అదిలాబాద్

వర్షాలతో గోదారి పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 16: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీనికి తోడు ఎగువ మహారాష్టల్రో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి జలకళతో పరవళ్లు తొక్కుతోంది. గురువారం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర ధర్మాబాద్ నుండి వరద నీరు పోటెత్తడంతో గోదావరిలోకి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో పుణ్యక్షేత్రమైన బాసర వద్ద గోదావరి వరద ప్రవాహం పెరగడంతో నాటు పడవలను నిషేదించారు. మరోవైపు సుద్దవాగు ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం చేరువలో ఉండడంతో ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో 6.2 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా, తలమడుగు మండలంలో 8.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. తలమడుగు, తాంసి, బజార్‌హత్నూర్, జైనథ్, దహెగాం, బోథ్, గుడిహత్నూర్ మండలాల్లో వానలు దంచికొట్టడంతో ఏపుగా పెరిగిన పత్తి, సోయ, కంది, పెసరి, జొన్న పంటలకు తీరని నష్టం వాటిల్లింది. తలమడుగు, తాంసి మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా నీటమునిగి రైతులకు కన్నీరును మిగిల్చింది. మరోవైపు ఆదిలాబాద్, భైంసా డివిజన్లలోనూ భారీ వర్షం కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోసాధారణ వర్షపాతం 928.8 మి.మీటర్లు కాగా శుక్రవారం వరకు సాధారణ వర్షపాతం మించి 971 మి.మీటర్లు నమోదు కావడం గమనార్హం.

అంగరంగ వైభవంగా గిరి సంబురం
* ఆదివాసీ సంస్కృతిని చాటిన ప్రదర్శనలు
* ఉట్నూరులో భారీ శోభాయాత్ర
ఉట్నూరు, సెప్టెంబర్ 16: జిల్లాలోని పది గిరిజన తెగల సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై ఐటిడిఏ అధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఉట్నూరు కేంద్రంలో నిర్వహించిన గిరి ఉత్సవం సంబరం అంబరాన్ని తాకింది. శుక్రవారం కొమురం భీం ప్రాంగణంలో గిరిజన సంస్కృతిని, సంప్రదాయాలను చాటే రీతిలో కార్యక్రమాలను నిర్వహించారు. గిరి ఉత్సవ్ కార్యక్రమాల్లో జిల్లా నలుమూలల నుండి గిరిజన తెగలన్నీ తరలిరావడంతో జాతరను తలపించింది. పది తెగల గిరిజనుల సాంప్రదాయ పద్దతులు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నృత్యాలు చేయడం, వేషాధారణలు చూపరులను ఆకట్టుకుంది. మండల కేంద్రంలోని ఐబి ప్రాంతం నుండి భారీ శోభాయాత్ర చేపట్టగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్‌లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో కలెక్టర్ జగన్మోహన్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్, ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖానాయక్, రాథోడ్ బాపురావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శోభాయాత్రలో గోండు, కొలాం, అంద్, పర్దాన్, తోటి, ఎరుకల, లంబాడా, మనె్నవార్, నాయక్‌పోడ్, కోయ తదితర గిరిజనులు వారి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింభించేలా ప్రదర్శనలు నిర్వహించారు. శోభాయాత్ర కొమురం భీం ప్రాంగణం చేరుకున్న అనంతరం సభా కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలనచేసి ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీర రేఖానాయక్ గిరి ఉత్సవ్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ జిల్లాలోని అన్ని తెగల గిరిజనులు ఐక్యంగా ముందుకు సాగితేనే అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతారని అన్నారు. ఆదిలాబాద్‌జిల్లా అంటేనే ఆదివాసీ గిరిజన జీవన విధానాలకు మారుపేరని, జిల్లాలో ఉన్న అన్ని తెగల గిరిజనులు ఒకే వేదికపై తీసుకవచ్చి వారి వారి సంస్కృతిసాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింభించే విధంగా గిరి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీని కోసం విశేషంగా కృషి చేసిన ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్‌ను జిల్లా గిరిజనులు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. జిల్లా విస్తీర్ణం దృష్ట్యా మూడు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్న సంధర్భంలో కొమరంభీం జిల్లాగా పేరు పెట్టాలన్న గిరిజనుల కోరిక మేరకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మంచిర్యాలకు కొమురం భీం పేరు పెట్టడం జరిగిందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో గిరిజన ప్రాంతాలు విడిపోతున్నప్పటికీ సమస్యల సాధన కోసం ప్రాంతాలతో సంబంధం లేకుండా ఐక్యంగా ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన గిరిజనులందరికి అందించేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. గిరిజన పోరాట యోదుడు కొమరంభీం అసువులు బాసిన జోడెఘాట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ జోడెఘాట్ సభకు వచ్చి రూ.25 కోట్లు కేటాయించారని అన్నారు. అదే విధంగా కొమరంభీ కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనివిని ఎరగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ బంజారహిల్స్‌లో లంబాడా గిరిజనులకు బంజార భవన్, ఆదివాసి గిరిజనులకు ఆదివాసి భవన్‌లకు ఎకరం చొప్పున స్థలాలను కేటాయించి, భవనాల నిర్మాణం కోసం రూ.5కోట్లు కేటాయించింద్నారు. కొమురం భీం ప్రాజెక్టు ద్వారా ఏజెన్సీలోని గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. జోడెఘాట్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంతో పాటు రూ.13కోట్ల వ్యయంతో కెరమెరి నుండి జోడెఘాట్ వరకు డబుల్ రోడ్డు నిర్మానం చేపట్టిందన్నారు. గిరిజనుల హక్కుల కోసం పోరాటాలు చేసి అసువులు బాసిన కొమురం భీం విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించి అరుదైన గౌరవం కల్పించిందన్నారు. గిరి ఉత్సవ్ కార్యక్రమం ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్తు తరాలకు అందించేందుకే ఏర్పాటు చేశామన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రతి తెగకు లిపి అనేది ఉందని, ఆలాంటిది ఆదివాసి తెగలకు తరతరాలుగా లిపిలేకున్నా సంప్రదాయాలు కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించడం గిరిజనులకే దక్కిందన్నారు. అనంతరం ఆయా గిరిజన తెగలు వారి వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానంపై కళ్లకు కట్టినట్లు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు ఆజ్మీరా రేఖానాయక్, కోవలక్ష్మి, రాథోడ్ బాపురావు, కొమరంభీం మనువడు సోనెరావు, ఉట్నూరు ఆర్డీవో ఐలయ్య, తెలంగాణ సంస్కృతిక సారథి కన్వీనర్ జయనర్సింగ్, ఉట్నూరు ఆర్డీవో ఐలయ్య, ఏపివో జనరల్ నాగోరావు, డిడి రాంమూర్తి, ఈ ఈ రమేష్‌బాబు, అదనపు జిల్లా వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీ జగజీవన్, ఎంపిపి విమల, వన్యప్రాణి సంరక్షణ డైరెక్టర్లు రాథోడ్ జనార్ధన్, కనక లక్కెరావు, ఉట్నూరు, లక్కారం సర్పంచ్‌లు బొంత అశారెడ్డి, తిరుపతి, గిరిజన తెగల పటేళ్లు, నాయకులు పాల్గొన్నారు.

