కడప

ఆది వర్సెస్ పిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒకే వరలో రెండుకత్తులు
జమ్మలమడుగు, మార్చి 10: రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి ప్రత్యర్థి పార్టీల నాయకులను చేర్చుకుంటున్న క్రమంలో తెదేపాలోకి వైకాపా ఎమ్మెల్యే ఆది చేరిక జమ్మలమడుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆది చేరికతో మిగతా ప్రాంతాలకు భిన్నంగా జమ్మలమడుగు రాజకీయ పరిస్థితి ఏర్పడింది. రాయలసీమలో ఫ్యాక్షన్‌గడ్డగా పేరొందిన జమ్మలమడుగులో మూడు దశాబ్దాల కాలంగా గుండ్లకుంట శివారెడ్డి, దేవగుడి సోదరుల కుటుంబాల మధ్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరు నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతూవస్తోంది. ఫ్యాక్షన్ భూతానికి రెండు కుటుంబాల నాయకులతో పాటు నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులు బలయ్యారు. చాలా కుటుంబాలు ఫ్యాక్షన్‌తో రోడ్డున పడి దయనీయస్థితిలో వున్నాయి. కరుడుగట్టిన ఫ్యాక్షన్ నేపథ్యంవున్న జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయిన 1983నుండి 2004వరకు తెదేపాకు కంచుకోటగా వుంది. 1993లో తెదేపా నేత గుండ్లకుంట శివారెడ్డి హత్యోదనంతరం ఆయన వారసుడిగా సోదరుడి కుమారుడు రామసుబ్బారెడ్డి తెరపైకి వచ్చారు. పిఆర్ రెండు మార్లు తెలుగుదేశం పార్టీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో దేవగుడి కుటుంబం రాజకీయాల్లో తెరవెనుక వుండి నడిపించిన ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గతంలోని జరిగిన షాద్‌నగర్ జంటహత్యల కేసులో 2004 డిసెంబర్ 22న పిఆర్ జైలుకుపోవడంతో టిడిపి కేడర్ బలహీనపడుతూ వచ్చింది. ఆ తరువాత కాలంలో 2009లో కాంగ్రెస్, 2014లో వైకాపా తరపున ఎన్నికల్లో పోటీచేసిన ఆదినారాయణరెడ్డి ప్రత్యర్థి పిఆర్‌పై గెలుపొందారు. ఇప్పటి వరకు జమ్మలమడుగు రాజకీయం ఫ్యాక్షన్ నేపథ్యంతో రెండు కుటుంబాల ఆధిపత్య పోరుగానే సాగింది. వైకాపా అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో తలెత్తిన విబేధాలతో ఏడాది కాలంగా ఎమ్మెల్యే ఆది దూరంగావుంటూ వచ్చారు. దీంతో తెదేపాకు దగ్గరవడానికి ఆది ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆది తెదేపాలో ఆది చేరికతో అభిమానంతో పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నష్టం కలుగుతుందని అధిష్ఠానం వద్ద రామసుబ్బారెడ్డి తన తీవ్రంగా నిరసన గళం వినిపించారు. అయితే పార్టీ బలోపేతమే ధ్యేయంగా సాగుతున్న అధిష్ఠానం పిఆర్‌ను ఒప్పించి ఆదిని తెదేపాలోకి ఆహ్వానించింది. దీంతో ఎమ్మెల్యే ఈ ఏడాది ఫిబ్రవరి 27న టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. దీంతో చిరకాల ప్రత్యర్థులుగా వున్న ఇరు కుటుంబాల నాయకులు ఒకే గొడుగుకింద పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యక్తిత్వమే ముఖ్యమనీ, నియోజకవర్గ అభివృద్ది కోసమే తాను అధికార పార్టీలో చేరాననీ ఎమ్మెల్యే ఆది ఫిబ్రవరి 29న తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిని ఆహ్వానించి నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తన కేడర్‌కు వివరించారు. అదే క్రమంలో నియోజకవర్గ అభివృద్దికోసం రామసుబ్బారెడ్డిని కలుపుకొని పనిచేయడానికి సిద్దంగా వున్నామని చెబుతూనే తన వర్గం ఎవరినీ నొప్పించే పనిచేమని, అయితే అవతలి వర్గం వారు తమ కేడర్‌కు నష్టం కల్గించే ప్రయత్నం చేస్తే సహించమని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఆ క్రమంలోనే కలిసి పనిచేస్తామని చెబుతూనే ఆది రెచ్చగొట్టే వాఖ్యలు చేయడం