస్సులు ప్రత్యేక ట్రిప్పులతో నడుస్తాయని ఆయన వివరించారు.

నేడు ఐటిడిఏ పాలకవర్గ సమావేశం
* హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు
* 53 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఉట్నూరు, జూలై 30: జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం ఐటిడిఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షించేందుకు కొమరంభీం ప్రాంగణంలోని పిఎమ్మార్సీ భవనంలో ఆదివారం కలెక్టర్ జగన్మోహన్ అధ్యక్షతన పాలక వర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ పాలక వర్గ సమావేశంలో గత పాలకవర్గ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలు పరిగణలోకి తీసుకొని వాటిపై సమీక్షించనున్నారు. అదే విధంగా ఐటిడిఏ ద్వారా అభివృద్ధి పథకాల అమలులో ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం వలన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలుకావడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇట్టి పాలకవర్గ సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్, జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విఫ్ నల్లాల ఓదేలుతో పాటు ఎంపి నగేష్, జిల్లాలోని ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు, ఎంపిపి, జడ్పీటీసీలు హాజరుకానున్నారు. ఇదిలాఉండగా ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో గిరిజన గ్రామాల్లో విజృంభిస్తున్న వ్యాధులు, వైద్యసేవలు, పారిశుద్ధ్య అంశాలపై చర్చ జరిగే అవాకాశాలు ఉన్నాయి. ఐటిడిఏ ద్వారా గిరిజనుల అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాలను సమీక్షించనుండగా రాబోయే రోజుల్లో గిరిజనుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా పాలకవర్గ సమావేశం సంధర్భంగా పలు అభివృద్ధి పథకాలకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.53 కోట్ల 85 లక్షలతో చేపట్టే అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనుండగా అందులో రూ.2కోట్ల 75లక్షలతో హుమెన్ వర్కింగ్ హాస్టల్, రూ.5కోట్ల 50లక్షలతో ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్, ఖానాపూర్, బోథ్‌లలో గిరిజన భవన్‌లు, రూ.25కోట్ల 20లక్షలతో జైనూర్, తిర్యాణి, ఇంద్రవెల్లి, బోథ్, సిర్పూర్‌టి, ముథోల్‌లలో 6గురుకులాల నిర్మాణం, రూ.16కోట్ల 60లక్షలతో ఎందా, కల్వాడా, బాబాపూర్, భీమారం, కొహినూర్‌లలో డార్మెంటరి అదనపు గదుల నిర్మాణం, రూ.3కోట్ల 80లక్షలతో ఖానాపూర్, లక్సెటిపేట్‌లలో బాలికల ఆశ్రమ వసతిగృహాలను నిర్మించనుండగా వాటికి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకై అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు.

కడెం జలాశయంలో హైకోర్టు జడ్జి బోటు విహారం
* ప్రకృతి అందాలను తిలకించిన జడ్జిలు
* హరిత రిసార్ట్ సందర్శన
కడెం, జూలై 30: ఆదిలాబాద్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి సమీపంలో గల పర్యాటక శాఖ హరిత రిసార్ట్‌ను శనివారం లీగల్ సర్వీసెస్ అథారిటి ఎగ్జిక్యూటివ్ చైర్మెన్, రాష్ట్ర హైకోర్టు జడ్జి వి.