జిల్లాలో పెద్ద రెవెన్యూ డివిజన్‌గా బెల్లంపల్లి
బెల్లంపల్లి, సెప్టెంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన బెల్లంపల్లిని అసలు అడిగితే కొసరు వేసిన చందంగా కేవలం బెల్లంపల్లిని రెవెన్యూ డివిజన్‌కే పరిమితం చేసింది. దీంతో బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌ను ఎనిమిది మండలాలతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కొమురంభీం జిల్లాలో అతి పెద్ద రెవెన్యూ డివిజన్‌గా బెల్లంపల్లి రికార్డులోకి ఎక్కనుంది. బెల్లంపల్లి మండలం, మున్సిపాలిటీ, తాండూర్, తిర్యాణి, దహెగాం, వేమనపల్లి, నెనె్నల, భీమిని, కాసిపేట మండలాలతో ఈ డివిజన్‌కు బౌగోళిక స్వరూపం తీసుకువచ్చింది. బెల్లంపల్లి అటవీ డివిజన్ సైతం విస్తీర్ణంలో కొమురంభీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోని డివిజన్ కన్నా అతిపెద్దదిగా పేర్కొనవచ్చు. అదే తరహాలో ఈ రెవెన్యూ డివిజన్ విస్తీర్ణం వైశాల్యంలో పెద్దదిగా పేర్కొనవచ్చు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 15వేల నివాస గృహాలు, దాదాపు 70వేల జనాభా, మండలంలో 10 గ్రామ పంచాయతీలు, 30వేల జనాభా, 10వేల నివాస గృహాలు, తాండూర్‌లో 7 గ్రామ పంచాయతీలు, 30వేల జనాభా, 10వేల నివాస గృహాలు, 25 రెవెన్యూ గ్రామాలు, తిర్యాణిలో 13పంచాయతీలు, 26411మంది జనాభా, 7వేల నివాస గృహాలు, 40 రెవెన్యూ గ్రామాలు, భీమినిలో 13 పంచాయతీలు, 35 రెవెన్యూ గ్రామాలు, 26వేల నివాస గృహాలు, 26285మంది జనాభా, నెనె్నలలో 13 గ్రామ పంచాయతీలు, 29 రెవెన్యూ గ్రామాలు, 8వేల నివాస గృహాలు, వేమనపల్లిలో 11 గ్రామ పంచాయతీలు, 33 రెవెన్యూ గ్రామాలు, 3500 నివాస గృహాలు, కాసిపేటలో 10 గ్రామ పంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు, 25వేల జనాభా, 8వేల నివాస గృహాలు, దహెగాంలో 18 గ్రామ పంచాయతీలు, 39 రెవెన్యూ గ్రామాలు, 34712మంది జనాభా, 8742 నివాస గృహాలు బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. మొత్తం ఈ డివిజన్‌లో 95 గ్రామ పంచాయతీలు, 2.85లక్షల జనాభా, దాదాపు లక్ష నివాస గృహాలు ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో చేర్చారు. గతంలో ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్‌లో భీమిని, తాండూర్ మండలాలు, మంచిర్యాల రెవెన్యూ డివిజన్‌లో ఉన్న బెల్లంపల్లి, కాసిపేట, నెనె్నల, వేమనపల్లి, ఊట్నూరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న తిర్యాణి మండలాలను బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేశారు. దీంతో కొమురంభీం జిల్లాలో అతిపెద్ద రెవెన్యూగా అవతరించిన బెల్లంపల్లిలో రెవెన్యూ పరిపాలన సౌలభ్యం కోసం ఇక్కడ ఐ ఏ ఎస్ అధికారి, జాయింట్ కలెక్టర్ లేదా సబ్ కలెక్టర్‌గా నియమించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, లక్షలాది ఎకరాల వ్యవసాయ భూమి ఈ డివిజన్‌లోనే ఉన్నాయి. రెవెన్యూ పరంగా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారిని నియమించాలనే ప్రతిపాదనలున్నాయి. ఏది ఏమైనా బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ కావడంతో జిల్లాల విభజన రాజ్యాంగ విరుద్దంగా జరిగాయని హై కోర్టులో వాజ్యం దాఖలు చేయడంతో జిల్లాల విభజన సమస్య మలుపు తిరిగే పరిస్థితులున్నాయి. బెల్లంపల్లి జిల్లాపై ఆశలు చిగురించనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

వారసత్వ ఉద్యోగాలు సాధించి తీరుతాం