సమంజసంకాదని పిఆర్ ప్రతివిమర్శలు చేశారు. తెదేపా పరిస్థితి ఇలా వుంటే వైకాపా కడప ఎంపి అవినాష్‌రెడ్డి నియోజకవర్గంలో అవకాశం వచ్చినప్పుడల్లా ద్వితీయశ్రేణి నాయకులతో సమావేశం అయి తమకు అందుబాటులో వుంటామని భరోసా ఇస్తూ వైయస్ కుటుంబం అభిమానులకు, నాయకులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలతో 2.2 లక్షలు పైగా ఓటర్లు వున్న నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆది చేరికను మొదటినుండి వ్యతిరేకిస్తున్న రామసుబ్బారెడ్డి అధిష్ఠానం రాజీకి సహకరిస్తారన్న విషయం ప్రశ్నార్థకమని విశే్లషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే ఆది కూడా నియోజకవర్గ వ్యాప్తంగా వున్న తన కేడర్ చేజారకుండా జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు ఎలా వున్నా తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, ఫ్యాక్షన్ వద్దు, పారిశ్రామికీకరణ అభివృద్ది, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల చేరివేత, తన పరిశీలన, పరిశోధనే తన పనితనమే కొలమానంగా వున్నాయని ఆదినారాయణరెడ్డి భరోసాగా చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ వైకాపా నుండి ఆది ఫిరాయింపుతో అంతటి బలమైన నాయకుడు లేకపోవడం ఎమ్మెల్యేకు కలిసి వచ్చే అంశంగా విశే్లషకులు భావిస్తున్నారు. అయితే దశాబ్దాల కాలంగా ఫ్యాక్షన్ రాజకీయాలకు బలై గడ్డుపరిస్థితులు అనుభవిస్తున్న ఇరువర్గాల కుటుంబాలు, గతం మరిచి నాయకులకు సహకరిస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకమే. తెదేపా అధిష్ఠానం సూచనల మేరకు ఒకరికొకరు సహకరించుకొని కొనసాగుతామని బహిరంగంగా చెబుతున్నా ఎన్నికల సమయానికి మళ్లీ చెరోదారిన వెళ్లే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి .టిడిపి అధిష్టానం మాత్రం ఏదోవిధంగా ఇరువర్గాలకు రాజీ కుదర్చి వైకాపాను దెబ్బతీయాలని వ్యూహరచన చేస్తోంది. అధికారంలో ఉన్నందున ప్రస్తుతం అయిష్టంగా ఇద్దరూ చేతులు కలిపినా ఎన్నికల సమయానికి కత్తులు దూసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
అత్యాచారం చేసి హతమార్చాడు
చింతకొమ్మదినె్న, మార్చి 10: తాగిన మైకంలో తన ఇంటిముందు వీధిలో ఆడుకుంటున్న అభం శుభం ఎరుగని ఆరుసంవత్సరాల ఆస్మా అనే బాలికను చాక్లెట్ ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు ఓ మృగాడు. సికె దినె్న సమీపంలోని వంకలో పూడ్జిపెట్టిన కిరాతకుడు ఓబయ్య అలియాస్ ఓబులేసు (45)ను పోలీసులు ఎట్టకేలకు అతడి భార్య సహకారంతో అరెస్టు చేశారు. రూరల్ సిఐ వెంకటశివారెడ్డి , ఎస్‌ఐ కుళాయప్ప ఈ ఘటనకు సంబంధించిన వివరాలు గురువారం విలేఖరులకు వివరించారు. ఈనెల 6న మండల పరిధిలోని కొప్పర్తి గ్రామానికి చెందిన నాయబ్ రసూల్ , మస్తానీల కుమార్తె ఆస్మా (6) తమ ఇంటిముందు ఆడుకుంటూ కన్పించలేదని తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిని మిస్సింగ్ కేసుగా నమోదుచేసుకున్న సికె దినె్న పోలీసులు అన్ని కోణాల్లో గ్రామంలో విచారిస్తుండగా, హంతకుడు కూడా వారి వెంటే ఉండి ఏమీ తెలియనట్లు నటిస్తూ వెతకడం ఆరంభించాడు. అదృశ్యమైన బాలిక విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు జాగిలాలు తెప్పించి చూస్తామని స్థానికులతో చెప్పడంతో హంతకుడు భయపడి ఊరువిడిచి పారిపోయాడు. ఈ విషయమై హంతకుడు తన భార్యకు ఫోన్ ద్వారా చిన్నారిని హత్యచేసి , వంకలో పూడ్చిపెట్టానని , నీవు పిల్లలతో పాటు ఊరువిడిచి వెళ్లాలని చెప్పాడు. లేకుంటే గ్రామస్తులు తరిమికొడతారని చెప్పడంతో భయపడిన హంతకుడి భార్య ఈ విషయం పోలీసులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగుచూసింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లేసరికి బుధవారం చీకటి పడటంతో గురువారం తహసీల్దార్ గుణభూషణ్‌రెడ్డి, విఆర్‌ఓ నానిల ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహానికి సంఘటన స్థలంలోనే రిమ్స్ ఫోరెన్సిక్ వైద్యులు డాక్టర్ సుధాకర్‌నాయక్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. హంతకుడు రాయచోటిలో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు బుధవారం రాత్రికే వెతికి పట్టుకుని గురువారం మద్యాహ్నం చిన్నారిని పూడ్చిని స్థలం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ వందలాది మంది చేరుకోవడంతో ఆగ్రహోద్రగ్దులై హంతకుడిపై దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు హంతకుడిని ఏదైనాచేస్తారన్న ఉద్దేశంతో హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హంతకుడు నగరంలో ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో హమాలీ పనిచేస్తుండేవాడని, ఇతనికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసుకుని నిందితుడ్ని కోర్టులో హాజరుపరుస్తామని రూరల్ సిఐ వెంకటశివారెడ్డి తెలిపారు.
మైనారిటీ ఓటుబ్యాంకుపై టిడిపి చూపు
కడప, మార్చి 10: జిల్లాలో మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న కడప, రాయచోటి నియోజకవర్గాలపై తెలుగుదేశం అధిష్టానం కనే్నసింది. ఆ నియోజకవర్గాల్లో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉండటంతో అక్కడి మైనారిటీ ముఖ్యనేతలపై తెలుగుదేశం అధిష్టానం దృష్టిసారించింది. మైనార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు కడప, రాయచోటి సీట్లను మైనార్టీలకు కేటాయిస్తామని ఇప్పటినుంచే సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ గత నెలలో జిల్లా పర్యటన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మైనార్టీకి చెందిన వైకాపా కీలక ప్రజాప్రతినిధిని పార్టీలోకి తీసుకునేందుకు కూడా రంగం సిద్దమైనట్లు తెలిసింది. మైనార్టీల్లో వైకాపా సానుభూతి పరులే అధికంగా ఉండటంతో ఆ ఓటుబ్యాంకును తమవైపు మళ్లించేందుకు టిడిపి అధిష్టానం వ్యూహరచన చేస్తోంది. 2019 ఎన్నికల్లో మైనార్టీ ఓటర్లను తమవైపు తిప్పుకునే విధంగా టిడిపి అధిష్టానం అడుగులు వేస్తోంది. కడపలో హజ్‌హౌస్ నిర్మాణం మొదలుకావడం, అబ్దుల్‌కలామ్ ఆజాద్ ఉర్దూ స్టడీ సెంటర్ కడపకు కేటాయించడం ద్వారా ఇప్పటికే మైనార్టీలకు టిడిపి గాలం వేసింది. వైకాపా పార్టీ స్థాపితం ముందు మైనార్టీలంతా అధిక సంఖ్యలో కాంగ్రెస్‌పార్టీ వైపే ఉండేవారు. ప్రొద్దుటూరులో బలమైన మైనార్టీనేత ముక్తియార్ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని మైనారిటీలపై ఆకర్ష్ వల విసిరారు. అంతేగాకుండా టిడిపికి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో మైనార్టీలను ప్రోత్సహించేందుకు రాష్టస్థ్రాయిలో కొన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో రానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలను మైనార్టీ నేతలకు కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ఇస్తున్న రాయితీలతోపాటు ప్రత్యేక రాయితీలను మైనార్టీలకు కల్పించి వారికి కూడా పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఆ పార్టీని బలహీన పరచడంతోపాటు ఆపార్టీ వైపు వున్న మైనార్టీ నేతలను ఆకర్షించేందుకు శరవేగంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. మొత్తమీద జిల్లాలో మైనార్టీ ఓటుబ్యాంకును కూడగట్టేందుకు అధికారపార్టీ కసరత్తు చేస్తోంది.