రామసుబ్రహ్మణ్యం, జిల్లా జడ్జి ఉదయగౌరీ సందర్శించారు. ఈ సందర్బంగా దాదాపు రెండు గంటలపాటు హరిత రిసార్ట్‌లో హైకోర్టు జడ్జి రామసుబ్రహ్మణ్యం సరదాగా గడిపారు. కడెం ప్రాజెక్టు ప్రకృతి అందాలు, హరిత రిసార్ట్ విషయాలు తదితర వాటిపై స్థానికంగా ఉన్న జిల్లా న్యాయమూర్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి ఉదయగౌరీ పలు విషయాలపై ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు. అనంతరం హరిత రిసార్ట్ సమీపంలో గల పర్యాటక కేంద్రం బోటింగ్ పాయింట్ వద్దకు వెళ్లి కడెం జలాశయంలో బోటులో హైకోర్టు జడ్జి రామసుబ్రహ్మణ్యం, జిల్లా జడ్జి ఉదయగౌరీ, జిల్లా న్యాయమూర్తులు విక్రమ్, చంద్రశేఖర్‌రావు, పర్యాటకశాఖ అధికారి రవికుమార్, నిర్మల్ ఆర్డీవో శివలింగయ్య జలాశయంలో బోటు విహారం చేస్తూ ప్రాజెక్టు, ప్రకృతి అందాలను తిలకిస్తూ హైకోర్టు జడ్జి రామసుబ్రహ్మణ్యం తన సెల్‌ఫోన్‌లో ప్రకృతి అందాలను చిత్రీకరించారు. నిర్మల్ ఆర్డీవో శివలింగయ్య, డిటివో రవికుమార్, జిల్లాలోని న్యాయమూర్తులు విక్రమ్, చంద్రశేఖర్‌రావు, తహసిల్దార్ నర్సయ్య, మండల రెవెన్యు ఇన్స్‌పెక్టర్‌లు మెస్రం బాపురావు, రవీంధర్‌నాయక్, ఖానాపూర్ సిఐ నరేష్‌కుమార్, కడెం ఎస్సై రాము, వి ఆర్‌వొ వెంకటస్వామి, హరిత రిసార్ట్ మేనేజర్ విద్యాసాగర్‌రెడ్డి, కడెం టూరిజం బోటింగ్‌పాయింట్ ఇంచార్జి రమేష్, తదితరులు ఉన్నారు.

హక్కుల పరిరక్షణ కోసమే న్యాయ సేవాధికార సంస్థ
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్
ఉట్నూరు, జూలై 30: పౌర హక్కుల పరిరక్షణ కోసమే న్యాయసేవాధికార సంస్థ కృషి చేస్తుందని, పౌరులకు రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులు పొందుటకు ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంవల్ల సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ అన్నారు. శనివారం కొమరంభీం ప్రాంగణంలోని పిఎమ్మార్సీ భవనంలో గిరిజన హక్కులు, రక్షణ అమలు (నల్స) 2015 పథకంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఐక్యత సమావేశంలో న్యాయమూర్తితో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్, కలెక్టర్ ఎం.జగన్మోహన్, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి, ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, చట్టాలు, హక్కులపై సరైన అవగాహన లేక సద్వినియోగం చేసుకోలేకపోతున్నామన్నారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న చట్టాలు, హక్కుల గురించి గిరిజనులకు తెలియజేసి వారు తమ హక్కులను సద్వినియోగంతో లబ్దిపొందేందుకు న్యాయసేవాధికార సంస్థ పనిచేస్తుందన్నారు. గిరిజనులకు చట్టపరంగా అనేక హక్కులు కల్పించినప్పటికీ వారు వినియోగించుకోలేకపోతున్నారని, అందుకై గిరిజన హక్కులు, రక్షణ అమలు 2015 పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయసేవాధికార సంస్థలు గిరిజన హక్కులపై అవగాహన కల్పిస్తూ హక్కులు పొందేలా కృషి చేస్తున్నాయన్నారు. న్యాయసేవాధికార సంస్థ నల్స అమలుపై ఆదిలాబాద్‌లో గిరిజనులు ఎక్కువగా ఉన్నందున ఉట్నూరు కేంద్రంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ, సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీర చందులాల్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు తమ హక్కులు పొందడం తెలియదని, చట్టపరంగా సంక్రమించిన చట్టాలను సద్వినియోగం చేసుకునేందుకు ఈ సదస్సులు ఉపయోగపడుతాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో మూడనమ్మకాలు ఎక్కువగా ఉన్నందునా వాటిని పారదోలేందుకు నల్స పథకంలో అంశాన్ని చేర్చి చైతన్యవంతులను చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి కేసులు జరిగినట్లయితే అవి ఎక్కడ పరిష్కారం అవుతాయో తెలియజేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రెండు మూడునెలలకొక్కసారి సమావేశాలు ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోని ప్రజలకు చట్టాలపై అవగాహన లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి గురించి తెలిసేవిధంగా బుక్‌లెట్‌ను ప్రచురించాలని ప్రాజెక్టు అధికారికి సూచించారు. న్యాయసేవాధికార సంస్థ రాష్ట్ర కార్యదర్శి జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులు జనజీవన స్రవంతిలోకి రాలేకపోతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విద్య, వైద్య పథకాలను పొందలేకపోతున్నారన్నారు. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను సద్వినియోగం చేసుకొని జనజీవన స్రవంతిలో కలిసి లబ్దిపొందాలన్నారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో 5లక్షల మంది గోండులు, లంబాడ, కొలాం, మ్నె, తోటి, ప్రదాన్ తదితర తెగలకు చెందిన గిరిజనులు ఉన్నారని తెలిపారు. ట్టాలపై సరైన అవగాహన లేక వీరికి సంక్రమించిన హక్కులు పొందలేక పోతున్నారన్నారు. అనంతరం గిరిజన హక్కులు, రక్షణ అమలు నల్స 2015కు సంబంధించిన బ్రౌచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉదయగౌరి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగేశ్వరరావు, ఆర్డీవో ఐలయ్య, డిడి రాంమూర్తి, జిల్లాలోని పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

గిరిజనులు ఉన్నతవిద్యలో రాణించాలి
* గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్
జైనూర్, జూలై 30: ఏజెన్సీలోని గిరిజన విద్యార్థులు స్వయం కృషితో ఉన్నత విద్యలో రాణించినప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, గిరిజనుల విద్య, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దచూపుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్ అన్నారు. మండలంలోని మార్లవాయిలో నూతనంగా నిర్మించిన ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని శనివారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎంపి గెడం నగేష్, ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చందులాల్ మాట్లాడుతూ చదువు లేకపోతే అభివృద్దిసాధ్యపడదని అన్నారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు. గిరిజనుల పిల్లలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు హరితహారం కార్యక్రమంలో పాలుపంచుకొని మొక్కలు నాటాలని అన్నారు. ఈ సంధర్భంగా మంత్రి చందులాల్ గిరిజనులకు మొక్కలను పంపిణీ చేసిన అనంతరం హెమాన్‌డార్ఫ్ దంపతులకు, కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హెమాన్ డార్ఫ్ విశ్రాంతి భవనానికి ప్రహారి గోడ నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గర్భిణీ స్ర్తిలకు పౌష్టికాహారం అందజేసిన అనంతరం రాగపూర్ చెరువులో చేప పిల్లల విత్తనాలు వేశారు. వీటిని రక్షించుకున్నట్లయితే మత్స్యకారులకు మంచి ఆదాయం వస్తుందన్నారు. అనంతరం జైనూర్‌లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రి అక్కడ గిరిజనులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జైనూర్ ప్రాథమిక ఆసుపత్రి చిన్నగా ఉందని, అదనపు పడకలు మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు. వైద్యసిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటూ గిరిజనులకు మెరుగైన వైద్యసేవలందించాలని సూచించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎంపి గెడం నగేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా నెరవేరుస్తామని, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కోటప్ప విమల, సర్పంచ్ మెస్రం భీంరావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాలా, ఎంపిటీసీ దేవురావు, తహశీల్దార్ శంకర్ గౌడ్, ఎంపిడీవో దత్తరాం, మండల అధికారులు పాల్గొన్నారు.