మందమర్రి, సెప్టెంబర్ 16: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను తప్పకుండా సాదించి తీరుతామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం ఏరియాలోని కేకే-5 గని వద్ద నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో మరోసారి టీబీజీకే ఎస్ గుర్తింపు సంఘంగా గెలుపొందడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈనెల 26న ఏఐటియుసి తలపెట్టిన అంసెబ్లీ ముట్టడి కార్యక్రమం వల్ల కార్మికులకు ఒరిగేదేమీ లేదని, కార్మికుల్లో టీబీజీకేఎస్‌కు పెరుగుతున్న ఆదరణ చూడలేకనే ఏఐటియుసి నాయకులు టీబీజీకేఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పోగొట్టింది ఏఐటియుసి నాయకులు కాదా అని ప్రశ్నించారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇప్పించేందుకు గుర్తింపు సంఘం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. సింగరేణిలో డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు, సొంతింటి పథకం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడి తప్పకుండా అమలు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా నూతన గనులను ఏర్పాటు చేసి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికైనా ఏఐటియుసి నాయకులు టీబీజీకేఎస్‌పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టిబిజికేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, రవీందర్, రాజశేఖర్, రాంచెందర్, కాంపెల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ముధోల్ రెవెన్యూ డివిజన్ కొరకు ఉద్యమం ఉద్ధృతం
* ఎంపిడివో కార్యాలయంకు తాళం వెసిన నాయకులు
* ముధోల్‌లో భారీ ర్యాలీ
* రాస్తారోకో నిర్వహించిన ఆఖిలపక్ష జె ఎసి నాయకులు
* డివిజన్ కొరకు సెల్‌టవర్ ఎక్కిన యువకుడు
ముధోల్, సెప్టెంబర్ 16: ముధోల్ రెవెన్యూ డివిజన్ కొరకు ఉద్యమం ఉద్ధృతమైంది. శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో ముధోల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఎర్పాటు చేయాలని కోరుతూ ఆఖిలపక్ష జె ఎసి నాయకుల అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకరోజు ముందే ఆఖిల పక్ష జె ఎసి నాయకులు ముధోల్ బంద్‌కు పిలుపునివ్వడంతో వ్యాపార సముదాయాలు, దుకాణలు, ప్రవేటు పాఠశాలు,బంద్‌లో భాగస్వాములు అయ్యారు. ర్యాలీ అనంతరము ఆఖిల పక్ష జె ఎసి నాయకులు ముధోల్ మండల ఆభివృద్ది కార్యాలయంకు తాళం వెశారు. స్థానిక అంబేద్కర్ చౌక్‌లోని భైంసా- బాసర జాతీయ రాహదారిపై జె ఎసి అధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రాహదారికి ఇరువైపుల దాదాపు 10 కీలోమీటర్ల వరకు వాహనాలు అగిపొయాయి. దీంతో వాహనాల రాకపొకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కనివిని ఎరగని రితీలో రాస్తారోకోకు ప్రజలకు తరలిరావతంతో జనమే జనము కన్పించింది. దాదాపు రెండు నుండి మూడు గంటల పాటు రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలకు అక్కడే అగిపోయాయి. మండల జె ఎసి కన్వీనర్ రోల్ల రమేష్ మాట్లాడుతు ముధోల్‌పై పాలకులు ఎప్పుడు సవతి తల్లీ ప్రేమనే చూపారని అన్నారు. ముఖ్యంగా ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. ఘన చరిత్ర కలిగిన ముధోల్ పట్ల చిన్న చూపు తగదని తెలిపారు. దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ముధోల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయక పోవడంలో అంతర్యమేమిటో ప్రజలకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నరని వెల్లడించారు. ముధోల్ మండలంలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఓత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముధోల్, తానూర్, లోకేశ్వరం, కొత్తగ ఏర్పాటు కానున్న బాసరకు ముధోల్ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుతో సత్వర ఆభివృద్దికి అస్కారం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అభివృద్దికి అమడ దూరంలో ఉన్న ముధోల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసినట్లైతె అన్నిరకాలుగా ఆభివృద్ది చేందుతుందని పేర్కొన్నారు. దాదాపు ఎనిమిది వేయిల మంది తరలిరావడం పాలకులు గమనించాలని విన్నవించారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో యువతకు విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని అన్నారు. రెవెన్యూ డివిజన్ కొరకు యువత పొరాడుతుందని తెలిపారు. నాలుగు మండలాల ప్రజలకు ముధోల్ రెవెన్యూ డివిజన్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. ఇప్పటికే గత రెండు వారాల నుండి శాంతియుత మార్గంలో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ముధోల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసెంతవరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. ముధోల్ తహసీల్దార్ సిడాం దత్తు రాస్తారోకో చేస్తున్న ఆఖిల పక్షం జెఎసి నాయకుల దగ్గరికి చేరుకుని ప్రజల అకాంక్షను జిల్లాకలేక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకేళ్తమని హమి ఇవ్వడంతో శాంతి రాస్తారోకో విరమించారు. ముధోల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు. అనంతరము సముదాయించడంతో శాంతించారు. ముధోల్‌లోని వాడ వాడల ప్రజలతో కిక్కిరిసి పొయింది. జెఎసి అందోళనను దృష్టిలో పెట్టుకుని ముధోల్ పోలీసుల అధ్వర్యంలో గట్టి బందోబస్తు చేపట్టారు. కార్యక్రమంలో ముధోల్ మండల ఉపాధ్యక్షులు ఎజాజోద్దిన్, సర్పంచ్ ఆనిల్, ఉపసర్పంచ్ టి. లక్ష్మీదశరత్, బిసి సంఘం అధ్యక్షులు ధర్మన్న, మాజి ఎంపిటిసి సభ్యుడు బి పోతన్నయాదవ్, నాయకులు హంగిర్గా చిన్నన్న, గోవింద్ పటేల్, దిగంబర్, మనోరంజన్, ఖాలీద్ పటేల్, బిజెపి, బి ఎస్‌పి, తెరాస, కాంగ్రేస్, ఎంఐఎం పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ కార్యాలయ భవనం ఎంపిక
* తాత్కాలిక క్యాంపు కార్యాలయంగా ఎంసిసి క్వార్టర్స్
* గుడిపేట బెటాలియన్‌లో పోలీసు ట్రెయినీ కాలేజ్
* పక్కా భవనం కోసం నస్పూర్ ప్రభుత్వ స్థలం ఎంపిక
మంచిర్యాల, సెప్టెంబర్ 16: నూతన కొమురం భీం జిల్లాలో పోలీసు శాఖలోని ఎస్పీ కార్యాలయం కొరకు ఆర్డీవో కార్యాలయాన్ని ఎంపిక చేశారు. తాత్కాలిక క్యాంపు కార్యాలయంగా మంచిర్యాల సిమెంట్ కంపెనీ క్వార్టర్స్‌ను ఎంపిక చేసుకొని దసరా నుంచే జిల్లా ఉన్నత శాఖ అధికారుల కార్యాలయాల ద్వారా సేవలందించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ప్రభుత్వం ఆయా శాఖల తాత్కాలిక భవనాలను ఎంపిక చేసుకోవాలని తెలపగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్‌ను కలెక్టరేట్‌కు రెవెన్యూ శాఖ అధికారులు నిర్ణయించుకోగా, పోలీసు శాఖ అధికారులు కూడా అదే భవనం కావాలనడంతో ఇబ్బందులు ఏర్పడగా, ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్ రావులు ఆర్డీవో కార్యాలయాన్ని ఎస్పీ కార్యాలయంగా ఎంచుకోవాలని కోరడంతో ఇప్పటికే జిల్లా ఎస్పీ విక్రమ్ జీత్ దుగ్గల్ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో శుక్రవారం రాష్ట్ర అదనపు డిజిపి, (గ్రేహౌండ్స్) ఆక్టోపస్ గోవింద్ సింగ్ పట్టణంలోని భవనాలను పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయంతో పాటు ఎస్పీ ఎం క్వార్టర్స్, ఎలక్ట్రిసిటీ డివిజన్ కార్యాలయం, నస్పూర్‌లోని ప్రభుత్వ స్థలంతో పాటు గుడిపేట బెటాలియన్‌ను పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ తాత్కాలిక కార్యాలయంగా ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. క్యాంపు కార్యాలయం కోసం ఎంసిసి క్వార్టర్స్‌ను వినియోగించుకునేందుకు ఉన్నతాధికారులు పరిశీలించి పనులు ప్రారంభించే విధంగా ఇప్పటికే ఆ శాఖాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నస్పూర్‌లోని సర్వే నెంబర్ 42లోని పోలీసు కమాండెంట్ కంట్రోల భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించి 10 ఎకరాల స్థలం కేటాయించాలని తగిన ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించనున్నట్లుగా ఆ శాఖాధికారులు తెలిపారు. గుడిపేటలోని 7.8 ఎకరాల్లో పోలీసు ట్రెయినీ కాలేజీ ఏర్పాటుకు స్థలాన్ని నిర్ణయించినట్లుగా ప్రతిపాదన ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు కూడా భవనాలను ఎంపిక చేసుకొని పనులు ప్రారంభించి దసరా నుంచే సేవలందేలా ఆయా శాఖల అధికారులు ఉన్నారు.