సావిత్రీబాయి జయంతిని ప్రభుత్వం గుర్తంచాలి
బద్వేలు, మార్చి 10: సావిత్రీబాయిపూలే జయంతిని ప్రభుత్వం గుర్తించి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని మహాత్మాజ్యోతీరావుపూలే ఆశయసాధనసమితి జిల్లా ఛైర్మెన్ జి.గురుమూర్తి పేర్కొన్నారు. సావిత్రీబాయి 119వ వర్ధంతి సభలో స్థానిక బిసి కళాశాల బాలికల వసతిగృహంలో గురువారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా సావిత్రీబాయిపూలే, మహాత్మాజ్యోతీరావుపూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భర్త చేపట్టిన సామాజిక కార్యక్రమాలైన అనాధాశ్రమంలోను, 1868లో అంటరాని వారిని తమ బావిలో నీరు తీసుకొనిపోనివ్వడంలోను, సారా వ్యతిరేక వుద్యమంలోను ఆమె కృషి ప్రశంసనీయమన్నారు. సత్యసోదక్, కార్మికోధ్యమం, వితంతు, గర్భవతులకు ఏర్పాటుచేసిన బాల్య హత్యాప్రబందక్ గృహంలోను సావిత్రీబాయి తన భర్త అడుగుజాడల్లో నడిచారని ప్రశంశించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం జ్యోతీరావుపూలే, సావిత్రీబాయిపూలే జీవితచరిత్ర పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బిసి హాస్టల్ వెల్ఫేర్ అధికారి ఓబులమ్మ, స్కూల్ కరస్పాండెంట్లు ఎన్.వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసులరెడ్డి, రామక్రిష్ణ సేవాసమితి సభ్యులు శశిధర్, హాస్టల్ విద్యార్థినిలు పాల్గొన్నారు

మద్యానికి బానిసై పిల్లలను అమ్మజూపుతున్న భర్తపై ఫిర్యాదు
రైల్వేకోడూరు, మార్చి 10:మండలంలోని అబ్బినాయుడుగారిపల్లెకు చెందిన జి.శివయ్య తాగుడుకు బానిసై డబ్బుల కోసం కన్నబిడ్డలను కూడా అమ్మేందుకు సిద్దమయ్యాడని, అడ్డుకుంటే చంపుతానని బెదిరిస్తున్నాడని భార్య సునీత గురువారం ఎస్సై రమేష్‌బాబుకు ఫిర్యాదు చేసింది. యేళ్ల తరబడి తాగుడుకు బానిసైన తన భర్త ఇంట్లోని వస్తుసామాగ్రిని తరుచూ అమ్ముతూ డబ్బులు లేక పోవడంతో కన్నకొడుకును కూడా అమ్మేందుకు సిద్దమయ్యాడని పోలీసులే రక్షించాలని సునీత పోలీస్‌స్టేషన్‌లో బోరుమని విలపించింది. ఆమె ఫిర్యాదుకు స్పందించి శివయ్య కోసం పోలీసులను గ్రామానికి పంపినట్లు ఎస్సై తెలిపారు.