అధికారుల తీరు వల్లే సమస్యల పరిష్కారంలో జాప్యం
* అంగన్‌వాడీల అక్రమాలపై సభ్యుల గరంగరం
* హరితహారం మొక్కల సంరక్షణకు జడ్పీలో తీర్మానం
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జూలై 30: వివిధ శాఖల అధికారుల పనితీరులో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే అభివృద్ధి పనులు కుంటుపడుతూ ప్రజలు అవస్థలు పడుతున్నారని, అధికారుల వైఖరివల్లే తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని జిల్లాకు చెందిన శాసన సభ్యులు, జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జడ్పీ చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వైస్ చైర్మెన్ రాజారెడ్డి, శాసన సభ్యులు దివాకర్‌రావు, రాథోడ్ బాపురావు, రేఖానాయక్, కోవ లక్ష్మి, విఠ్ఠల్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, కలెక్టర్ జగన్మోహన్, సిఈవో జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా సాగిందని, అయితే జిల్లాలో ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు నాటిన మొక్కలను కాపాడుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. మొక్కల చుట్టూ కంచెలు, ట్రీగార్డ్స్ ఏర్పాటు చేయడమే గాక వచ్చే సెప్టెంబర్ నుండి మొక్కలకు ప్రతిరోజు నీరుపోసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మొక్కను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. 2017 డిసెంబర్‌లోగా జిల్లాలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించి తీరుతామని, ఇప్పటికే పనులు వేగిరంగా సాగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పలువురు జడ్పీటీసీలు మాట్లాడుతూ ఎండ కాలంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం జరిగిందని, దానికి సంబంధించిన బిల్లులు రావడంలేదని పేర్కొన్నారు. ఒక్కో వ్యక్తికి సగటున ప్రతిరోజు 20 లీటర్ల నీరు అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సూచించగా నీటి కొరత కారణంగా 30లీటర్లపైనే ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు, కాలనీలకు సరఫరా చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ స్వచ్చ్భారత్‌లో భాగంగా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించి ప్రచారం చేసినప్పటికీ అవి నిర్మించిన కుటుంబాలకు మాత్రం ఏడాది దాటినా బిల్లులు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పథకాల అమలుకు సహకరించడంలేదని విమర్శించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ జిల్లాలోని 133/11 కెవి సబ్‌స్టేషన్‌లో జిల్లాకు చెందిన నిరుద్యోగులను నియమించకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, వారిని తొలగించి స్థానికంగా ఉన్నవారిని నియమించాలని కోరారు. గుడిహత్నూర్ జడ్పీటీసీ కేశవ్‌గిత్తె మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల ధరలు తగ్గించినప్పటికీ రైతులకు మాత్రం పాత ధరలకే విక్రయిస్తూ వ్యాపారులు మోసగిస్తున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మంచిర్యాల ప్రాంతంలో కాకతీయ మిషన్ చెరువులు నాసిరకంగా నిర్మించి డబ్బులు దండుకుంటున్నారని, అవినీతి పెరిగిపోయిందని అక్కడి జడ్పీటీసీ ఆరోపించాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలన్నారు. ఆసిఫాబాద్ జడ్పీటీసీ ఏమాజీ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణాల్లో ఆధికారుల నిర్లక్ష్యం కనబడుతోందని, దీనిపై పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం లోపిస్తోందని, ఈ కేంద్రాలు అవినీతికి నిలయాలుగా మారాయని, సన్న బియ్యం పంపిణీ పర్యవేక్షణ లోపించిందన్నారు. ఈ వ్యవహరంలో జడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు పరిశీలించి అంగన్‌వాడీలపై చర్యలు తీసుకునేలా తీర్మానించారు. సాక్షర భారతి పథకం జిల్లాలో మొక్కుబడిగా సాగుతోందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా డిడి దుర్గ్భావాణి వేధిస్తున్నారని పలువురు సభ్యులు ఆరోపిస్తూ ఆమెను సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆమె బదిలీ కోసం దరఖాస్తు చేసుకుందని, ఈ వ్యవహారంపై విచారణ చేస్తామన్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యంవల్ల గ్రామాల్లో గడవులోగా ట్యాంకు నిర్మాణం, పైపులైన్లు వేయడంలేదని, దీంతో తాగునీటి సమస్య తీరడంలేదని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పసల్ బీమా యోజన పథకం ప్రత్యేక కార్యాలయాన్ని ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. సమావేశంలో స్థానికంగా ఎదురవుతున్న సమస్యలపై సభ్యులు నిలదీశారు.