బంగారం షాపుల బంద్
ప్రొద్దుటూరు, మార్చి 10: కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బంగారు వ్యాపారులపై కొంతమేర భారం మోపిందని, బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు బంద్ పాటిస్తున్నారు. దేశంలో వాణిజ్య కేంద్రమైన ముంబై తర్వాత బంగారు వ్యాపారానికి సంబంధించి ప్రొద్దుటూరు పట్టణం రెండవదిగా పేరుగాంచిందే కాకుండా నిత్యం కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే స్వర్ణకారుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు గత రెండురోజులుగా పట్టణంలోని బంగారు దుకాణాలన్నీ మూసివేసి బంద్ నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి పూరిస్థాయిలో బంగారు దుకాణాలను మూసివేసి, ప్రతి ఒక్క వ్యాపారి బంద్‌లో పాల్గొంటున్నారు. దీంతో వివాహాలు, ముహూర్తాలు ఉన్న సమయం కనుక బంగారు ఆభరణాలు చేయించుకొనేందుకు వీలు లేకపోవడంతో వినియోగదారులు కొంతమేర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక ప్రతిరోజూ కాస్తోకూస్తో పనిచేసుకుంటేనే తాము జీవనం సాగిస్తామని, ఇలా బంద్ నిర్వహించడం వలన తమకు పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చిరు వ్యాపారులు, చేతివృత్తి కార్మికులు వాపోతున్నారు. పరోక్షంగా బంగారు దుకాణాలపై ఆధారపడి పనిచేస్తున్న వ్యాపారులు, పెట్టుబడిదారుల పరిస్థితి కూడా దయనీయంగానే వుందని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బంగారు వ్యాపారుల డిమాండ్లను పరిష్కరించాలని వ్యాపారులు కోరుతున్నారు.

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన వీరభద్రుడు
రాయచోటి, మార్చి 10:్భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారు, అమ్మవారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. ఈ సందర్బంగా ఉత్సవమూర్తులకు వివిధ రకాల పూలతో అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో ఊరేగించారు. మట్లి వడ్డెపల్లె వాస్తవ్యులచే కోలాటాలు, చెక్క్భజనలు నిర్వహించినట్లు ఆలయ ఈఓ మంజుల తెలిపారు. ఈ కార్యక్రమాలకు పెద్దఎత్తున భక్తులు హాజరయ్యారు. ప్రమధ గణహోమము కార్యక్రమాన్ని కూడా వేదపండితులు నిర్వహించారు.
అగ్నిగుండానికి ఏర్పాట్లు పూర్తి: భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు నిర్వహించే అగ్నిగుండ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలలో అతి కీలకమైనది కావడంతో ఆలయ ఈఓ మంజుల, భక్త జనుల సేవా సమితి మండలి వారు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ అగ్నిగుండ కార్యక్రమాన్ని తిలకించేందుకు పట్టణ ప్రజలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. అందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. నేడు మహానైవేద్యం కార్యక్రమంతో పాటు రథోత్సవం కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు కూడా వచ్చాయి.
భూ ఆక్రమణల కుంభకోణాలపై విచారణ సజావుగా జరిగేనా..
ఒంటిమిట్ట, మార్చి 10: గత 15 రోజులుగా జిల్లాలోనే హాట్ హాట్‌గా సాగుతున్న ఒంటిమిట్ట భూ ఆక్రమణల కుంభకోణాలపై విచారణ సజావుగా జరిగేనా అనే అనుమానాలు గుప్పుమంటున్నాయి. 7వ విడత అసైన్‌మెంట్ కమిటీలో దళితులకు దక్కాల్సిన భూములను రాజకీయ అండ దండలతో బడా భూస్వాములు చేజిక్కుంచుకున్న వైనం ఈ నోటా, ఆ నోటా పొక్కి ఆంధ్రభూమిలో వెలువడిన విషయం విదితమే. మండలంలోని పెన్నపేరూరు, చింతరాసపల్లె, జవుకులపల్లె, ఒంటిమిట్ట తదితర ప్రాంతాలలోని విలువైన ప్రభుత్వభూములను భూ బకాసురులు స్వంతం చేసుకున్నారు. వీటిపై కలెక్టర్ స్పందించి విచారణ నిమిత్తం స్పెషాలాఫీసర్ సుబ్బరాజు నేతృత్వంలో విచారణ జరిపారు. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల కాలంలోని భూ రికార్డులను పరిశీలించారు. విచారణపై సమగ్ర నివేదిక కలెక్టర్‌కు అందిస్తారా, లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆక్రమణలలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులే అధికంగా ఉన్నట్లు ఆధారాల ద్వారా బట్టబయలైంది. ఇవే కాకుండా మండలంలోని ఒక ప్రభుత్వ కార్యాలయం, ఒక పాఠశాల గ్రౌండ్, చెరువును కూడా వారి పేర్లతో వ్రాయించుకున్నట్లు వెల్లడవుతుంది. విచారణ పూర్తిస్థాయిలో జరిగితే ఒకరిద్దరు అధికారులపై వేటు తప్పదన్నది నగ్నసత్యం. దీంట్లో అధికార పార్టీ నాయకులు ఉండటంతో విచారణ సద్దుమణుగుతుందా, లేదా విచారణ జరిగి తప్పు చేసిన అధికారులపై వేటు పడుతుందా లేదా చూడాల్సి ఉంది. అలా జరిగితే అసైన్‌మెంట్ కమిటీలోని దళితులకు న్యాయం దక్కుతుంది.
ఎమ్మార్పీఎస్ నేత ఆత్మహత్యా యత్నం
రాజంపేట టౌన్, మార్చి 10:రాజంపేటలో జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు చేమూరి వెంకటేష్ గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. క్రిమి సంహకర మందు సేవించిన వెంకటేష్‌ను స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగను పోలీసులు అరెస్టు చేయడంతో తాను ఆత్మహత్యకు యత్నించానని అన్నారు.

మూతపడిన ఎపిజి బ్యాంకు శాఖలు
కడప, మార్చి 10: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించుకునే దిశగా దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆర్‌జిబి యూనియన్స్, ఆలిండియా రీజనల్ రూరల్ బ్యాంకు ఎంప్లారుూస్ అసోసియేషన్ పిలుపుమేరకు జిల్లాలోని పట్టణ, మండల , గ్రామీణ ప్రాంతాల్లోని ఏపిజి బ్యాంకులు గురువారం మూతపడ్డాయి. దీంతో ఆయా బ్యాంకులకు సంబందించిన ఖాతాదారులు బ్యాంకుల వద్దచేరుకుని వెనుదిరిగారు. బ్యాంకుల వద్ద నోటీసులు అంటించారు. బ్యాంకు సిబ్బంది సమ్మె కారణంగా నాలుగురోజులపాటు బ్యాంకులు పనిచేయవని ఆయా బ్యాంకుల ఎదుట నోటీసులు అతికించారు. రెండురోజులు పాటు ఏపిజిబి ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వగా, మరో రెండురోజులు 12,13వ తేదీల్లో శని, ఆదివారాలు సెలవుకావడంతో నాలుగురోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఎపిజిబి బ్యాంకుశాఖలు ఈనెల 14వ తేదిన తెరుచుకోనున్నాయి. జిల్లాలో 80 ఏపిజి బ్యాంకుశాఖలు మూతపడ్డాయి. బ్యాంకు ఉద్యోగులు స్వచ్చందంగా సమ్మెబాట పట్టారు. బ్యాంకు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించనందుకు నిరసనగానే సమ్మె చేపట్టాల్సివచ్చిందని యూనియన్ నాయకులు అంటున్నారు. ఏపిజిబి శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రాడ్యుయేషన్, ఇంక్రిమెంట్లు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న కంపాసినెట్, కారుణ్య నియామకాలు, జాతీయ బ్యాంకులతో సమానంగా అన్ని అలవెన్సులు వర్తింపచేయాలని ఎపిజిబి ఉద్యోగులు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని యూనియన్ నాయకుల ఆవేదన వ్యక్తంచేశారు. కడప ఏపిజిబి రీజనల్ పరిధిలో కడప , అనంతపురం, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలోని 500 గ్రామీణ బ్యాంకులు ఉద్యోగులకు సంబంధించి సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆర్‌జిబి ఎంప్లారుూస్ అసోసియేషన్, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కెవి శివారెడ్డి, ఏ.సురేష్‌లు మాట్లాడుతూ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాము రెండురోజులపాటు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా 70వేల మంది గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారని, కడప ఏపిజిబి రీజనల్ పరిధిలో 500శాఖల్లో పనిచేస్తున్న 3వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని చెప్పారు. ఇప్పటికైనా దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవచూపాలని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో దశలవారీగా సమ్మెను ఉధృతం చేయాల్సివస్తుందని వారు హెచ్చరించారు.